ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌ | Digestation in several government agencies already | Sakshi
Sakshi News home page

ఇప్పటికే పలు ప్రభుత్వ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్‌

Published Fri, Nov 17 2017 12:10 AM | Last Updated on Fri, Nov 17 2017 12:10 AM

Digestation in several government agencies already - Sakshi

న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా నిధులు సమీకరించాలన్న లక్ష్యంతో కేంద్రం వేగంగానే అడుగులేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయంతో రూ.72,500 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి అందులో సగం మేర పూర్తి చేసింది. నవంబర్‌ 1 నాటికి వాటాల విక్రయం ద్వారా రూ.30,185 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ నెల 3న ముగిసిన న్యూ ఇండియా అష్యూరెన్స్‌ ఐపీవోతో కలిపి చూస్తే కేంద్ర సర్కారు లక్ష్యంలో సగానికిపైనే అంటే రూ.37,000 కోట్లు సమకూరాయి. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది.

బీమా సంస్థలు బంగారు బాతులు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ లక్ష్యంలో రూ.46,500 కోట్లను ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా సమీకరించాలన్నది ప్రణాళిక. అలాగే, రూ.15,000 కోట్లను వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా సమకూర్చుకోనుంది. ఇన్సూరెన్స్‌ కంపెనీల లిస్టింగ్‌ ద్వారా రూ.11,000 కోట్లు వస్తాయన్న అంచనా వేసింది. నవంబర్‌ 1 నాటికి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ.25,797 కోట్లు వచ్చాయి. వ్యూహాత్మక వాటాల విక్రయంతో మరో రూ.4,153 కోట్లు జమయ్యాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్‌లో వాటాల విక్రయంతో రూ.7,600 కోట్లను సమీకరించింది. దీంతో మొత్తం సమీకరించిన నిధులు రూ.37,865 కోట్లు. జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఐపీవో ఒక్కటే కేంద్ర సర్కారుకు భారీగా నిధులను సమకూర్చిపెట్టింది. దీని ద్వారానే కేంద్ర సర్కారుకు ఏకంగా రూ.9,700 కోట్ల నిధులు వచ్చి చేరాయి. దీనికితోడు ఎన్‌టీపీసీలో వాటాలను అమ్మటం ద్వారా కేంద్రం రూ.9,100 కోట్లను రాబట్టుకుంది.

ముందే లక్ష్యం పూర్తి!
ఇక భారత్‌ 22 ఈటీఎఫ్‌ ఇష్యూ ప్రస్తుతం నడుస్తోంది. దీని ద్వారా కేంద్ర సర్కారు 22 సంస్థల్లో తనకున్న వాటాలను కొంత మేర విక్రయించడం ద్వారా రూ.8,000 కోట్లు రానున్నాయి. ఈ ఇష్యూ నేటి(శుక్రవారం)తో ముగుస్తుంది. మరోవైపు వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని కేంద్ర సర్కారు వేగవంతం చేయనుందని సమాచారం. వ్యూహాత్మక వాటాల విక్రయంలో భాగంగా డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌కు సంబంధించి కేంద్రం ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకుంది. అలాగే సెంట్రల్‌ ఎలక్ట్రానిక్స్, హిందుస్తాన్‌ ప్రీఫ్యాబ్‌లను కూడా ప్రైవేటు సంస్థలకు విక్రయించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement