భారత్‌లో వ్యాపార పవనాలు
బిజినెస్ అనుకూల దేశాల జాబితాలో 12 స్థానాలు జంప్, 130వ ర్యాంకు
* మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణలో 8వ స్థానం
* ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడి
వాషింగ్టన్: కొత్త కంపెనీల చట్టం, విద్యుత్ సరఫరా మెరుగుపడటం తదితర అంశాల ఊతంతో వ్యాపారాల నిర్వహణకు అనుకూల దేశాల జాబితాలో భారత్ 130వ స్థానానికి ఎగబాకింది. గతేడాది భారత ర్యాంకింగ్ 142. భారత్ వంటి భారీ దేశం ఒక్కసారిగా 12 స్థానాలు దూసుకెళ్లడం చెప్పుకోతగ్గ విజయమేనని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్టు కౌశిక్ బసు వ్యాఖ్యానించారు.
భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలకు ఇది సానుకూల సంకేతమన్నారు. ‘డూయింగ్ బిజినెస్ 2016’ పేరిట ప్రపంచ బ్యాంకు 189 దేశాలతో రూపొందించిన జాబితాలో పది అంశాల ప్రాతిపదికన భారత్‌కు తాజాగా 130వ ర్యాంకు దక్కింది. ఈ లిస్టులో సింగపూర్ అగ్రస్థానంలో నిలవగా, న్యూజిల్యాండ్, డెన్మార్క్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చైనా (84), పాకిస్తాన్ (138) ర్యాంకుల్లో ఉన్నాయి. కనీస పెట్టుబడి పరిమితి నిబంధనలను తొలగించడం ద్వారా వ్యాపారాలను ప్రారంభించడాన్ని భారత్ మరింత సులభతరం చేయడం సానుకూలాంశమని ప్రపంచ బ్యాంకు నివేదికలో పేర్కొంది.
విద్యుత్ కనెక్షను అనుమతులు (70వ స్థానం), నిర్మాణ అనుమతులు (183వ స్థానం), ప్రాపర్టీ నమోదు (138వ ర్యాంకు) తదితర అంశాలు భారత ర్యాంకింగ్‌కు ప్రాతిపదికగా నిల్చాయి. ఇక వ్యాపారాల ప్రారంభానికి పట్టే సమయం విషయంలో భారత్ 164వ స్థానం నుంచి 155వ ర్యాంకుకు చేరడం చెప్పుకోతగ్గ మరో పరిణామం. భారత్‌లో వ్యాపారం ప్రారంభించాలంటే 12 పైగా ప్రక్రియలు పాటించాల్సి వస్తోంది. ఇందుకు 29 రోజులు పడుతోంది. నిర్మాణ అనుమతులు విషయంలో భారత ర్యాంకింగ్ స్వల్పంగా 184వ స్థానం నుంచి 183వ స్థానానికి పెరిగింది. విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలో మాత్రం 99వ ర్యాంకు నుంచి 70వ స్థానానికి ఎగబాకింది. అయితే, రుణ సదుపాయం లభ్యత, పన్నుల చెల్లింపుల విషయంలో మాత్రం దేశ ర్యాంకింగ్ తగ్గింది.
మరోవైపు, మైనారిటీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు పరిరక్షించడంలో భారత్ అంతర్జాతీయంగా 8వ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో అమెరికా (35), జర్మనీ (49), జపాన్ (36) వంటి పలు సంపన్న దేశాల కన్నా కూడా ముందు నిల్చింది. బ్రిక్స్ కూటమిలో (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) భారత్ మెరుగ్గా ఉందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.
జీఎస్‌టీ అమలు కీలకం..
భారత ర్యాంకింగ్ పెరగడానికి విద్యుత్ లభ్యత, కొత్త కంపెనీల చట్టం తదితర అంశాలు దోహదపడ్డాయని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా ప్రపంచ బ్యాంకు భారత విభాగం డెరైక్టరు ఒనో రుహల్ చెప్పారు. భారత్‌ను ఒకే పెద్ద మార్కెట్‌గా మార్చడంలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) విధాన సంస్కరణ అమలు కీలకమని తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తెస్తే.. 2018 నాటికి ఆ ప్రభావాలు కనిపించడం మొదలు కాగలదని ఒనో రుహల్ పేర్కొన్నారు. అయితే, వ్యాపారాల విషయంలో భారత్ స్కోరు మెరుగుపడటానికి ఇదొక్కటే సరిపోదని, మరిన్ని సంస్కరణలు అవసరమవుతాయని వివరించారు.
టాప్ 100లో చేరే సత్తా ఉంది..
నిర్దేశించుకున్న ఆర్థిక సంస్కరణలను భారత్ అమల్లోకి తెస్తే వచ్చే ఏడాది టాప్ 100 దేశాల జాబితాలో చేరడం కష్టమేమీ కాదని కౌశిక్ బసు చెప్పారు. ఇందుకోసం జీఎస్‌టీని అమలు చేయడం, బ్యూరోక్రసీపరమైన అడ్డంకులు తొలగించడం కీలకమన్నారు. సాధారణంగా ఇతర దేశాలు సంస్కరణలు చేపట్టిన తొలి ఏడాది స్వల్పంగా, ఆ తర్వాత రెండు.. మూడు సంవత్సరాల్లో గణనీయంగా ర్యాంకులు మెరుగుపర్చుకుంటాయని బసు చెప్పారు. కానీ, భారత్ తొలి ఏడాదిలోనే చెప్పుకోతగ్గ స్థాయిలో ర్యాంకు మెరుగుపర్చుకుందన్నారు.
ర్యాంకు మరింత పెంచుకుంటాం: జైట్లీ
ప్రపంచ బ్యాంకు భారత్‌కు ఇచ్చిన తాజా ర్యాంకింగ్.. ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల ప్రభావం పూర్తిగా ప్రతిబింబించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. వ్యాపారాల నిర్వహణకు అనువైన దేశాల జాబితాలో భారత్ స్థానం వచ్చే ఏడాది మరింతగా మెరుగుపడగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జూన్ 1 దాకా గణాంకాల ఆధారంగానే ప్రస్తుత ర్యాంకింగ్ ఉందని, ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న పలు చర్యల ప్రభావం వచ్చే ఏడాది కనిపించగలదని జైట్లీ చెప్పారు. ఆదాయ పన్ను చట్టాన్ని సరళతరం చేయడానికి ప్రయత్నిస్తున్నామని, అలాగే కంపెనీల చట్టంలోని సంక్లిష్టతలను తొలగించేందుకు కమిటీ కసరత్తు చేస్తోందని తెలిపారు.