సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగువిస్తీర్ణాన్ని భారీగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 45 వేల ఎకరాల్లో ఈ పంట సాగవుతుండగా, రాబోయే మూడేళ్లలో 20 లక్షల ఎకరాలకు పెంచేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆయిల్‌పామ్ రైతులకు ఎకరాకు గరిష్టంగా రూ.36 వేల ఆర్థికసాయాన్ని అందించనుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు కేటాయించనున్నాయి.
పొరుగుదేశాల నుంచి నూనె దిగుమతులతోపాటు వరిసాగు విస్తీర్ణం, ధాన్యం సేకరణ భారం తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో కేంద్రం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 25 జిల్లాల్లో 8.24 లక్షల ఎకరాలు ఆయిల్‌పామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయని గుర్తించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కంటే మూడు రెట్లు అధికవిస్తీర్ణంలో పంటసాగు చేపట్టేవిధంగా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఆయిల్‌ఫెడ్ రూపొందించిన కార్యాచరణ ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మూడేళ్లు... మూడుదశలు
రాబోయే మూడేళ్లలో మూడు దశలుగా ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచనుంది. 2022–23 సంవత్సరంలో 3 లక్షల ఎకరాలు, 2023–24లో 7 లక్షల ఎకరాలు, 2024–25లో మరో 10 లక్షల ఎకరాల పంటను సాగు చేసే విధంగా కార్యాచరణ రూపొందించింది. ఈ పంట సాగు కోసం 11 కంపెనీలకు 25 జిల్లాలను కేటాయించింది. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెంచితే ప్రత్యక్షంగా 30 వేలమంది, పరోక్షంగా 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆయిల్‌పామ్ రైతులకు ఒక్కో ఎకరాకు రూ.36 వేల చొప్పున సాయాన్ని మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ పంట సాగు కోసం రూ.7,200 కోట్లు ఖర్చు చేయనుంది. ఆయిల్‌పామ్ పంట సాగుకు నీటి వినియోగం తక్కువ.
టీఎస్ ఆయిల్‌ఫెడ్ సరికొత్త యాప్
ఆయిల్‌పామ్ రైతులకు సూచనలు, సలహాలతోపాటు నిరంతరం ఫీడ్ బ్యాక్ తెలుసుకునేవిధంగా టీఎస్ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ సరికొత్త యాప్, ప్రత్యేక వెబ్‌పేజీని అందుబాటులోకి తీసుకొచి్చంది. వీటిని ఆయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ ఎం.సురేందర్ లాంఛనంగా ప్రారంభించారు.
నేడు టీ–సాట్
ప్రత్యేక లైవ్ కార్యక్రమం
ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణంపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో శనివారం మధ్యాహ్నం 12 నుండి 2–గంటల వరకు టీ–సాట్ స్టూడియోలో ప్రత్యేక లైవ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతుల్లో అవగాహన కలి్పంచేందుకు మంత్రి ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment