సాగు, ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్
దేశవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 3.70 లక్షల హెక్టార్లు.. ఇందులో ఏపీలోనే 1.84 లక్షల హెక్టార్లు
రాష్ట్రంలో పామాయిల్ ఉత్పత్తి 2.95 లక్షల టన్నులు.. నూనెగింజల ఉత్పత్తి చేసే రాష్ట్రాలపై నీతి ఆయోగ్ నివేదిక
సాక్షి, అమరావతి: ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. దేశంలో ఆయిల్ పామ్ సాగు వృద్ధికి ఏపీ దిక్సూచిగా నిలిచిందని నూనె గింజల ఉత్పత్తి రాష్ట్రాలపై నీతి ఆయోగ్ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, హరియాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర.. ఈతొమ్మిది రాష్ట్రాలే దేశం మొత్తం నూనె గింజల విస్తీర్ణం, ఉత్పత్తిలో 90 శాతం పైగా దోహదం చేస్తున్నాయని నివేదిక తెలిపింది.
ఈ రాష్ట్రాల్లో నూనె గింజల సాగు, ఉత్పత్తిపై మరింత దృష్టి సారించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించాల్సిందిగా నీతి ఆయోగ్ నివేదిక సూచించింది. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆధిపత్యం చెలాయిస్తున్నాయని తెలిపింది. దేశంలో మొత్తం ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం 3,70,028 హెక్టార్లలో ఉండగా ఇందులో ఏపీలోనే అత్యధికంగా 1,84,640 హెక్టార్లలో ఉందని వివరించింది.
ముడి పామాయిల్ ఉత్పత్తిలో కూడా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని నివేదిక తెలిపింది. దేశంలో ముడి పామాయిల్ ఉత్పత్తి 3,60,729 టన్నులుండగా అందులో ఏపీలోనే అత్యధికంగా ముడి పామాయిల్ ఉత్పత్తి 2,95,075 టన్నులు ఉందని, ఆ తరువాత స్థానాల్లో తెలంగాణ, కర్ణాటక, మిజోరంలు ఉన్నాయని చెప్పింది.
ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకోవాలి
మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ నివేదిక సూచించింది. దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతులను తగ్గించేందుకు ఎడిబుల్ ఆయిల్ మిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని తెలిపింది.
నూనె గింజలు సాగు, ఉత్పత్తి మరింత విస్తరింప చేసేలా వ్యూహాలను, రోడ్ మ్యాప్‌లను అమలు చేయాలని నివేదిక సూచించింది. ఈ రంగంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యంగా ముందుకు సాగాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment