పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.64 | Tariff decision keeping in view the growing production | Sakshi
Sakshi News home page

పవన విద్యుత్‌కు యూనిట్‌కు రూ.2.64

Published Mon, Jul 17 2023 2:39 AM | Last Updated on Mon, Jul 17 2023 2:45 AM

2.64 per unit for wind power - Sakshi

సాక్షి, అమరావతి: పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు చెల్లించాల్సిన టారిఫ్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఖరారు చేసింది. ఉత్పత్తి సంస్థలతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకుని పదేళ్లు దాటిన తరువాత యూనిట్‌ రూ.2.64 చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. 11వ సంవత్సరం నుంచి 20 ఏళ్ల వరకు ఇదే టారిఫ్‌ వర్తిస్తుందని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

2,100 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టులకు చెందిన 22 పీపీఏలకు ఆ సంస్థలు సమర్పించిన నివేదికలను పరిశీలించిన అనంతరం ఏపీఈఆర్‌సీ ఈ టారిఫ్‌ను నిర్ణయించింది. అదే విధంగా ప్రాజెక్టు జీవిత కాలాన్ని 25 ఏళ్లుగా సంస్థలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. కానీ దానిని 30 ఏళ్లుగా ఏపీఈఆర్‌సీ పరిగణించింది.

ప్రాజెక్టు ఏర్పాటుకు మెగావాట్‌కు ఐదెకరాల చొప్పున ఆ సంస్థలు ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నాయి.పీపీఏ గడువు ముగిసేనాటికి వాటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఏపీఈఆర్‌సీ అంచనా వేసింది. దానిని పరిగణనలోకి తీసుకుని యూనిట్‌ ధరను ఖరారు చేసినట్లు కమిషన్‌ వెల్లడించింది.

మీరు అడిగినంత ఇవ్వలేం
మొదటి పది సంవత్సరాలకు యూనిట్‌కు రూ.3.43 చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్‌సీ ఆదేశాలిచ్చింది. అయితే ప్రస్తుత మార్కెట్‌ ధరల మేరకు 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకూ యూనిట్‌కు రూ.3.50 టారిఫ్‌ సెట్‌ చేయాలని పవన విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్‌సీని కోరాయి. ఏపీఈఆర్‌సీ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది.

పవన విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్ల టారిఫ్‌ రూ.3.43గా నిర్ణయించామని, ఆ సమయంలో సుంకం కూడా యూనిట్‌పై రూ.2.4 తగ్గించామని, కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది.

11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.2.64గా నిర్ధారించింది.20 ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. కొనసాగితే విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్‌ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్‌కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది.

వృద్ధికి అనుగుణంగా..
పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్‌ స్థాపిత సామర్థ్యం 4096.65 మెగావాట్లు. గతేడాది దేశవ్యాప్తంగా 8 శాతం పవన విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే మన రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయిలో వృద్ధి కంటే 1.8 శాతం ఎక్కువగా ఏపీలో పెరుగుదల నమోదు చేసుకుంది.

వాతావరణ మార్పులకు ప్రభుత్వ చర్యలు తోడవడంతో ఏపీలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటీయొరాలజీ (పూణె)కి చెందిన పరిశోధకులు వారి అధ్యయనంలో వెల్లడించారు. అంతేకాదు రాష్ట్రంలోని సముద్రతీర ప్రాంతాలపై గాలి సామర్థ్యం పెరుగుతున్నట్లు ‘కపుల్డ్‌ మోడల్‌ ఇంటర్‌–కంపారిజన్‌ ప్రాజెక్ట్‌ (సీఎంఐపీ) ప్రయోగాల్లో తేలింది.

ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) పవన విద్యుత్‌ ధరలను నిర్ణయించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement