సాక్షి, హైదరాబాద్: పామాయిల్ మొలక విత్తనాలపై కేంద్రం భారీగా పెంచిన దిగుమతి సుంకం రైతులను ఆర్థికంగా దెబ్బతీయనుంది. ఐదు శాతం నుంచి ఏకంగా 30 శాతానికి పెంచడంతో రైతులపై కోట్ల రూపాయల భారం పడనుంది. ఒకవైపు ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు సుంకం పెంచడంపై ఆయిల్‌ఫెడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును 20 లక్షల ఎకరాలకు విస్తరింపజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి దిగుమతి సుంకం పెంపు తీవ్రమైన విఘాతం కలిగిస్తుందని అంటున్నారు.
ఇప్పటికే 30% చొప్పున చెల్లింపులు
గతంలో లక్ష విత్తనాలకు దిగుమతి సుంకం రూ.3.25 లక్షలు పడితే, ఇప్పుడది రూ.19.50 లక్షలకు పెరగనుంది. 2022– 23 సంవత్సరానికి గాను దాదాపు 55 వేల ఎకరాల సాగుకు అవసరమైన 40 లక్షల విత్తనాలు థాయ్‌లాండ్, మలేసియా, కోస్టారికా దేశాల నుంచి కొనుగోలు చేయాలని ఆయిల్ ఫెడ్ నిర్ణయించింది. ఒక్కో మొలక విత్తనపు గింజ ధర ఆయా దేశాల్లో సగటున రూ.65 ఉంటుంది. గతంలో ఉన్న 5 శాతం కస్టమ్స్ డ్యూటీ ప్రకారం రూ. 3.25 సుంకం, రవాణా ఖర్చులు కలిపితే ఒక్కో విత్తనం రూ.75 వరకు అయ్యేది. ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ 30 శాతానికి పెరగటంతో సుంకం రూ.19.50కి పెరిగింది. రవాణా ఖర్చులు కలిపితే ఒక్కో విత్తనపు గింజ రూ.95 అవుతుండగా.. లక్ష విత్తనాలకు రూ.19.50 లక్షల సుంకం చెల్లించాల్సి వస్తోంది. దిగుమతి, రవాణా ఖర్చులు కలిపి 40 లక్షల పామాయిల్ విత్తనాలకు గాను ఆయిల్ ఫెడ్‌కు రూ. 38 కోట్లు ఖర్చవుతోంది. పాత విధానం ప్రకారమైతే రూ. 30 కోట్లే అయ్యేది. అంటే కొత్తగా రూ.8 కోట్ల భారం పడుతోందన్నమాట. పెరిగిన దిగుమతి సుంకం రైతులే భరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దాదాపు 9 లక్షల మొలక విత్తనాలను కొనుగోలు చేసిన ఆయిల్ ఫెడ్ 30 శాతం చొప్పున దిగుమతి సుంకం చెల్లించింది.
కొత్తగా 8.24 లక్షల ఎకరాలు గుర్తింపు
రాష్ట్రంలో ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లోనే ఆయిల్‌పామ్ సాగవుతోంది. కొత్తగా 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలు దీనికి అనుకూలమైన భూమిగా గుర్తించారు. ఆయిల్‌పా మ్ నుంచి క్రూడ్ ఆయిల్ తీసేందుకు ఫ్యాక్టరీలు అవసరం కాగా, ప్రస్తుతం అశ్వారావుపేట, అప్పారావుపేటలో ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి. కొత్తగా నోటిఫై చేసిన 8 లక్షలకు పైగా ఎకరాలకు గాను కొత్తగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో గుర్తించిన భూములకు సంబంధించిన రైతుల నుంచి ఆయిల్‌పామ్‌ను ఆయా ఫ్యాక్టరీలే కొనుగోలు చేయాలి. వారికి అవసరమైన మొక్కలు అందజేయాలి. మార్కెట్లో ఉన్న ధర రైతుకు ఇవ్వాలి. ఈ పరిస్థితుల్లో కేంద్రం నోటిఫై చేసిన దానికంటే మరింత ఎక్కువగా సాగును ప్రోత్సహించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి దిగుమతి సుంకం పెంపు శరాఘాతంలా మారింది. రైతులపై భారం వేస్తే వారు సాగుకు దూరం అవుతారు. కొత్త రైతులు ముందు కు వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు.
పెంచిన సుంకాన్ని రైతులే భరించాల్సి వస్తుంది
దిగుమతి సుంకాన్ని తగ్గించాలని, పాత పద్ధతిలోనే 5 శాతం వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించాం. 30 శాతం దిగుమతి సుంకం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇప్పటివరకు ఐదు శాతం సుంకాన్ని ఆయిల్‌ఫెడ్ భరించేది. కానీ పెంచిన దిగుమతి సుంకాన్ని రైతులే భరించాల్సి వస్తుంది.
– కంచర్ల రామకృష్ణారెడ్డి, చైర్మన్, ఆయిల్‌ఫెడ్
Comments
Please login to add a commentAdd a comment