బాలాజీచెరువు(కాకినాడ సిటీ) : ఐటీఐ విద్యలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు చేపట్టింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆన్‌లైన్ పరీక్షల విధానం తీసుకొస్తుంది. ఇప్పటికే సెమిస్టర్ విధానంలో సంవత్సరానికి రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహిస్తోంది. ఒక సంవత్సరం ట్రేడ్‌వారికి ఏడాది చివర్లో, రెండేళ్ల ట్రేడ్‌వారికి రెండో ఏడాది చివర్లో పరీక్షలు నిర్వహించేది. ఈ విధానం వల్ల ఉత్తీర్ణతశాతం తగ్గిపోవడం, సాంకేతిక నైపుణ్యం విద్యార్థుల్లో పెరగకపోవడంతో ఈ విధానానికి ప్రభుత్వం పూర్తిగా స్వస్తి పలికి, సంవత్సరం ట్రేడ్‌వారికి ఆరు నెలలు చొప్పున రెండు సార్లు, రెండేళ్ల ట్రేడ్‌వారికి ఆరు నెలల చొప్పున నాలుగుసార్లు పరీక్షలు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ విధానం 2013 జూలై నెలలో ఐటీఐలో చేరే విద్యార్థులకు వర్తింపజేసేలా సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టినా పరీక్షలు మాత్రం మాన్యువల్ పద్ధతిలో నిర్వహించింది. ఇప్పుడు తాజాగా అదే సెమిస్టర్ పరీక్షలకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది.
ప్రభుత్వ ఆలోచన బాగున్నా... ఆ మార్పునకు తగ్గట్టుగా ఐటీఐ కళాశాలలో ఆధునిక పరికరాలు సమకూర్చకపోవడం, అధ్యాపకుల ఖాళీలను భర్తీ చేయకపోవడం తదితర కారణాలతో విద్యార్థులకు పరీక్షలకు తగ్గట్టుగా శిక్షణ ఇవ్వడానికి ఏ మాత్రం అవకాశం కనపించడంలేదు. ప్రస్తుతం ఐటీఐలో రెండు సంవత్సరాల కోర్సులు 12, ఏడాది కోర్సులు ఆరు ఉన్నాయి. అలాగే అధ్యాపకుల కొరత కూడా సమస్యగా ఏర్పడింది. కళాశాలలో ఉన్న అధ్యాపకుల్లో సగానికిపైగా కాంట్రాక్టు పద్ధతిలో, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తుండగా 15 పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయి. దీంతో విద్యార్థులకు విద్యాపరంగా కూడా సమస్య తలెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంపై ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ వాడ్రేవు శ్రీనివాసరావును వివరణ కోరగా ఈ ఏడాది నుంచి ప్రభుత్వం ఐటీఐలో ఆన్‌లైన్ విధానానికి చర్యలు చేపడుతుందన్నారు. అయితే ఎటువంటి ఆదేశాలు తమకు రాలేదని, కళాశాలల్లో పూర్తిస్థాయిలో సదుపాయాలు లేకపోయినా ప్రైవేట్ సంస్థల్లో పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. పరీక్షల సమయం దగ్గరపడుతుండడంతో ఈ సారి ఆఫ్‌లైన్‌లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment