iti
-
ఏటీసీల్లో కొలువుల భర్తీకి కసరత్తు
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో వాటిలో ఉద్యోగ ఖాళీల భర్తీపై కార్మిక ఉపాధి కల్పన విభాగం దృష్టి సారించింది. దాదాపు పదేళ్లుగా ఐటీఐల్లో ఉద్యోగ నియామకాలు జరగకపోవడంతో దాదాపు 40 శాతం కొలువులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి గతవారం కార్మిక, ఉపాధి కల్పన శాఖపై సమీక్షలో ఆదేశించారు. దీంతో ఏటీసీలవారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వచ్చే నెల రెండో వారంలోగా కార్మి క శాఖకు నివేదికలు సమరి్పంచనున్నారు. ప్రతి ఏటీసీకి పూర్తిస్థాయి ప్రిన్సిపాల్... రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఏటీసీల్లో వివిధ కేటగిరీల్లో 2,033 ఉద్యోగాలు మంజూరయ్యాయి. అందులో మూడింట రెండో వంతు శిక్షణ ఇచ్చే శిక్షకుల పోస్టులు ఉన్నాయి. దాదాపు 1,500 శిక్షకుల పోస్టుల్లో 740 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏటీసీలవారీగా ఏయే కేటగిరీలో ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలలో కొత్త ట్రేడ్లను పరిచయం చేయనుంది. పాత ట్రేడ్లు రద్దు చేస్తూనే వాటి స్థానంలో కొత్త ట్రేడ్లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో కొత్త ట్రేడ్లపై శిక్షణ ఇచ్చే శిక్షకులకు అర్హతలను ఖరారు చేస్తూ ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సగానికిపైగా ఏటీసీల్లో పూర్తిస్థాయి ప్రిన్సిపాల్ లేకపోవడంతో ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు.ప్రతి ఏటీసీకి తప్పకుండా ప్రిన్సిపాల్ ఉండాలని సీఎం స్పష్టం చేయడంతో ప్రిన్సిపాల్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలా లేక నూతన నియామకాల్లో భాగంగా చేపట్టాలా అనే అంశంపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు నూతన ఏటీసీల ఏర్పాటుపైనా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. -
కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర పన్నుల్లో తెలంగాణకు రూ. 26,216.38 (2.102 శాతం) కోట్ల వాటా లభించనుంది. అందులో ఆదాయ పన్ను రూ. 9,066.56 కోట్లు, కార్పొరేషన్ పన్ను రూ. 7,872.25 కోట్లు, కేంద్ర జీఎస్టీ æరూ. 7,832.19 కోట్లు, కస్టమ్స్ రూ. 1,157.45 కోట్లు, కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ రూ. 243.98 కోట్లు, సరీ్వస్ టాక్స్ రూ. 0.86 కోట్లు, ఇతర పన్నులు రూ. 43.09 కోట్లు ఉన్నాయి.ఈ మేరకు 2024–25 బడ్జెట్ ప్రతిపాదనల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గతేడాది బడ్జెట్లో కేంద్ర పన్నుల రూపంలో తెలంగాణకు రూ. 23,066.20 కోట్లు కేటాయించగా దానితో పోలిస్తే ఈసారి బడ్జెట్లో పన్నుల వాటా రూ. 3,150.18 కోట్లు అధికం కావడం విశేషం.రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థలకు బడ్జెట్ కేటాయింపులు ఇవీ..⇒ ఈ ఏడాది బడ్జెట్లో హైదరాబాద్ ఐఐటీ (ఎక్స్‌టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టులు)కి నిధుల కేటాయింపులో కోత విధించారు. గతేడాది రూ. 300 కోట్లు బడ్జెట్లో కేటాయించి మొత్తం రూ. 522.71 కోట్లు ఖర్చు చేయగా ఈ ఏడాది ఐఐటీ హైదరాబాద్ (ఈఏపీ)లకు రూ. 122 కోట్లు మాత్రమే కేటాయించారు. ⇒ తెలంగాణలోని గిరిజన యూనివర్సిటీ కోసం ప్రత్యేకంగా కేటాయింపులేవీ చేయలేదు. దేశంలోని అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు కలిపి కేటాయింపులు చేశారు. అయితే గతేడాది తెలంగాణ, ఏపీలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు కలిపి రూ. 37.67 కోట్లు కేంద్రంకేటాయించింది.⇒ హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్‌కు కేటాయింపుల్లో కోత విధించారు. గతేడాది రూ.115 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో కేవలం రూ.10.84 కోట్లే కేటాయించారు. ⇒ సింగరేణి కాలరీస్‌కు రూ. 1,600 కోట్లు, హైదరాబాద్‌లోని అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్‌కు రూ. 352.81 కోట్లు, హైదరాబాద్ సహా దేశంలోని 7 నైపర్ సంస్థలకు కలిపి రూ. 242 కోట్ల మేర కేంద్రం కేటాయించింది. ⇒ హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్‌కు రూ. 28 కోట్లు, హైదరాబాద్ సహా మరో మూడు ప్రాంతాల్లో ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థకు రూ. 16.54 కోట్ల మేర కేటాయింపులు చేసింది. ⇒హైదరాబాద్ సహా 12 నగరాల్లో ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీ–డాక్)కు రూ. 270 కోట్లు, నేషనల్ ఫిషరీస్ డెవలస్‌మెంట్ బోర్డుకు రూ. 16.78 కోట్లు, స్వాతంత్య్ర సమరయోధులకు (పెన్షన్లు) రూ. 603.33 కోట్లు, హైదరాబాద్ జాతీయ పోలీసు అకాడమీ సహా పోలీసు విద్య, శిక్షణ, పరిశోధనకు మొత్తం రూ. 1,348.35 కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించారు. ⇒హైదరాబాద్‌లోని సీడీఎఫ్‌డీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సహా దేశంలోని ఇతర స్వయం ప్రతిపత్తి సంస్థలకు కలిపి రూ. 940.66 కోట్లు, మణుగూరు సహా కోటా (రాజస్తాన్)లోని భార జల ప్లాంట్లకు రూ. 1,485.21 కోట్ల మేర కేటాయించారు. -
చదువులు ‘ఉన్నతం’
న్యూఢిల్లీ: దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు రూ.10 లక్షల వరకు విద్యా రుణాలు అందించనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. విద్యా రుణాలకు సంబంధించి ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణాలపై మూడు శాతం సబ్సిడీతో ఈ–వోచర్లు నేరుగా అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.విద్యార్థులు, విద్యారంగానికి ఇది మేలు చేస్తుందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పేర్కొన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చడం, నాణ్యమైన విద్య, మెరుగైన నైపుణ్యాలు అందుబాటులోకి రావడంతోపాటు వచ్చే ఐదేళ్లలో 4.1 కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించవచ్చన్నారు.మేనేజ్మెంట్ విద్య బోధించే ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూళ్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లకు వరుసగా రెండో ఏడాదీ కేంద్రం కేటాయింపులు కుదించింది. గత ఆర్థిక ఏడాది సవరించిన అంచనాలతో పోలిస్తే పాఠశాల విద్యకు కేటాయింపులు రూ.535 కోట్లకుపైగా పెంచగా ఉన్నత విద్య గ్రాంట్‌ను రూ.9,600 కోట్లకుపైగా కుదించింది. మొత్తమ్మీద విద్యారంగానికి కేటాయింపులు రూ.9,000 కోట్లకుపైగా తగ్గాయి. విద్యాశాఖకు 2024–25 బడ్జెట్లో రూ.1.25 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఆవిష్కరణలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం విద్యాసంస్థలలో ఆవిష్కరణలు, సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు బడ్జెట్లో మరో రూ.161 కోట్లు అదనంగా కేటాయించారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థలకు కేటాయింపులు రూ.1,300 కోట్ల (సవరించిన అంచనాలు) నుంచి రూ.1,800 కోట్లకు పెరిగాయి.యూజీసీకి నిధుల కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలు రూ.6,409 కోట్లతో పోలిస్తే ఈసారి 60.99 శాతం తగ్గించి రూ.2,500 కోట్లకు కుదించారు. ఐఐఎంలకు బడ్జెట్లో కోతలు తప్పలేదు. గతేడాది బడ్జెట్లో ఐఐఎంలకు కేటాయింపులు సవరించిన అంచనాలు రూ.608.23 కోట్లతో పోలిస్తే రూ.300 కోట్లకు కుదించగా ఈసారి మరింత కోత పడింది. ఈ ఏడాది సవరించిన అంచనాలు రూ.331 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.212 కోట్లకు కుదించారు. సెంట్రల్ వర్సిటీలకు మరికొంత.. దేశంలో అత్యున్నత సాంకేతిక విద్యకు నిలయాలైన ఐఐటీలకు కూడా బడ్జెట్ కేటాయింపులు గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. సవరించిన అంచనాలు రూ.10,384.21 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.10,324.50 కోట్లకు తగ్గాయి. కేంద్రీయ విశ్వవిద్యాలయాల (సెంట్రల్ వర్సీటీలు) కేటాయింపులు మాత్రం 28 శాతం పెరిగాయి.సెంట్రల్ వర్సిటీలకు సవరించిన అంచనాలు రూ.12,000.08 కోట్లతో పోలిస్తే కేటాయింపులు రూ.15,472 కోట్లకు పెరిగాయి. పాఠశాల విద్యకు సంబంధించి కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, ఎన్సీఈఆరీ్ట, పీఎంశ్రీ స్కూళ్లు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించే గ్రాంట్ ఇన్ ఎయిడ్ స్కూళ్లకు బడ్జెట్లో కేటాయింపులు పెరిగాయి. -
ఆ ఐటీఐలు ఇక నుంచి ఏటీసీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, ఆ దిశగా రాష్ట్ర కార్మిక శిక్షణ, ఉపాధి కల్పన విభాగం కార్యాచరణ వేగవంతం చేసింది. గతవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఏటీసీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చగా, మాసబ్టాంక్లో నాలుగు ఏటీసీల భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలు ఉన్నాయి. వీటన్నింటినీ ఏటీసీలుగా అప్‌గేడ్ర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, తొలివిడతలో 25 ఐటీఐలను మాత్రమే అప్‌గ్రేడ్ చేస్తారు. ఇవన్నీ 2024–25 నుంచే సేవలు ప్రారంభిస్తాయి.తొలివిడతలోకి వచ్చే ఐటీఐలతో కూడిన ప్రతిపాదిత జాబితా ను సిద్ధం చేసేందుకు శిక్షణ, ఉపాధికల్పన శాఖ కసరత్తు చేస్తోంది. తొలివిడత ప్రాజెక్టులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే ఐదు ఐటీఐలు ఏటీసీలుగా మారనున్నాయి. మిగతా వాటిని కూడా ఎంపిక చేసి జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచేందుకు ఆ శాఖ చర్యలు చేపట్టింది. ఇండస్ట్రీస్ 4.0.... అప్‌గ్రేడ్ చేసే క్రమంలో ప్రస్తుతమున్న శిక్షణ కార్యక్రమాలు సైతం కొత్తరూపు సంతరించుకోనున్నాయి. రెండుమూడు దశాబ్దాల క్రితం ఉన్న శిక్షణ కార్యక్రమాలనే ఐటీఐల్లో కొనసాగిస్తున్నారు. ఇకపై ఏటీసీల్లో సరికొత్త కోర్సులు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కోర్సుల ఎంపికపైనా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆరు రకాల ట్రేడ్లు ఎంపిక చేసి వాటిని ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టేలా చర్యలు వేగవంతం చేసింది. ఇవన్నీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(ఎన్సీవీటీ) నిబంధనలకు అనుగుణంగా మార్పు చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, అడ్వాన్స్డ్ మాన్యుఫాక్చరింగ్, ఐఓటీ డిజిటల్ ఇన్స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, మోడ్రన్ ఆటోమేటివ్ మెయింటెనెన్స్, ఆర్ట్ వెల్డింగ్, ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వెల్డింగ్, పెయింటింగ్ తదితర కొత్త ట్రేడ్లు ఏటీసీల ద్వారా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. కొత్తగా ఇండస్ట్రీస్ 4.0 పేరిట లాంగ్‌టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సులను, పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన ట్రేడ్లను ఏటీసీల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. చాలా ఐటీఐల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ సమస్య, స్థలాభావం కారణంగా భవనాల సమస్య ఉండడంతో యుద్ధప్రాతిపదికన ఏటీసీలుగా మార్పు చేయడం కత్తిమీద సాములా పరిణమించిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
65 ఐటీఐల్లో స్కిల్ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఐటీఐ కళాశాలలను అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా (స్కిల్లింగ్ సెంటర్లు) తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 65 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో స్కిల్లింగ్ సెంటర్ల ఏర్పాటుకు టాటా టెక్నాలజీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో అధికారులు ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉపాధి శిక్షణ శాఖ స్పెషల్ సీఎస్ రాణి కుముదిని, టాటా టెక్నాలజీస్ ప్రెసిడెంట్ పవన్ భగేరియాతో పాటు ఇతర ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విస్తరిస్తున్న పరిశ్రమల అవసరాలకు, ఇప్పుడున్న కోర్సులకు మధ్య భారీ అంతరముందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ అంతరాన్ని తగ్గించి యువతకు ఉపాధి అవకాశాలను అందించే కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు చెప్పారు. రూ.2,700 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం రూ.2700 కోట్ల ఖర్చుతో ఐటీఐలలో ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. అవసరమైన వర్కషాప్ల నిర్మాణం, యంత్రపరికరాల సామగ్రితో పాటు శిక్షణను అందించే ట్యూటర్ల నియామకాన్ని టాటా టెక్నాలజీస్ చేపడుతుంది. ప్రాజెక్టులో భాగంగా ఐటీఐలలో కొత్తగా 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులు ప్రవేశపెడతారు. అన్ని రంగాల్లో యువత ఉపాధి అవకాశాలందించే నైపుణ్య అభివృద్ధి కోర్సులను ఎంపిక చేశారు. ప్రతి ఏడాదీ వీటితో 9000 మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. దాదాపు లక్ష మందికి షార్ట్ టర్మ్ కోర్సుల ద్వారా శిక్షణను అందిస్తారు. ఈ విద్యా సంవత్సరం (2024–25) నుంచే ఈ ప్రాజెక్టు అమలుకు సన్నాహాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుంచి మొదలయ్యే అకడమిక్ సెషన్‌కు వర్క్ షాప్‌లను అందుబాటులో ఉంచాలని, సరిపడేంత మంది ట్యూటర్లను నియమించాలని ముఖ్యమంత్రి టాటా టెక్నాలజీ ప్రతినిధులకు సూచించారు. కేవలం శిక్షణనివ్వటమే కాకుండా యువతకు ఉపాధి కల్పించేందుకు క్యాంపస్ ప్లేస్మెంట్లపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక ప్లేస్‌మెంట్‌సెల్ ఏర్పాటుకు సహకరించాలని సీఎం రేవంత్ సూచించారు. త్వరలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు హైదరాబాద్‌ను స్కిల్ డెవెలప్మెంట్హబ్గా తయారు చేసేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు తగిన నైపుణ్యాలను అందించేందుకు త్వరలోనే రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. -
ఎన్నికల సమయంలోనే రాజకీయాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికలు ముగిసి.. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తాము రాజకీయాలు చేయడం లేదని, తమ దృష్టి అంతా అభివృద్ధి పైనే అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సీఐఐ– తెలంగాణ, టీడీఎఫ్– యూఎస్ఏల ఆధ్వర్యంలో విద్య, నైపుణ్య అభివృద్ధి, వాణిజ్య అవకాశాలు అనే అంశంపై బుధవారం నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, తరువాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో రూ. 2,000 కోట్లతో 64 ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. అలాగే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో శిక్షణ పొందిన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫెకెట్స్ ఇస్తామని వెల్లడించారు. ఈ ప్రభుత్వం అందరిదని, ప్రజలు కోరుకుంటేనే అధికారంలోకి వచ్చామని అన్నారు. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని చెప్పారు. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని చెప్పారు. గతంలో అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదని కొందరు అన్నారని, ఇప్పుడది హైదరాబాద్ కు లైఫ్‌లైన్ గా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.వెంకటేశం, సీఐఐ ప్రతినిధులు వగీశ్ దీక్షిత్, జి.గోపాల్‌రెడ్డి, సి. శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఐటీఐ లిమిటెడ్ కొత్త ల్యాప్‌టాప్‌లు - ప్రత్యర్థులకు గట్టి పోటీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీలో ఉన్న ప్రభుత్వ రంగ ఐటీఐ లిమిటెడ్ స్మాష్ బ్రాండ్ పేరుతో ల్యాప్‌టాప్‌లు, మైక్రో పర్సనల్ కంప్యూటర్ల విభాగంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఇంటెల్ కార్పొరేషన్‌తో కలిసి అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో వీటిని తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇంటెల్ ఐ3, ఐ5, ఐ7 తదితర ప్రాసెసర్లతో ఉపకరణాలు రూపుదిద్దుకున్నాయని ఐటీఐ పేర్కొంది. ‘స్మాష్ ఉత్పత్తులను ఇప్పటికే మార్కెట్లో ప్రవేశపెట్టాం. ఏసర్, హెచ్‌పీ, డెల్, లెనొవో వంటి ఎంఎన్సీ బ్రాండ్స్‌తో పోటీపడి అనేక ఆర్డర్లు దక్కించుకున్నాం. 12,000 పైచిలుకు పీసీలను కస్టమర్లు వినియోగిస్తున్నారు’ అని సంస్థ సీఎండీ రాజేశ్ రాయ్ తెలిపారు. కాగా, తాజా ప్రకటన నేపథ్యంలో ఐటీఐ షేరు ధర క్రితం ముగింపుతో పోలిస్తే బీఎస్ఈలో సోమవారం 20 శాతం ఎగసి రూ.149.40 వద్ద స్థిరపడింది. -
దేశంలో ఐటీఐలు చాలా పూర్
సాక్షి, అమరావతి: దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్ధలు)ల పనితీరు చాలా పేలవంగా ఉందని, వాటిని తక్షణం సంస్కరించి, అధునాతనంగా తీర్చిదిద్దాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నీతి ఆయోగ్ సూచించింది. నీతి ఆయోగ్ అధ్యయన బృందం వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటుఐటీఐలను స్వయంగా సందర్శించింది. అక్కడి విద్యార్థులు, బోధకులతో మాట్లాడటంతో పాటు మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు, పరిశ్రమల అనుసంధానం తదితర అంశాలను పరిశీలించి, సమగ్ర అధ్యయన నివేదికను విడుదల చేసింది. దేశం మొత్తం మీద ఐటీఐల్లో శిక్షణ పొందిన వారిలో ప్లేస్మెంట్ కేవలం 0.90 శాతమే ఉందని ఆ నివేదిక పేర్కొంది. దేశం మొత్తం మీద 2021 సంవత్సరంలో 4,14,247 మంది ఐటీఐల్లో శిక్షణ పొందితే 405 మంది మాత్రమే ప్లేస్‌మెంట్స్ పొందినట్లు వెల్లడించింది. అత్యధికంగా తమిళనాడులో 7,676 మంది విద్యార్థుల్లో 248 మందికి అంటే 3.2 శాతం ప్లేస్‌మెంట్స్ పొందారని, ఆ తరువాత గుజరాత్లో 0.25 శాతం ప్లేస్‌మెంట్స్ ఉండగా మిగతా రాష్ట్రాల్లో చాలా అధ్వాన్నంగా ఉందని నివేదిక వివరించింది. దేశంలో ప్రత్యేకంగా మహిళా ఐటీఐలు 2021 నాటికి 16.83 శాతం ఉంటే అందులో చేరికలు కేవలం 6.6 శాతమే. బోధకుల్లోనూ మహిళలు 15.83 శాతమే ఉన్నారు. ఇక్కడ లింగ వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని నివేదిక తెలిపింది. ఆ నివేదిక ప్రధానాంశాలివీ.. ప్రభుత్వ ఐటీఐలకే విద్యార్థుల ప్రాధాన్యత దేశవ్యాప్తంగా 14,789 ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో మొత్తం 25,38,487 సీట్లు ఉండగా, వీటిలో 48.20 శాతం సీట్లే భర్తీ అవుతున్నాయి. మొత్తం ఐటీఐల్లో 78.40 శాతం ప్రైవేటు రంగంలో, మిగతావి ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. అయితే, సీట్ల భర్తీలో ప్రైవేట్‌కన్నా ప్రభుత్వ ఐటీఐలే మెరుగ్గా ఉన్నాయి. ప్రైవేటు రంగంలో 43.07 శాతం సీట్లు భర్తీ అవుతుండగా ప్రభుత్వ ఐటీఐల్లో సీట్ల భర్తీ 56.74 శాతం ఉందని నివేదిక పేర్కొంది. అత్యంత ఆదరణ పొందిన ట్రేడ్లలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, మోటారు వెహికల్ మెకానిక్, డ్రాప్ట్స్‌మెన్ మొదలైనవి ఉన్నాయి. అయినప్పటికీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఉన్న సీట్లలో 64.81 శాతం, ఫిట్టర్ ట్రేడ్‌లో 71.57 శాతం సీట్లు ఖాళీగా ఉన్నాయి. అంటే ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో 35.19 శాతం, ఫిట్టర్లో 28.43 శాతం సీట్లే భర్తీ అవుతున్నాయి. అప్రెంటిస్‌లుగానే ఉపాధి ఐటీఐల్లో విద్యార్ధుల అనుభవాలు మిశ్రమంగా ఉన్నాయని నివేదిక తెలిపింది. అత్యున్నత ప్రమాణాలతో ఉన్న ఐటీఐల్లో ప్లేస్‌మెంట్స్ 80 శాతం ఉంటున్నాయి. వీటిలో చదివిన విద్యార్థులు కెరీర్ పట్ల భరోసాతో ఉంటున్నారు. వీరిలో ఎక్కువ మంది సొంతంగా వెంచర్ ప్రారంభించాలన్న ఆసక్తిని కనబరుస్తున్నారు. మరికొందరు బోధకులుగా మారాలనుకుంటున్నారు. మధ్యస్థాయి, తక్కువ స్థాయి ఐటీఐల్లో అతి కొద్ది సంస్థల్లో మాత్రమే 20 శాతానికి పైగా ప్లేస్‌మెంట్స్ పొందుతున్నారు. ఐటీఐ విద్యార్థులను సంస్థలు ఉద్యోగులుగా కాకుండా అప్రెంటిస్‌లుగానే పరిగణిస్తున్నాయి. సాధారణంగా ఐటీఐ అభ్యర్థుల కనీస వేతనం నెలకు రూ.20 వేలుగా ఉంది. చాలా కంపెనీలు ఐటీఐ అభ్యర్ధులను ఉద్యోగులుగా కాకుండా రిపేర్ల కోసం అప్రెంటిస్‌లగానే తీసుకుంటున్నాయి. వీరికి నెలకు రూ. 9,000 నుంచి రూ.12,000 వరకు ఇస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం 18 సంవత్సరాల వయస్సుగల వారు కావడం, సౌకర్యాల కోసం డిమాండ్ చేయడం. ఇవీ అసౌకర్యాలు ఐటీఐల్లో సరైన బోధకులు లేరు. మంజూరైన బోధకుల పోస్టుల్లో 36 శాతమే ఉన్నారు. ఔట్ సోర్సింగ్ బోధకుల్లో సమర్ధత లేదు. ఐటీఐల్లో శిక్షణకు అవసరమైన లేబోరేటరీలు, సాధనాల కొరత తీవ్రంగా ఉంది. ఐటీఐలకు కనెక్టివిటీ కూడా తక్కువగా ఉంది. దీంతో కొంతమంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు -
Telangana: నిజామాబాద్ ప్రభుత్వ మహిళా ఐటీఐ టాప్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని మొత్తం 295 ఐటీఐల్లో నిజామాబాద్ ప్రభుత్వ మహిళా ఐటీఐ 3.18 గ్రేడ్‌తో అగ్రస్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ ఒక్క ఐటీఐ మినహా రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలు అన్నీ 2.5 కంటే తక్కువ గ్రేడ్లు పొందాయి. 196 ప్రైవేట్ ఐటీఐలలో 2 మాత్రమే 2.5 కంటే ఎక్కువ గ్రేడ్లు, 88 ప్రైవేట్ ఐటీఐలు 1 కంటే తక్కువ గ్రేడ్లు పొందాయి. ‘ట్రాన్స్ఫార్మింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్– స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయిమెంట్ వర్టికల్’పేరుతో నీతిఆయోగ్ సిద్ధం చేసిన నివేదికలో రాష్ట్రాల్లోని ఐటీఐలకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. తెలంగాణలోని ఇతర జిల్లాల కంటే హైదరాబాద్‌లోనే అత్యధిక ఐటీఐలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఐటీఐల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఐటీఐలతో పోలిస్తే ప్రైవేట్ ఐటీఐలలో అందించే ట్రేడ్ల సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2022 సంవత్సరంలో రాష్ట్రంలోని 295 ఐటీఐల్లో 66 ప్రభుత్వ ఆధ్వర్యంలో, 77% ప్రైవేట్ నిర్వహణలో ఉన్నాయి. మహిళా ఐటీఐలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. 2020 సంవత్సరంలో 3,976 మంది ట్రైనీలు సర్టిఫికెట్లు అందుకున్నారు. కాగా, 2021 సంవత్సరంలో మొత్తం 54,340 సీట్లలో 50% మాత్రమే భర్తీ కావడంతో ఐటీఐలు పూర్తి సామర్థ్యంతో పనిచేయట్లేదు. -
5,000కు పైగా ‘స్కిల్ హబ్స్’
న్యూఢిల్లీ: దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి 5,000కుపైగా ‘స్కిల్ హబ్స్’ ప్రారంభించబోతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. కాలానుగుణంగా నైపుణ్యాలను వృద్ధి చేసుకోవడమే యువతకు తారకమంత్రం కావాలని ఉద్బోధించారు. ఆయన శనివారం ఐటీఐ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఉద్యోగ అవకాశాలూ పెరుగుతున్నాయి. కనుక యువత తమ నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవాలి. వారి రంగాల్లో మార్పులను గమనిస్తూండాలి’’ అన్నారు. ‘‘మా హయాంలో గత ఎనిమిదేళ్లలో దేశంలో కొత్తగా దాదాపు 5,000 ఐటీఐలను ప్రారంభించాం. 4 లక్షల సీట్లు అందుబాటులోకి వచ్చాయి. నూతన విద్యా విధానం కింద అనుభవం ఆధారిత విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తున్నాం. పునరుత్పాదక ఇంధన వనరులు, సోలార్ విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాలు తదితర రంగాల్లో భారత్ ముందంజ వేస్తోంది. సంబంధిత కోర్సులను ఐటీఐల్లో ప్రవేశపెడుతున్నాం’’ అని వివరించారు. రవాణా రంగం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్ లాజిస్టిక్స్ పాలసీని మోదీ ఆవిష్కరించారు. ‘‘13–14 శాతమున్న రవాణా లాజిస్టిక్స్ వ్యయాన్ని 7.5 శాతం కంటే దిగువకు తేవడంతో పాటు సమయం, డబ్బు మరింతగా ఆదా అయ్యేలా చూడటమే దీని లక్ష్యం. పీఎం గతిశక్తి పథకంతో కలిసి రవాణా రంగాన్ని ఈ పాలసీ పరుగులు పెట్టిస్తుంది’’ అన్నారు. ‘‘రవాణా వ్యవస్థను ఆధునీకరిస్తున్నాం. ఫాస్టాగ్, ఇ–వే బిల్లింగ్ వంటి చర్యలు చేపట్టాం. ‘‘సాగరమాల ప్రాజెక్టుతో నౌకాశ్రయాల సామర్థ్యాన్ని ఎంతగానో పెంపొందించాం’’ అని గుర్తు చేశారు. -
బీఎస్ఎన్ఎల్- ఐటీఐ పైలట్‌కు ప్రభుత్వ నిధులు
న్యూఢిల్లీ: 4జీ, 5జీ, ఈ-బ్యాండ్ స్పెక్ట్రమ్ సర్వీసులకు కావాల్సిన సాంకేతికతను దేశీయంగా అభివృద్ది చేసేందుకు బీఎస్ఎన్ఎల్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ (ఐటీఐ) తలపెట్టిన పైలట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు సమకూర్చనుంది. టీసీఎస్-తేజస్ నెట్‌వర్క్‌ల సహకారంతో తొలిసారిగా మేడ్–ఇన్–ఇండియా 4జీ, 5జీ టెలికం నెట్వర్క్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించిన ఈ ప్రాజెక్ట్‌లో ప్రభుత్వ టెలికం పరిశోధన సంస్థ సీ-డాట్ కూడా పాల్గొంటోంది. ఒక్కో పైలట్ ప్రాజెక్టుకు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ రూ.10 కోట్లు అందిస్తోంది. -
ఐటీఐ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్..
ఐటీఐ మ్యుచువల్ ఫండ్ తాజాగా ఐటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది నవంబర్ 29తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రదీప్ గోఖలే, ప్రతిభ్ అగర్వాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ప్రధానంగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, రేటింగ్ ఏజెన్సీలు, కొత్త తరం ఫిన్‌టెక్ సంస్థలు మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. నాణ్యమైన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సంస్థ సీఈవో జార్జ్ హెబర్ జోసెఫ్ తెలిపారు. -
డిప్లొమా, ఇంజనీరింగ్, ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు
జీఆర్ఎస్ఈలో 256 అప్రెంటిస్‌లు కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్(జీఆర్ఎస్ఈ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 256 » ఖాళీల వివరాలు: ట్రేడ్ అప్రెంటిస్ (ఎక్స్–ఐటీఐ)–170, ట్రేడ్ అప్రెంటిస్ (ఫ్రెషర్)–40, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–16, టెక్నీషియన్ అప్రెంటిస్–30. » ట్రేడ్ అప్రెంటిస్(ఎక్స్–ఐటీఐ): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్, కార్పెంటర్, డ్రాఫ్ట్స్‌మెన్, పెయింటర్ తదితరాలు. అర్హత: సంబంధిత ట్రేడులో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌తోపాటు క్రాఫ్ట్స్‌మెన్ ట్రెయినింగ్ స్కీమ్ కోసం ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. » ట్రేడ్ అప్రెంటిస్(ఫ్రెషర్): ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, పైప్ ఫిట్టర్. అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14ఏళ్ల నుంచి 20ఏళ్ల మధ్య ఉండాలి. » గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్. అర్హత: 2018, 2019, 2020లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. ఎంఈ/ఎంటెక్/ఎంబీఏ అభ్యర్థులు అర్హులు కాదు. వయసు: 14ఏళ్ల నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. » టెక్నీషియన్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్, సివిల్. అర్హత: 2018, 2019, 2020లో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 26ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 01.10.2021 » వెబ్సైట్: https://apprenticeshipindia.org చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్‌లో 492 అప్రెంటిస్‌లు చిత్తరంజన్(పశ్చిమ బంగ)లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 492 » ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, రిఫ్రిజిరేషన్స్ అండ్ ఏసీ మెకానిక్స్, పెయింటర్. » అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ(ఎన్సీవీటీ) ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 15.09.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ/ఓరల్ ఎగ్జామ్ ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:03.10.2021 » వెబ్సైట్: https://clw.indianrailways.gov.in ఎస్ఈసీఎల్, బిలాస్పూర్లో 450 అప్రెంటిస్‌లు బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 450 » ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మైనింగ్–140, టెక్నీషియన్ అప్రెంటిస్ మైనింగ్/మైన్ సర్వేయింగ్–310. » అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 05.10.2021 నాటికి 18ఏళ్లు నిండి ఉండాలి. » వేతనం: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9000, టెక్నికల్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు. » ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021 » వెబ్సైట్: www.secl.cil.in ఎస్ఈసీఆర్, బిలాస్పూర్ డివిజన్లో 432 అప్రెంటిస్‌లు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(ఎస్ఈసీఆర్), బిలాస్పూర్ డివిజన్.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం ఖాళీల సంఖ్య: 432 » ట్రేడులు: కోపా, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, కార్పెంటర్ తదితరాలు. » అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 01.07.2021 నాటికి 15ఏళ్ల నుంచి 24ఏళ్ల మధ్య ఉండాలి. » ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దర ఖాస్తులకు చివరి తేది:10.10.2021 » వెబ్సైట్: https://secr.indianrailways.gov.in -
అస్పైర్.. ఆవిష్కరణలకు ఇన్స్పైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన అస్పైర్(ఏ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ప్రభుత్వ పారిశ్రామికశిక్షణ సంస్థ(ఐటీఐ)లకు బాసటగా నిలవనుంది. గ్రామీణ యువతను సరికొత్త ఆవిష్కరణల బాటపట్టించడమే ఈ పథకం ఉద్దేశం. దీని కింద ఎంపికైన ఐటీఐలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది ఇక్కడ శిక్షణ పొందుతున్నవారికి సరికొత్త కార్యక్రమాలను పరిచయం చేయనుంది. అస్పై ర్ కింద సిరిసిల్ల, వనపర్తి, ఖమ్మం, నిజామాబాద్, మేడ్చల్, కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐలు ఎంపికయ్యాయి. ఒక్కో ఐటీఐ ఖాతాలోకి రూ.50 లక్షల చొప్పున కేంద్రం జమ చేసింది. ఈ నిధులతో ఐటీఐల్లో లైవ్లీవుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్(ఎల్బీఐ)లను కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ ఐటీఐలు సమీపంలోని పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని స్థానిక నేపథ్యంతో కూడిన సరికొత్త ఆవిష్కరణలు చేయనున్నాయి. త్వరలో మరిన్ని ఐటీఐలు ఈ పథకం పరిధిలోకి వచ్చే అవకాశముంది. ►సిరిసిల్ల ఐటీఐ: ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఎల్బీఐ ప్రధానంగా చేనేత పరిశ్రమ ఆధారంగా పనిచేయనుంది. ఈ పరిశ్రమ ఉత్పత్తులు, మార్కెట్ సవాళ్లు, లక్ష్యాలు తదితర అంశాలను అధిగమించి ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంది. ►వనపర్తి ఐటీఐ: స్థానిక రైతులకు సులభతర వ్యవసాయం, మార్కెటింగ్ అంశాలపై ఐటీఐ పనిచేయనుంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ విత్తనోత్పత్తి, ఎరువులు, విత్తనాల తయారీపై దృష్టి పెట్టనుంది. ►ఖమ్మం ఐటీఐ: వెదురుకు ప్రసిద్ధమైన ఖమ్మం ప్రాంతంలో వెదురు దిగుబడుల ప్రాసెసింగ్‌తోపాటు వీటిపై ఆధారపడిన చేతివృత్తిదారులకు మెరుగైన వసతులు సమకూర్చేదిశగా ఈ ఐటీఐ పనిచేయనుంది. ►నిజామాబాద్ ఐటీఐ: వ్యవసాయ రంగానికి కేంద్రంగా ఉన్న నిజామాబాద్ ప్రాంత రైతాంగం కోసం శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పుట్టగొడుగుల పెంపకం తదితర వాటిపై ఈ ఐటీఐలోని ఎల్బీఐ పనిచేయనుంది. ►మేడ్చల్ ఐటీఐ: నగరానికి చేరువలోని ఈ ప్రాంతంలో ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటిపై మరింత అవగాహన కలిగించడం, స్థానిక యువతకు ప్రాసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచడం, వీటికి అనుబంధంగా శిక్షణ తరగతులు నిర్వహించడం వంటి వాటిని ఈ ఎల్బీఐ పర్యవేక్షిస్తుంది. ►కరీంనగర్ ఐటీఐ: ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నప్పటికీ, కుటీర పరిశ్రమల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్న కుటీర పరిశ్రమల ఏర్పాటుపై ఎల్బీఐ పనిచేస్తుంది. ఫుట్‌వేర్, ఆర్నమెంట్, అత్తరు పరిశ్రమలను ప్రోత్సహించే కార్యాచరణతో ముందుకు వెళ్లనుంది. పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు అస్పైర్ పథకం అమలుతోపాటు ఎల్బీఐల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర సలహాకమిటీ, పాలకమండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయి సలహా కమిటీకి కార్మికమంత్రి చైర్మన్‌గా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యుడిగా, కమిషనర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ మెంబర్ కన్వీనర్‌గా, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ జనరల్, ఉపాధి, శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా కొనసాగుతారు. పాలక మండలి(గవర్నింగ్ బాడీ) చైర్మన్‌గా ఉపాధి శిక్షణా విభాగం కమిషనర్, కొనసాగుతారు. ఈ శాఖ జాయింట్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా, ఎన్ఎస్ఐసీ చీఫ్ మేనేజర్, ఎంఎస్ఎంఈ ప్రతినిధి, ఉపాధి, శిక్షణ డిప్యూటీ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కమిటీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిణి ఉత్తర్వులు జారీ చేశారు. -
అప్రెంటిస్ ఖాళీలు.. అప్లై చేసుకోండి!
భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాక్రాపర్లోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్).. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 121 ► ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్, టర్నర్ తదితరాలు. ► అర్హత: సంబంధిత ట్రేడ్‌ను అనుసరించి ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► కాలవ్యవధి: ఒక సంవత్సరం ► వయసు: 14 నుంచి 24 ఏళ్లు మించకూడదు. ► స్టైపెండ్: నెలకు రూ.7,700 నుంచి రూ.8855 వరకు చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఐటీఐ మార్కులు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కాక్రాపర్ గుజరాత్ సైట్, అనుమల–394651, టీఏ.వ్యారా, జిల్లా. తపి, గుజరాత్ చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021 ► వెబ్సైట్: www.npcilcareers.co.in నరోరా అటామిక్ పవర్ స్టేషన్లో 50 అప్రెంటిస్‌లు భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎన్పీసీఐఎల్)కి చెందిన ఉత్తరప్రదేశ్‌లోని నరోరా అటామిక్ పవర్ స్టేషన్.. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 50 ► ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్–20, ఎలక్ట్రీషియన్–13, ఎలక్ట్రానిక్స్–12, మెషినిస్ట్–05. ► అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. ► వయసు: 07.07.2021 నాటికి 14–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ఒకవేళ ఐటీఐ మార్కులు ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఉంటే.. వారి వయసును ప్రామాణికంగా తీసుకుంటారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మేనేజర్( హెచ్ఆర్ఎం), నరోరా అటామిక్ పవర్ స్టేషన్, ప్లాంట్ సైట్, నరోరా,బులందసహార్–203389(ఉత్తరప్రదేశ్) చిరునామాకు పంపించాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.07.2021 ► దరఖాస్తు హార్ట్కాపీలను పంపడానికి చివరి తేది: 21.07.2021 ► వెబ్సైట్: https://www.npcil.nic.in మరిన్ని నోటిఫికేషన్లు: పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీ ఖాళీలు సింగరేణిలో అప్రెంటిస్ ఖాళీలు.. త్వరపడండి పవర్‌గ్రిడ్, ఎస్బీఐలో ఉద్యోగ అవకాశాలు -
సదరన్ రైల్వేలో అప్రెంటిస్ ఖాళీలు
చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే, పెరంబూరులోని క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్‌కు చెందిన చీఫ్ వర్క్‌షాప్ మేనేజర్ కార్యాలయం.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► అప్రెంటిస్ మొత్తం ఖాళీల సంఖ్య: 3378 ► పనిచేసే ప్రదేశాలు: క్యారేజ్ అండ్ వేగన్ వర్క్స్, రైల్వే హాస్పిటల్, ఎలక్ట్రికల్ వర్క్‌షాప్, లోకోవర్క్స్, ఇంజనీరింగ్ వర్క్‌షాప్, చెన్నై డివిజన్. ► విభాగాలు: ఫ్రెషర్ కేటగిరీ, ఎక్స్ ఐటీఐ, ఎంఎల్టీ. ► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితరాలు. ► అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్/బయాలజీ)ఉత్తీర్ణత ఉండాలి. ► వయసు: 15 ఏళ్లు నిండి ఉండాలి. 22/24 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల వయో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పదోతరగతి, ఐటీఐ, ఇంటర్మీడియెట్ మార్కుల ప్రాతిపదికన తుది ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 30.06.2021 ► వెబ్సైట్: https://sr.indianrailways.gov.in మరిన్ని నోటిఫికేషన్లు: ఎన్ఎఫ్సీ, హైదరాబాద్‌లో ఐటీఐ అప్రెంటిస్‌లు వెస్టర్న్ రైల్వేలో 3591 అప్రెంటిస్ ఖాళీలు బెల్లో ట్రెయినీ, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు -
చైనీస్ పరికరాలకు చెక్- ఐటీఐ స్పీడ్
టెలికం రంగంలో చైనీస్ పరికరాల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించనున్నట్లు వెలువడిన వార్తలు పీఎస్‌యూ ఐటీఐ లిమిటెడ్ కౌంటర్‌కు జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 14.5 శాతం దూసుకెళ్లింది. రూ. 104 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 108 సమీపానికి చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత రెండు రోజుల్లోనే ఈ కౌంటర్ 32 శాతం జంప్‌చేసింది. ట్రేడింగ్ ప్రారంభమైన 45 నిమిషాల్లోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి 9.3 మిలియన్ షేర్లు చేతులు మారడం గమనార్హం! డాట్ దన్ను చైనా కంపెనీల నుంచి 4జీ పరికరాల కొనుగోలును నిలువరించవలసిందిగా ప్రభుత్వ రంగ కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లను టెలికం శాఖ(డాట్) ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. చైనా కంపెనీల నుంచి దూరంగా ఉండాల్సిందిగా ప్రయివేట్ రంగ టెలికం దిగ్గజాలను సైతం ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐటీఐ షేరుకి డిమాండ్ పెరిగినట్లు నిపుణులు పేర్కొన్నారు. టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీ విభాగంలో పీఎస్‌యూ అయిన ఐటీఐ లిమిటెడ్ సేవలందిస్తున్న విషయం విదితమే. కంపెనీ డిఫెన్స్ సెక్యూరిటీ ఎన్క్రిప్షన్, ఆప్టికల్, డేటా నెట్వర్క్, పాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర పలు ప్రొడక్టులను సరఫరా చేస్తోంది. అంతేకాకుండా టెలికం టర్న్‌కీ ప్రాజెక్టులుసహా టెలికం సొల్యూషన్స్‌నూ అందిస్తోంది. -
విప్రో చేతికి అమెరికా కంపెనీ!
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం విప్రో అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ టెక్నీ గ్రూప్ ఇన్‌కార్పొను (ఐటీఐ) కొనుగోలు చేయనున్నది. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ అండ్ ప్రొడక్ట్ లైఫ్‌సైకిల్ మేనేజ్మెంట్ ఇంటెరోపెరాబిలిటీ సాఫ్ట్వేర్ సేవలందించే ఐటీఐను రూ.312 కోట్ల(4.5 కోట్ల డాలర్లు)కు కొనుగోలు చేయనున్నామని విప్రో తెలిపింది. 1983లో ఆరంభమైన ఐటీఐ అమెరికాలోని ఓహియో కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇంగ్లాండ్, ఇటలీ, ఇజ్రాయేల్, జర్మనీల్లో ఈ కంపెనీకి కార్యాలయాలున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి ఈ కంపెనీలో మొత్తం 130 మంది ఉద్యోగులున్నారు. కంపెనీ ఆదాయం గత ఏడాది జూన్ 30 నాటికి 2.32 కోట్ల డాలర్లుగా ఉంది. సెప్టెంబర్ కల్లా డీల్ పూర్తి ! ఐటీఐ కొనుగోలుతో డిజిటల్ ఇంజినీరింగ్ మాన్యుఫాక్చరింగ్లో మరింత శక్తివంతమవుతామని విప్రో కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(ఇండస్ట్రియల్ అండ్ ఇంజినీరింగ్ సర్వీసెస్) హర్మీత్ చౌహన్ పేర్కొన్నారు. ఈ డీల్‌కు నియంత్రణ సంస్థల ఆమోదాలు పొందాల్సి ఉందని, ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా ఈ డీల్ పూర్తవ్వగలదని అంచనా వేస్తున్నామన్నారు. -
ఐటీఐలలో ఐదు ట్రేడ్లు ఔట్!
సాక్షి, హైదరాబాద్: ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్)లలో డిమాండ్ లేని ట్రేడ్లను రద్దు చేయాలని కార్మిక, ఉపాధి కల్ప న శాఖ నిర్ణయించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో అడ్మిషన్లను పరిగణిస్తూ.. గత మూడేళ్లుగా అడ్మిషన్ల తీరును విశ్లేషించింది. ఇప్పటికే ఐదు ట్రేడ్లలో ప్రవేశాల్లేవు. ఆయా రంగాల్లో ఉపాధి కల్పన కూడా ఆశాజనకంగా లేకపోవడంతో వాటిని రద్దు చేయనుంది. ఈ నేపథ్యంలో ఫౌండ్రీమన్, షీట్ మెటల్ వర్కర్, రేడియో అండ్ టీవీ మెకానిక్, వైర్‌మెన్, సెక్రెటేరియల్ ప్రాక్టీస్ ట్రేడ్లు రద్దు కానున్నాయి. రాష్ట్రంలో 290 ఐటీఐలు ఉన్నాయి. వీటిలో 65 ప్రభుత్వ ఐటీఐలు కాగా, 235 ప్రైవేటు సంస్థ లు నిర్వహిస్తున్నాయి. వీటి పరిధిలో 50 వేల మంది వివిధ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్నారు. ట్రెండ్‌కు తగ్గ ట్రేడ్లు.. నైపుణ్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్లో డిమాండ్ అంచనా వేసి నిపుణులను తయారు చేసేలా రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది. అక్కడున్న పరిస్థితులు, ఉపాధి అవకాశాల ఆధారంగా ఐటీఐలలో కొత్త ట్రేడ్లు ఏర్పాటు చేసుకునే వీలుంది. దీంతో డిమాండ్ లేని వాటిని తొలగించి కొత్త ట్రేడ్ల చేర్పుపై ఉపాధి కల్పన, శిక్షణల విభాగం దృష్టి సారించింది. ప్రస్తుతమున్న ఐటీఐలలో 32 ట్రేడ్లు ఉన్నాయి. వీటిలో 13 ట్రేడ్లకు శిక్షణ కాలం ఏడాది కాగా, 18 ట్రేడ్లు రెండేళ్ల కాల పరిమితి కేటగిరీలో ఉన్నాయి. మెకానిక్ మెషీన్ టూల్ మెయింటెనెన్స్ ట్రేడ్ పూర్తికి మాత్రం మూడేళ్లు పడుతుంది. ప్రస్తుత ట్రేడ్లలో ఐదింటిలో ప్రవేశాల్లేవు. తొలగించిన స్థానంలో కొత్తగా ఐదు ట్రేడ్లు చేర్చే అంశంపై ఉపాధి కల్పన, శిక్షణ శాఖ అధ్యయనం చేస్తోంది. వచ్చే విద్యా ఏడాది నాటికి కొత్త ట్రేడ్ల చేర్పుపై నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ ఐటీఐలలో కామన్ ట్రేడ్లు అమలు చేసే దానిపైనా అధికారులు పరిశీలిస్తున్నారు.ప్రతి ఐటీఐని పరిశ్రమలతో అనుసంధానం చేసి, ఉపాధి అవకాశాలు పెంచే లా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. -
అన్యాయం..అక్రమం..నిర్లక్ష్యం!
కందుకూరు: విద్యార్థుల భవిష్యత్‌తో ప్రభుత్వ ఐటీఐ కాలేజీ అధికారులు ఆటలాడుతున్నారు. కాలేజీల్లో చేరి కోర్సు పూర్తి చేసి మూడున్నరేళ్లు అవుతున్నా నేటికీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వారి భవిష్యత్‌ను అంధకారంలో నెడుతున్నారు. సర్టిఫికెట్ల కోసం కాలేజీ చుట్టూ తిరుగుతున్నా రేపు, మాపు అంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. పరిస్థితి ఇలా.. కందుకూరులోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో 2014–15 విద్యా సంవత్సరంలో వివి«ధ విభాగాల్లో వందల మంది విద్యార్థులు చేరారు. వీటిలో ఒక సంవత్సరం కోర్సులైన డీజిల్ మెకానిక్, కోఫా కోర్సులతో పాటు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి రెండు సంవత్సరాల కోర్సులకు చెందిన విద్యార్థులు అకాడమిక్ ఇయర్ పూర్తయ్యాక బయటకు వెళ్లారు. అయితే కోర్సు పూర్తి అయినట్లు కేవలం మార్కుల మెమోలు మాత్రమే ఇచ్చారు. దీనికి అనుబంధంగా ఉండే ఎన్టీసీ (నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్) ఇవ్వలేదు. ఇది వస్తేనే ఐటీఐ కోర్సు పూర్తి చేసినట్లు లెక్క. ఎన్టీసీ సర్టిఫికెట్స్ ఢిల్లీలోని డైరెక్టర్రేట్ ఆఫ్ సాంకేతిక విద్యాశాఖ అయిన ఢిల్లీ నుంచి ఈ సర్టిఫికెట్లు రావాల్సి ఉంది. దీనిపై విద్యార్థులు కాలేజీ అధికారులను ఎప్పుడు అడిగినా ఢిల్లీ నుంచి రావాలి ఇంకా రాలేదు. మరో రెండు, మూడు నెలల సమయం పడుతుందని సమాధానం చెప్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానిక ఐటీఐ కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటున్నారు. అయితే ఒంగోలు ఐటీఐ కాలేజీలో అదే ఏడాది కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రం సర్టిఫికెట్స్ రావడం గమనార్హం. కందుకూరు కాలేజీ ప్రిన్సిపాల్ మాత్రం దీనికి భిన్నంగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్య ఉందని చెప్తున్నారు. ఇదే విషయంపై ఐటీఐ కాలేజీల జిల్లా కన్వీనర్ మాత్రం భిన్నమైన సమాధానం చెప్తున్నారు. కందుకూరు కాలేజీకి సంబంధించి పెండింగ్ సర్టిఫికెట్లు ఉన్నట్లు జాబితానే రాలేదని చెప్తున్నారు. అప్రంటిస్ ఎలా? సాధారణంగా ఐటీఐ కోర్సులైన డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ వంటి కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు తప్పనిసరిగా నిర్ణీత సమయంలో అప్రంటిస్‌గా ఎక్కడో ఒకచోట పనిచేయాల్సి ఉంటుంది. రెండు సంవత్సరాలు కచ్చితంగా అప్రంటిస్ శిక్షణను కూడా పూర్తి చేసుకోవాలి. ఇది పూర్తి అయితేనే ఐటీఐ కోర్సుకు విలువ ఉంటుంది. అప్పుడే ఏ ప్రైవేట్ కంపెనీల్లో అయినా ఉద్యోగాల్లో చేరేందుకు, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. కోర్సు పూర్తి చేసి కాలేజీ నుంచి బయటకు వచ్చిన తరువాత ఐదు సంవత్సరాల్లోపు అప్రంటిస్‌గా పనిచేయాలి. ఉద్యోగాలకు అనర్హులే.. ప్రస్తుతం ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల ప్రకటనలు వస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలైన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) నుంచి వచ్చే ఉద్యోగ ప్రకటనలు ఐటీఐ విద్యార్థులకు వరం. కానీ స్థానిక ఐటీఐ కాలేజీ అధికారులు నిర్లక్ష్యం పుణ్యమా అంటూ ఆ విద్యార్థులు ఏ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఎన్టీసీ సర్టిఫికెట్ ఉంటేనే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వీలుంది. అలాగే ప్రైవేట్ కంపెనీల ఉద్యోగాల్లో చేరాలన్నా అనర్హులే. దీంతో ఆ విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. మూడున్నరేళ్లుగా తిరుగుతూనే ఉన్నాం, 2014–15లో ఐటీఐ కాలేజీలో డీజిల్ మెకానిక్ కోర్సు పూర్తి చేశాను. మూడున్నర సంవత్సరాలుగా సర్టిఫికెట్ల కోసం కాలేజీ చుట్టూ తిరుగుతున్నాం. అడిగినప్పుడల్లా రెండు నెలల్లో వస్తాయని చెప్తున్నారు. ఒంగోలు వెళ్లి ఐటీఐ కన్వీనర్‌ను కలిస్తే మీ కాలేజీ వాళ్లు వివరాలు పంపలేదు. అందుకే రాలేదని చెప్తున్నారు. దీనిపై ముఖ్యమంత్రికి, 1100కి కూడా ఫిర్యాదు చేశాం. వాళ్లు కూడా సంబంధిత అధికారులకు చెప్తామన్నారు. కానీ ఏ న్యాయం జరగలేదు.- కె. ఫణిదర్, డీజిల్ మెకానిక్ విద్యార్థి ఏ ఉద్యోగాలకూ తీసుకోవడం లేదు: ఐటీఐ కోర్సు పూర్తి చేశామన్నా ఏ ఉద్యోగానికి ఎవరూ తీసుకోవడం లేదు. కచ్చితంగా సర్టిఫికెట్లు అడుగుతున్నారు. కనీసం ఆర్టీసీలో అప్రంటీస్‌గా చేద్దామన్నా కూడా తీసుకోలేదు. అలాగే మూడేళ్లుగా అనేక ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలకు దూరమయ్యాం. ప్రస్తుతం ఆర్ఆర్బీ దరఖాస్తు చేసుకుందామన్నా సర్టిఫికేట్లు లేక అనర్హులం అవుతున్నాం. మా భవిష్యత్ పూర్తిగా నాశనం అయింది. సర్టిఫికెట్స్ కోసం ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం ఉండటం లేదు. ఎం. పవన్‌కుమార్ -
ఐటీఐల్లో తనిఖీ బృందాలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో ప్రమాణాల పరిస్థితిని పరిశీలించేందుకు కార్మిక ఉపాధి కల్పన శాఖ ఉపక్రమించింది. ప్రైవేటు ఐటీఐల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రమాణాల పరిశీలనకు ప్రత్యేకంగా తనిఖీ బృందాలను ఏర్పాటు చేసింది. పరిశీలన అనంతరం తనిఖీ బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా వాటి గుర్తింపును కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 291 ఐటీఐలున్నా యి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఐటీఐలకు ప్రాధాన్యతనిస్తోంది. ప్రతి ఐటీఐలోనూ పూర్తిస్థాయి ప్రమాణాలుండేలా కార్మిక ఉపాధి కల్పన శాఖ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తనిఖీలకు ఉపక్రమించింది. త్రిసభ్య కమిటీలు ఏర్పాటు ఐటీఐల తనిఖీలకు ఆ శాఖ జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ముగ్గురు సభ్యులుంటారు. శాఖ ప్రాంతీయ ఉప సంచాలకుడు, జిల్లా ఉపా ధి కల్పనాధికారితో పాటు ప్రభుత్వ ఐటీఐ నుంచి సీనియర్ ఫ్యాకల్టీతో ఏర్పా టు చేసిన త్రిసభ్య కమిటీ జిల్లా పరిధిలో ఉన్న ప్రైవేటు ఐటీఐల్లో మౌళిక వసతులు, మిషనరీ, బోధనా సిబ్బంది తదితర అంశాలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలిస్తారు. ప్రత్యేక ఫార్మాట్‌తో కూడిన ప్రొఫార్మా ఆ శాఖ తయారు చేసి బృందాలకు అందించింది. తనిఖీ అనంతరం వీరు ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి కమిటీ నివేదికలు... పారిశ్రామిక శిక్షణ సంస్థల అనుమతిలో కేంద్ర కార్మిక శాఖ పరిధిలోని డీజీఈటీ(డైరెక్టర్ జనరల్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్)కి కీలక పాత్ర ఉంటుంది. అనుమతులు, రెన్యువల్ తదితరాలన్నీ వీటి పరిధిలోనే ఉంటాయి. ఐటీఐల తనిఖీలు చేపట్టే త్రిసభ్య కమిటీలు సమర్పించే నివేదికలను కేంద్ర కార్మిక శాఖకు సమర్పించనున్నట్లు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ చెబుతోంది. దీంతో కమిటీ తనిఖీలపై ప్రైవేటు ఐటీఐలు ఆందోళన చెందుతున్నాయి. -
శిక్షణకు రుణ సదుపాయం
బద్వేలు: దేశంలోని వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులు రాణించేందుకు భారత ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్ఎస్డీఎస్) పథకం ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులకు బ్యాంకులు రుణ సదుపాయాన్ని కల్పిస్తాయి. దీనికోసం ముందుగా సంబంధిత వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. అర్హులు వీరే... పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు (ఐటీఐ), పాలిటెక్నిక్ సంస్థలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి గుర్తింపు పొందిన శిక్షణ సంస్థలు, కేంద్ర నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కలిగిన శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులు ఈ తరహా రుణం పొందేందుకు అర్హులు. రిజిస్ట్రేషన్ ఇలా ఆసక్తిగల అభ్యర్థులు ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఎన్ఎస్డీసీఐఎన్డీఐఏ.ఓఆర్జీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. వెబ్సైట్లో లాగిన్ అయిన తరువాత కనిపించే ముఖచిత్రంలో అవర్వర్క్ అనే విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో పైభాగంలో లాగిన్ కాలమ్ ఓపెన్ చేసి సబ్మిట్ ప్రపొజల్, ఎన్ఎస్డీసీ ట్రైనింగ్ ప్యాట్రన్ తదితర కాలమ్స్‌తో పాటు సిటిజన్ పోర్టల్ లాగిన్ వద్ద క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన విండో వద్ద న్యూయూజర్ వద్ద క్లిక్ చేస్తే సైన్అప్ విండో ఓపెన్ అవుతుంది. ఈ పథకానికి సంబధించి ఏపీలో 37 ప్రాంతాలలో వివిధ రంగాలకు సంబంధించిన శిక్షణ సంస్థలు ఉన్నాయి. వాటి వివరాలు, చిరునామాలు, ఫోన్ నెంబర్లు వంటి వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. రుణాలు, మంజూరు, చెల్లింపులు ఇలా... ♦ అభ్యర్థులకు ట్యూషన్/కోర్సు ఫీజు, పరీక్ష రుసుం, గ్రంథాలయ ఫీజు, ప్రయోగశాల ఫీజు, కాషన్ డిపాజిట్, పుస్తకాలు, పరిస్థితులను బట్టి వసతి కోసం అయ్యే ఖర్చులు, కోర్సుకు అవసరమయ్యే ఇతర వస్తువుల ఖర్చులకు రుణాలను ఇస్తారు. ♦ రూ.ఐదు వేల నుంచి రూ.1.50లక్షల వరకు ఈ పథకం కింద రుణం ఇస్తారు. ♦ ఈ రుణాలపై ఎటువంటి మార్జిన్ మనీ కట్టాల్సిన పని లేదు. ♦ రుణాలకు వసూలు చేసే వడ్డీ రేటు బ్యాంకును బట్టి మారుతుంది. ప్రస్తుతం ఈ తరహా రుణాలకు బ్యాంకు వడ్డీ రేటు 11 నుంచి 12 శాతం ఉంది. నైపుణ్యాభివృద్ధి రుణానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ♦ రుణాలను తిరిగి చెల్లించేందుకు తగినంత గడువు ఇస్తారు. ఏడాదిలోపు కోర్సులకు కోర్సు పూర్తి చేసిన ఆరు నెలల వరకు, సంవత్సరం పైబడిన కోర్సులకు కోర్సు పూర్తి చేసిన తరువాత 12 నెలల మారటోరియం పీరియడ్ ఉంటుంది. ఈ కాలంలో సాధారణ వడ్డీని వసూలు చేస్తారు. ♦ రుణాలను తిరిగి చెల్లించేందుకు తీసుకున్న నగదు పరిమాణాన్ని బట్టి గడువు ఇస్తారు. ♦ రూ.50 వేలకు మూడేళ్లు, రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఐదేళ్లు, రూ.లక్ష పైబడిన రుణానికి ఏడేళ్లు గడువు ఉంటుంది. ♦ రుణగ్రహీత ఎటువంటి ముందస్తు రుసుంలు లేకుండా రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. ప్ర మాదం/మరణం/వైకల్యం కారణంగా అభ్యర్థులు కోర్సు పూర్తి చేయలేకపోతే శిక్షణ సంస్థ నుంచి మిగిలిని శిక్షణ కాలానికి సంబంధించిన సొమ్మును ప్రొనేటా రీఎంబర్స్మెంట్ పద్ధతిలో వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు. బ్యాంకులు అర్హత కలిగిన అభ్యర్థులకు పరిమితి మేరకు రుణాన్ని మంజూరు చేస్తాయి. దీని ద్వారా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని ఉపాధిని పొందవచ్చు. -
ఆన్‌లైనా.. ఆఫ్‌లైనా!
బాలాజీచెరువు(కాకినాడ సిటీ) : ఐటీఐ విద్యలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్లైన్ పరీక్షల విధానం తీసుకొస్తుంది. ఇప్పటికే సెమిస్టర్ విధానంలో సంవత్సరానికి రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఒక సంవత్సరం ట్రేడ్వారికి ఏడాది చివర్లో, రెండేళ్ల ట్రేడ్వారికి రెండో ఏడాది చివర్లో పరీక్షలు నిర్వహించేది. ఈ విధానం వల్ల ఉత్తీర్ణతశాతం తగ్గిపోవడం, సాంకేతిక నైపుణ్యం విద్యార్థుల్లో పెరగకపోవడంతో ఈ విధానానికి ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికి, సంవత్సరం ట్రేడ్వారికి ఆరు నెలలు చొప్పున రెండు సార్లు, రెండేళ్ల ట్రేడ్వారికి ఆరు నెలల చొప్పున నాలుగుసార్లు పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ విధానం 2013 జూలై నెలలో ఐటీఐలో చేరే విద్యార్థులకు వర్తింపజేసేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టినా పరీక్షలు మాత్రం మాన్యువల్ పద్ధతిలో నిర్వహించింది. ఇప్పుడు తాజాగా అదే సెమిస్టర్ పరీక్షలకు ఆన్లైన్ విధానంలో నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ ఆలోచన బాగున్నా... ఆ మార్పునకు తగ్గట్టుగా ఐటీఐ కళాశాలలో ఆధునిక పరికరాలు సమకూర్చకపోవడం, అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయకపోవడం తదితర కారణాలతో విద్యార్థులకు పరీక్షలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడానికి ఏ మాత్రం అవకాశం కనపించడంలేదు. ప్రస్తుతం ఐటీఐలో రెండు సంవత్సరాల కోర్సులు 12, ఏడాది కోర్సులు ఆరు ఉన్నాయి. అలాగే అధ్యాపకుల కొరత కూడా సమస్యగా ఏర్పడింది. కళాశాలలో ఉన్న అధ్యాపకుల్లో సగానికిపైగా కాంట్రాక్టు పద్ధతిలో, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తుండగా 15 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు విద్యాపరంగా కూడా సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వాడ్రేవు శ్రీనివాసరావును వివరణ కోరగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఐటీఐలో ఆన్లైన్ విధానానికి చర్యలు చేపడుతుందన్నారు. అయితే ఎటువంటి ఆదేశాలు తమకు రాలేదని, కళాశాలల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు లేకపోయినా ప్రైవేట్ సంస్థల్లో పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. పరీక్షల సమయం దగ్గరపడుతుండడంతో ఈ సారి ఆఫ్‌లైన్‌లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. -
ఐటీఐ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు
-
ఐటీఐ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు
విజయవాడ : ప్రభుత్వ ఐటీఐలో జిల్లా స్థాయి ట్రైనింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న కోనేరు శ్రీనివాస్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ విజయవాడ డీఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో సోదాలు జరుపుతున్నారు. విజయవాడతో పాటు పెనమలూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో ఏక కాలంలో ఆరు చోట్ల సోదాలు జరుపుతున్నారు. విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీ, విజయనగర్ కాలనీల్లోని శ్రీనివాస్ కుమార్ నివాసాల్లో జరిపిన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది. మూడు కార్లు, వాణిజ్య ట్రక్కులను గుర్తించారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.