చేసిన సాయానికి లెక్కగా సమయం జమ.. అవసరమైనప్పుడు బ్యాంకు ద్వారా సాయం
ఒంటరి వృద్ధులకు ఎంతో ఉపయుక్తంగా సస్
తొలిసారి స్విట్జర్లాండ్‌లో ప్రారంభం
ప్రపంచవ్యాప్తంగా 34 దేశాల్లో ఏర్పాటు.. మన దేశంలోనూ టైమ్ బ్యాంక్ సేవలు
విశాఖపట్నానికి చెందిన సత్యమూర్తి విద్యాశాఖలో ఉన్నతాధికారిగా పనిచేశారు. తన ఇద్దరు పిల్లలను అమెరికా పంపించి బాగా చదివించారు. ఉన్నతోద్యోగాల్లో వారు అక్కడే సెటిల్ అయ్యారు. ఏడాదికి ఓసారి భార్యతో కలిసి అమెరికాలోని కొడుకుల వద్దకు వెళ్లి కొద్దిరోజులుండి రావడం ఆయనకు అలవాటు. అయితే, ఏడాది క్రితం భార్య చనిపోవడంతో ఇక్కడ ఒంటరైపోయారు.
తమ వద్దకు వచ్చేయమని కొడుకులు కోరుతున్నా ఆయన ఒప్పుకోవడం లేదు. తాను టైమ్ బ్యాంక్‌లో కొంత సమయం దాచుకున్నానని, తనకు అవసరం వచ్చినప్పుడు తనను చూసుకునేందుకు మనుషులు వస్తారని చెప్పడంతో కొడుకులు ఆశ్చర్యపోయారు. విలువైన నగలు, డాక్యుమెంట్లను లాకర్‌లో దాచుకున్నట్టు బ్యాంకులో టైమును కూడా దాచుకోవచ్చా..అలాంటి అవకాశం కూడా ఉందా!!
సాక్షి, అమరావతి: ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. జీవితాలు అపార్ట్‌మెంట్లలో బందీ అయ్యాయి. ఇది ఒంటరిగా ఉన్న వృద్ధులకు పెద్ద సవాలుగా మారింది. విదేశాల్లోనో లేక మరో దూర ప్రాంతంలోనో ఉండటంతో తల్లిదండ్రులను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో పిల్లలు ఉన్నారు.
ఆస్పత్రికి తీసుకెళ్లేందుకో లేక ఇంటి వద్దే కొన్ని పనులు చేసిపెట్టేందుకో ఓ వయసు దాటాక ప్రతి ఒక్కరికీ మరొకరి సాయం తప్పనిసరైంది. ఇలాంటి అవసరాలు ఉన్న వారిని చూసుకునేందుకు రోటరీ సంస్థ ‘టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో సామాజిక కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ని అందుబాటులోకి తెచ్చి కుటుంబ అవసరాల అంతరాన్ని తగ్గించడానికి కృషి చేస్తోంది.
ఏమిటీ టైమ్ బ్యాంక్..
అరవై ఏళ్లు దాటి ఆరోగ్యవంతమైన వ్యక్తి టైమ్ బ్యాంక్ సభ్యుడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సమయంలో సహాయం చేయడం ద్వారా వారి సమయాన్ని కొంత ఇతరులకు వెచ్చించవచ్చు. ఇలా ఎన్ని గంటలు వెచి్చస్తే అన్ని గంటలు సదరు సమయం కేటాయించిన వ్యక్తి పేరుపై అతని ఖాతాలో ఆ సమయం జమ అవుతుంది. దానిని వారు అవసరమైన సమయంలో ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ సభ్యులకు ఆరోగ్యం బాగాలేనప్పుడు లేదా ఇతర అవసరాలు ఉన్నపుడు ఇంకో సభ్యుడు వీరికి సాయం చేస్తారు.
ఇందులో సభ్యులు.. సేవ కోరేవారి మధ్య డబ్బు లావాదేవీ ఉండదు. ఉదాహరణకు, ఒక సభ్యుడు వారానికి నాలుగు గంటలు మరొకరికి సేవ చేస్తున్నట్టయితే, అతను నెలకు 16 గంటలు సంపాదిస్తాడు లేదా ఆదా చేస్తాడు. ఇలా సంవత్సరానికి 192 గంటలు లేదా 8 రోజులు అతని/ఆమె ఖాతాలో జమ అవుతాయి. ఈ సమయాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత విడతల వారీగా లేదా ఒకేసారి తన అవసరాల కోసం ఖర్చు చేసుకోవచ్చు.
దీనికోసం సదరు బ్యాంకులో నమోదు చేసుకుంటే మరో సభ్యుడు లేదా సభ్యురాలు వచ్చి సేవలందిస్తారు. సరళంగా చెప్పాలంటే టైమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రిజి్రస్టేషన్ అనేది జీరో బ్యాలెన్స్‌తో బ్యాంక్ ఖాతాను తెరవడం లాంటిది. పెద్దలకు సేవ చేయడం ద్వారా డబ్బుకు బదులు సమయాన్ని జమ చేసుకుంటారు. వారి అవసరాల సమయంలో వారి డిపాజిట్ సమయానికి సమానమైన సమయాన్ని విత్‌డ్రా చేసుకుంటారు.
ప్రపంచంలో 34 దేశాల్లో అమలు
స్విట్జర్లాండ్‌లో మొదలైన టైమ్ బ్యాంక్ కాన్సెప్‌్టను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 34 దేశాలు అమలు చేస్తున్నాయి. ఇందులో యూకే, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, స్పెయిన్, గ్రీస్, సింగపూర్, తైవాన్, సెనెగల్, అర్జెంటీనా, ఇజ్రాయెల్ తదితర దేశాల్లో 300కు పైగా ఈ తరహా బ్యాంకులు ఉన్నాయి.
ఒక్క అమెరికాలోనే 40 రాష్ట్రాల ప్రభుత్వాలు టైమ్ బ్యాంక్‌ను అమలు చేస్తున్నాయంటే వీటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలోనూ ఈ తరహా కాన్సెప్ట్ అవసరమని 2018లో జాతీయ మానవ హక్కుల సంఘం కేంద్రానికి సూచించింది. అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక్కటే 2019లో టైమ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది.
ఇందులో ప్రస్తుతం 50 వేల మంది వలంటీర్లుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతోపాటు సామాజిక సేవల్లో ముందుండే రోటరీ క్లబ్ కూడా టైమ్ బ్యాంక్‌ను ప్రారంభించగా, ఇందులో 5 వేల మంది వరకు సభ్యులుగా చేరారు.
2012లో స్విట్జర్లాండ్‌లో ప్రారంభం
డబ్బుతో అవసరం లేకుండా ‘మనిíÙకి మనిషి సాయం’ అందించే వినూత్న విధానానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నాంది పలికింది. స్విస్ ప్రభుత్వం వృద్ధులకు ప్రత్యేకంగా పెన్షన్ అందిస్తోంది. అయితే, తమకు డబ్బు కంటే సాయం చేసేవారు అవసరమని, చాలా సందర్భాల్లో ఏ పనీ చేసుకోలేకపోతున్నామని అక్కడి వృద్ధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న తమతో మాట్లాడేందుకు మనిíÙని తోడు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనిపై స్పందించిన అక్కడి ఫెడరల్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసి అధ్యయనం చేసింది. దేశంలో వృద్ధుల్లో అత్యధికులు ఒంటరి జీవితాలు గడుపుతున్నారని, వారు డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మనిషి సాయం కోరుతున్నట్టు గుర్తించారు. దాంతో ఇంట్లో ఉండే ఒంటరి వృద్ధులకు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
2012లో ‘టైమ్ బ్యాంక్’ను అక్కడి ప్రభుత్వం ప్రారంభించి ‘టైమ్ ఈజ్ మనీ’ కాన్సెప్‌్టను వర్తింపజేస్తోంది. ఈ కాన్సెప్ట్‌ని కచ్చితంగా ఆచరించడంలో స్విట్జర్లాండ్ ముందడుగు వేసింది. ఆ దేశంలో పౌరులు తమ సమయాన్ని బ్యాంకుల్లో ‘పొదుపు’ చేసేలా ప్రోత్సహించింది. ఆరోగ్యంగా ఉన్నవారు ఎవరైనా సరే అక్కడి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో వలంటీర్‌గా రిజిస్టర్ చేసుకుంటే వారిని అవసరం ఉన్నవారికి అలాట్ చేస్తారు.
అలా వారు తోటపని, ఇంటి పని, బయటకి తీసుకెళ్లడం, కబుర్లు చెప్పడం, వృద్ధులు చెప్పే మాటలు వినడం, ఆస్పత్రికి తీసుకెళ్లడం వంటి పనుల్లో సాయంగా ఉంటారు. వీరు ఎన్ని గంటలు కేటాయించారో అంత సమయం సాయం చేసిన వ్యక్తి అకౌంట్‌లో జమ చేయడం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment