రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై ప్రపంచ బ్యాంకు ఆసక్తి
ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం రేవంత్ బృందం భేటీ
వివిధ ప్రాజెక్టులపై సంయుక్తంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయం
అమెరికా పర్యటనలో పలు సంస్థల ప్రతినిధులతోనూ సీఎం సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామ్యం పంచుకునేందుకు తాము సంసిద్ధమని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఈ మేరకు పలు అంశాలపై ఆసక్తి చూపింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై గంట పాటు చర్చించారు. తెలంగాణలో స్కిల్ డెవలప్‌మెంట్, రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, నెట్ జీరో సిటీ, ఆరోగ్య సంరక్షణ, డయాగ్నస్టిక్స్, హెల్త్ ప్రొఫైల్ రంగాల్లో ప్రపంచ బ్యాంకుతో భాగస్వామ్యానికి సంబంధించి ఈ భేటీలో సంప్రదింపులు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులపై సంయుక్తంగా రోడ్ మ్యాప్ రూపొందించాలని నిర్ణయించారు. ప్రజల జీవన ప్రమాణాలు, పర్యావరణం, జీవనోపాధి, నైపుణ్యాల వృద్ధి, ఉద్యోగాలు, ఆర్థిక సుస్థిరత తదితర అంశాలపైనా వారు చర్చించారు.
యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తాం: రేవంత్
తమ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఉందని.. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వాటిని యుద్ధ ప్రాతిపదికన అమలు చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పాటిస్తామని చెప్పారు. ప్రాంతాల వారీగా చేపట్టే ప్రాజెక్టుల సాధ్యాసాధ్యాలపై నిపుణుల బృందం ఏర్పాటు ఆలోచనను ప్రపంచ బ్యాంకు బృందంతో సీఎం పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి రేవంత్ అనుసరిస్తున్న సమతుల దృక్పథం సానుకూల ఫలితాలు ఇస్తుందని ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరమేశ్వరన్ అయ్యర్ ప్రశంసించారు. గతంలో భారత్‌లో తమ భాగస్వామ్యంతో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలు అందించాయని గుర్తు చేశారు.
అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో ఇదే తొలిసారి!
ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కలసి పనిచేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, స్కిల్ యూనివర్సిటీ, సిటిజన్ హెల్త్‌కేర్, హైదరాబాద్ 4.0 ఫ్యూచర్ సిటీ తదితరాలపై సీఎం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించారని.. ఈ ప్రాజెక్టులకు, భవిష్యత్తు వ్యూహాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు మరింత ఊతమిస్తుందని అంటున్నాయి. ఈ భేటీలో మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కొత్త ఆవిష్కరణల కోసం కార్నింగ్‌తో ఒప్పందం
తెలంగాణలో నైపుణ్యాభివృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు లక్ష్యంగా దిగ్గజ సంస్థ కార్నింగ్ ఇన్ కార్పొరేషన్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు అడ్వాన్స్‌డ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, కెమికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో కార్నింగ్ సంస్థ సహకారం అందిస్తుంది. ఫార్మాస్యూటికల్, కెమికల్ రంగాల్లో అత్యాధునిక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి తోడ్పడుతుంది. ఫార్మా, కెమికల్ పరిశ్రమలలో ఆవిష్కరణతోపాటు ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీలోనూ సహకారం అందించనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం స్థాపనపైనా చర్చ జరిగింది. 2025లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ సమక్షంలో అవగాహన ఒప్పందంపై కార్నింగ్ ప్రతినిధులు సంతకాలు చేశారు.
జీనోమ్ వ్యాలీలో రూ.400 కోట్లతో ‘వివింట్’ విస్తరణ
వివింట్ ఫార్మా కంపెనీ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రూ.400 కోట్ల పెట్టుబడితో నేరుగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఉన్న వివింట్ సంస్థ తాజాగా సీఎం రేవంత్‌తో చర్చల అనంతరం విస్తరణ ప్రణాళికను వెల్లడించింది. అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలకు సంబంధించి నాణ్యమైన ఇంజెక్టబుల్స్, ఔషధాలను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment