ఇక మరింత సులువుగా వ్యాపారాల నిర్వహణ
మరిన్ని నిబంధనలు సడలించిన కేంద్రం
న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది. ఇకపై ప్రైవేట్ కంపెనీలు .. ఆఫర్ సర్క్యులర్, డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా డిపాజిట్లు స్వీకరించే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ సంస్థల్లో అధికారులకిచ్చే జీతభత్యాల విషయంలో పరిమితుల నుంచి మినహాయింపునిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, చారిటబుల్ సంస్థలు, నిధి కంపెనీలు మొదలైన వాటి నిబంధనలను సడలిస్తూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది.
దీని ప్రకారం ఇకపై ప్రైవేట్ కంపెనీలు సింపుల్ మెజారిటీ ద్వారా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్‌ను ఆమోదించవచ్చు. అలాగే, పెట్టుబడులు తదితర నిర్దిష్ట లావాదేవీలకు షేర్‌హోల్డర్ల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలన్న నిబంధనను పక్కన పెడుతున్నట్లు ఎంసీఏ పేర్కొంది. ఆడిటర్లు గరిష్టంగా 20 కంపెనీలకు మాత్రమే ఆడిటింగ్ చేయాలన్న నిబంధన పరిధిలోకి ఏక వ్యక్తి కంపెనీలు, అంతగా లావాదేవీలు లేని సంస్థలు, చిన్న కంపెనీలు, రూ. 100 కోట్ల పెయిడప్ షేర్ క్యాపిటల్ కన్నా తక్కువ ఉండే ప్రైవేట్ సంస్థలు మొదలైనవి రాకుండా మినహాయింపునిచ్చింది.
డిఫెన్స్ పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థలకు కొన్ని అకౌంటింగ్ నిబంధనలను పాటించనక్కర్లేకుండా మినహాయింపు కల్పించింది. నిధి కంపెనీలకు సంబంధించి డివిడెండ్ చెల్లింపు తదితర అంశాలను సవరించింది. పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు ఉద్దేశించి ఏర్పాటైన సంస్థలను నిధి కంపెనీలుగా వ్యవహరిస్తారు.