Business Management
-
ఉడాన్ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: బీటూబీ ఈకామర్స్ సంస్థ(ప్లాట్‌ఫామ్) ఉడాన్ తాజాగా 34 కోట్ల డాలర్లు(సుమారు రూ. 2,822 కోట్లు) సమీకరించింది. సిరీస్–ఈ ఫండింగ్‌లో భాగంగా ఎంఅండ్‌జీ పీఎల్సీ అధ్యక్షతన పలు పీఈ సంస్థలు పెట్టుబడులను సమకూర్చాయి. కంపెనీలో ఇప్పటికే ఇన్వెస్ట్ చేసిన లైట్‌స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్, డీఎస్టీ గ్లోబల్ సైతం నిధులు సమకూర్చాయి. బిజినెస్ నిర్వహణకు అవసరమైన పూర్తిస్థాయి పెట్టుబడులను సమకూర్చుకోవడంతో రానున్న 12–18 నెలల్లో లాభాల్లోకి ప్రవేశించే లక్ష్యంతో సాగుతున్నట్లు ఈ సందర్భంగా ఉడాన్ తెలియజేసింది. ప్రస్తుత రుణాలను ఈక్విటీగా మార్పు చేయడంతోపాటు.. తాజా ఈక్విటీ జారీ ద్వారా నిధుల సమీకరణ చేపట్టినట్లు వెల్లడించింది. వెరసి బ్యాలన్స్‌షీట్ పటిష్టంకానున్నట్లు పేర్కొంది. కస్టమర్ సేవలు, మార్కెట్ విస్తరణ, వెండార్ భాగస్వామ్యాలు, సరఫరా చైన్, క్రెడిట్ తదితరాలపై నిధులను వెచ్చించనున్నట్లు వివరించింది. -
‘అమెరికా’ ఏం చదువుతోంది?
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) అమెరికాలో విద్యనభ్యసించడం వివిధ దేశాలకు చెందిన ఎన్నో లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ఎన్నో కష్టాలు పడి, వివిధ పరీక్షలు రాసి అమెరికాకు పరుగులు తీస్తుంటారు. అక్కడే గ్రాడ్యుయేషన్లు, పోస్ట్గ్రాడ్యుయేషన్లు చేసి.. ఉద్యోగాలు కూడా సంపాదించి స్థిరపడిపోతుంటారు. కానీ అసలు అమెరికా విద్యార్థులు ఏం చేస్తున్నారు? ఏఏ కోర్సులు ఎక్కువగా చదువుతున్నారు? ఏఏ రంగాలపై ఆసక్తి చూపిస్తున్నారు? అనే ప్రశ్నలు మనలో తలెత్తుతుంటాయి. ఈ అంశాలపై అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ స్టాటిస్టిక్స్ (ఎన్సీఈఎస్) అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పలు ముఖ్యమైన కోర్సులపై అధ్యయనం చేసింది. 2010–11 విద్యా సంవత్సరంలో వివిధ సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో.. సరిగ్గా దశాబ్దం తర్వాత అంటే 2020–21లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్యతో పోల్చి గణాంకాలు రూపొందించింది. కంప్యూటర్ సైన్స్‌కే పట్టం అమెరికాలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుకే విద్యార్థుల నుంచి విశేష ఆదరణ దక్కింది. దశాబ్దకాలం తర్వాత కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్లు 144 శాతం పెరిగారు. 2010–11లో 43,066 మంది కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయగా, 2020–21లో ఈ రంగం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థుల సంఖ్య 1,04,874కు పెరిగింది. ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులో ఉండటం, భవిష్యత్‌ను శాసించే శక్తి ఉందని యువత భావించడం వల్లే దీనిపై విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వైద్య రంగంలోనూ భారీ వృద్ధి: వైద్య, ఆరోగ్య రంగంలోని విస్తృత అవకాశాలు కూడా అమెరికా విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. 2010–11తో పోలి్చతే.. 2020–21 విద్యా సంవత్సరంలో 87 శాతం వృద్ధితో 2.6 లక్షల మంది విద్యార్థులు ఈ రంగంలో పట్టాలు అందుకున్నారు. అమెరికాలోని మొత్తం గ్రాడ్యుయేట్లలో వైద్య, ఆరోగ్య రంగంలో పట్టభద్రులైన విద్యార్థుల సంఖ్య దాదాపు 13 శాతం. అలాగే బయోమెడికల్ సైన్స్‌లోనూ 46 శాతం వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఈ విభాగంలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వన్నె తగ్గని ఇంజనీరింగ్ కోర్సులు కంప్యూటర్ సైన్స్‌ను మినహాయించి మిగతా బ్రాంచ్‌లను ఇంజనీరింగ్ కింద పరిగణించారు. దశాబ్దకాలంలో 65 శాతం వృద్ధితో 1.26 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు 2020–21లో కాలేజీల నుంచి పట్టాలతో బయటకు వచ్చారు. ఏటా లక్ష డాలర్లకు తగ్గని వేతనాలు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు కొదవ ఉండదనే భరోసా.. ఈ రంగం వైపు విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారుతున్న వారిలో ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారి శాతమే ఎక్కువ. దాదాపు 4 లక్షల మంది.. అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్కు ఆదరణ ఏటా పెరుగుతూనే ఉంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్న వారిలో అత్యధికులు ఈ రంగం వారే. 2020–21లో దాదాపు 4 లక్షల మంది ఈ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పడిపోతున్న ‘ఆర్ట్స్’ అమెరికాలో పలు ఆర్ట్స్ గ్రూప్‌లకు ఆదరణ తగ్గుతోంది. సామాజిక శా్రస్తాలు, భాషలు, చరిత్ర లాంటి 17 సబ్జెక్టుల్లో గత దశాబ్దకాలంలో విద్యార్థుల చేరికలు తగ్గినట్లు తేలింది. ఇంగ్లిష్, చరిత్ర తదితర సబ్జెక్టుల్లో దశాబ్దకాలంలో 35 శాతం విద్యార్థుల సంఖ్య పడిపోయింది. పాకశాస్త్రంలో తగ్గుదల 50 శాతానికిపైగా ఉంది. ఉపాధి అవకాశాలున్నా.. తగ్గిన చేరికలు అమెరికాలో ఎడ్యుకేషన్ రంగంలో గ్రాడ్యుయేషన్ చేసే వారి సంఖ్య తగ్గుతోంది. టీచర్ల వేతనాలు పెద్దగా పెరగకపోవడం ఈ రంగంలోకి విద్యార్థులు రాకపోవడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. టీచర్ల కొరత ఉన్నందున ఉద్యోగవకాశాలు సులభంగా దక్కే అవకాశం ఉన్నా.. ఇతర రంగాల వైపే విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దశాబ్దకాలంలో 16 శాతం మేర చేరికలు తగ్గాయి. అలాగే మారుతున్న ప్రపంచంలో పరిశ్రమలు స్పెషలైజేషన్‌ను కోరుకుంటుండటంతో విద్యార్థులు కూడా లిబరల్ ఆర్ట్స్‌వైపు ఆసక్తి చూపించం లేదు. దీంతో విద్యార్థుల సంఖ్య దశాబ్దకాలంలో 10 శాతం తగ్గింది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇంగ్లిష్దీ ఇదే పరిస్థితి. -
అవాంతరాలు సర్వసాధారణంగా మారాయి
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణలో వివిధ రకాల అవాంతరాలు ప్రస్తుతం సర్వ సాధారణంగా మారాయని అల్ట్రాటెక్ సిమెంట్ చైర్మన్ కుమార మంగళం బిర్లా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్నప్పటికీ వాటిని విజయవంతంగా అధిగమించగలిగేలా భారత్ కనిపిస్తోందని తెలిపారు. వార్షిక సర్వ సభ్య సమావేశంలో షేర్హోల్డర్లను ఉద్దేశించి వర్చువల్‌గా చేసిన ప్రసంగంలో ఆయన ఈ అంశాలు ప్రస్తావించారు. ఈ ఏడాది వ్యయాలపరమైన ఒత్తిళ్లు, ఆర్థిక మార్కెట్లలో అస్థిరత విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ వ్యాపారాలు మధ్యకాలికంగా చూస్తే వ్యాపారాలు రికవరీ బాటలోనే కొనసాగుతున్నాయని బిర్లా వివరించారు. ‘కోవిడ్–19 మహమ్మారి కారణంగా 2020 అసాధారణమైన సంవత్సరంగా గడిచింది. సరఫరా వ్యవస్థలు దెబ్బతినడంతో 2021 కూడా అలాగే గడిచిపోయింది. ఇక ఇప్పుడు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయంగా స్టాగ్ఫ్లేషన్ (ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత పెరిగిపోయి.. డిమాండ్ స్తబ్దంగా ఉండటం) వంటి కారణాలతో 2022 కూడా అసాధారణంగానే కొనసాగుతోంది. చూడబోతే అవాంతరాలనేవి సర్వసాధారణంగా మారిపోయినట్లుగా కనిపిస్తోంది‘ అని బిర్లా చెప్పారు. -
ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు ‘సింగిల్ విండో’
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇన్వెస్టర్లు, వ్యాపారాలకు అనుమతుల కోసం జాతీయ స్థాయిలో సింగిల్ విండో విధానాన్ని అందుబాటులోకి తెచి్చంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బుధవారం దీన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. దీనితో వ్యాపారాలను నమోదు చేసుకునేందుకు, ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ ప్రభుత్వ విభాగాల చుట్టూ తిరగాల్సిన సమస్య తప్పుతుందని ఆయన పేర్కొన్నారు. ‘వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, భారత్ సిసలైన స్వావలంబన సాధించడం లక్ష్యాలను సాకారం చేసుకునే దిశగా ఇది ముఖ్యమైన పరిణామం. దీనితో బ్యూరోక్రసీ నుంచి, వివిధ విభాగాల చూట్టూ తిరగడం నుంచి స్వాతంత్య్రం లభిస్తుంది‘ అని మంత్రి చెప్పారు. ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారా 18 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, 9 రాష్ట్రాలకు సంబంధించిన అనుమతులు పొందవచ్చు. డిసెంబర్ ఆఖరు నాటికి మరో 14 కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ఇంకో 5 రాష్ట్రాలను చేరుస్తామని గోయల్ తెలిపారు. నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ బీటా వెర్షన్ ప్రజలు, సంబంధిత వర్గాలందరికీ అందుబాటులో ఉంటుంది. యూజర్లు, పరిశ్రమ ఫీడ్‌బ్యాక్ బట్టి ఇందులో మరిన్ని అనుమతులు, లైసెన్సుల జారీ ప్రక్రియకు సంబంధించిన అంశాలను జోడించనున్నట్లు కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. పారదర్శకతకు పెద్ద పీట..: సమాచారం అంతా ఒకే పోర్టల్‌లో అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందని గోయల్ వివరించారు. పరిశ్రమ, ప్రజలు, సంబంధిత వర్గాలు అందరితో కలిసి టీమ్ ఇండియాగా పనిచేసేందుకు ప్రభుత్వం ముందుకొచి్చందని, సమష్టి కృషి ఫలితమే ఈ పోర్టల్ అని చెప్పారు. దరఖాస్తు మొదలుకుని దాని అనుమతుల ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, సందేహాలకు తగు వివరణలు ఇచ్చేందుకు ఇందులో దరఖాస్తుదారు కోసం ప్రత్యేకంగా డ్యాష్‌బోర్డ్ ఉంటుందని పేర్కొన్నారు. పటిష్టమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ వైపే యావత్ప్రపంచం చూస్తోందని గోయల్ చెప్పారు. -
విధానాలు ముఖ్యం... తాయిలాలు కాదు
ధర్మశాల (హిమాచల్‌ప్రదేశ్): ఉచిత తాయిలాలకు వ్యతిరేకంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. పారదర్శకమైన, సులభతర వ్యాపార నిర్వహణకు అనుగుణంగా నిబంధనలు ఉండాలేకానీ, ఉచిత విద్యుత్తు, చౌకగా భూమి, పన్ను రాయితీలు కాదన్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణకు ధర్మశాలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించి మాట్లాడారు. 2025 నాటికి ఐదు లక్షల కోట్ల డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాల పాత్ర ఉంటుందన్నారు. ‘‘పరిశ్రమలు పారదర్శకత, స్వచ్ఛమైన వ్యవస్థను ఇష్టపడతాయి. అనవసర నిబంధనలు, అనవసర ప్రభుత్వ జోక్యం పరిశ్రమల వృద్ధికి విఘాతం కలిగిస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. పర్యాటకం, ఫార్మా రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు హిమాచల్‌ప్రదేశ్‌కు ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయన్నారు. -
‘డూయింగ్ బిజినెస్’ ఈజీ కాదు!!
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపార నిర్వహణ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సులభతరంగా లేదని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) ప్రెసిడెంట్ అనిల్ ఖైతాన్ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మెరుగుపడలేదని తెలిపారు. దిగువ స్థాయిల్లో ఇంకా అవినీతి నెలకొని ఉందన్నారు. ‘‘కేంద్ర ప్రభుత్వం వద్ద మాటలు మాత్రమే ఉన్నాయి. చేతలు కనిపించడంలేదు. పాలసీలు ప్రకటిస్తారు. కానీ వాటిని అమలు చేయరు. అప్పుడు వాటి వల్ల ఉపయోగం ఏముంటుంది? ప్రకటించిన వాటిని అమలు చేయలేకపోతే అవి వైఫల్యాలుగా మిగిలిపోతాయి’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పాలసీల అమలులో మాటలతో పాటు చేతలు కూడా చూపించాలన్నారు. డీమోనిటైజేషన్ ప్రతికూల ప్రభావం నుంచి కంపెనీలు బయటపడటానికి కనీసం మరో 14 నెలలు పడుతుందన్నారు. కాగా ప్రపంచ బ్యాంక్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తాజా నివేదికలో భారత్ 30 స్థానాలు ఎగబాకి 100వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఖైతాన్ స్పందిస్తూ.. ‘నేను అలా అనుకోవడం లేదు. బిల్డర్లతో మాట్లాడితే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదనే అంశం స్పష్టమౌతోంది’ వివరించారు. -
సంస్కరణల వల్లే మెరుగైన ర్యాంకు
న్యూఢిల్లీ: సులభతర వ్యాపార నిర్వహణ(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో భారత్ ర్యాంకు మెరుగుపడడంపై కాంగ్రెస్ విమర్శల్ని ప్రధాని మోదీ తోసిపుచ్చారు. ఒకప్పుడు ప్రపంచ బ్యాంకుతో కలిసి పనిచేసిన వారే ఇప్పుడు ఆ సంస్థ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో శనివారం నిర్వహించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్‌ను పెట్టుబడులకు గమ్యస్థానంగా అభివర్ణించారు. గత మూడేళ్లలో కేంద్రం చేపట్టిన సంస్కరణల వల్లే ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో భారత్ ర్యాంకు 30 స్థానాలు మెరుగుపడి 100వ ర్యాంకులో నిలిచిందని చెప్పారు. జీఎస్టీతో పాటు ఇతర అన్ని సంస్కరణల ఫలితాల్ని కూడా ప్రపంచ బ్యాంకు పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఏడాది నుంచి ర్యాంకింగ్ మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత సంస్కరణల్ని ఇంతకుముందే అమలు చేసి ఉంటే రేటింగ్ ఎప్పుడో మెరుగుపడి ఉండేదని గత ప్రభుత్వాల పనితీరును పరోక్షంగా తప్పుపట్టారు. దేశంలోని 125 కోట్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవడం కోసం ‘ఒన్ లైఫ్, ఒన్ మిషన్’ లక్ష్యంగా పనిచేస్తున్నానని చెప్పారు. జీఎస్టీపై చిన్న వ్యాపారస్తులు చేసిన పలు సూచనల్ని మంత్రుల బృందం ఆమోదించిందని, వచ్చే వారం జీఎస్టీ మండలి సమావేశాల్లో ప్రకటన వెలువడవచ్చన్నారు. మే, 2016 వరకూ అమలు చేసిన సంస్కరణల్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని 2017 సంవత్సరం ర్యాంకుల్ని ప్రకటించారన్నారు. -
సంస్కరణల వల్లే మెరుగయ్యాం: మోదీ
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణల వల్లే సులభతర వ్యాపార నిర్వహణకు సంబం ధించి ప్రపంచ బ్యాంకు ర్యాంకింగ్‌లో భారత్ 30 స్థానాలు మెరుగుపరచుకుందని ప్రధాని మోదీ అన్నారు. వ్యాపారానికి అను కూల వాతావరణం ఉండటం వల్ల పారిశ్రామిక వేత్తలకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అవకాశాలు ఏర్పడతా యన్నారు. ‘భారత్ 30 స్థానాలు మెరుగు పరచుకుని 100వ ర్యాంకును సాధించింది. ఇది గొప్ప గర్వకారణం’ అని మోదీ తన లింక్డ్ ఇన్ ఖాతాలో పోస్ట్ చేశారు. -
గతవారం బిజినెస్
వ్యాపార నిర్వహణ... భారత్‌కు రెండో ర్యాంక్ వ్యాపార నిర్వహణ సులభతరం చేయడంలో భారత్ ఈ ఏడాది రెండో ర్యాంక్‌ను సాధించింది. గ్లోబల్ రిటైల్ డెవలప్మెంట్ ఇండెక్స్(జీఆర్‌డీఐ) రూపొందించిన ఈ జాబితాలో అభివృద్ధి చెందుతున్న 30 దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. భారత్‌లో జనాభా అధికంగా ఉండడం, జీడీపీ జోరు పెరుగుతుండడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ప్రభుత్వం సరళీకరిస్తుండడం వంటి కారణాల వల్ల భారత్‌కు ఈ ర్యాంక్ లభించిందని నివేదిక పేర్కొంది. ఎల్అండ్టీకి ఖతార్ ప్రతిష్టాత్మక కాంట్రాక్ట్ ఖతార్ 2022 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు సంబంధించి 13.5 కోట్ల డాలర్ల (సుమారుగా రూ.900 కోట్లకు పైగా)విలువైన స్టేడియం నిర్మాణ కాంట్రాక్ట్ ఎల్ అండ్ టీ జాయింట్ వెంచర్‌కు లభించింది. ఏఐ బలగ్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీతో ఎల్ అండ్ టీ ఈ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ కాంట్రాక్టులో భాగంగా 40 వేల సీట్ల ఏఐ రాయ్యన్ స్టేడియమ్‌ను ఎల్ అండ్ టీ జేవీ 2019 కల్లా నిర్మించాల్సి ఉంటుంది. గ్రీన్ బాండ్లతో యాక్సిస్ నిధుల సమీకరణ లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో గ్రీన్ బాండ్ల జారీ ద్వారా ప్రైైవేట్ రంగంలోని యాక్సిస్ బ్యాంక్ 50 కోట్ల డాలర్లు సమీకరించింది. అంతర్జాతీయంగా లిస్టైన తొలి భారత గ్రీన్ బాండ్ ఇది. యాక్సిస్ బ్యాంక్ గ్రీన్ బాండ్‌ను క్లైమెట్ బాండ్స్ స్టాండర్డ్స్ బోర్డ్ సర్టిఫై చేసింది. ఈ గ్రీన్ బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను హరిత ఇంధనోత్పత్తి, రవాణా, మౌలిక ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేస్తామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్ షేర్ల బై బ్యాక్! ప్రభుత్వ రంగ మైనింగ్ దిగ్గజ కంపెనీలు ఎన్ఎండీసీ, ఎంఓఐఎల్‌లు 25 శాతం వాటా షేర్లను బై బ్యాక్ చేయనున్నాయి. ఈ రెండు సంస్థలు కలసి రూ.10,000 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్ చేస్తాయని అంచనాలున్నాయి. ఈ రెండు కంపెనీల్లో ప్రభుత్వ వాటా 80 శాతంగా ఉండటంతో ఈ బై బ్యాక్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.6,500 కోట్లు సమకూరుతాయని అంచనా. యథాతథ రేట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా బ్యాంక్ రేటు (7 శాతం), రెపో రేటు (6.5 శాతం), రివర్స్ రెపో రేటు (6 శాతం), నగదు నిల్వల శాతం (సీఆర్ఆర్-4 శాతం)లను అంచనాలకనుగుణంగానే యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణం రిస్క్‌తో ఈ నిర్ణయం తీసుకున్నామని గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. వర్షాలు కురిసి ద్రవ్యోల్బణం దిగొస్తే రేట్లను తగ్గిస్తామని చెప్పారు. టాప్-100 మహిళల్లో నలుగురు మనవారు.. ప్రపంచంలోని తొలి వంద మంది శక్తిమంతమైన మహిళల్లో నలుగురు భారతీయ మహిళలు చోటు సంపాదించారు. ఫోర్బ్స్ తాజాగా రూపొందించిన ఈ జాబితాలో... ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య 25వ స్థానంలో నిలవటం విశేషం. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ చందా కొచర్ 40వ స్థానంలోను... బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 77వ స్థానంలోను, హెచ్‌టీ మీడియా అధిపతి శోభనా భర్తియా 93వ స్థానంలోను నిలిచారు. అలాగే అరుంధతీ భట్టాచార్య.. ఫోర్బ్స్ ‘ఆర్థిక వ్యవహారాల్లో అత్యంత శక్తివంతమైన మహిళల’ జాబితాలో 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈక్విటీ ఫండ్స్ పెట్టుబడుల రికార్డు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు జోరుగా కొనసాగుతున్నాయి. మే నెలలో ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)తో సహా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.4,721 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు యాంఫీ పేర్కొంది. ఆరు నెలల కాలంలో ఈ నెలలోనే అధిక పెట్టుబడులు వచ్చాయని, రిటైల్ ఇన్వెస్టర్లు అధికంగా పెట్టుబడులు పెట్టడమే దీనికి ప్రధాన కారణమని తెలియజేసింది. సిండికేట్ బ్యాంక్ భారీ నిధుల సమీకరణ ప్రభుత్వ రంగ సిండికేట్ బ్యాంక్ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.1,700 కోట్లు సమీకరించనుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్‌పీఓ) లేదా రైట్స్ ఇష్యూ లేదా క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్విప్) లేదా ప్రభుత్వం/ ఆర్బీఐ ఆమోదించే మరే ఇతర మార్గాల ద్వారానైనా ఈ నిధులు సమీకరించాలని యోచిస్తున్నామని సిండికేట్ బ్యాంక్ తెలియజేసింది. ఈ నెల 26న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం కోరతామని వివరించింది. ఆఫీసు లీజుల్లో బెంగళూరు టాప్ ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకోవటంలో బెంగళూరు రికార్డుసృష్టించింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధిక ఆఫీసు స్థల లీజు ఒప్పందాలు బెంగళూరులోనే చోటు చేసుకున్నట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ సంస్థ జేఎల్ఎల్ ఇండియా తెలియజేసింది. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి బెంగళూరు, టోక్యో, ఢిల్లీ- ఎన్సీఆర్లో ఈ ఏడాది ప్రారంభం నుంచే లీజింగ్ కార్యకలాపాలు ఊపందుకున్నాయని సంస్థ పేర్కొంది. రుణ రేటు తగ్గించిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ (ఎంసీఎల్ఆర్) ఆధారిత రుణ రేటును స్వల్పంగా 0.05 శాతం తగ్గించింది. కొత్త రుణ గ్రహీతల నెలవారీ బకాయిల చెల్లింపు (ఈఎంఐ)లు తగ్గడానికి దోహదపడే అంశం ఇది. తాజా నిర్ణయంతో బ్యాంక్ రెండేళ్ల రుణ రేటు 9.25 శాతం నుంచి 9.20 శాతానికి తగ్గింది. ఈ నిర్ణయం 7వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెబ్సైట్లో పేర్కొంది. ఇక నెలవారీ రేటు 9 శాతం నుంచి 8.95కు తగ్గింది. హైదరాబాద్‌లో ఫ్లైదుబాయ్ కేంద్రం వినూత్న యాప్స్‌తో దూసుకెళ్తున్న హైదరాబాద్ డెవలపర్లకు మరో అరుదైన అవకాశం లభించింది. ఇక్కడి యువ డెవలపర్ల ప్రతిభను చూసిన చౌక విమానయాన సంస్థ ఫ్లైదుబాయ్... హైదరాబాద్‌లో డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ) ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్న ఈ కేంద్రం సంస్థకు భారత్‌లో తొలి డెవలప్మెంట్ సెంటర్ కావటం విశేషం. తిరిగి పరిశ్రమల పడక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటినెల ఏప్రిల్‌లో పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధి నమోదుకాలేదు. 2015 ఇదే నెలతో పోల్చితే ఉత్పత్తిలో అసలు వృద్ధి లేకపోగా -0.8 శాతం క్షీణించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 2 శాతం, మార్చిలో 0.3 శాతం ప్లస్‌లో వున్న పారిశ్రామికోత్పత్తి ఏప్రిల్‌లో మైనస్‌లోకి జారిపోవడం గమనార్హం. కాగా గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు 3 శాతం. ఇక మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) సూచీలో 75 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో కూడా అసలు వృద్ధి లేకపోగా - 3.1 శాతం క్షీణత నమోదయ్యింది. 2015 ఏప్రిల్‌లో ఈ రంగం వృద్ధి రేటు 3.9 శాతం. అమ్మకానికి డెక్కన్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లు రుణ సంక్షోభంలో కూరుకుపోయిన డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) ట్రేడ్‌మార్కులను వేలం వేసేందుకు ఐడీబీఐ బ్యాంకు సిద్ధమైంది. దాదాపు రూ. 444 కోట్ల బకాయిలను రాబట్టుకునేందుకు ఈ నెల 24న డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి, ఏషియన్ ఏజ్, ఫైనాన్షియల్ క్రానికల్ ట్రేడ్‌మార్క్‌లను ఆన్లైన్లో వేలం వేయనున్నట్లు ప్రకటించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 23 ఆఖరు తేదీగా పేర్కొంది. డీల్స్.. * పునరుత్పాదక ఇంధన రంగంలో ఉన్న గ్రీన్కో ఎనర్జీలో సింగపూర్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ జీఐసీతోపాటు అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీలకు చెందిన కంపెనీలు సుమారు రూ.1,530 కోట్లు పెట్టుబడి పెట్టాయి. * అమెరికా మార్కెట్లో విక్రయాల కోసం యూఎస్‌ఫార్మా విండ్లాస్ సంస్థ నుంచి నాలుగు ఉత్పత్తులకు సంబంధించి హక్కులు దక్కించుకున్నట్లు గ్రాన్యూల్స్ ఇండియా వెల్లడించింది. డ్రోన్‌డరోన్, లూరాసిడోన్, ప్రాసుగ్రెల్, ఫింగ్లిమోడ్ వీటిలో ఉన్నట్లు వివరించింది. * టీవీఎస్ గ్రూప్‌కు చెందిన టీవీఎస్ ఆటోమొబైల్ సొల్యూషన్స్(టీవీఎస్ ఏఎస్ఎల్) సంస్థ 3 స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టింది. కంపెనీ డిజిటల్ ప్రయత్నాల్లో భాగంగా ఈ స్టార్టప్‌ల్లో ఇన్వెస్ట్ చేశామని టీవీఎస్ ఏఎస్ఎల్ వివరించింది. * ఫోన్ డెరైక్టరీ యాప్, ట్రూకాలర్‌లో మైనారిటీ వాటాను వొడాఫోన్ గ్లోబల్ కంపెనీ మాజీ సీఈఓ అరుణ్ శరీన్ కొనుగోలు చేశారు. ఎంత వాటాను, ఎంతకు కొనుగోలు చేసింది తదితర వివరాలు వెల్లడికాలేదు. * స్టార్టప్‌ల్లో రతన్ టాటా పెట్టుబడుల జోరు పెరుగుతోంది. తాజాగా ఆయన ఈ-టికెటింగ్ కంపెనీ క్యజూంగలో పెట్టుబడులు పెట్టారు. * బీఎల్ఏ పవర్లో 15.23 శాతం వాటాను ప్రిజమ్ సిమెంట్ రూ.21 కోట్లకు కొనుగోలు చేసింది. -
భారత్‌లో వ్యాపార పవనాలు
బిజినెస్ అనుకూల దేశాల జాబితాలో 12 స్థానాలు జంప్, 130వ ర్యాంకు * మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణలో 8వ స్థానం * ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడి వాషింగ్టన్: కొత్త కంపెనీల చట్టం, విద్యుత్ సరఫరా మెరుగుపడటం తదితర అంశాల ఊతంతో వ్యాపారాల నిర్వహణకు అనుకూల దేశాల జాబితాలో భారత్ 130వ స్థానానికి ఎగబాకింది. గతేడాది భారత ర్యాంకింగ్ 142. భారత్ వంటి భారీ దేశం ఒక్కసారిగా 12 స్థానాలు దూసుకెళ్లడం చెప్పుకోతగ్గ విజయమేనని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్టు కౌశిక్ బసు వ్యాఖ్యానించారు. భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలకు ఇది సానుకూల సంకేతమన్నారు. ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట ప్రపంచ బ్యాంకు 189 దేశాలతో రూపొందించిన జాబితాలో పది అంశాల ప్రాతిపదికన భారత్‌కు తాజాగా 130వ ర్యాంకు దక్కింది. ఈ లిస్టులో సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా, న్యూజిల్యాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చైనా (84), పాకిస్తాన్ (138) ర్యాంకుల్లో ఉన్నాయి. కనీస పెట్టుబడి పరిమితి నిబంధనలను తొలగించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించడాన్ని భారత్ మరింత సులభతరం చేయడం సానుకూలాంశమని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది. విద్యుత్ కనెక్షను అనుమతులు (70వ స్థానం), నిర్మాణ అనుమతులు (183వ స్థానం), ప్రాపర్టీ నమోదు (138వ ర్యాంకు) తదితర అంశాలు భారత ర్యాంకింగ్‌కు ప్రాతిపదికగా నిల్చాయి. ఇక వ్యాపారాల ప్రారంభానికి పట్టే సమయం విషయంలో భారత్ 164వ స్థానం నుంచి 155వ ర్యాంకుకు చేరడం చెప్పుకోతగ్గ మరో పరిణామం. భారత్‌లో వ్యాపారం ప్రారంభించాలంటే 12 పైగా ప్రక్రియలు పాటించాల్సి వస్తోంది. ఇందుకు 29 రోజులు పడుతోంది. నిర్మాణ అనుమతులు విషయంలో భారత ర్యాంకింగ్ స్వల్పంగా 184వ స్థానం నుంచి 183వ స్థానానికి పెరిగింది. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో మాత్రం 99వ ర్యాంకు నుంచి 70వ స్థానానికి ఎగబాకింది. అయితే, రుణ సదుపాయం లభ్యత, పన్నుల చెల్లింపుల విషయంలో మాత్రం దేశ ర్యాంకింగ్ తగ్గింది. మరోవైపు, మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు పరిరక్షించడంలో భారత్ అంతర్జాతీయంగా 8వ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో అమెరికా (35), జర్మనీ (49), జపాన్ (36) వంటి పలు సంపన్న దేశాల కన్నా కూడా ముందు నిల్చింది. బ్రిక్స్ కూటమిలో (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) భారత్ మెరుగ్గా ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. జీఎస్టీ అమలు కీలకం.. భారత ర్యాంకింగ్ పెరగడానికి విద్యుత్ లభ్యత, కొత్త కంపెనీల చట్టం తదితర అంశాలు దోహదపడ్డాయని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా ప్రపంచ బ్యాంకు భారత విభాగం డెరైక్టరు ఒనో రుహల్ చెప్పారు. భారత్‌ను ఒకే పెద్ద మార్కెట్‌గా మార్చడంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధాన సంస్కరణ అమలు కీలకమని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తెస్తే.. 2018 నాటికి ఆ ప్రభావాలు కనిపించడం మొదలు కాగలదని ఒనో రుహల్ పేర్కొన్నారు. అయితే, వ్యాపారాల విషయంలో భారత్ స్కోరు మెరుగుపడటానికి ఇదొక్కటే సరిపోదని, మరిన్ని సంస్కరణలు అవసరమవుతాయని వివరించారు. టాప్ 100లో చేరే సత్తా ఉంది.. నిర్దేశించుకున్న ఆర్థిక సంస్కరణలను భారత్ అమల్లోకి తెస్తే వచ్చే ఏడాది టాప్ 100 దేశాల జాబితాలో చేరడం కష్టమేమీ కాదని కౌశిక్ బసు చెప్పారు. ఇందుకోసం జీఎస్టీని అమలు చేయడం, బ్యూరోక్రసీపరమైన అడ్డంకులు తొలగించడం కీలకమన్నారు. సాధారణంగా ఇతర దేశాలు సంస్కరణలు చేపట్టిన తొలి ఏడాది స్వల్పంగా, ఆ తర్వాత రెండు.. మూడు సంవత్సరాల్లో గణనీయంగా ర్యాంకులు మెరుగుపర్చుకుంటాయని బసు చెప్పారు. కానీ, భారత్ తొలి ఏడాదిలోనే చెప్పుకోతగ్గ స్థాయిలో ర్యాంకు మెరుగుపర్చుకుందన్నారు. ర్యాంకు మరింత పెంచుకుంటాం: జైట్లీ ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఇచ్చిన తాజా ర్యాంకింగ్.. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావం పూర్తిగా ప్రతిబింబించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. వ్యాపారాల నిర్వహణకు అనువైన దేశాల జాబితాలో భారత్ స్థానం వచ్చే ఏడాది మరింతగా మెరుగుపడగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ 1 దాకా గణాంకాల ఆధారంగానే ప్రస్తుత ర్యాంకింగ్ ఉందని, ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న పలు చర్యల ప్రభావం వచ్చే ఏడాది కనిపించగలదని జైట్లీ చెప్పారు. ఆదాయ పన్ను చట్టాన్ని సరళతరం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలాగే కంపెనీల చట్టంలోని సంక్లిష్టతలను తొలగించేందుకు కమిటీ కసరత్తు చేస్తోందని తెలిపారు. -
సంస్కరణలు వేగవంతం చేయండి
వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడేలా చూడండి - భారత్‌ను కోరిన అమెరికా - వైస్ ప్రెసిడెంట్ జో బెడైన్ వాషింగ్టన్: పెట్టుబడుల రాకకు, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేలా ఆర్థిక సంస్కరణల అమలును మరింత వేగవంతం చేయాలని అమెరికా ఉపాధ్యక్షుడు జో బెడైన్.. భారత్‌ను కోరారు. మేధోహక్కులను పరిరక్షించడం, వాణిజ్య నిబంధనలను సరళతరం చేయడంపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్-అమెరికాల మధ్య తొలి వ్యూహాత్మక, వాణిజ్య చర్చలు.. ఇరు దేశాల సంబంధాల్లో నూతన శకాన్ని ఆవిష్కరించగలవని బెడైన్ వ్యాఖ్యానించారు. అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ) 40వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా బెడైన్ ఈ విషయాలు చెప్పారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ సదస్సులో పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులు, సర్వీసులను మార్కెట్లో స్వేచ్ఛగా విక్రయించుకునే వీలు కల్పించేలా విదేశీ పెట్టుబడులపై పరిమితులు తొలగించాల్సిన అవసరం ఉందని బెడైన్ పేర్కొన్నారు. వాణిజ్య నిబంధనల సరళీకరణ ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుందన్నారు. అటు వాతావరణంలో ప్రతికూల మార్పులను సరిదిద్దేందుకు కూడా ఇరు దేశాలు మరింతగా పరస్పరం సహకరించుకోవాలని, ఇది ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల ఆర్థిక ప్రగతిలో కొత్త శకాన్ని ఆవిష్కరించగలదని బెడైన్ చెప్పారు. ఇరు దేశాలు వాణిజ్య సంబంధాలు వేగవంతంగా పటిష్టం చేసుకుంటున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ పేర్కొన్నారు. ఇండియాలో ఇన్వెస్ట్ చేయండి.. సుష్మా స్వరాజ్ భారత్‌లో అపార వ్యాపార అవకాశాలు ఉన్నాయని, వీటిని అందిపుచ్చుకునేందుకు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాలని అమెరికన్ ఇన్వెస్టర్లకు సుష్మా స్వరాజ్ పిలుపునిచ్చారు. భారత్ పట్టణీకరణను పెంచేందుకు, ప్రజలందరికీ చౌకగా విద్యుత్‌ను, అందుబాటు ధరల్లో ఇళ్లను అందించేందుకు కృషి చేస్తోందని ఆమె తెలిపారు. అలాగే అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. వీటన్నింటా కూడా వ్యాపార అవకాశాలు ఉన్నాయని, అమెరికా ఇన్వెస్టర్లు వీటిని అందిపుచ్చుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. మరోవైపు, వ్యాపారాలకు అనువైన దేశాల జాబితాలో భారత్ .. టాప్ 50లోకి చేరాలంటే .. కాంట్రాక్టుల అమలును మెరుగుపర్చాలని, దివాలా చట్టాలను ఆధునీకరించాలని అమెరికా వాణిజ్య మంత్రి పెనీ ప్రిట్జ్కర్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో వ్యాపారపరమైన కాంట్రాక్టుల వివాదాలు పరిష్కారం కావడానికి సంవత్సరాలు పట్టేస్తుందని, నిబంధనలు తరచూ మారిపోతుంటాయని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి పరిస్థితుల వల్ల భారత్‌లో వ్యాపార నిర్వహణ చాలా ఖరీదైన వ్యవహారంగానూ, అనూహ్యమైన విధంగానూ ఉంటోందని పెనీ పేర్కొన్నారు. ఇవే దేశీ, విదేశీ పెట్టుబడుల రాకకు అవరోధంగా మారుతున్నాయన్నారు. ఇలాంటి వాటిని పరిష్కరించే దిశగా అత్యుత్తమ విధానాలదే రూపకల్పన చేసేందుకు ఇరు దేశాల బృందాలు కలిసి పనిచేయనున్నాయని పెనీ చెప్పారు. నూయి, భార్తియాకు పురస్కారాలు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో అందర్నీ భాగస్వాములు చేసే దిశగా కృషి చేస్తున్నందుకు గాను పెప్సీకో చైర్మన్ ఇంద్రా నూయి, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ చైర్పర్సన్ శోభనా భార్తియా ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు. 2015 సంవత్సరానికి గాను యూఎస్ఐబీసీ.. గ్లోబల్ లీడర్షిప్ అవార్డును దక్కించుకున్నారు. భారత్-అమెరికా సంబంధాల్లో యూఎస్ఐబీసీ కీలకపాత్ర పోషిస్తోందని ఈ సందర్భంగా ఇంద్రా నూయి పేర్కొన్నారు. రెండు దేశాల మీడియా, టెక్నాలజీ సంస్థలు కలిసి పనిచే సేందుకు అపార అవకాశాలున్నాయని శోభనా భార్తియా తెలిపారు. ప్రముఖ ఇండియన్-అమెరికన్ ఆర్టిస్టు నట్వర్ భవ్సార్.. ఆర్టిస్టిక్ అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నారు. -
మరిన్ని సంస్కరణలు తెస్తాం...
- వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు కల్పిస్తాం... - భారత్‌లో ఇన్వెస్ట్ చేయండి: ఆర్థిక మంత్రి జైట్లీ అంకారా (టర్కీ): పన్నుల విధానాలు హేతుబద్ధంగా ఉండేలా మరిన్ని సంస్కరణలు ప్రవేశపెడతామని, వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. భారత్‌లో స్మార్ట్ సిటీలు, టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, పునరుత్పాదక విద్యుత్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేయాలంటూ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. జీ-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సదస్సు సందర్భంగా భారతీయ పరిశ్రమల సమాఖ్య సీఐఐ.. టర్కీ ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ ఇన్ఫ్రాకు ఇంకా నిధులు కావాలి. విదేశీ ఇన్వెస్టర్లు ఈ విషయంలో కీలక పాత్ర పోషించగలరు’’ అని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. టర్కీ నిర్మాణ రంగ కంపెనీలు కన్సార్షియంగా ఏర్పడి, భారత్‌లో వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని జైట్లీ సూచించారు. -
పన్నుల విధానాలు సరళతరం చేయాలి
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా అనుమతులకు సింగిల్ విండో విధానం అమలు చేయటంతో పాటు నియంత్రణ, పన్నుల విధానాలను సరళతరం చేయాలని టాటా స్టీల్, జీఎంఆర్ తదితర దిగ్గజ సంస్థలు కేంద్రాన్ని కోరాయి. ఇన్వెస్టర్లు బహుళ అనుమతుల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా చర్యలు సూచించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన అజయ్ శంకర్ కమిటీకి ఆయా సంస్థలు ఈ మేరకు తమ అభిప్రాయాలు తెలియజేశాయి. -
ఇక మరింత సులువుగా వ్యాపారాల నిర్వహణ
మరిన్ని నిబంధనలు సడలించిన కేంద్రం న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది. ఇకపై ప్రైవేట్ కంపెనీలు .. ఆఫర్ సర్క్యులర్, డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా డిపాజిట్లు స్వీకరించే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ సంస్థల్లో అధికారులకిచ్చే జీతభత్యాల విషయంలో పరిమితుల నుంచి మినహాయింపునిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, చారిటబుల్ సంస్థలు, నిధి కంపెనీలు మొదలైన వాటి నిబంధనలను సడలిస్తూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ప్రైవేట్ కంపెనీలు సింపుల్ మెజారిటీ ద్వారా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్‌ను ఆమోదించవచ్చు. అలాగే, పెట్టుబడులు తదితర నిర్దిష్ట లావాదేవీలకు షేర్‌హోల్డర్ల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలన్న నిబంధనను పక్కన పెడుతున్నట్లు ఎంసీఏ పేర్కొంది. ఆడిటర్లు గరిష్టంగా 20 కంపెనీలకు మాత్రమే ఆడిటింగ్ చేయాలన్న నిబంధన పరిధిలోకి ఏక వ్యక్తి కంపెనీలు, అంతగా లావాదేవీలు లేని సంస్థలు, చిన్న కంపెనీలు, రూ. 100 కోట్ల పెయిడప్ షేర్ క్యాపిటల్ కన్నా తక్కువ ఉండే ప్రైవేట్ సంస్థలు మొదలైనవి రాకుండా మినహాయింపునిచ్చింది. డిఫెన్స్ పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థలకు కొన్ని అకౌంటింగ్ నిబంధనలను పాటించనక్కర్లేకుండా మినహాయింపు కల్పించింది. నిధి కంపెనీలకు సంబంధించి డివిడెండ్ చెల్లింపు తదితర అంశాలను సవరించింది. పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు ఉద్దేశించి ఏర్పాటైన సంస్థలను నిధి కంపెనీలుగా వ్యవహరిస్తారు. -
కంపెనీల చట్టానికి సవరణలపై నోటిఫికేషన్
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు, మోసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు ఉద్దేశించి కొత్త కంపెనీల చట్టం 2013లో పలు సవరణలను కేంద్రం నోటిఫై చేసింది. బోర్డుల తీర్మానాలు, అన్క్లెయిమ్డ్ డివిడెండ్ల వినియోగం, సంస్థల ఏర్పాటు తదితర సవరణలు ఇందులో ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు కోసం కనీస మూలధనం రూ. 1 లక్ష, ప్రభుత్వ రంగ సంస్థ ఏర్పాటుకు రూ. 5 లక్షలు ఉండాలన్న నిబంధనను కొత్త కంపెనీల చట్టం తొలగించింది. సమీకరించిన డిపాజిట్లను, వాటిపై వడ్డీని గడువులోగా చెల్లించని కంపెనీలపై రూ. 1 కోటి నుంచి రూ. 10 కోట్ల దాకా జరిమానా పడనుంది. అలాగే, కంపెనీ అధికారులకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. -
పన్నులు తగ్గించాలి
వృద్ధికి ఊతమివ్వాలి కేంద్రానికి పారిశ్రామిక దిగ్గజాల వినతి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో {పీ-బడ్జెట్ సమావేశం న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణకు ప్రతికూలంగా ఉంటున్న పన్నుల విధానాలను సరిచేయాలని పారిశ్రామిక దిగ్గజాలు కేంద్రాన్ని కోరారు. ఇందులో భాగంగా కార్పొరేట్ ట్యాక్స్, ఆదాయ పన్నులు మొదలైనవి తగ్గించాలని సూచించారు. బడ్జెట్ తయారీకి ముందు జరిపే చర్చల్లో భాగంగా మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిర్వహించిన సమావేశంలో వారు ఈ మేరకు తమ అభ్యర్థనలు తెలియజేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై మరిన్ని నిధులు వెచ్చించాలని, మేకిన్ ఇండియా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా సంస్కరణల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని వారు పేర్కొన్నారు. తయారీ రంగ వృద్ధి మందకొడిగా ఉన్న పరిస్థితి వాస్తవమేనని అంగీకరించిన అరుణ్ జైట్లీ.. వ్యాపార నిర్వహణకు పరిస్థితులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి వస్తే.. పన్నుల వ్యవస్థ మెరుగుపడగలదని, మరింత పారదర్శకత రాగలదని ఆయన తెలిపారు. మరోవైపు, కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 10 శాతానికి పరిమితం చేయడం ద్వారా తయారీ రంగానికి తోడ్పాటునివ్వాలని భేటీలో కోరినట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ అజయ్ శ్రీరామ్ తెలిపారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లలో(సెజ్) యూనిట్లకు, డెవలపర్లకు మ్యాట్ .. డివిడెండ్ పంపిణీ పన్నులు (డీడీటీ) నుంచి మినహాయింపునివ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ ప్రక్రియకు, ఉపాధి కల్పనకి, వ్యవసాయ రంగ అభివృద్ధికి ఊతమిచ్చేలా బడ్జెట్లో మరిన్ని చర్యలు ఉండగలవని ఆశిస్తున్నట్లు శ్రీరామ్ పేర్కొన్నారు. -
ప్రతిభకు పదునుపెట్టే ఫాస్ట్‌ట్రాక్ ఎంబీఏ
దేశంలో వేగంగా మారుతున్న వ్యాపార, వాణిజ్య పరిస్థితుల నేపథ్యంలో పోటీ తీవ్రమవుతోంది, వ్యాపారంలో పురోగతికి, సమర్థమైన వ్యాపార నిర్వహణ కోసం ప్రతిభకు మరింత సానపెట్టాలి. సాధారణ ఉద్యోగంలో స్థిరపడినవారికి మంచి వ్యాపారంలోకి ప్రవేశించి మరో 10 మందికి ఉపాధి చూపాలనే ఆశయం ఉంటే.. మొదట బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవాలి. కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటే.. అకడమిక్ అర్హతలను పెంచుకొని ఉన్నత ఉద్యోగంలో చేరొచ్చు. ఇలాంటి కలలను నిజం చేసేందుకే దేశంలోని బిజినెస్ స్కూల్స్ నడుం కట్టాయి. ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఏడాది కాల వ్యవధి గల ఫాస్ట్‌ట్రాక్ ఎంబీఏ కోర్సులను ప్రవేశపెట్టాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఈ కోర్సుల్లో అధిక సంఖ్యలో చేరుతున్నారు. తమ నైపుణ్యాలను, వ్యాపార మెళకువలను, అర్హతలను మెరుగుపర్చుకుంటున్నారు! సాంకేతిక పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు ఫాస్ట్‌ట్రాక్ ఫుల్‌టైమ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆదరణను ఎంతగానో చూరగొంటున్నాయి. వీటి ద్వారా పని అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చు. ఏడాదిపాటు సాగే కోర్సు పూర్తయిన తర్వాత తిరిగి తమ రంగాల్లో ప్రవేశించవచ్చు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఆసక్తి ఉంటే కొత్త రంగాల్లోకి అడుగుపెట్టడానికీ ఈ ఫాస్ట్‌ట్రాక్ కోర్సులు ఉపకరిస్తున్నాయి. పని అనుభవం తప్పనిసరి.. ఏడాది వ్యవధిగల పోస్టు గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లో చేరాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. కనీసం మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి. బిజినెస్ స్కూల్‌ను బట్టి ఇది మారుతుంది. చాలా బీ స్కూల్స్ జీమ్యాట్ స్కోర్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటాయి. రెండేళ్ల ఏంబీఏ కోర్సుల ఫీజులతో పోలిస్తే ఈ కోర్సుల ఫీజు కాస్త ఎక్కువే. ఐఐఎం-బెంగళూరులో రెండేళ్ల ఎంబీఏ ఫీజు రూ.17 లక్షలు కాగా ఏడాది ఎంబీఏ ఫీజు రూ.23 లక్షల వరకు ఉంది. కోర్సు తర్వాత వచ్చే వేతనాన్ని బట్టి చూస్తే ఇది ఎక్కువ మొత్తం కాదని బిజినెస్ స్కూళ్ల ప్రతినిధులు చెబుతున్నారు. అనుభవజ్ఞులకే కంపెనీల ప్రాధాన్యం ఎలాంటి అనుభవం లేకుండా కొత్తగా వచ్చే ఎంబీఏ గ్రాడ్యుయేట్ల కంటే కొంత పని అనుభవంతో వచ్చే ఏడాది ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. వారిని కొలువులో చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అనుభవజ్ఞులు కార్పొరేట్ వాతావరణానికి ముందుగానే అలవాటు పడి ఉండడం మరో కారణం. ఏడాది ఎంబీఏ ప్రోగ్రామ్స్ చేసిన వారికి ఎక్కువగా మేనేజ్మెంట్, లీడర్షిప్, ఆపరేషన్, రిటైల్, మానవ వనరుల నిపుణులు.. వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఏడాది ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఐటీ, ఐటీఈఎస్, కన్సల్టింగ్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. అవకాశాలను అందుకోవాలంటే.. 2001లో దేశవ్యాప్తంగా ఐఎస్బీ-హైదరాబాద్ మాత్రమే ఏడాది వ్యవధి గల ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. దీనికి ఆదరణ పెరగడంతో తర్వాత ఐఐఎంలు, ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్ ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. వీటికి ఆదరణ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. మన దేశంలో వ్యాపార రంగంలో వాతావరణం క్షణక్షణానికి మారిపోతోంది. కొత్తకొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి. వాటిని అందుకోవాలంటే తగిన అర్హతలు, అనుభవం అవసరం. ఇప్పటికే ఉద్యోగమో, వ్యాపారమో చేస్తున్నవారికి మళ్లీ రెండేళ్ల మేనేజ్మెంట్ కోర్సులను చదివే తీరిక ఉండడం లేదు. అందుకే ఏడాదిలోనే పూర్తయ్యే ఫాస్ట్‌ట్రాక్ ఎంబీఏ కోర్సులవైపు చూస్తున్నారని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమతమ రంగాల్లో ప్రగతిని ఆశిస్తున్నవారు ఏడాది ఎంబీఏ కోర్సుల్లో చేరి అర్హతలను పెంచుకుంటున్నారని పేర్కొంటున్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్సుతో పరిపూర్ణ నాయకత్వ లక్షణాలు ‘‘ఉద్యోగస్థులు లేదా ఎంటర్‌ప్రెన్యూర్స్ అవసరాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ప్రపంచ శ్రేణి మేనేజ్మెంట్ విద్యను అందించే లక్ష్యంగా బిజినెస్ స్కూల్స్... పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ తదితర స్వల్ప కాలవ్యవధి గల మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులతో అభ్యర్థులు తమ అర్హతలు, నైపుణ్యాలను పెంపొందించుకుని త్వరగా పని వాతావరణ ంలోకి తిరిగి వెళ్లేందుకు వీలవుతుంది. ఈ ఫాస్ట్‌ట్రాక్ కోర్సు పూర్తి చేసేనాటికి థియరీ, ప్రాక్టికల్ దృక్పథాలు పూర్తి స్థాయిలో లభించి పరిపూర్ణమైన నాయకత్వ లక్షణాలు సొంతమవుతాయి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు. తక్కువ కాలంలోనే కోర్సు పూర్తి చేయడం కఠినమైనప్పటికీ.. దాన్ని సవాలుగా బీస్కూల్స్ నిర్వహిస్తున్నాయి. తరగతి గది బయట కూడా నేర్చుకోవడాన్ని ఈ కోర్సులు ప్రోత్సహిస్తాయి. క్యాంపస్‌లో ఫ్యాకల్టీ పాఠాలకు తోడు గెస్ట్ లెక్చర్స్ కూడా ఉంటాయి. దాంతో ప్రముఖ పారిశ్రామిక వేత్తల అనుభవాలు, సూచనలు, సలహాలు కూడా విద్యార్థులకు లభిస్తాయి. అంతేకాకుండా ఈ కోర్సుల ద్వారా పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులను త్వరగా విశ్లేషించుకుని, వాటిని సమర్థంగా నిర్వహించడానికి కావాల్సిన నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఏడాది కోర్సులో ముఖ్యంగా పరిశ్రమ నైపుణ్యాలను, మేనేజ్మెంట్ సూత్రాలను అన్వయిస్తూ బోధన వైవిధ్యంగా ఉంటుంది. విద్యార్థుల్లో లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ప్లానింగ్ ఎంటర్ప్రెన్యూరియల్ వెంచర్, ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్, ఇండిపెండెంట్ స్టడీ ప్రోగ్రామ్, కార్పొరేట్ ఇంటరాక్షన్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వంటి ఎన్నో కార్యకలాపాలను బీ స్కూల్స్ నిర్వహిస్తున్నాయి. ఉద్యోగస్థులు ఈ కోర్సులను అభ్యసించడానికి కంపెనీలు సైతం ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందగలవని సంస్థల ఉద్దేశం. కాబట్టి ఈ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది’’ - అజిత్ రంగ్నేకర్, డీన్, ఐఎస్బీ-హైదరాబాద్ ఏడాది ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు- ఫీజులు (సుమారుగా) బిజినెస్ స్కూల్ కోర్సు ఫీజు(రూపాయల్లో) ఐఐఎం-అహ్మదాబాద్ పీజీపీఎక్స్ 21.5 లక్షలు ఐఐఎం-బెంగళూరు ఈపీజీపీ 23.82 లక్షలు ఐఐఎం-కలకత్తా పీజీపీఈఎక్స్ 18 లక్షలు ఐఐఎం-లక్నో ఐపీఎంఎక్స్ 19.11 లక్షలు ఎక్స్ఎల్ఆర్ఐ పీజీడీఎం 15 లక్షలు గ్రేట్ లేక్స్ పీజీపీఎం 16.50 లక్షలు ఐఎస్బీ-హైదరాబాద్ పీజీపీఎం 40 వేలు (యూఎస్ డాలర్లు) -
విదేశీ విద్యకు దారులెన్నో..
విదేశీ విద్య.. భారత్‌లోని లక్షల మంది విద్యార్థుల స్వప్నం. ప్రధానంగా ఇంజనీరింగ్, సెన్సైస్, బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఔత్సాహికుల్లో ఈ ఆలోచన ఎక్కువే. అందుకే దేశవ్యాప్తంగా ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోంది. ఆయా దేశాల్లోని విద్యా సంస్థలు.. మన దేశంలోని కన్సల్టెన్సీలతో ఒప్పందం ద్వారా ప్రవేశ ప్రక్రియను సులభం చేస్తూ విద్యార్థులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. పలు దేశాల్లో సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఫాల్ సెమిస్టర్‌కు దరఖాస్తు గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో.. స్టడీ అబ్రాడ్ దిశగా మన దేశ విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న దేశాలపై ఫోకస్.. అమెరికా... హాట్ స్పాట్ విదేశీ విద్య విషయంలో మన దేశ విద్యార్థులకు హాట్ స్పాట్‌గా నిలుస్తున్న దేశం అమెరికా. గత మూడేళ్లుగా అమెరికాకు వెళుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్య కాస్త తగ్గింది. అయినా ఇతర దేశాలతో పోల్చితే అత్యధికుల గమ్యస్థానం నేటికీ అమెరికానే. అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారతీయ విద్యార్థులే అధికం. 2012-13 విద్యా సంవత్సరంలో అమెరికాలో మొత్తం 8 లక్షల మంది విదేశీ విద్యార్థులుంటే.. వారిలో లక్ష మంది వరకు మన దేశ విద్యార్థులే ఉండటం విశేషం. ప్రధానంగా బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులకు సంబంధించి భారతీయ విద్యార్థులను ఆకట్టుకోవడంలో అమెరికా ముందంజలో ఉంది. ఆ దేశ బోధన విధానం.. ఆర్థిక ప్రోత్సాహకాలు.. అమెరికా పట్ల మన విద్యార్థులు ఆకర్షితులవ్వడానికి ప్రధాన కారణం. దాంతోపాటు అమెరికాలో విద్యతో భవిష్యత్ బంగారం అవుతుందనే అనే ఆలోచన కూడా ఇందుకు దోహదం చేస్తోంది. అమెరికాలో ప్రముఖ యూనివర్సిటీలు హార్వర్డ్ యూనివర్సిటీ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రిన్స్టన్ యూనివర్సిటీ పెన్సిల్వేనియా యూనివర్సిటీ యేల్ యూనివర్సిటీ మిచిగాన్ యూనివర్సిటీ కొలంబియా యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ చికాగో కార్నెగీ మిలన్ యూనివర్సిటీ ప్రవేశం: ఔత్సాహిక విద్యార్థులు ఆయా ఇన్స్టిట్యూట్లకు నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతోపాటు నిర్దేశిత పత్రాలు(విద్యార్హతల సర్టిఫికెట్లు; ఫీజు, నివాస వ్యయానికి సరిపడే విధంగా ఆర్థిక వనరుల రుజువు పత్రాలు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, రికమండేషన్ లెటర్స్, ప్రవేశపరీక్షల స్కోర్లు తదితర) అందించాలి. వీటి ఆధారంగా.. ఆయా ఇన్స్టిట్యూట్లు ఆఫర్ లెటర్ అందిస్తాయి. దీన్నే ఐ-20 ఫామ్‌గా పిలుస్తారు. దీని ఆధారంగా స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేయాలి. అమెరికా వీసా ప్రక్రియ కాస్త క్లిష్టంగా ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తాము చేరదలచుకున్న కోర్సు, ఇన్స్టిట్యూట్ విషయంలో అడ్మిషన్ సెషన్ ప్రారంభానికి కనీసం ఏడాది లేదా ఏడాదిన్నర ముందు నుంచే కసరత్తు మొదలుపెట్టాలి. అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా రెండుసార్లు (జనవరి, సెప్టెంబర్) పూర్తి వివరాలకు: www.educationusa.state.gov ఆస్ట్రేలియా... మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్‌సకు పెట్టింది పేరు మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ కోర్సుల బోధనలో పేరుగాంచిన దేశంగా ఆస్ట్రేలియా నిలుస్తోంది. స్టూడెంట్ వీసా నిబంధనలను సరళీకృతం చేయడం.. కొత్తగా పోస్ట్ స్టడీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పేరిట కోర్సు పూర్తయ్యాక ఆస్ట్రేలియాలోనే రెండేళ్లు ఉద్యోగం చేసే అవకాశం కల్పిస్తోంది. అదేవిధంగా అభ్యర్థులు చూపించాల్సిన ఆర్థిక వనరుల మొత్తాన్ని కూడా కొంత తగ్గిస్తూ తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించడం.. భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియావైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం. ప్రపంచ ర్యాంకింగ్స్ జాబితాలో టాప్-100లో నిలిచిన పలు ప్రముఖ యూనివర్సిటీలు ఆస్ట్రేలియాలో ఉన్నాయి. అకడమిక్ సెషన్ ప్రారంభం: ఫిబ్రవరి, జూలై పేరున్న యూనివర్సిటీలు ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ మెల్బోర్న్ యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ అడిలైడ్ యూనివర్సిటీ మొనాష్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పూర్తి వివరాలకు: www.immi.gov.au సింగపూర్... అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు కేవలం మూడు ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లే ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశం సింగపూర్. ముఖ్యంగా ఈ దేశం మేనేజ్మెంట్ కోర్సుల విషయంలో ఖ్యాతి పొందింది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటైన సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్.. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైనాలోని ఝెజియాంగ్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడ చేరిన విద్యార్థులకు యు.ఎస్., చైనా సర్టిఫికెట్లు పొందే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. కోర్సు పూర్తయ్యాక ఒక ఏడాది పని చేసే అవకాశం కల్పించడం, కోర్సు సమయంలో వారానికి 16 గంటలు పార్ట్‌టైం జాబ్ చేసుకునే సదుపాయం వంటివి మన విద్యార్థులను సింగపూర్‌వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. అకడమిక్ సెషన్ ప్రారంభం: మార్చి, జూలై బెస్ట్ ఇన్స్టిట్యూట్స్: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్; నాన్యాంగ్ టెక్నలా జికల్ యూనివర్సిటీ. పూర్తి వివరాలకు: ww.singaporeedu.gov.sg జర్మనీ... నామమాత్రపు ఫీజులే! సైన్స్, ఇంజనీరింగ్, రీసెర్చ్ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తున్న దేశం జర్మనీ. అయితే ఇంగ్లిష్ మాధ్యమంలో బోధించని ఇన్స్టిట్యూట్లలో చేరాలంటే.. దరఖాస్తు సమయంలోనే జర్మన్ భాషలో నైపుణ్యం ఉన్నట్లు తెలియజేయాలి. ఇందుకోసం అన్ని దేశాల్లోని జర్మనీ ఎంబసీ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలు ఉన్నాయి. జర్మనీలో విద్యాభ్యాసం దిశగా మరో ఆకర్షణీయ అంశం.. స్వల్ప ఫీజులు. జర్మనీ ప్రభుత్వ విధానాల ప్రకారం- చాలా యూనివర్సిటీలు ఫీజులు లేకుండానే లేదా సెమిస్టర్‌కు 500 యూరోల నామమాత్రపు ఫీజుతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎలాంటి ఫీజు వసూలు చేయని ఇన్స్టిట్యూట్లలో చేరిన విద్యార్థులు సెమిస్టర్ కంట్రిబ్యూషన్ పేరుతో ప్రతి సెమిస్టర్‌కు 50 యూరోల నుంచి 250 యూరోల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇవేకాకుండా ఎలాంటి కాలపరిమితి లేకుండా వర్క్ వీసా సదుపాయం అందుబాటులో ఉండటం.. కోర్సు పూర్తయ్యాక కూడా 18 నెలలపాటు జర్మనీలో ఉండి ఉద్యోగాన్వేషణ సాగించేందుకు అవకాశం కల్పించడం జర్మనీలో విదేశీ విద్య ప్రత్యేకతలు. అకడమిక్ సెషన్ ప్రారంభం: ఏప్రిల్, అక్టోబర్ పేరున్న ఇన్స్టిట్యూట్స్ హంబోల్ట్ యూనివర్సిటీ ఫ్రీ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్ టెక్నికల్ యూనివర్సిటీ మ్యూనిచ్ జార్జ్ అగస్ట్ యూనివర్సిటీ ఎబర్‌హార్డ్ కార్ల్స్ యూనివర్సిటీ టెక్నికల్ యూనివర్సిటీ బెర్లిన్ లీప్జిగ్ యూనివర్సిటీ జెనా యూనివర్సిటీ బ్రెమెన్ యూనివర్సిటీ రెగెన్స్‌బర్గ్ యూనివర్సిటీ పూర్తి వివరాలకు: www.studyin.de/en యూకే ప్రతిష్టాత్మక వర్సిటీలకు నెలవు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ వంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు నెలవు యునెటైడ్ కింగ్డమ్. అమెరికా తర్వాత భారతీయ విద్యార్థులను విదేశీ విద్య కోసం విశేషంగా ఆకర్షిస్తున్న దేశం ఇది. విద్యార్థుల నమోదు సంఖ్య, క్రేజీ కోర్సుల పరంగానూ అమెరికా తర్వాత స్థానం యూకే యూనివర్సిటీలదే. బిజినెస్ మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ కోర్సులకు కేరాఫ్‌గా నిలుస్తోంది యూకే. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ వ్యవధి రెండేళ్లు ఉండగా.. అధిక శాతం యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లు ఫాస్ట్‌ట్రాక్ కోర్సుల పేరుతో ఏడాదిలోనే పీజీ కోర్సులను అందిస్తుండటం కూడా ఈ దేశానికి మన విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం. రెండేళ్ల క్రితం వీసా నిబంధనలను కఠినం చేస్తూ.. పోస్ట్ స్టడీ వర్క్ వీసా సదుపాయాన్ని తొలగించడంతో యూకేకు అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య కొంతమేర తగ్గింది. అయితే చదువుకుంటున్న సమయంలోనే.. 20 వేల పౌండ్ల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందేట్లు స్పాన్సర్ లెటర్ అందించి.. చదువు పూర్తయ్యాక కూడా అక్కడే ఉండేలా నిబంధనను కొంత సడలించింది. అకడమిక్ సెషన్ ప్రారంభం: జనవరి, సెప్టెంబర్ యూకేలో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ వార్విక్ యూనివర్సిటీ కింగ్స్ కాలేజ్ ఎడిన్బర్గ్ యూనివర్సిటీ లాంకెస్టర్ యూనివర్సిటీ గ్లాస్గో యూనివర్సిటీ పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ukvisas.gov.uk జపాన్.. సైన్స అండ్ టెక్నాలజీ కోర్సులు ప్రతి ఏటా దాదాపు 50 వేల మందికిపైగా విదేశీ విద్యార్థులు అడుగుపెడుతున్న దేశం జపాన్. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల విషయంలో ప్రపంచ ప్రఖ్యాతి గడించిన ఎన్నో ఇన్స్టిట్యూట్లు జపాన్‌లోనే ఉన్నాయి. ఈ దే శంలో ఇన్స్టిట్యూట్లోనే అనుబంధంగా ఆర్ అండ్ డీ సంస్థలు ఉంటాయి. దాంతో విద్యార్థులు ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకునేందుకు వీలవుతుంది. రీసెర్చ్ విభాగాల్లో పాల్పంచుకునే విద్యార్థులకు రీసెర్చ్ అసిస్టెన్స్‌షిప్ లభిస్తుంది. అకడమిక్ సెషన్ ప్రారంభం: ఏప్రిల్, అక్టోబర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీ ఆఫ్ టోక్యో క్యోటో యూనివర్సిటీ ఒసాకా యూనివర్సిటీ టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నగోయా యూనివర్సిటీ క్యుషు యూనివర్సిటీ వసెడా యూనివర్సిటీ కోబ్ యూనివర్సిటీ టోక్యో మెట్రోపాలిటన్ యూనివర్సిటీ టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ పూర్తి వివరాలకు: www.jasso.go.jp కెనడా... సైన్స, పీహెచ్‌డీలకు చిరునామా సైన్స్ కోర్సులకు, పీహెచ్‌డీలకు చిరునామా కెనడా. ఇంజనీరింగ్, ఏవియేషన్, బయోటెక్నాలజీ వంటి కోర్సుల ఔత్సాహికులకు బెస్ట్ ఇన్స్టిట్యూట్లలో చదివే అవకాశం ఇక్కడ లభిస్తుంది. పీహెచ్డీ స్థాయిలో కెనడాలోని అన్ని ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు ఇండస్ట్రీ కొలాబరేషన్‌తో రియల్‌టైం ఎక్స్‌పీరియన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. దాంతో పీహెచ్‌డీకి సరైన వేదికగా ఈ దేశాన్ని పేర్కొనొచ్చు. అదే విధంగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను సడలించి.. పని అనుభవం కలిగిన ఉన్నత విద్యావంతులు కెనడాలోనే శాశ్వత నివాసానికి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు సైతం కల్పించారు. ఈ కారణంగా గత ఐదేళ్లుగా కెనడాకు వెళుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. అకడమిక్ సెషన్ ప్రారంభం: జనవరి, సెప్టెంబర్ బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ మెక్‌గిల్ యూనివర్సిటీ క్వీన్స్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ టోరంటో వాటర్లూ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీ ఆఫ్ అల్బెర్టా యూనివర్సిటీ డి మాంట్రియల్ మెక్‌మాస్టర్ యూనివర్సిటీ వెస్ట్రన్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ కల్గెరీ పూర్తి వివరాలకు: www.educationau-incanada.ca/ రష్యా... మెడికల్, ఫార్మసీ కోర్సులకు కేరాఫ్ మెడికల్, హెల్త్, ఫార్మసీ, నర్సింగ్, ఏవియేషన్ కోర్సులకు కేరాఫ్‌గా రష్యా పేరు గడిస్తోంది. ముఖ్యంగా మన దేశంలో వైద్య విద్య ఔత్సాహికులకు రష్యానే ప్రధాన గమ్యం. ఎంబీబీఎస్ కోర్సు కోసమే ప్రతి సంవత్సరం దాదాపు ఐదు వేల మంది రష్యాకు వెళుతున్నారు. అయితే ఈ దేశానికి వెళ్లే విద్యార్థులు ప్రధానంగా గమనించాల్సిన అంశం.. అక్కడ తాము చేరాలనుకుంటున్న కళాశాలలో బోధన మాధ్యమం. అధిక శాతం ఇన్స్టిట్యూట్లు స్థానిక భాషలోనే బోధిస్తున్నాయి. ఈ మేరకు సదరు ఇన్స్టిట్యూట్లో ప్రవేశం కోరుకునే విద్యార్థులు తప్పనిసరిగా ఆ భాషపై పరిజ్ఞానం పొందాల్సి ఉంటుంది. నెలకు 80 డాలర్ల నుంచి వంద డాలర్ల లోపు నివాస వ్యయం ఇక్కడ ప్రధానంగా కలిసొచ్చే అంశం. ప్రముఖ యూనివర్సిటీలు సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ యూనివర్సిటీ మాస్కో మెడికల్ అకాడమీ మాస్కో స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ డెంటిస్ట్రీ సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ ఎల్.పి.పావ్లోవ్ మెడికల్ యూనివర్సిటీ రష్యన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ మాస్కో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ టెక్నాలజీ కజాన్ ఫెడరల్ యూనివర్సిటీ సదరన్ ఫెడరల్ యూనివర్సిటీ వొరోనెజ్ స్టేట్ యూనివర్సిటీ బౌమన్ మాస్కో స్టేట్ టెక్నికల్ యూనివర్సిటీ అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా సెప్టెంబర్ పూర్తి వివరాలకు వెబ్సైట్: en.russia.edu.ru న్యూజిలాండ్... మేనేజ్మెంట్, అగ్రికల్చర్ తక్కువ వ్యయంతో కోర్సులు పూర్తి చేసుకునే అవకాశమున్న దేశం న్యూజిలాండ్. ముఖ్యంగా మేనేజ్మెంట్, అగ్రికల్చర్ కోర్సుల విషయంలో ఈ దేశ యూనివర్సిటీలకు మంచి పేరుంది. ఎంబీఏ, ఇతర పీజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు బ్యాచిలర్‌స డిగ్రీ తర్వాత రెండేళ్ల పని అనుభవం పొందడం తప్పనిసరి! ఆయా కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత ఏడాది కాలపరిమితి గల జాబ్ సెర్చ్ వీసా పొంది.. అక్కడే ఉద్యోగాన్వేషణ సాగించే సదుపాయం ఉంది. కొన్ని కోర్సులకు మన దేశంలో బోధించే మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో ప్రవేశం లభిస్తోంది. ఎంఎస్, ఎంటెక్ వంటి స్పెషలైజ్డ్ కోర్సుల్లో చేరాలంటే.. 16 ఏళ్ల విద్యాభ్యాసం తప్పనిసరి. బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో యూనివర్సిటీ ఆఫ్ కాంటెర్బరీ విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్ మాసే యూనివర్సిటీ వ్యకాటో యూనివర్సిటీ లింకన్ యూనివర్సిటీ ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అకడమిక్ సెషన్ ప్రారంభం: ప్రతి ఏటా మార్చి నెలలో పూర్తి వివరాలకు: www.immigration.govt.nz అమెరికా ఔత్సాహికులు అప్రమత్తంగా అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియకు సంబంధించి మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏటా రెండుసార్లు మొదలయ్యే అకడమిక్ సెషన్ కోసం 12 నుంచి 14 నెలల ముందుగానే ప్రక్రియ ప్రారంభించడం మేలు. ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీల ఎంపిక విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల కాలంలో అమెరికాలో కొన్ని ఫేక్ యూనివర్సిటీల్లో చేరడం వల్ల ఎందరో విదేశీ విద్యార్థులు నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ఔత్సాహిక విద్యార్థుల కోసం యునెటైడ్ స్టేట్స్- ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యుఎస్‌ఐఈఎఫ్) తరఫున హెల్ప్‌లైన్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం. అభ్యర్థులు దీన్ని వినియోగించుకుంటే కచ్చితమైన సమాచారం లభిస్తుంది. రేణుక రాజారావు, కంట్రీ కో-ఆర్డినేటర్, యుఎస్‌ఐఈఎఫ్ కూలంకషంగా పరిశీలించి.. స్టడీ అబ్రాడ్ ఔత్సాహిక విద్యార్థులు.. తాము ఎంచుకున్న కోర్సు, గమ్యాలకు సంబంధించి కూలంకషంగా పరిశీలన చేయాలి. అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అవగాహన ఏర్పరచుకోవాలి. సాధారణంగా విదేశాల్లోని యూనివర్సిటీలు.. ప్రవేశాల విషయంలో ప్రత్యేక ప్రకటనలు చేయవు. కాబట్టి విద్యార్థులు సదరు యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్ల వెబ్సైట్లను చూస్తూ నిర్ణీత గడువు తేదీలను, ఇతర ప్రవేశ నిబంధనలను తెలుసుకోవాలి. వాటికి సరితూగుతామనే ఆత్మవిశ్వాసం లభించాకే దరఖాస్తు ప్రక్రియకు ఉపక్రమించాలి. దరఖాస్తు సమయంలో జత చేయాల్సిన స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ను పకడ్బందీగా రూపొందించుకోవాలి. నిర్దేశిత టెస్ట్ (జీమ్యాట్, జీఆర్ఈ, టోఫెల్, ఐఈఎల్టీఎస్, శాట్ తదితర)ల్లో స్కోర్ బాగా ఉన్నప్పటికీ.. కొన్ని సందర్భాల్లో స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ సరిగా లేక దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి. అందుకే ఈ విషయంలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. అకడమిక్ సెషన్ ప్రారంభానికి సంవత్సరం ముందు నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి. అలా చేస్తేనే సదరు ఇన్స్టిట్యూట్ నిబంధనల మేరకు అడ్మిషన్ ప్రక్రియ సరైన సమయంలో పూర్తి చేసుకోవడం సులువవుతుంది. సోను హిమాని, సీనియర్ మేనేజర్, ఎడ్యుకేషన్ యూకే, (సౌత్ ఇండియా బ్రిటిష్ కౌన్సిల్) విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించి.. సిద్ధం చేసుకోవాల్సినవి... జీఆర్ఈ/టోఫెల్, జీమ్యాట్/ఐఈఎల్టీఎస్/ ఎస్ఏటీ పరీక్షల్లో స్కోరు. దరఖాస్తుతోపాటు కవరింగ్ లెటర్ అప్లికేషన్ ఫీజు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లెటర్ ఆఫ్ రికమండేషన్ విద్యార్హతల సర్టిఫికెట్లు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పాస్‌పోర్ట్ స్పాన్సర్ లెటర్స్, స్పాన్సరర్స్ ఆదాయ పన్ను స్టేట్మెంట్ -
ఈ-కామర్స్... ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్
గెస్ట్ కాలమ్ ఈ-కామర్స్.. ఆన్లైన్ విధానంలో ఆయా వస్తువుల క్రయవిక్రయాలు సాగించే విభాగం. కొద్దిగా సాంకేతిక నైపుణ్యాలు, మార్కెటింగ్ చాతుర్యం ఉంటే.. ఈ-కామర్స్‌లో కొత్త స్టార్ట్-అప్స్‌తో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కోణంలోనూ తక్కువ ఖర్చుతో స్టార్ట్-అప్ను సుగమం చేసేది ఈ-కామర్స్ అంటున్నారు ప్రముఖ ఆన్లైన్ బిజినెస్ పోర్టల్ ఇ-బే ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ లతీఫ్ నతానీ. దేశంలో ఆన్లైన్ క్రయవిక్రయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలపై లతీఫ్ నతానీతో ప్రత్యేక ఇంటర్వ్యూ.. దేశంలో ప్రస్తుతం ఈ-కామర్స్ రంగం ఎలా పయనిస్తోంది? ఇంటర్నెట్, బ్రాడ్‌బ్యాండ్ వంటి సదుపాయాలతో దేశంలో ఈ-కామర్స్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రతి నెలా సగటున మూడు కోట్ల మంది ప్రజలు ఆన్లైన్ షాపింగ్ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారనే గణాంకాలే ఇందు కు నిదర్శనం. ఇటీవల ‘ఫొరెస్టర్’ విడుదల చేసిన నివేదిక ప్రకారం- 2014 నాటికి 60శాతం వృద్ధితో 3.2 బిలియన్ డాలర్ల వృద్ధి రేటును సాధించనుందని అంచనా. స్టార్ట్-అప్స్ పరంగా ఈ-కామర్స్ రంగంలో అవకాశాలు? ఆన్లైన్ షాపింగ్ కార్యకలాపాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో.. అంతే స్థాయిలో కొత్త సంస్థల ఏర్పాటుకు కూడా అనేక అవకాశాలున్నాయి. ఈ-కామర్స్ వెబ్సైట్ ద్వారా కేవలం సంస్థ నిర్వాహకులకే కాకుండా పరోక్షంగా వందలాది మందికి ఉపాధి లభిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని చేతి వృత్తుల వారికి, అదేవిధంగా తాము తయారు చేసిన వస్తువుల విక్రయ మార్గాలపై అవగాహన లేని వారికి ఆన్లైన్ బిజినెస్ పోర్టల్స్ ఎంతో సహకరిస్తున్నాయి. అమ్మకందార్లు-కొనుగోలుదార్లకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తూ ఇద్దరికీ లాభదాయకంగా ఉండేలా సేవలు అందిస్తున్నాయి. ఈ-కామర్స్ విభాగంలో ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించాలంటే.. ప్రత్యేక స్కిల్స్ అవసరమా? ఈ-బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు ఎంత మేరకు ఉపయోగం? వాస్తవానికి ఈ-కామర్స్ వ్యాపార రంగంలో ప్రవేశించాలనుకునేవారికి ఎలాంటి అకడెమిక్ నైపుణ్యాలు అవసరం లేదు. సాంకేతిక నైపుణ్యం, కొనుగోలుదారులు, అమ్మకందార్లను గుర్తించి వారికి తమ ఆన్లైన్ ట్రేడింగ్ పోర్టల్ అనుకూలం అనే విధంగా వ్యవహరిస్తే విజయం సాధించినట్లే. ఈ-బిజినెస్‌కు సంబంధించిన అవగాహన ఈ-బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల ద్వారా పొందొచ్చు. ఈ-కామర్స్ నైపుణ్యాలు అందించడంలో ఈ-బే ఇండియా తీసుకుంటున్న చర్యలు? స్పీక్వెల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల సహకారంతో ‘ఈ-ప్రో’ పేరుతో సర్టిఫికేషన్ ప్రోగ్రాంను నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా.. ఈ-కామర్స్ నేపథ్యం, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, కస్టమర్ సర్వీస్, మార్కెటింగ్, ఆన్లైన్ సెల్లింగ్, ప్రాసెస్ ఆఫ్ సెల్లింగ్ తదితర అంశాలపై నైపుణ్యాలు కల్పించేలా శిక్షణనిస్తున్నాం. దీంతోపాటు మా సంస్థలో సెల్లర్స్‌గా ఉన్న వారికి భాషా నైపుణ్యాలు అందించేందుకు ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గుజరాతీ, తమిళం, కన్నడ భాషల్లో ప్రావీణ్యం పొందేలా ఆన్లైన్ లెర్నింగ్ మాడ్యూల్స్‌ను కూడా అందిస్తున్నాం. మన దేశంలో కొత్త స్టార్ట్-అప్స్ విషయంలో సవాళ్లు, సమస్యలపై మీ అభిప్రాయం? ప్రస్తుతం మన దేశంలో ఆహ్వానించదగిన పరిణామం.. యువత స్టార్ట్-అప్స్ దిశగా ఆలోచించడం. ఈ క్రమంలో ఎన్నో వెంచర్స్ ఆవిష్కృతమవుతున్నాయి. ఇదే సమయంలో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు.. నిర్దిష్ట బడ్జెట్లో మౌలిక సదుపాయలు ఏర్పాటు చేసుకోవడం. అంతేకాకుండా.. సదరు ఉత్పత్తికి సంబంధించి భారీ స్థాయిలో ఉండే లక్షిత వినియోగదారులను చేరేందుకు అవసరమైన మార్కెటింగ్ వ్యూహాలు. ఈ రెండు అంశాలు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. వీటికి పరిష్కారం ఆర్థిక వనరుల సమీకరణ. ఈ-కామర్స్‌తో పోల్చితే ఉత్పత్తి రంగంలో స్టార్ట్-అప్స్ సంఖ్య తక్కువకు కారణం? ఈ-కామర్స్‌కు సంబంధించి కొత్త స్టార్ట్-అప్స్ ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం.. తక్కువ ఖర్చుతో ప్రారంభించే సౌలభ్యం. అదే ఉత్పత్తి రంగంలో కొత్త స్టార్ట్-అప్ అంటే భారీగా మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరం. ఇందుకోసం పెట్టుబడి కూడా భారీగానే ఉండాలి. అంతేకాకుండా ఈ-కామర్స్ సంస్థలు.. చిన్న తరహా ఉత్పత్తిదారులకు చక్కటి మార్కెటింగ్ ప్రాంతంగా నిలుస్తూ ఆ ఇబ్బందులను తగ్గిస్తున్నాయి. ఔత్సాహిక ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు వనరుల సమీకరణకు ఉన్న మార్గాలు? ప్రస్తుతం సీడ్ ఫండింగ్ సంస్థలు లాభదాయకమైన వెంచర్స్‌కు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఫండింగ్ ఇవ్వడంతో సరిపెట్టకుండా.. నిరంతరం సమీక్షిస్తూ వ్యాపారాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపైనా సలహాలు, సూచనలు అందిస్తున్నాయి. ఈ అవకాశాలను ఔత్సాహికులు అందిపుచ్చుకోవాలి. ఇంటర్నెట్ ద్వారా ఈ సౌకర్యాలు అందించే సంస్థల వివరాలు తెలుసుకోవచ్చు. స్టార్ట్-అప్‌కు సరైన సమయం? తాము సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న రంగానికి సంబంధించి ప్రాథమిక అవగాహన కోసం ముందుగా ఆ రంగంలో పని అనుభవం గడించడం మంచిది. ఫలితంగా ఆ రంగంలోని లోటుపాట్లు, తాజా పరిస్థితులపై అవగాహన లభిస్తుంది. తాము భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహాలపై స్పష్టత వస్తుంది. లాభదాయక విధానాలు అవలంబించే వీలు కలుగుతుంది. స్వయంఉపాధి, ఉద్యోగం.. రెండు వర్గాల ఔత్సాహికులకు మీరిచ్చే సలహా? తమ అకడమిక్ విభాగాల్లో నైపుణ్యాలతోపాటు పీపుల్ స్కిల్స్ (కమ్యూనికేషన్, ఇంటర్ పర్సనల్, క్రాస్ కల్చరల్) పెంచుకోవాలి. అవి ఉన్నప్పుడే ఉద్యోగమైనా, వ్యాపారంలోనైనా భవిష్యత్తులో రాణించొచ్చు. ఆశించిన లక్ష్యాన్ని చేరుకోవచ్చు. -
విదేశాల్లో మేనేజ్మెంట్ విద్యకు.. జీమ్యాట్
విదేశీ విద్య ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల్లో ఎంబీఏ, ఇతర బిజినెస్ మేనేజ్మెంట్ సంబంధిత కోర్సుల్లో ప్రవేశం పొందాలంటే రాయాల్సిన పరీక్ష గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్ (జీమ్యాట్). దీన్ని యూఎస్‌లోని గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ కౌన్సిల్ నిర్వహిస్తోంది. ఇందులో వచ్చిన స్కోర్ ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1700 యూనివర్సిటీలు బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా ఆయా కోర్సుల్లో స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్ అందించడానికి జీమ్యాట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నారు. మనదేశ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, కెనడా, ఫిన్లాండ్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యూకే, యూఎస్‌లలోని ప్రముఖ కాలేజీలు/యూనివర్సిటీలు జీమ్యాట్ స్కోర్ ఆధారంగానే గ్రాడ్యుయేట్ బిజినెస్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి. మనదేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లు, బిట్స్ పిలానీ, ఐఎస్బీ-హైదరాబాద్, ఎక్స్ఎల్ఆర్ఐ-జంషెడ్పూర్, మైకా-అహ్మదాబాద్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి ప్రముఖ సంస్థలు జీమ్యాట్ స్కోర్ ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి. నిబంధనలు: జీమ్యాట్ రాసేవారికి కనీసం 18 ఏళ్ల వయసు ఉండాలి. పరీక్ష తేదీ నాటికి కనీసం వారం రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. ఒక ఏడాదిలో గరిష్టంగా ఐదుసార్లు పరీక్ష రాయొచ్చు. ఒకసారి పరీక్ష రాస్తే 31 రోజుల తర్వాత మాత్రమే మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం లభిస్తుంది. పరీక్ష: మూడున్నర గంటల వ్యవధిలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ పరీక్షలో మొత్తం నాలుగు విభాగాలు ఉంటాయి. ఎనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్: ఇందులో ఎనాలిసిస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విధానంలో ప్రశ్న ఉంటుంది. ఇందులో రాణించాలంటే నిర్దేశిత అంశాలకు చెందిన కాన్సెప్ట్స్‌పై అవగాహన పొందే నైపుణ్యాలను అలవర్చుకోవాలి. ఇచ్చిన నిర్దేశిత అంశం ఉద్దేశం ఏమిటి? అందులో కీలక ఆర్గ్యుమెంట్స్ ఏమిటి? వాటి వల్ల కలిగే పర్యవసానాలు, ఫలితాలు ఏంటి? తదితర అంశాలను గుర్తించాలి. విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానాలు రాయాలి. ఈ విభాగానికి కేటాయించిన సమయం 30 నిమిషాలు. ఇంటిగ్రేటెడ్ రీజనింగ్: ఇందులో 12 ప్రశ్నలు ఇస్తారు. టేబుల్ ఎనాలిసిస్, మల్టీసోర్స్ రీజనింగ్, గ్రాఫిక్స్ ఇంటర్‌ప్రిటేషన్‌లపై ప్రశ్నలు అడుగుతారు. 30 నిమిషాల సమయం అందుబాటులో ఉంటుంది. క్వాంటిటేటివ్: ఈ విభాగంలో అడిగే ప్రశ్నల సంఖ్య 37. డేటా సఫిషియన్సీ, ప్రాబ్లం సాల్వింగ్లపై ప్రశ్నలు ఉంటాయి. 75 నిమిషాల్లో ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఇందులో రాణించాలంటే ఇచ్చిన స్టేట్మెంట్లో మినహారుుంపులు, ముగింపు, వాదనలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. అర్థమెటిక్, ఆల్జీబ్రా, ఎలిమెంటరీ జామెట్రీల్లో పట్టు ఉంటే మంచి స్కోరు సాధించొచ్చు. వెర్బల్: ఇందులో భాగంగా రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, సెంటెన్స్ కరెక్షన్లపై మొత్తం 41 ప్రశ్నలు అడుగుతారు. రీడింగ్ కాంప్రహెన్షన్‌లో... ఇచ్చిన ప్యాసేజ్ ను అర్థం చేసుకుని సమాధానాలు గుర్తించాలి. రీడింగ్ ఎబిలిటీని పెంచుకుంటే ఇందులో రాణించొచ్చు. కరెక్ట్ ఎక్స్ప్రెషన్, ఎఫెక్టివ్ ఎక్స్ప్రెషన్, ప్రాపర్ డిక్షన్ తదితర అంశాల్లో పట్టు సాధిస్తే సెంటెన్స్ కరెక్షన్లో మంచి స్కోరు సాధిస్తారు. క్రిటికల్ రీజనింగ్ ద్వారా అభ్యర్థిలోని లాజికల్ నైపుణ్యాలు పరీక్షిస్తారు. ఇందులో ఇచ్చిన ఆర్గ్యుమెంట్‌ను సరిగ్గా విశ్లేషించి సమాధానాలు ఇవ్వాలి. ఈ విభాగానికి నిర్దేశించిన కాలపరిమితి 75 నిమిషాలు. జీమ్యాట్ పరీక్ష విధానం, ప్రశ్నల తీరు తెలుసుకోవడానికి మాదిరి ప్రశ్నలను వెబ్సైట్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా జీమ్యాట్ ప్రిపరేషన్ టిప్స్, జీమ్యాట్ అలుమ్ని సూచనలు, సలహాలు, వీడియోలు వంటివి జీమ్యాట్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. స్కోరు: పరీక్ష రాసిన మూడు వారాల తర్వాత స్కోర్ కార్డ్‌ను మెయిల్ చేస్తారు. ఈ స్కోర్ ఐదేళ్లపాటు చెల్లుతుంది. జీమ్యాట్ అభ్యర్థుల స్కోర్ రిపోర్ట్‌లో వెర్బల్, క్వాంటిటేటివ్, ఎనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్, టోటల్ స్కోర్లు ఉంటాయి. టోటల్ స్కోర్ వెర్బల్, క్వాంటిటేటివ్ స్కోర్ ఆధారంగా ఇస్తారు. మిగిలిన ఎనలిటికల్ రైటింగ్ అసెస్మెంట్, ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ స్కోర్లను పరిగణనలోకి తీసుకోరు. సాధారణంగా ఈ టోటల్ స్కోర్ 200 నుంచి 800 మధ్యలో ఉంటుంది. చాలామంది విద్యార్థులు 400-600 మధ్య స్కోర్ సాధిస్తారు. ప్రధాన బీ-స్కూల్స్‌లో ప్రవేశానికి కనీస స్కోరు ప్రకటించనప్పటికీ 600-700 వరకు మంచి స్కోరుగా భావించొచ్చు. దరఖాస్తు విధానం: ఆన్లైన్, ఫోన్, పోస్టల్ మెయిల్ ద్వారా సంవత్సరమంతా దరఖాస్తు చేసుకోవచ్చు. క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా 250 యూఎస్ డాలర్లు పరీక్ష ఫీజుగా చెల్లించాలి. మన రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం. వెబ్సైట్: www.mba.com/india -
స్తంభించిన ఆర్థిక లావాదేవీలు
సాక్షి, తిరుపతి: సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆరు రోజు లుగా జిల్లాలో బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి. వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక సంస్థలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నాయి. జూలై 31వ తేదీ నుంచి నేటి వరకూ జిల్లా వ్యాప్తంగా బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. జిల్లాలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు పనిచేస్తున్న ప్రధాన జాతీయ బ్యాంకు లు, ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పుంగనూరు, కుప్పం, తంబళ్లపల్లె, బి.కొత్తకోట, బంగారుపాళెం, పీలేరు, వాయల్పాడు వంటి పట్టణాల్లోనూ బ్యాంకులు పని చేయ టం లేదు. ప్రతి రోజూ సమైక్యాంధ్ర ఆందోళనలో భాగంగా హోటళ్లు, దుకాణాలతో సహా, బ్యాంకులను బంద్ చేయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షల మందికి పైగా బ్యాంకుల వినియోగదారులు కార్యకలాపాలు సాగక బ్యాంకులకు వచ్చి వెనుతిరిగి వెళ్తున్నారు. వెయ్యికోట్లకు పైగా స్తంభన జిల్లా వ్యాప్తంగా 35కు పైగా ఉన్న జాతీయ, వాణిజ్య, కార్పొరేట్ బ్యాంకుల్లో వాణిజ్య కార్యకలాపాల స్తంభన వెయ్యికోట్ల రూపాయలకు పైగా ఉంటుందని బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో ఆర్థిక సంస్థలు మొత్తం 800 వరకు ఉన్నాయి. వీటిల్లో ఐదురోజులుగా ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. దీంతో నగదు మార్పిడి జరగక, జిల్లాలోని వాణిజ్య రంగంపై ప్రభావం చూపుతోంది. ఆగస్టు 5వ తేదీకి కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఖాతాల్లో జమ చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వ ఖజానా శాఖ కార్యకలాపాలు కూడా స్తంభించాయి. దీంతో ఉద్యోగులు, ప్రభుత్వ పింఛన్ల చెల్లింపులు, ఇతర ప్రభుత్వ శాఖల చెల్లింపులు నిలిచిపోయాయి. కేవలం సోమవారం మాత్రం ట్రెజరీ(ఖజనా శాఖ)లో ఒక రోజు పని జరి గింది. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులకు సంబంధించిన కోట్ల రూపాయల జీతాలు నిలిచిపోవటంతో ఉద్యోగులు డబ్బుల కోసం వెతుక్కునే పరిస్థితి తలెత్తింది. ఏటీఎంలు ఖాళీ జూలై 31వ తేదీ నుంచి వరుసగా బ్యాంకులు పనిచేయకపోవడంతో ఏటీఎంలన్నీ ఖాళీ అయిపోయాయి. మొత్తం 500కు పైగా ఉన్న వివిధ బ్యాంకుల ఏటీఎంల్లో డబ్బులు నిల్వ ఉంచలేకపోయారు. ఉన్న అరకొర నిధులు ఒక్క రోజులోనే వినియోగదారులు డ్రా చేయటంతో మూతపడ్డాయి. ఎస్బీఐ ఏటీఎంలు పూర్తిగా ఖాళీ కావటంతో ఆంధ్రాబ్యాంక్ ఏటీఎంలు, యూనియన్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ ఏటీంలకు వినియోగదారులు పరుగులు దీస్తున్నారు. ఏటీఎంల ముందు రాత్రుల్లో కూడా బారులు తీరారు. నాలుగురోజుల తరువాత ఆదివారం కొన్ని ఏటీఎంలలో డబ్బులు నింపటంతో ఏటీఎం కేంద్రాలు కిక్కిరిసిపోయాయి. ఆ ఏటీఎంల్లో కూడా సోమవారం ఉదయం కల్లా డబ్బులు అయిపోయాయి. దీంతో సోమవారం మధ్యాహ్నం నుంచి మళ్లీ అవుట్ సర్వీ సు బోర్డులతో ఏటీఎంలు దర్శనమిచ్చాయి. వరుసగా బంద్ కొనసాగనుండటంతో డబ్బు లు డ్రా చేసేందుకు వినియోగదారులు పరుగులు తీస్తున్నారు.