‘అమెరికా’ ఏం చదువుతోంది? | National Center for Education Statistics study of student interest | Sakshi
Sakshi News home page

‘అమెరికా’ ఏం చదువుతోంది?

Published Sun, Nov 12 2023 4:53 AM | Last Updated on Sun, Nov 12 2023 4:53 AM

National Center for Education Statistics study of student interest - Sakshi

(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) 
అమెరికాలో విద్యనభ్యసించడం వివిధ దేశాలకు చెందిన ఎన్నో లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ఎన్నో కష్టాలు పడి, వివిధ పరీక్షలు రాసి అమెరికాకు పరుగులు తీస్తుంటారు. అక్కడే గ్రాడ్యుయేషన్లు, పోస్ట్‌గ్రాడ్యుయేషన్లు చేసి.. ఉద్యోగాలు కూడా సంపాదించి స్థిరపడిపోతుంటారు. కానీ అసలు అమెరికా విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఏఏ కోర్సులు ఎక్కువగా చదువుతున్నారు? ఏఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు? అనే ప్రశ్నలు మనలో తలెత్తుతుంటాయి. ఈ అంశాలపై అమెరికాకు చెందిన నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ స్టాటిస్టిక్స్‌ (ఎన్‌సీఈఎస్‌) అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

పలు ముఖ్యమైన కోర్సులపై అధ్యయనం చేసింది. 2010–11 విద్యా సంవత్సరంలో వివిధ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో.. సరిగ్గా దశాబ్దం తర్వాత అంటే 2020–21లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో పోల్చి గణాంకాలు రూపొందించింది.  

కంప్యూటర్‌ సైన్స్‌కే పట్టం
అమెరికాలో కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టుకే విద్యార్థుల నుంచి విశేష ఆదరణ దక్కింది. దశాబ్దకాలం తర్వాత కంప్యూటర్‌ సైన్స్‌ గ్రాడ్యుయేట్లు 144 శాతం పెరిగారు. 2010–11లో 43,066 మంది కంప్యూటర్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయగా, 2020–21లో ఈ రంగం నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్య 1,04,874కు పెరిగింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులో ఉండటం, భవిష్యత్‌ను శాసించే శక్తి ఉందని యువత భావించడం వల్లే దీనిపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
వైద్య రంగంలోనూ భారీ వృద్ధి: వైద్య, ఆరోగ్య 
రంగంలోని విస్తృత అవకాశాలు కూడా అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. 2010–11తో పోలి్చతే.. 2020–21 విద్యా సంవత్సరంలో 87 శాతం వృద్ధితో 2.6 లక్షల మంది విద్యార్థులు ఈ రంగంలో పట్టాలు అందుకున్నారు. అమెరికాలోని మొత్తం గ్రాడ్యుయేట్లలో వైద్య, ఆరోగ్య రంగంలో పట్టభద్రులైన విద్యార్థుల సంఖ్య దాదాపు 13 శాతం. అలాగే బయోమెడికల్‌ సైన్స్‌లోనూ 46 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్‌ సంక్షోభం తర్వాత ఈ విభాగంలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  

వన్నె తగ్గని ఇంజనీరింగ్‌ కోర్సులు 
కంప్యూటర్‌ సైన్స్‌ను మినహాయించి మిగతా బ్రాంచ్‌లను ఇంజనీరింగ్‌ కింద పరిగణించారు. దశాబ్దకాలంలో 65 శాతం వృద్ధితో 1.26 లక్షల మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు 2020–21లో కాలేజీల నుంచి పట్టాలతో బయటకు వచ్చారు. ఏటా లక్ష డాలర్లకు తగ్గని వేతనాలు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదనే భరోసా.. ఈ రంగం వైపు విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్‌ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారుతున్న వారిలో ఇంజనీరింగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వారి శాతమే ఎక్కువ.  

దాదాపు 4 లక్షల మంది..  
అమెరికాలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌కు ఆదరణ ఏటా పెరుగుతూనే ఉంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేస్తున్న వారిలో అత్యధికులు ఈ రంగం వారే. 2020–21లో దాదాపు 4 లక్షల మంది ఈ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు.  

పడిపోతున్న ‘ఆర్ట్స్‌’ 
అమెరికాలో పలు ఆర్ట్స్‌ గ్రూప్‌లకు ఆదరణ తగ్గుతోంది. సామాజిక శా్రస్తాలు, భాషలు, చరిత్ర లాంటి 17 సబ్జెక్టుల్లో గత దశాబ్దకాలంలో విద్యార్థుల చేరికలు తగ్గినట్లు తేలింది. ఇంగ్లిష్, చరిత్ర తదితర సబ్జెక్టుల్లో దశాబ్దకాలంలో 35 శాతం విద్యార్థుల సంఖ్య పడిపోయింది. పాకశాస్త్రంలో తగ్గుదల 50 శాతానికిపైగా ఉంది. 

ఉపాధి అవకాశాలున్నా.. తగ్గిన చేరికలు 
అమెరికాలో ఎడ్యుకేషన్‌ రంగంలో గ్రాడ్యుయేషన్‌ చేసే వారి సంఖ్య తగ్గుతోంది. టీచర్ల వేతనాలు పెద్దగా పెరగకపోవడం ఈ రంగంలోకి విద్యార్థులు రాకపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. టీచర్ల కొరత ఉన్నందున ఉద్యోగవకాశాలు సులభంగా దక్కే అవకాశం ఉన్నా.. ఇతర రంగాల వైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దశాబ్దకాలంలో 16 శాతం మేర చేరికలు తగ్గాయి. అలాగే మారుతున్న ప్రపంచంలో పరిశ్రమలు స్పెషలైజేషన్‌ను కోరుకుంటుండటంతో విద్యార్థులు కూడా లిబరల్‌ ఆర్ట్స్‌వైపు ఆసక్తి చూపించం లేదు. దీంతో విద్యార్థుల సంఖ్య దశాబ్దకాలంలో 10 శాతం తగ్గింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇంగ్లిష్‌దీ ఇదే పరిస్థితి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement