Government Agency
-
తాటాకు చప్పుళ్లకు బెదరం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రభుత్వ వ్యవస్థల ద్వారా భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన పార్టీ హైదరాబాద్ జిల్లా సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ సంస్థలను అడ్డుపెట్టుకుని చేసే తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదని, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ‘ఈ రోజు వ్యవస్థలు మీ చేతుల్లో ఉండొచ్చు. రేపు మా చేతుల్లో ఉండొచ్చు’అని తలసాని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మంత్రు లు, ప్రజాప్రతినిధులే లక్ష్యంగా చేస్తున్న దాడు లు, ఇతర పరిణామాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామన్నారు. 27న టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం తెలంగాణ భవన్లో హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం ఈ నెల 27న నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. మంత్రులు శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీతో పాటు హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, నియోజకవర్గ ఇన్చార్జిలు మంగళవారం తెలంగాణ భవన్లో జరిగిన టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా ముఖ్య నేతల సమావేశంలో పాల్గొన్నారు. -
ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్
న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సమీకరించాలన్న లక్ష్యంతో కేంద్రం వేగంగానే అడుగులేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయంతో రూ.72,500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి అందులో సగం మేర పూర్తి చేసింది. నవంబర్ 1 నాటికి వాటాల విక్రయం ద్వారా రూ.30,185 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ నెల 3న ముగిసిన న్యూ ఇండియా అష్యూరెన్స్ ఐపీవోతో కలిపి చూస్తే కేంద్ర సర్కారు లక్ష్యంలో సగానికిపైనే అంటే రూ.37,000 కోట్లు సమకూరాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. బీమా సంస్థలు బంగారు బాతులు! ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ లక్ష్యంలో రూ.46,500 కోట్లను ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా సమీకరించాలన్నది ప్రణాళిక. అలాగే, రూ.15,000 కోట్లను వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోనుంది. ఇన్సూరెన్స్ కంపెనీల లిస్టింగ్ ద్వారా రూ.11,000 కోట్లు వస్తాయన్న అంచనా వేసింది. నవంబర్ 1 నాటికి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ.25,797 కోట్లు వచ్చాయి. వ్యూహాత్మక వాటాల విక్రయంతో మరో రూ.4,153 కోట్లు జమయ్యాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్‌లో వాటాల విక్రయంతో రూ.7,600 కోట్లను సమీకరించింది. దీంతో మొత్తం సమీకరించిన నిధులు రూ.37,865 కోట్లు. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవో ఒక్కటే కేంద్ర సర్కారుకు భారీగా నిధులను సమకూర్చిపెట్టింది. దీని ద్వారానే కేంద్ర సర్కారుకు ఏకంగా రూ.9,700 కోట్ల నిధులు వచ్చి చేరాయి. దీనికితోడు ఎన్టీపీసీలో వాటాలను అమ్మటం ద్వారా కేంద్రం రూ.9,100 కోట్లను రాబట్టుకుంది. ముందే లక్ష్యం పూర్తి! ఇక భారత్ 22 ఈటీఎఫ్ ఇష్యూ ప్రస్తుతం నడుస్తోంది. దీని ద్వారా కేంద్ర సర్కారు 22 సంస్థల్లో తనకున్న వాటాలను కొంత మేర విక్రయించడం ద్వారా రూ.8,000 కోట్లు రానున్నాయి. ఈ ఇష్యూ నేటి(శుక్రవారం)తో ముగుస్తుంది. మరోవైపు వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని కేంద్ర సర్కారు వేగవంతం చేయనుందని సమాచారం. వ్యూహాత్మక వాటాల విక్రయంలో భాగంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్‌కు సంబంధించి కేంద్రం ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకుంది. అలాగే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్, హిందుస్తాన్ ప్రీఫ్యాబ్‌లను కూడా ప్రైవేటు సంస్థలకు విక్రయించనుంది. -
ఇక మరింత సులువుగా వ్యాపారాల నిర్వహణ
మరిన్ని నిబంధనలు సడలించిన కేంద్రం న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా నిబంధనలను కేంద్రం సరళతరం చేసింది. ఇకపై ప్రైవేట్ కంపెనీలు .. ఆఫర్ సర్క్యులర్, డిపాజిట్ రీపేమెంట్ రిజర్వ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా డిపాజిట్లు స్వీకరించే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ సంస్థల్లో అధికారులకిచ్చే జీతభత్యాల విషయంలో పరిమితుల నుంచి మినహాయింపునిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, చారిటబుల్ సంస్థలు, నిధి కంపెనీలు మొదలైన వాటి నిబంధనలను సడలిస్తూ కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై ప్రైవేట్ కంపెనీలు సింపుల్ మెజారిటీ ద్వారా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్‌ను ఆమోదించవచ్చు. అలాగే, పెట్టుబడులు తదితర నిర్దిష్ట లావాదేవీలకు షేర్‌హోల్డర్ల నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలన్న నిబంధనను పక్కన పెడుతున్నట్లు ఎంసీఏ పేర్కొంది. ఆడిటర్లు గరిష్టంగా 20 కంపెనీలకు మాత్రమే ఆడిటింగ్ చేయాలన్న నిబంధన పరిధిలోకి ఏక వ్యక్తి కంపెనీలు, అంతగా లావాదేవీలు లేని సంస్థలు, చిన్న కంపెనీలు, రూ. 100 కోట్ల పెయిడప్ షేర్ క్యాపిటల్ కన్నా తక్కువ ఉండే ప్రైవేట్ సంస్థలు మొదలైనవి రాకుండా మినహాయింపునిచ్చింది. డిఫెన్స్ పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థలకు కొన్ని అకౌంటింగ్ నిబంధనలను పాటించనక్కర్లేకుండా మినహాయింపు కల్పించింది. నిధి కంపెనీలకు సంబంధించి డివిడెండ్ చెల్లింపు తదితర అంశాలను సవరించింది. పొదుపు అలవాటును ప్రోత్సహించేందుకు ఉద్దేశించి ఏర్పాటైన సంస్థలను నిధి కంపెనీలుగా వ్యవహరిస్తారు.