ఐటిఐ కళాశాల
-
ఎస్సారెస్పీ క్యాంపులో ఎస్పీ ఆఫీస్
-
పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యాలయాల గుర్తింపు
పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యాలయాలను అధికారులు దాదాపు ఖరారు చేశారు. పట్టణంలోని ఐటీఐ బస్టాండ్, రైల్వేస్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉండడంతో ఐటీఐని కలెక్టర్ కార్యాలయానికి ప్రతిపాదించారు. కాగా, స్థానిక డీఎస్పీ నల్ల మల్లారెడ్డి, సీఐ మహేష్ పెద్దకల్వల ఎస్సారెస్పీ క్యాంపు భవనాలను గురువారం పరిశీలించి ఎస్పీ కార్యాలయాన్ని క్యాంపులో నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. ఇక్కడి ఐటీఐ 21 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఎస్సారెస్పీ క్యాంపు 20.16 ఎకరాల విస్తీర్ణ ఉంది. ఆయా కార్యాలయాలు 10 ఎకరాల లోపే నిర్వహణలో ఉన్నాయి. దాదాపు ఇక్కడి ఐటీఐ, ఎస్సారెస్పీ క్యాంపులో సగానికి సగం స్థలం ఖాళీగానే ఉంటోంది. దీంతో ఇటు ఎస్సారెస్పీ కార్యాలయాన్ని పోలీసు అధికారులు ఎస్పీ కార్యాలయం కోసం ఇష్టపడుతుండగా రెవెన్యూ అధికారులు మాత్రం ఐటీఐలో మిగులు భూమిని కలెక్టర్ కార్యాయానికి వాడుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలోనూ ఏడు ఎకరాల మిగులు భూమిని ఐటీఐ నుంచి అప్పటి ఆర్డీవో నారాయణరెడ్డి గుర్తించారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని వివిధ శాఖల కార్యాలయాను ఐటీఐ స్థలంలో నిర్మించేందుకు ప్రతిపాదించారు. తాజాగా పెద్దపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఇక ఐటీఐ స్థలాన్ని కలెక్టర్ కార్యాలయానికి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. స్వయంగా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ ఐటీఐలోనే కలెక్టర్ కార్యాలయాన్ని కొనసాగించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. పోలీసులు ఎస్సారెస్పీ క్యాంపులోనే ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించాలని చూస్తున్నారు. ఇప్పటికే పంచాయతీరాజ్, ఇరిగేషన్, ఐసీడీఎస్, సోషల్ వెల్ఫేర్ లాంటి డివిజన్ కార్యాలయాలు ఎస్సారెస్పీ క్యాంపులోనే ఉన్నాయి. కొత్తగా ఆర్టీవో కార్యాలయానికి కూడా క్యాంపు స్థలాన్ని కేటాయించారు. కొత్త జిల్లాలో సగం ప్రభుత్వ కార్యాలయాలు క్యాంపులోనే ఉండే అవకాశం ఉంది.