ప్రతిభకు పదునుపెట్టే ఫాస్ట్‌ట్రాక్ ఎంబీఏ
దేశంలో వేగంగా మారుతున్న వ్యాపార, వాణిజ్య పరిస్థితుల నేపథ్యంలో పోటీ తీవ్రమవుతోంది, వ్యాపారంలో పురోగతికి, సమర్థమైన వ్యాపార నిర్వహణ కోసం ప్రతిభకు మరింత సానపెట్టాలి. సాధారణ ఉద్యోగంలో స్థిరపడినవారికి మంచి వ్యాపారంలోకి ప్రవేశించి మరో 10 మందికి ఉపాధి చూపాలనే ఆశయం ఉంటే.. మొదట బిజినెస్ స్కిల్స్ నేర్చుకోవాలి. కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటే.. అకడమిక్ అర్హతలను పెంచుకొని ఉన్నత ఉద్యోగంలో చేరొచ్చు. ఇలాంటి కలలను నిజం చేసేందుకే దేశంలోని బిజినెస్ స్కూల్స్ నడుం కట్టాయి. ముఖ్యంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ఏడాది కాల వ్యవధి గల ఫాస్ట్‌ట్రాక్ ఎంబీఏ కోర్సులను ప్రవేశపెట్టాయి. ఉద్యోగులు, వ్యాపారులు ఈ కోర్సుల్లో అధిక సంఖ్యలో చేరుతున్నారు. తమ నైపుణ్యాలను, వ్యాపార మెళకువలను, అర్హతలను మెరుగుపర్చుకుంటున్నారు!
సాంకేతిక పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలు
ఫాస్ట్‌ట్రాక్ ఫుల్‌టైమ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఆదరణను ఎంతగానో చూరగొంటున్నాయి. వీటి ద్వారా పని అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చు. ఏడాదిపాటు సాగే కోర్సు పూర్తయిన తర్వాత తిరిగి తమ రంగాల్లో ప్రవేశించవచ్చు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఆసక్తి ఉంటే కొత్త రంగాల్లోకి అడుగుపెట్టడానికీ ఈ ఫాస్ట్‌ట్రాక్ కోర్సులు ఉపకరిస్తున్నాయి.
పని అనుభవం తప్పనిసరి..
ఏడాది వ్యవధిగల పోస్టు గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లో చేరాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. కనీసం మూడేళ్ల పని అనుభవం తప్పనిసరి. బిజినెస్ స్కూల్‌ను బట్టి ఇది మారుతుంది. చాలా బీ స్కూల్స్ జీమ్యాట్ స్కోర్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటాయి. రెండేళ్ల ఏంబీఏ కోర్సుల ఫీజులతో పోలిస్తే ఈ కోర్సుల ఫీజు కాస్త ఎక్కువే. ఐఐఎం-బెంగళూరులో రెండేళ్ల ఎంబీఏ ఫీజు రూ.17 లక్షలు కాగా ఏడాది ఎంబీఏ ఫీజు రూ.23 లక్షల వరకు ఉంది. కోర్సు తర్వాత వచ్చే వేతనాన్ని బట్టి చూస్తే ఇది ఎక్కువ మొత్తం కాదని బిజినెస్ స్కూళ్ల ప్రతినిధులు చెబుతున్నారు.
అనుభవజ్ఞులకే కంపెనీల ప్రాధాన్యం
ఎలాంటి అనుభవం లేకుండా కొత్తగా వచ్చే ఎంబీఏ గ్రాడ్యుయేట్ల కంటే కొంత పని అనుభవంతో వచ్చే ఏడాది ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. వారిని కొలువులో చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అనుభవజ్ఞులు కార్పొరేట్ వాతావరణానికి ముందుగానే అలవాటు పడి ఉండడం మరో కారణం. ఏడాది ఎంబీఏ ప్రోగ్రామ్స్ చేసిన వారికి ఎక్కువగా మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్, ఆపరేషన్, రిటైల్, మానవ వనరుల నిపుణులు.. వంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఏడాది ఎంబీఏ గ్రాడ్యుయేట్లకు ఐటీ, ఐటీఈఎస్, కన్సల్టింగ్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి.
అవకాశాలను అందుకోవాలంటే..
2001లో దేశవ్యాప్తంగా ఐఎస్‌బీ-హైదరాబాద్ మాత్రమే ఏడాది వ్యవధి గల ఎంబీఏ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. దీనికి ఆదరణ పెరగడంతో తర్వాత ఐఐఎంలు, ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్స్ ఈ కోర్సులను అందుబాటులోకి తెచ్చాయి. వీటికి ఆదరణ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. మన దేశంలో వ్యాపార రంగంలో వాతావరణం క్షణక్షణానికి మారిపోతోంది. కొత్తకొత్త అవకాశాలు తలుపు తడుతున్నాయి. వాటిని అందుకోవాలంటే తగిన అర్హతలు, అనుభవం అవసరం. ఇప్పటికే ఉద్యోగమో, వ్యాపారమో చేస్తున్నవారికి మళ్లీ రెండేళ్ల మేనేజ్‌మెంట్ కోర్సులను చదివే తీరిక ఉండడం లేదు. అందుకే ఏడాదిలోనే పూర్తయ్యే ఫాస్ట్‌ట్రాక్ ఎంబీఏ కోర్సులవైపు చూస్తున్నారని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమతమ రంగాల్లో ప్రగతిని ఆశిస్తున్నవారు ఏడాది ఎంబీఏ కోర్సుల్లో చేరి అర్హతలను పెంచుకుంటున్నారని పేర్కొంటున్నారు.
ఫాస్ట్‌ట్రాక్ కోర్సుతో పరిపూర్ణ నాయకత్వ లక్షణాలు
‘‘ఉద్యోగస్థులు లేదా ఎంటర్‌ప్రెన్యూర్స్ అవసరాలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ప్రపంచ శ్రేణి మేనేజ్‌మెంట్ విద్యను అందించే లక్ష్యంగా బిజినెస్ స్కూల్స్... పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ తదితర స్వల్ప కాలవ్యవధి గల మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులతో అభ్యర్థులు తమ అర్హతలు, నైపుణ్యాలను పెంపొందించుకుని త్వరగా పని వాతావరణ ంలోకి తిరిగి వెళ్లేందుకు వీలవుతుంది. ఈ ఫాస్ట్‌ట్రాక్ కోర్సు పూర్తి చేసేనాటికి థియరీ, ప్రాక్టికల్ దృక్పథాలు పూర్తి స్థాయిలో లభించి పరిపూర్ణమైన నాయకత్వ లక్షణాలు సొంతమవుతాయి. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు. తక్కువ కాలంలోనే కోర్సు పూర్తి చేయడం కఠినమైనప్పటికీ.. దాన్ని సవాలుగా బీస్కూల్స్ నిర్వహిస్తున్నాయి. తరగతి గది బయట కూడా నేర్చుకోవడాన్ని ఈ కోర్సులు ప్రోత్సహిస్తాయి. క్యాంపస్‌లో ఫ్యాకల్టీ పాఠాలకు తోడు గెస్ట్ లెక్చర్స్ కూడా ఉంటాయి.
దాంతో ప్రముఖ పారిశ్రామిక వేత్తల అనుభవాలు, సూచనలు, సలహాలు కూడా విద్యార్థులకు లభిస్తాయి. అంతేకాకుండా ఈ కోర్సుల ద్వారా పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులను త్వరగా విశ్లేషించుకుని, వాటిని సమర్థంగా నిర్వహించడానికి కావాల్సిన నైపుణ్యాలను పెంచుకోవచ్చు. ఏడాది కోర్సులో ముఖ్యంగా పరిశ్రమ నైపుణ్యాలను, మేనేజ్‌మెంట్ సూత్రాలను అన్వయిస్తూ బోధన వైవిధ్యంగా ఉంటుంది. విద్యార్థుల్లో లీడర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ప్లానింగ్ ఎంటర్‌ప్రెన్యూరియల్ వెంచర్, ఎక్స్‌పెరిమెంటల్ లెర్నింగ్, ఇండిపెండెంట్ స్టడీ ప్రోగ్రామ్, కార్పొరేట్ ఇంటరాక్షన్, ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ వంటి ఎన్నో కార్యకలాపాలను బీ స్కూల్స్ నిర్వహిస్తున్నాయి. ఉద్యోగస్థులు ఈ కోర్సులను అభ్యసించడానికి కంపెనీలు సైతం ప్రోత్సహిస్తున్నాయి. తద్వారా వారిలో నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందగలవని సంస్థల ఉద్దేశం. కాబట్టి ఈ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది’’
- అజిత్ రంగ్నేకర్, డీన్, ఐఎస్‌బీ-హైదరాబాద్
ఏడాది ఎంబీఏ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు- ఫీజులు (సుమారుగా)
బిజినెస్ స్కూల్ కోర్సు ఫీజు(రూపాయల్లో)
ఐఐఎం-అహ్మదాబాద్ పీజీపీఎక్స్ 21.5 లక్షలు
ఐఐఎం-బెంగళూరు ఈపీజీపీ 23.82 లక్షలు
ఐఐఎం-కలకత్తా పీజీపీఈఎక్స్ 18 లక్షలు
ఐఐఎం-లక్నో ఐపీఎంఎక్స్ 19.11 లక్షలు
ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ పీజీడీఎం 15 లక్షలు
గ్రేట్ లేక్స్ పీజీపీఎం 16.50 లక్షలు
ఐఎస్‌బీ-హైదరాబాద్ పీజీపీఎం 40 వేలు (యూఎస్ డాలర్లు)