ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు
సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది. గత నెలలో వాషింగ్టన్‌లో ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తదుపరి చర్చల కోసం ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టీన్ రైజర్ నేతృత్వంలో వరల్డ్ బ్యాంక్ కంట్రీ ఆపరేషన్ హెడ్ పాల్ ప్రోసీ, అర్బన్ ఇన్‌ఫ్రా, ప్రాజెక్ట్ లీడ్ నటాలియా కె, డిజిటల్ డెవలప్‌మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ మహిమాపత్ రే శనివారం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో వారు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్య, సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని, ఆయా రంగాల్లో తాము తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి వివరించారు. తాము ప్రాధాన్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంతో పాటు అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ప్రాజెక్టులు నిలిచేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యా, వైద్య రంగాల్లో రేవంత్‌రెడ్డి దార్శనికత బాగుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మార్టీన్ రైజర్ ప్రశంసించారు.
ప్రపంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయని మార్టిన్ రైజర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని ఆయన తెలిపారు. సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.
‘ఏటీసీల్లో సిబ్బంది కొరతను అధిగమించాలి’
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో సిబ్బంది కొరతను అధిగమించాలని సీఎం ఎ.రేవంత్ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాల యంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకనుగుణంగా సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని, మార్కెట్ అవసరాలకనుగుణంగా ఏటీసీల్లో సిలబస్ ఉండాలని, ఈ మేరకు సిలబస్ మార్పునకు ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్యం అందించే ఏటీసీలను, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సీ.ఎస్ శాంతికుమారి, కారి్మక శాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment