కేంద్రం నూనెల దిగుమతి సుంకం పెంచడం ఆసరాగా చేసుకుని డీలర్లతో కుమ్మక్కు!
నెలన్నరలో ఇష్టారాజ్యంగా 12 సార్లు ధరలు పెంచిన సంస్థ
పాత నిల్వలు పాత ధరకే అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘన
డీలర్లకు పాత ధరకిచ్చి, కొత్త ధరకు విక్రయించుకునేలా వెసులుబాటు
కీలక అధికారులు రూ.10 కోట్ల కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌ఫెడ్‌లో నూనె దందా నడుస్తోందని, కేంద్రం నూనెపై దిగుమతి సుంకం పెంచిన తర్వాత, కేంద్రం ఆదేశాలను పట్టించుకోకుండా నెలన్నర కాలంలోనే ఏకంగా 12 సార్లు ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై పెద్దయెత్తున భారం మోపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు కేంద్రం దిగుమతి సుంకం పెంచడాన్ని అవకాశంగా తీసుకుని కొందరు అధికారులు అక్రమార్జనకు తెరలేపారని, కోట్ల రూపాయల కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచిన తర్వాత అప్పటికే నిల్వ ఉన్న వంట నూనెలను పాత ధరకే ప్రైవేట్ డీలర్లకు ఇచ్చి.. వారు పెరిగిన ధరల ప్రకారం వినియోగదారులకు అమ్ముకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
వంటనూనెల ధరలన్నీ భారీగా పెంపు
కేంద్రం సెప్టెంబర్ 14వ తేదీన వంట నూనెల దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. సన్‌ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్, వేరుశనగ నూనెపై 12.5 శాతం నుంచి 32.5 శాతం వరకు పెంచింది. ఇది దేశవ్యాప్తంగా నూనెల ధరల పెరుగుదలకు కారణం అయ్యింది. అయితే పాత నిల్వలను పాత ధరకే అమ్మాలని కేంద్రం స్పష్టం చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న పాత నిల్వలు నెలన్నర రోజులకు పైగా సరిపోతాయని, ఆ తర్వాత కొత్త నిల్వలకు కొత్త ధరలు అమలు చేయాలని పేర్కొంది. కానీ ఆయిల్ ఫెడ్ కేంద్రం నిర్ణయాన్ని పెడచెవిన పెట్టి, దిగుమతి సుంకం పెంచిన రోజునే సంస్థ పరిధిలోని నూనె ధరలను పెంచేసింది. అలా పలుమార్లు ధరలు పెంచుకుంటూ పోయింది. అలా ఈనెల ఐదో తేదీలోగా పామాయిల్ లీటర్ ధరను రూ.96 నుంచి ఏకంగా రూ.131కు పెంచింది.
అంటే ధర రూ.35 పెరిగిపోయిందన్న మాట. అలాగే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరను రూ.104 నుంచి రూ.138కి, రైస్ బ్రాన్ ధరను రూ.105 నుంచి రూ.136కు పెంచింది. దీపం ఆయిల్ ధరను కూడా రూ. 31 పెంచేసింది. కేంద్రం చెప్పినట్టు కాకుండా దిగుమతి సుంకం పెంచిన రోజు నుంచే ఆయిల్‌ఫెడ్ ఇలా ధరలు పెంచుతూ పోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అంటున్నారు.
ధరలు స్థిరీకరించాల్సింది పోయి
బహిరంగ మార్కెట్లో నూనెల ధరలు పెరిగే సమయంలో వాటిని స్థిరీకరించాల్సిన బాధ్యత ఆయిల్‌ఫెడ్‌పై ఉండగా, అందుకు భిన్నంగా, కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించి నూనె ధరలను పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన రోజున ఆయిల్‌ఫెడ్ వద్ద, దాని డీలర్ల వద్ద దాదాపు 5 వేల మెట్రిక్ టన్నుల నిల్వ నూనె ఉన్నట్లు అంచనా. కాగా తన వద్ద ఉన్న నిల్వ నూనెను పాత ధరకు ఇచ్చి, కొత్త ధరకు అమ్ముకోవాలని కొందరు డీలర్లకు కొందరు ఆయిల్‌ఫెడ్ అధికారులు సూచించారు.
అంతేకాకుండా డీలర్ల వద్ద అప్పటికే ఉన్న నిల్వ నూనెను కూడా కొత్త ధరకే అమ్ముకోవాలని చెప్పారు. ఇప్పటివరకు 12 సార్లు ధరలను పెంచిన నేపథ్యంలో పెంచిన ప్రతిసారీ పాత నిల్వ నూనెలను కొత్త ధరకే అమ్ముకునేలా వెసులుబాటు కల్పించారు. ఇలా నిల్వ నూనెలు కొత్త ధరకు విక్రయించడం వల్ల ప్రైవేట్ డీలర్లు అక్రమంగా దాదాపు రూ.10 కోట్ల అదనపు లాభం పొందినట్లు అంచనా. కాగా అందులో సగం అంటే సుమారు రూ.5 కోట్ల మేరకు ఆయిల్‌ఫెడ్‌లోని కొందరు కీలకమైన అధికారులకు డీలర్లు కమీషన్లుగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
పలుమార్లు ధరల పెంపుపై వినియోగదారుల నుంచి విమర్శలు వచ్చినా ఆయిల్‌ఫెడ్ అధికారులు కమీషన్ల మత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీపావళికి ముందు రోజు ధర పెంపుపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఆయిల్‌ఫెడ్ ఖాతరు చేయలేదని అంటున్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై వివరణ కోసం ఫోన్‌లో సంప్రదించడగానికి ‘సాక్షి’ప్రయత్ని0చగా ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment