ప్రపంచవ్యాప్తంగా డార్క్ టూరిజానికి పెరుగుతున్న ఆదరణ
ఈ ఏడాది డార్క్ టూరిజం పరిశ్రమ మార్కెట్ విలువ రూ.2.55 లక్షల కోట్లు
2034 నాటికి డార్క్ టూరిజం పరిశ్రమ మార్కెట్ విలువ (అంచనా) రూ.3.46లక్షల కోట్లు
ప్రకృతి అందాలనే కాదు.. ప్రపంచ విపత్తులను చూడడం పర్యాటకుల అభిలాష
ఉక్రెయిన్ యుద్ధాన్ని వీక్షించేందుకు రూ.లక్షలు ఖర్చు చేసిన యువత
విషాద ఘటనలు, చారిత్రక చీకటి అధ్యయనాలపై అనురక్తి
కేరళ విపత్తులను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్న ప్రజలు
భారత్‌లోనూ డార్క్ టూరిజం ప్రాంతాల్లో పర్యాటకుల సందడి
2034 నాటికి ఈ మార్కెట్ రూ.3.46 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా
సాక్షి, అమరావతి: మారుతున్న ప్రజల అభిరుచులకు అనుగుణంగా ప్రపంచ పర్యాటక రంగం కూడా సరికొత్త మార్గంలో పయనిస్తోంది. ప్రకృతి రమణీయత, కొత్త ప్రదేశాల అందాలు, సంస్కృతుల సందడుల నుంచి మారణహోమ క్షేత్రాల సందర్శన దిశగా అడుగులు వేస్తోంది. ఇంతకాలం ప్రశాంతత కోసం పర్యాటకం కాగా... ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. భయానక వాతావరణానికి అద్దంపట్టే ప్రాంతాల సందర్శనకు డిమాండ్ పెరుగుతోంది.
చరిత్రలో నిలిచిపోయిన విషాదాలు, చీకటి అధ్యాయాలపై ఉత్సుకత.. చరిత్రలోని తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలనే కోరిక, ప్రత్యేకమైన విజ్ఞాన అనుభవం కోసం పర్యాటకులు ‘డార్క్ టూరిజం’ దిశగా మొగ్గు చూపుతున్నారు. ఘోరకల్లోల పరిస్థితులు, విపత్తులకు దారితీసిన సంఘటనల గురించి తెలుసు కోవాలనే ఆసక్తిని కనబరుస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇటీవల డార్క్ టూరిజం ఊపందుకుంది.
డార్క్ టూరిజం అంటే...
డార్క్ టూరిజం అనగా ప్రపంచంలో ఘోరమైన, క్రూరమైన ఘటనలకు గుర్తుగా మిగిలిన ఆనవాళ్లను సందర్శించడం. ఈ జాబితాలో తరచుగా మరణాలు, విషాద ఘటన, విపత్తులు ఎక్కువగా సంభవించే ప్రాంతాలు ఉంటాయి. అదేవిధంగా పూర్వపు యుద్ధ భూములు, జైళ్లు, నిర్బంధ శిబిరాలు, స్మారక చిహ్నాలు సైతం ఉన్నాయి. మారణ హోమాలు, హోలిస్టిక్, పారానార్మల్(ఘోస్ట్ టూర్స్, మంత్రగత్తెల ప్రాంతాలు), యుద్ధభూమి, న్యూక్లియర్ విస్ఫోటాలు జరిగిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఘోస్ట్ హౌస్‌లు, గ్రహాంతరవాసులు–యూఎఫ్‌వోలు (గాలిలో గుర్తుతెలియని ఎగిరే వస్తువులు) గుర్తించిన ప్రదేశాల సందర్శన కూడా డార్క్ టూరిజం కిందకే వస్తుంది.
డార్క్ టూరిజానికి ఈ దేశాలు ప్రసిద్ధి..
అమెరికా, కెనడా, బ్రెజిల్, మెక్సికో, లాటిన్ అమెరికా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, రష్యా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, రొమేనియా, భారత్, బంగ్లాదేశ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, గల్ఫ్ కార్పొరేషన్ కౌన్సిల్(జీసీసీ)దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, దక్షిణాఫ్రికా, ఇజ్రాయెల్ దేశాల్లో డార్క్ టూరిజం ప్రసిద్ధి చెందు తోంది. అమెరికాలోని ఓ సర్వే ప్రకారం.. 82 శాతం మంది పాస్‌పోర్టు ప్రయాణికుల్లో కనీసం ఒక చీకటి ప్రదేశాన్ని సందర్శించినట్టు తేలింది. తాజాగా కేరళలోని ప్రకృతి విపత్తును తిలకించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులువెళుతున్న నేపథ్యంలో డార్క్ టూరిజంపై చర్చ జరుగుతోంది.
ఒక్కో దేశంలో.. ఒక్కో విషాద ఘటన..
⇒ చరిత్రలోని చీకటి ప్రదేశాలపై యాత్రికులకు ఆసక్తి పెరుగుతోంది. మిస్టరీలను తెలుసుకుంటూ థ్రిల్ కావడానికి పర్యాటకులు సాహసాలు చేస్తున్నారు.
⇒ ఉక్రెయిన్–రష్యా యుద్ధం జరుగుతున్న సమయంలో చాలామంది విదేశీ పర్యాటకులు అక్కడి యుద్ధాన్ని నేరుగా చూసేందుకు రూ.లక్షల్లో ఖర్చు చేసుకుని వెళ్లారు. గతంలో ఉక్రెయిన్ అందాలను వీక్షించేందుకు వచి్చన పర్యాటకులు ఇప్పుడు శిథిలమైన ఉక్రెయిన్‌ను కూడా చూసేందుకు క్యూ కట్టడం విశేషం.
⇒ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నైరుతి పోలాండ్‌లో యూదులను నాజీలు చిత్రహింసలు పెట్టిన నిర్బంధ శిబిరం (ఆష్‌విట్జ్), న్యూక్లియర్ పేలుళ్లు జరిగిన ప్రాంతం (చెర్నోబిల్), అమెరికాలోని గెట్టిస్‌బర్గ్ పట్టణంలోని యుద్ధభూమి(సివిల్‌వార్) డార్క్ టూరిజానికి ప్రసిద్ధి చెందాయి.
⇒ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు గురైన ప్రదేశాన్ని కూడా ఎక్కువ మంది సందర్శిస్తున్నారు.
⇒ చాలాకాలం కిందట ఫ్రాన్స్‌లో బహిరంగ ఉరి శిక్షలను అమలుచేసిన ప్రాంతాలను చూడటానికి కూడా సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు.
⇒ జపాన్‌లో అణుబాంబులతో నాశనమైన హిరోíÙమా, నాగసాకి పట్టణాలు, కంబోడియాలోని కిల్లింగ్ ఫీల్డ్, అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (గ్రౌండ్ జీరో), రువాండా (మారణహోమం) ప్రాంతాలను కూడా సందర్శించే
అంతర్జాతీయ పర్యాటకులు పెరుగుతున్నారు.
మన దేశంలో డార్క్ టూరిజానికి ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రదేశాలు...
⇒భారతదేశంలో స్వాతంత్య్ర సమరయోధుల జ్ఞాపకాలను గుర్తుచేసే ఫోర్ట్ బ్లెయిర్ సెల్యులార్ జైలు.
⇒అమృత్‌సర్‌లోని జలియన్ వాలాబాగ్ (జనరల్ డయ్యర్ భారతీయులను ఊచకోత చేసిన ప్రాంతం)ఉద్యానవనం, స్మారక చిహ్నం.
⇒ఉత్తరాఖండ్‌లోని గర్వాల్ హిమాలయాల్లో ఎత్తయిన రూప్‌కుండ్ సరస్సు(అస్థిపంజర అవశేషాలతో నిండి ఉంటుంది).
⇒రాజస్థాన్‌లోని థార్ ఎడారిలో కుద్దార గ్రామం (ఇక్కడి ప్రజలు ఒక్కరాత్రిలో అంతరించిపోయారని పురాణాలు చెబుతున్నాయి).
⇒మహారాష్ట్రలోని పుణేలో శనివార్ వాడ చారిత్రక కోట (అతీంద్రియ శక్తులు ఉన్నాయని ప్రచారం ఉంది).
⇒రాజస్థాన్‌లో భాంగర్ కోట(మొఘల్ దళాలు చేసిన ఊచకోత)
⇒గుజరాత్‌లోని అరేబియా తీరంలో డుమాస్ బీచ్ (పురాణాల ప్రకారం ఒకప్పుడు ఇది హిందువుల శ్మశాన వాటికని, అందుకే అక్కడ ఇసుక నల్లగా ఉంటుందని నమ్మకం).
⇒ గుజరాత్‌లోని లోథాల్ సింధూ లోయ నాగరికత ప్రదేశాలు
⇒ముంబైలోని తాజ్ హోటల్ (2008లో ఉగ్రవాద దాడి జరిగిన ప్రాంతం).
⇒ భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పాండ్ (భోపాల్ విషవాయువు దుర్ఘటన జరిగిన ప్రదేశం).
⇒గుజరాత్‌లోని భుజ్ (భూకంపానికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతం).
⇒ తాజాగా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన కేరళలోని వయనాడ్ ప్రాంతాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. అయితే సైన్యం చేపడుతున్న సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడటంతో అధికారుల విజ్ఞప్తుల మేరకు వెనక్కి తగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment