న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యాల సాధనకు, ఎన్నికల వేళ సంక్షేమ పథకాలకు కావల్సిన నిధులను సమకూర్చుకునేందుకు కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా శత్రు దేశాల పౌరులకు భారత్‌లోని సంస్థల్లో ఉన్న షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. వీటి విలువ సుమారు రూ. 3,000 కోట్ల పైచిలుకు ఉండొచ్చని అంచనా. ఇందుకు సంబంధించి అనుసరించాల్సిన విధానానికి కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. దశాబ్దాల పాటు నిద్రాణస్థితిలో ఉన్న శత్రుదేశ పౌరుల ఆస్తుల విక్రయానికి ఈ నిర్ణయం దోహదపడగలదని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. వీటి విక్రయం ద్వారా వచ్చే నిధులను అభివృద్ధి, సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు వివరించింది. ‘ఈ షేర్ల విక్రయ ప్రక్రియను ఆర్థిక మంత్రి సారథ్యంలోని ప్రత్యామ్నాయ యంత్రాంగం ఆమోదించాల్సి ఉంటుంది. షేర్ల విక్రయంతో వచ్చిన నిధులను డిజిన్వెస్ట్‌మెంట్ నిధులుగా పరిగణించి ఆర్థిక శాఖ నిర్వహించే ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది’ అని వివరించింది.
996 సంస్థల్లో 6.5 కోట్ల షేర్లు..
శత్రు దేశ పౌరుల భారతీయ ఆస్తులకు సంరక్షక సంస్థగా వ్యవహరించే సెపి వద్ద మొత్తం 996 కంపెనీల్లో 20,323 మంది షేర్‌హోల్డర్లకు చెందిన 6,50,75,877 షేర్లు ఉన్నాయి. వీటిలో 588 సంస్థలు క్రియాశీలకంగా ఉండగా, 139 సంస్థలు స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయినవి ఉన్నాయి. షేర్ల విక్రయ ప్రక్రియ ప్రారంభించడానికి ముందుగా.. న్యాయస్థానాల ఉత్తర్వులు, ఇతరత్రా నియంత్రణ సంస్థల ఆంక్షలు మొదలైన ప్రతిబంధకాలేమీ లేకుండా ధృవీకరణ బాధ్యతలను సెపి నిర్వర్తిస్తుంది. ఈ ప్రక్రియకు సంబంధించి వివిధ సేవలు అందించే మర్చంట్ బ్యాంకర్లు, లీగల్ అడ్వైజర్లు మొదలైన వారిని టెండర్ ప్రక్రియ ద్వారా దీపం ఎంపిక చేస్తుంది. మొత్తం విక్రయ ప్రక్రియను అంతర్–మంత్రిత్వ శాఖల గ్రూప్ పర్యవేక్షిస్తుంది.
శత్రు ఆస్తులంటే..
సాధారణంగా యుద్ధాల సమయంలో శత్రు దేశాల పౌరులకు తమ దేశాల్లో ఉన్న ఆస్తులను ప్రభుత్వాలు జప్తు చేస్తుంటాయి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల సమయంలో అమెరికా, బ్రిటన్ మొదలైనవి తమ దేశాల్లో జర్మన్ సంస్థలు, పౌరుల ఆస్తులను ఇలాగే జప్తు చేశాయి. వీటినే శత్రు ఆస్తులుగా వ్యవహరిస్తుంటారు. 1962లో చైనాతోను,1965 ఆ తర్వాత 1971లో పాకిస్తాన్‌తోనూ భారత్ యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రక్షణ చట్టాల కింద ఈ రెండు దేశాల్లోని పౌరులకు భారత్‌లో ఉన్న ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది. వీటిల్లో స్థలం, భవంతులు, షేర్లు, బంగారం, ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి. వీటి సంరక్షణ బాధ్యత సెపి చేతిలో ఉంటుంది. కొన్నేళ్ల క్రితం దాకా సెపి వద్ద ఇలాంటి ఆస్తులు సుమారు 2,100 దాకా ఉండగా.. ప్రస్తుతం ఇవి 16,000 దాకా చేరినట్లు తెలుస్తోంది. వీటి విలువ రూ. లక్ష కోట్ల పైగానే ఉంటుందని అంచనా.
‘శత్రు’ షేర్ల విక్రయం!
Published Sat, Nov 10 2018 1:24 AM | Last Updated on Sat, Nov 10 2018 4:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment