సాగులో నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోని ప్రైవేట్ కంపెనీలు
పామాయిల్ ఫ్యాక్టరీల ఏర్పాటులోనూ నిర్లక్ష్యం
సమీక్ష చేసి అవసరమైతే కంపెనీలతో ఒప్పందాల రద్దు?
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పామ్ సాగు రాష్ట్రంలో ఆశించినస్థాయిలో పెరగలేదు. దీనిపై సర్కారు దృష్టి సారిస్తున్నా..కొన్ని కంపెనీలు మాత్రం వెనుకడుగు వేస్తున్నాయి. ఆయిల్‌పామ్ విస్తీర్ణాన్ని వచ్చే దశాబ్దంలోగా ఏకంగా 20 లక్షల ఎకరాలకు విస్తరించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.రాష్ట్రంలో ఆయిల్‌ఫెడ్ సహా 14 ప్రైవేట్ కంపెనీలకు ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన బాధ్యతలు అప్పగించింది. మొత్తం 31 జిల్లాలను గుర్తించింది.
కొన్నేళ్లుగా ప్రైవేట్ కంపెనీలు తమ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. సాగు చేయించడంలోనూ, ఆ మేరకు రైతులను ఒప్పించడంలోనూ అనాసక్తి చూపిస్తున్నాయి. మరోవైపు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని కొన్ని కంపెనీలు సేకరించలేదు. దాదాపు మూడేళ్ల క్రితమే ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, కంపెనీలు పట్టించుకోలేదు.
ఇప్పటి వరకు భూములు కొనకపోతే ఫ్యాక్టరీలు ఎప్పుడు నిర్మిస్తారోనన్న విమర్శలు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం మూడేళ్లలోపు ఫ్యాక్టరీ నిర్మించాలి. కానీ ఈ నిబంధనను అనేక కంపెనీలు అమలు చేయడం లేదు. పంట చేతికొచ్చే సమయానికి ఫ్యాక్టరీ అందుబాటులో లేకుంటే రైతులు ఇబ్బందులు పడతారు. ఇప్పటికే కొత్తగా ఆయిల్‌పామ్ సాగు చేసిన జిల్లాల్లో పంట గెలలు అందుబాటులోకి వచ్చాయి. మరో ఏడాదిలో మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు ఇంకా నిర్లిప్తంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
లక్ష్యాన్ని చేరుకోలేని దుస్థితి
ఆయిల్‌పామ్ సాగులో 14 కంపెనీలు తమ లక్ష్యంలో కేవలం 20 శాతం వరకే చేరుకున్నాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్ మినహా ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పెద్దగా పురోగతి లేదు. వంట నూనెల జాతీయ పథకం (ఎన్‌ఎంఈఓ) ద్వారా కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని వాటికి జిల్లాలు, అందులో భూముల సాగు లక్ష్యాలను నిర్దేశించింది. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు స్థాపించండం, రైతులను ఒప్పించి మొక్కలు వేయడం, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, పంట వచ్చిన తర్వాత కొనుగోలు చేయడం వంటి వాటిని ఈ కంపెనీలు చేపట్టాలి.
2020–21లో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు ఇప్పటివరకు కేవలం 1,52,957 ఎకరాల్లోనే పంటలు వేయించాయి. వీటిలో టీఎస్ ఆయిల్‌ఫెడ్ 87 వేల ఎకరాల్లో..మిగిలిన సంస్థలు 65 వేల ఎకరాల్లోనే పంటలను వేయించాయి. ఈ నేపథ్యంలో సాగు లక్ష్యాన్ని చేరుకోని కంపెనీలతోపాటు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేని కంపెనీలకు ఉద్యానశాఖ నోటీసులు జారీ చేసింది. అయితే కంపెనీలు మాత్రం సాగుకు రైతులు ముందుకు రావడం లేదంటూ వివరణ ఇచ్చాయి.
ప్రైవేట్ కంపెనీలు రైతుల వద్దకు వెళ్లడానికి అవసరమైన సిబ్బందిని నియమించడంలోనూ... రైతులను ప్రోత్సహించడంలోనూ విఫలం అవుతున్నాయి. పైగా ప్రైవేట్ కంపెనీలు కావడంతో వాటిని రైతులు నమ్మడం లేదన్న చర్చ జరుగుతోంది. తమకు ప్రోత్సాహకాలు అందుతాయో లేదోనని, పంట కొనుగోలు చేయరేమోనని అనుమానపడుతున్నారు. వారి అనుమానాలను తొలగించే ప్రయత్నాలు చేయడం లేదు.
ఈ నేపథ్యంలో లక్ష్యంలో 20 శాతం కూడా సాధించక పోవడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా కంపెనీలతో సమావేశం నిర్వహించాలని, వాటి నుంచి ఆశించిన స్పందన లేకపోతే అవసరమైతే ఒప్పందాలను రద్దు చేయాలని ఆయన అన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment