65 ఐటీఐల్లో స్కిల్‌ సెంటర్లు | Skill centers in 65 ITIs | Sakshi
Sakshi News home page

65 ఐటీఐల్లో స్కిల్‌ సెంటర్లు

Published Sun, Mar 10 2024 1:22 AM | Last Updated on Sun, Mar 10 2024 7:26 PM

Skill centers in 65 ITIs - Sakshi

టాటా గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

రూ.2,700 కోట్లతో 2024–25 నుంచి కొత్త ప్రాజెక్టు అమలు

9 లాంగ్‌ టర్మ్, 23 షార్ట్‌ టర్మ్‌ కోర్సులతో 

నైపుణ్య అంతరాన్ని తగ్గించేలా బ్రిడ్జి కోర్సులు

అధునాతన నైపుణ్య కేంద్రాలుగా ఐటీఐలను తీర్చిదిద్దే దిశగా..

టాటా టెక్నాలజీస్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్‌ భేటీ.. 

హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్‌ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో స్కిల్లింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్‌ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో అధికారులు ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉపాధి శిక్షణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రాణి కుముదిని, టాటా టెక్నాలజీస్‌ ప్రెసిడెంట్‌ పవన్‌ భగేరియాతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విస్తరిస్తున్న పరిశ్రమల అవసరాలకు, ఇప్పుడున్న కోర్సులకు మధ్య భారీ అంతరముందని సీఎం రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంతరాన్ని తగ్గించి యువతకు ఉపాధి అవకాశాలను అందించే కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు.

రూ.2,700 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు
రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల ఖర్చుతో ఐటీఐలలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అవసరమైన వర్కషాప్‌ల నిర్మాణం, యంత్రపరికరాల సామగ్రితో పాటు శిక్షణను అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా టెక్నాలజీస్‌ చేపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా ఐటీఐలలో కొత్తగా 9 లాంగ్‌ టర్మ్, 23 షార్ట్‌ టర్మ్‌ కోర్సులు ప్రవేశపెడతారు. అన్ని రంగాల్లో యువత ఉపాధి అవకాశాలందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను ఎంపిక చేశారు. ప్రతి ఏడాదీ వీటితో 9000 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. దాదాపు లక్ష మందికి షార్ట్‌ టర్మ్‌ కోర్సుల ద్వారా శిక్షణను అందిస్తారు.

ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్‌ నుంచి మొదలయ్యే అకడమిక్‌ సెషన్‌కు వర్క్‌ షాప్‌లను అందుబాటులో ఉంచాలని, సరిపడేంత మంది ట్యూటర్లను నియమించాలని ముఖ్యమంత్రి టాటా టెక్నాలజీ ప్రతినిధులకు సూచించారు. కేవలం శిక్షణనివ్వటమే కాకుండా యువతకు ఉపాధి కల్పించేందుకు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక ప్లేస్‌మెంట్‌సెల్‌ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్‌ సూచించారు. 

త్వరలో స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు
హైదరాబాద్‌ను స్కిల్‌ డెవెలప్‌మెంట్‌హబ్‌గా తయారు చేసేందుకు  తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించేందుకు త్వరలోనే రాష్ట్రంలో స్కిల్‌ యూనివర్సిటీ నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement