
న్యూఢిల్లీ: దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి 5,000కుపైగా ‘స్కిల్ హబ్స్’ ప్రారంభించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాలానుగుణంగా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడమే యువతకు తారకమంత్రం కావాలని ఉద్బోధించారు. ఆయన శనివారం ఐటీఐ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఉద్యోగ అవకాశాలూ పెరుగుతున్నాయి. కనుక యువత తమ నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలి.
వారి రంగాల్లో మార్పులను గమనిస్తూండాలి’’ అన్నారు. ‘‘మా హయాంలో గత ఎనిమిదేళ్లలో దేశంలో కొత్తగా దాదాపు 5,000 ఐటీఐలను ప్రారంభించాం. 4 లక్షల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. నూతన విద్యా విధానం కింద అనుభవం ఆధారిత విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్నాం. పునరుత్పాదక ఇంధన వనరులు, సోలార్ విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాలు తదితర రంగాల్లో భారత్ ముందంజ వేస్తోంది. సంబంధిత కోర్సులను ఐటీఐల్లో ప్రవేశపెడుతున్నాం’’ అని వివరించారు.
రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని మోదీ ఆవిష్కరించారు. ‘‘13–14 శాతమున్న రవాణా లాజిస్టిక్స్ వ్యయాన్ని 7.5 శాతం కంటే దిగువకు తేవడంతో పాటు సమయం, డబ్బు మరింతగా ఆదా అయ్యేలా చూడటమే దీని లక్ష్యం. పీఎం గతిశక్తి పథకంతో కలిసి రవాణా రంగాన్ని ఈ పాలసీ పరుగులు పెట్టిస్తుంది’’ అన్నారు. ‘‘రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం. ఫాస్టాగ్, ఇ–వే బిల్లింగ్ వంటి చర్యలు చేపట్టాం. ‘‘సాగరమాల ప్రాజెక్టుతో నౌకాశ్రయాల సామర్థ్యాన్ని ఎంతగానో పెంపొందించాం’’ అని గుర్తు చేశారు.