oilfed
-
ఆయిల్ ఫెడ్లో అక్రమ దందా?
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌ఫెడ్‌లో నూనె దందా నడుస్తోందని, కేంద్రం నూనెపై దిగుమతి సుంకం పెంచిన తర్వాత, కేంద్రం ఆదేశాలను పట్టించుకోకుండా నెలన్నర కాలంలోనే ఏకంగా 12 సార్లు ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై పెద్దయెత్తున భారం మోపిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కేంద్రం దిగుమతి సుంకం పెంచడాన్ని అవకాశంగా తీసుకుని కొందరు అధికారులు అక్రమార్జనకు తెరలేపారని, కోట్ల రూపాయల కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సుంకం పెంచిన తర్వాత అప్పటికే నిల్వ ఉన్న వంట నూనెలను పాత ధరకే ప్రైవేట్ డీలర్లకు ఇచ్చి.. వారు పెరిగిన ధరల ప్రకారం వినియోగదారులకు అమ్ముకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వంటనూనెల ధరలన్నీ భారీగా పెంపు కేంద్రం సెప్టెంబర్ 14వ తేదీన వంట నూనెల దిగుమతి సుంకాన్ని భారీగా పెంచింది. సన్‌ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్, వేరుశనగ నూనెపై 12.5 శాతం నుంచి 32.5 శాతం వరకు పెంచింది. ఇది దేశవ్యాప్తంగా నూనెల ధరల పెరుగుదలకు కారణం అయ్యింది. అయితే పాత నిల్వలను పాత ధరకే అమ్మాలని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న పాత నిల్వలు నెలన్నర రోజులకు పైగా సరిపోతాయని, ఆ తర్వాత కొత్త నిల్వలకు కొత్త ధరలు అమలు చేయాలని పేర్కొంది. కానీ ఆయిల్ ఫెడ్ కేంద్రం నిర్ణయాన్ని పెడచెవిన పెట్టి, దిగుమతి సుంకం పెంచిన రోజునే సంస్థ పరిధిలోని నూనె ధరలను పెంచేసింది. అలా పలుమార్లు ధరలు పెంచుకుంటూ పోయింది. అలా ఈనెల ఐదో తేదీలోగా పామాయిల్ లీటర్ ధరను రూ.96 నుంచి ఏకంగా రూ.131కు పెంచింది. అంటే ధర రూ.35 పెరిగిపోయిందన్న మాట. అలాగే సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరను రూ.104 నుంచి రూ.138కి, రైస్ బ్రాన్ ధరను రూ.105 నుంచి రూ.136కు పెంచింది. దీపం ఆయిల్ ధరను కూడా రూ. 31 పెంచేసింది. కేంద్రం చెప్పినట్టు కాకుండా దిగుమతి సుంకం పెంచిన రోజు నుంచే ఆయిల్‌ఫెడ్ ఇలా ధరలు పెంచుతూ పోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అంటున్నారు. ధరలు స్థిరీకరించాల్సింది పోయి బహిరంగ మార్కెట్లో నూనెల ధరలు పెరిగే సమయంలో వాటిని స్థిరీకరించాల్సిన బాధ్యత ఆయిల్‌ఫెడ్‌పై ఉండగా, అందుకు భిన్నంగా, కేంద్రం ఆదేశాలను ఉల్లంఘించి నూనె ధరలను పెంచేసింది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచిన రోజున ఆయిల్‌ఫెడ్ వద్ద, దాని డీలర్ల వద్ద దాదాపు 5 వేల మెట్రిక్ టన్నుల నిల్వ నూనె ఉన్నట్లు అంచనా. కాగా తన వద్ద ఉన్న నిల్వ నూనెను పాత ధరకు ఇచ్చి, కొత్త ధరకు అమ్ముకోవాలని కొందరు డీలర్లకు కొందరు ఆయిల్‌ఫెడ్ అధికారులు సూచించారు. అంతేకాకుండా డీలర్ల వద్ద అప్పటికే ఉన్న నిల్వ నూనెను కూడా కొత్త ధరకే అమ్ముకోవాలని చెప్పారు. ఇప్పటివరకు 12 సార్లు ధరలను పెంచిన నేపథ్యంలో పెంచిన ప్రతిసారీ పాత నిల్వ నూనెలను కొత్త ధరకే అమ్ముకునేలా వెసులుబాటు కల్పించారు. ఇలా నిల్వ నూనెలు కొత్త ధరకు విక్రయించడం వల్ల ప్రైవేట్ డీలర్లు అక్రమంగా దాదాపు రూ.10 కోట్ల అదనపు లాభం పొందినట్లు అంచనా. కాగా అందులో సగం అంటే సుమారు రూ.5 కోట్ల మేరకు ఆయిల్‌ఫెడ్‌లోని కొందరు కీలకమైన అధికారులకు డీలర్లు కమీషన్లుగా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పలుమార్లు ధరల పెంపుపై వినియోగదారుల నుంచి విమర్శలు వచ్చినా ఆయిల్‌ఫెడ్ అధికారులు కమీషన్ల మత్తులో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. దీపావళికి ముందు రోజు ధర పెంపుపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఆయిల్‌ఫెడ్ ఖాతరు చేయలేదని అంటున్నారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై వివరణ కోసం ఫోన్లో సంప్రదించడగానికి ‘సాక్షి’ప్రయత్ని0చగా ఆయిల్‌ఫెడ్ ఎండీ యాస్మిన్ బాషా స్పందించలేదు. -
‘ఆయిల్‌పామ్’..అంతంతే
సాక్షి, హైదరాబాద్: ఆయిల్‌పామ్ సాగు రాష్ట్రంలో ఆశించినస్థాయిలో పెరగలేదు. దీనిపై సర్కారు దృష్టి సారిస్తున్నా..కొన్ని కంపెనీలు మాత్రం వెనుకడుగు వేస్తున్నాయి. ఆయిల్‌పామ్ విస్తీర్ణాన్ని వచ్చే దశాబ్దంలోగా ఏకంగా 20 లక్షల ఎకరాలకు విస్తరించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.రాష్ట్రంలో ఆయిల్‌ఫెడ్ సహా 14 ప్రైవేట్ కంపెనీలకు ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన బాధ్యతలు అప్పగించింది. మొత్తం 31 జిల్లాలను గుర్తించింది. కొన్నేళ్లుగా ప్రైవేట్ కంపెనీలు తమ నిర్ణీత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమవుతున్నాయి. సాగు చేయించడంలోనూ, ఆ మేరకు రైతులను ఒప్పించడంలోనూ అనాసక్తి చూపిస్తున్నాయి. మరోవైపు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని కొన్ని కంపెనీలు సేకరించలేదు. దాదాపు మూడేళ్ల క్రితమే ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఉన్నా, కంపెనీలు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు భూములు కొనకపోతే ఫ్యాక్టరీలు ఎప్పుడు నిర్మిస్తారోనన్న విమర్శలు వస్తున్నాయి. ఒప్పందం ప్రకారం మూడేళ్లలోపు ఫ్యాక్టరీ నిర్మించాలి. కానీ ఈ నిబంధనను అనేక కంపెనీలు అమలు చేయడం లేదు. పంట చేతికొచ్చే సమయానికి ఫ్యాక్టరీ అందుబాటులో లేకుంటే రైతులు ఇబ్బందులు పడతారు. ఇప్పటికే కొత్తగా ఆయిల్‌పామ్ సాగు చేసిన జిల్లాల్లో పంట గెలలు అందుబాటులోకి వచ్చాయి. మరో ఏడాదిలో మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయంటున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు ఇంకా నిర్లిప్తంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్యాన్ని చేరుకోలేని దుస్థితి ఆయిల్‌పామ్ సాగులో 14 కంపెనీలు తమ లక్ష్యంలో కేవలం 20 శాతం వరకే చేరుకున్నాయని అధికారులు అంటున్నారు. ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్‌ఫెడ్ మినహా ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పెద్దగా పురోగతి లేదు. వంట నూనెల జాతీయ పథకం (ఎన్ఎంఈఓ) ద్వారా కంపెనీలతో ఒప్పందాలు చేసుకొని వాటికి జిల్లాలు, అందులో భూముల సాగు లక్ష్యాలను నిర్దేశించింది. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు స్థాపించండం, రైతులను ఒప్పించి మొక్కలు వేయడం, వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం, పంట వచ్చిన తర్వాత కొనుగోలు చేయడం వంటి వాటిని ఈ కంపెనీలు చేపట్టాలి. 2020–21లో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలు ఇప్పటివరకు కేవలం 1,52,957 ఎకరాల్లోనే పంటలు వేయించాయి. వీటిలో టీఎస్ ఆయిల్‌ఫెడ్ 87 వేల ఎకరాల్లో..మిగిలిన సంస్థలు 65 వేల ఎకరాల్లోనే పంటలను వేయించాయి. ఈ నేపథ్యంలో సాగు లక్ష్యాన్ని చేరుకోని కంపెనీలతోపాటు ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోలేని కంపెనీలకు ఉద్యానశాఖ నోటీసులు జారీ చేసింది. అయితే కంపెనీలు మాత్రం సాగుకు రైతులు ముందుకు రావడం లేదంటూ వివరణ ఇచ్చాయి. ప్రైవేట్ కంపెనీలు రైతుల వద్దకు వెళ్లడానికి అవసరమైన సిబ్బందిని నియమించడంలోనూ... రైతులను ప్రోత్సహించడంలోనూ విఫలం అవుతున్నాయి. పైగా ప్రైవేట్ కంపెనీలు కావడంతో వాటిని రైతులు నమ్మడం లేదన్న చర్చ జరుగుతోంది. తమకు ప్రోత్సాహకాలు అందుతాయో లేదోనని, పంట కొనుగోలు చేయరేమోనని అనుమానపడుతున్నారు. వారి అనుమానాలను తొలగించే ప్రయత్నాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో లక్ష్యంలో 20 శాతం కూడా సాధించక పోవడంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా కంపెనీలతో సమావేశం నిర్వహించాలని, వాటి నుంచి ఆశించిన స్పందన లేకపోతే అవసరమైతే ఒప్పందాలను రద్దు చేయాలని ఆయన అన్నట్టు సమాచారం. -
ఆయిల్ ఫెడ్ చైర్మన్‌గా కంచర్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ చైర్మన్‌గా కంచర్ల రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. తాజా ఉత్తర్వులతో ఆయిల్ ఫెడ్ సంస్థకు వరుసగా నాలుగోసారి కూడా కంచర్ల చైర్మన్‌గా నియమితుల య్యారు. మొదట 2018లో 2020 వరకు అవకాశం ఇవ్వగా, తరువాత 2020 నుంచి 2021 వరకు, అనంతరం 2021 నుంచి 2022 జూలై వరకు చైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుత ఉత్తర్వులతో 2024 జూలై వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. నాలుగోసారి కూడా తనకే చైర్మన్‌గా అవకాశమివ్వడంతో సీఎం కేసీఆర్‌కు రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో కంచర్ల రామకృష్ణారెడ్డి. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, గ్యాదరి కిశోర్ -
ఆయిల్‌ఫెడ్ ఉద్యోగులకు బోనస్ ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో దసరా సందర్భంగా ప్రతీ ఏడాది ఇచ్చే బోనస్‌ను రద్దుచేశారని ఉద్యోగులు, అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 ఏళ్లకుపైగా ఆనవాయితీగా వస్తున్న బోనస్‌ను ఒక ఉన్నతాధికారి నిర్వాకంతో ఎత్తివేశారని ఆరోపిస్తున్నారు. కొత్తగా లక్షలాది ఎకరాల పామాయిల్ విస్తరణలో పాలుపంచుకుంటున్నామని అయినా తమను నిరాశపరిచేలా బోనస్ ఎత్తివేయడం సమంజసం కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎండీ, చైర్మన్లతోనూ తాము చర్చించామని ఓ అధికారి పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, బోర్డు సమావేశంలో బోనస్ ఇవ్వాల్సిన అవసరమేంటన్న అభిప్రాయం తలెత్తిందని, ఇతర సంస్థల్లో లేనిది ఎందుకు ఇస్తున్నారన్న చర్చ జరిగిందన్నారు. దీంతో బోనస్ విషయాన్ని పెండింగ్‌లో పెట్టారని వివరించారు. దీనిపై వ్యవసాయ శాఖ కార్యదర్శి దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. అయినా ఈ వ్యవహారం ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నారు. తాము బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని, లాభాల్లో ఉన్నందున ఉద్యోగులకు బోనస్ ఇవ్వాల్సిన అవసరముందని రామకృష్ణారెడ్డి అభిప్రాయపడ్డారు. -
పామాయిల్ రైతులపై దిగుమతి సుంకం దెబ్బ
సాక్షి, హైదరాబాద్: పామాయిల్ మొలక విత్తనాలపై కేంద్రం భారీగా పెంచిన దిగుమతి సుంకం రైతులను ఆర్థికంగా దెబ్బతీయనుంది. ఐదు శాతం నుంచి ఏకంగా 30 శాతానికి పెంచడంతో రైతులపై కోట్ల రూపాయల భారం పడనుంది. ఒకవైపు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు సుంకం పెంచడంపై ఆయిల్‌ఫెడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును 20 లక్షల ఎకరాలకు విస్తరింపజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి దిగుమతి సుంకం పెంపు తీవ్రమైన విఘాతం కలిగిస్తుందని అంటున్నారు. ఇప్పటికే 30% చొప్పున చెల్లింపులు గతంలో లక్ష విత్తనాలకు దిగుమతి సుంకం రూ.3.25 లక్షలు పడితే, ఇప్పుడది రూ.19.50 లక్షలకు పెరగనుంది. 2022– 23 సంవత్సరానికి గాను దాదాపు 55 వేల ఎకరాల సాగుకు అవసరమైన 40 లక్షల విత్తనాలు థాయ్‌లాండ్, మలేసియా, కోస్టారికా దేశాల నుంచి కొనుగోలు చేయాలని ఆయిల్ ఫెడ్ నిర్ణయించింది. ఒక్కో మొలక విత్తనపు గింజ ధర ఆయా దేశాల్లో సగటున రూ.65 ఉంటుంది. గతంలో ఉన్న 5 శాతం కస్టమ్స్ డ్యూటీ ప్రకారం రూ. 3.25 సుంకం, రవాణా ఖర్చులు కలిపితే ఒక్కో విత్తనం రూ.75 వరకు అయ్యేది. ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ 30 శాతానికి పెరగటంతో సుంకం రూ.19.50కి పెరిగింది. రవాణా ఖర్చులు కలిపితే ఒక్కో విత్తనపు గింజ రూ.95 అవుతుండగా.. లక్ష విత్తనాలకు రూ.19.50 లక్షల సుంకం చెల్లించాల్సి వస్తోంది. దిగుమతి, రవాణా ఖర్చులు కలిపి 40 లక్షల పామాయిల్ విత్తనాలకు గాను ఆయిల్ ఫెడ్‌కు రూ. 38 కోట్లు ఖర్చవుతోంది. పాత విధానం ప్రకారమైతే రూ. 30 కోట్లే అయ్యేది. అంటే కొత్తగా రూ.8 కోట్ల భారం పడుతోందన్నమాట. పెరిగిన దిగుమతి సుంకం రైతులే భరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 9 లక్షల మొలక విత్తనాలను కొనుగోలు చేసిన ఆయిల్ ఫెడ్ 30 శాతం చొప్పున దిగుమతి సుంకం చెల్లించింది. కొత్తగా 8.24 లక్షల ఎకరాలు గుర్తింపు రాష్ట్రంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనే ఆయిల్‌పామ్ సాగవుతోంది. కొత్తగా 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలు దీనికి అనుకూలమైన భూమిగా గుర్తించారు. ఆయిల్‌పా మ్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసేందుకు ఫ్యాక్టరీలు అవసరం కాగా, ప్రస్తుతం అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. కొత్తగా నోటిఫై చేసిన 8 లక్షలకు పైగా ఎకరాలకు గాను కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో గుర్తించిన భూములకు సంబంధించిన రైతుల నుంచి ఆయిల్‌పామ్‌ను ఆయా ఫ్యాక్టరీలే కొనుగోలు చేయాలి. వారికి అవసరమైన మొక్కలు అందజేయాలి. మార్కెట్లో ఉన్న ధర రైతుకు ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రం నోటిఫై చేసిన దానికంటే మరింత ఎక్కువగా సాగును ప్రోత్సహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి దిగుమతి సుంకం పెంపు శరాఘాతంలా మారింది. రైతులపై భారం వేస్తే వారు సాగుకు దూరం అవుతారు. కొత్త రైతులు ముందు కు వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. పెంచిన సుంకాన్ని రైతులే భరించాల్సి వస్తుంది దిగుమతి సుంకాన్ని తగ్గించాలని, పాత పద్ధతిలోనే 5 శాతం వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. 30 శాతం దిగుమతి సుంకం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటివరకు ఐదు శాతం సుంకాన్ని ఆయిల్‌ఫెడ్ భరించేది. కానీ పెంచిన దిగుమతి సుంకాన్ని రైతులే భరించాల్సి వస్తుంది. – కంచర్ల రామకృష్ణారెడ్డి, చైర్మన్, ఆయిల్‌ఫెడ్ -
ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం 20 లక్షల ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగువిస్తీర్ణాన్ని భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 45 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతుండగా, రాబోయే మూడేళ్లలో 20 లక్షల ఎకరాలకు పెంచేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆయిల్‌పామ్ రైతులకు ఎకరాకు గరిష్టంగా రూ.36 వేల ఆర్థికసాయాన్ని అందించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయించనున్నాయి. పొరుగుదేశాల నుంచి నూనె దిగుమతులతోపాటు వరిసాగు విస్తీర్ణం, ధాన్యం సేకరణ భారం తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో కేంద్రం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని గుర్తించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కంటే మూడు రెట్లు అధికవిస్తీర్ణంలో పంటసాగు చేపట్టేవిధంగా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడేళ్లు... మూడుదశలు రాబోయే మూడేళ్లలో మూడు దశలుగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచనుంది. 2022–23 సంవత్సరంలో 3 లక్షల ఎకరాలు, 2023–24లో 7 లక్షల ఎకరాలు, 2024–25లో మరో 10 లక్షల ఎకరాల పంటను సాగు చేసే విధంగా కార్యాచరణ రూపొందించింది. ఈ పంట సాగు కోసం 11 కంపెనీలకు 25 జిల్లాలను కేటాయించింది. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచితే ప్రత్యక్షంగా 30 వేలమంది, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆయిల్‌పామ్ రైతులకు ఒక్కో ఎకరాకు రూ.36 వేల చొప్పున సాయాన్ని మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ పంట సాగు కోసం రూ.7,200 కోట్లు ఖర్చు చేయనుంది. ఆయిల్‌పామ్ పంట సాగుకు నీటి వినియోగం తక్కువ. టీఎస్ ఆయిల్‌ఫెడ్ సరికొత్త యాప్ ఆయిల్‌పామ్ రైతులకు సూచనలు, సలహాలతోపాటు నిరంతరం ఫీడ్ బ్యాక్ తెలుసుకునేవిధంగా టీఎస్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ సరికొత్త యాప్, ప్రత్యేక వెబ్‌పేజీని అందుబాటులోకి తీసుకొచి్చంది. వీటిని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ ఎం.సురేందర్ లాంఛనంగా ప్రారంభించారు. నేడు టీ–సాట్ ప్రత్యేక లైవ్ కార్యక్రమం ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో శనివారం మధ్యాహ్నం 12 నుండి 2–గంటల వరకు టీ–సాట్ స్టూడియోలో ప్రత్యేక లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల్లో అవగాహన కలి్పంచేందుకు మంత్రి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. -
ఆయిల్‌ఫెడ్‌లో ‘వ్యాట్’ కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌లో ‘వ్యాట్’ కుంభకోణం ఆలస్యంగా వెలుగుచూసింది. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆయిల్‌ఫెడ్ దాదాపు రూ.3.76 కోట్ల మేర నష్టపోయినట్లు విశ్వసనీయ సమాచారం. అంత పెద్దస్థాయిలో నష్టం జరగడానికి బాధ్యులను గుర్తించినా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు ఒత్తిళ్లకు లోనవుతున్నారన్న చర్చ జరుగుతోంది. పైగా దానికి బాధ్యులైన కొందరు సీనియర్ ఉద్యోగులు పైస్థాయిలో అండదండలు చూసుకుని జరిగిన నష్టానికి బాధ్యత వహించడం లేదని తెలిసింది. వ్యవహారం బయటకు పొక్కకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డికి ఇది తెలియకుండా దాచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇది నిర్లక్ష్యమా? లేక కోట్ల రూపాయల నష్టం చవిచూడడంలో ఎవరికైనా లబ్ధి జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయిల్‌ఫెడ్‌లో ఇతర ఉద్యోగులు కూడా దీనిపై ఉన్నతస్థాయిలో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. అసలేం జరిగిందంటే? 2016 నుంచి 2017 జూన్ మధ్య కాలంలో జరిగిన వ్యవహారం ఇది. అప్పట్లో అప్పారావుపేట ఆయిల్‌ఫాం ప్లాంటును నెలకొల్పారు. అందుకోసం ఆయిల్‌ఫెడ్ పామాయిల్ ప్లాంటుకు, సివిల్ పనులకు, అన్ని రకాల పనుల కోసం రూ. 75.13 కోట్లు ఖర్చు చేసింది. పామాయిల్ ప్లాంటు, ఇతర యంత్రాలు నెలకొల్పే బాధ్యత ప్రీ యూనిక్ అనే సంస్థకు అప్పగించారు. అందులో ఆ ఒక్కదానికే రూ. 45.42 కోట్లు ఖర్చు చేసింది. ఇలా వివిధ కంపెనీలకు వివిధ రకాల పనులను అప్పగించింది. ఆయా కంపెనీలన్నీ కూడా మిషనరీని కొనుగోలు చేసి అప్పారావుపేటలో ఫ్యాక్టరీని, దానికి సంబంధించిన ఇతర పనులను పూర్తిచేశాయి. మెటీరియల్ విలువను ఆధారం చేసుకొని ఆ కంపెనీలు వ్యాట్‌ను ప్రభుత్వానికి చెల్లించాయి. ఆ మొత్తం వ్యాట్ విలువ రూ. 3.63 కోట్లు. మరోవైపు అశ్వారావుపేటలో అప్పటికే ఉనికిలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ ఆధునీకరణ పనుల కోసం ఆయిల్‌ఫెడ్ కొన్ని కంపెనీలకు బాధ్యత అప్పగించింది. ఆ కంపెనీలు రూ. 6 కోట్లకు పైగా విలువైన మెటీరియల్‌ను వాడారు. అందుకోసం దాదాపు రూ. 12.74 లక్షలకు పైగా వ్యాట్ సొమ్ము చెల్లించాయి. రెండూ కలిపి మొత్తంగా రూ. 3.76 కోట్ల వ్యాట్‌ను రెండు ఫ్యాక్టరీలకు కలిపి జరిగిన పనులకు ఆయా కంపెనీలు చెల్లించాయి. ఆ తర్వాతే మొదలైన అసలు కథ... ఆయా కంపెనీలు రూ. 3.76 కోట్లు వ్యాట్ చెల్లించాయి. కంపెనీ ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ, మరో ఫ్యాక్టరీ ఆధునీకరణ అనంతరం అక్కడ పామాయిల్ ఉత్పత్తి జరుగుతోంది. అలా ఉత్పత్తి అయిన పామాయిల్‌ను ఆయిల్‌ఫెడ్ విక్రయిస్తుంది. అలా విక్రయించిన పామాయిల్‌కు కూడా వ్యాట్‌ను చెల్లిస్తుంది. ఇక్కడ జరిగిందేంటంటే ఒకవైపు ఫ్యాక్టరీ, దానికి సంబంధించిన యంత్రాలకు ఆయా కంపెనీలు అప్పటికే వ్యాట్ చెల్లించాయి. మరోసారి ఆయిల్‌ఫెడ్ అవే ఫ్యాక్టరీల ద్వారా తాను ఉత్పత్తి చేసిన పామాయిల్ విక్రయాలపైనా వ్యాట్‌ను చెల్లించింది. కానీ ఇలా చేయాల్సిన అవసరంలేదని ఆయిల్‌ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆయా ఫ్యాక్టరీల మెటీరియల్‌కు వ్యాట్ చెల్లించినందున, వాటి ద్వారా ఉత్పత్తి అయి విక్రయించిన దానికి వ్యాట్ చెల్లించాల్సిన అవసరంలేదని అంటున్నారు. అంటే అక్కడ మినహాయింపు కోరాల్సిన అవసరం ఉంది. ఆయా కంపెనీలు చెల్లించిన రూ. 3.76 కోట్లను మినహాయింపు కోరే అవకాశం ఆయిల్‌ఫెడ్‌కు ఉంది. అంటే ఆయిల్‌ఫెడ్ తాను అమ్మే పామాయిల్‌కు చెల్లించే వ్యాట్ సొమ్ములోనుంచి రూ. 3.76 కోట్లు మినహాయించుకోవాలి. కానీ అలా కొద్ది సొమ్మును మాత్రమే మినహాయించినట్లు తెలిసింది. దీంతో ఆ మేరకు సంస్థ నష్టపోయిందని ఆయిల్‌ఫెడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై వ్యాఖ్యానించేందుకు అధికారులు ముందుకు రావడంలేదు. -
ఆయిల్‌ఫెడ్‌కు రూ. 79 కోట్ల ప్రభుత్వ గ్యారంటీ
పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఎన్సీడీసీ రుణం సాక్షి, హైదరాబాద్: జాతీయ సహకార అభి వృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి తెలంగాణ ఆయిల్‌ఫెడ్ తీసుకునే రూ. 79.47 కోట్ల రుణా నికి గ్యారంటీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు విడుదల చేయనుంది. దీంతో ఆయిల్‌ఫెడ్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఖమ్మం జిల్లా దమ్మపేట మండలం అప్పారావు పేట లో నిర్మాణంలో ఉన్న ఆయిల్‌ఫాం ఫ్యా క్టరీ, అశ్వారావుపేటలో ప్రస్తుతమున్న ఫ్యాక్టరీ విస్త రణ పనులకు ఈ రుణాన్ని ఖర్చు చేస్తారు. -
అవినీతి అధికారులపై కఠిన చర్యలు : మంత్రి పోచారం
అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఆయిల్‌ఫెడ్‌కు చెందిన పామాయిల్ ఫ్యాక్టరీలో అవినీతికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. పామాయిల్ ఫ్యాక్టరీలో బుధవారం రైతులతో నిర్వహించిన సమావేశంలోమంత్రులు పోచారం, తుమ్మల నాగేశ్వరరావు లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ... పామాయిల్ రికవరీ 20 శాతానికి తక్కువ కాకుండా వచ్చేలా చూడాలని అధికారులకు స్పష్టం చేశారు. గతంలో ఫ్యాక్టరీలో అధికారులు చేసిన అవినీతిపై మాట్లాడుతూ... ప్రత్యేక పైపులైన్ ద్వారా పామాయిల్ మళ్లించి రైతులను దోచుకోవడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేస్తే సరిపోదన్నారు. మరెవరూ అలాంటి తప్పు చేయకుండా భయపడే రీతిలో చర్యలు తీసుకోవాలని ఆయిల్‌ఫెడ్ జాయింట్ డెరైక్టర్ అచ్యుతరావుకు మంత్రి పోచారం సూచించారు. పామాయిల్ రైతులకు మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చెప్పారు.