ఐటీఐలు కావు.. పిటీఐలు! | Recognized not admission not goingon | Sakshi
Sakshi News home page

ఐటీఐలు కావు.. పిటీఐలు!

Published Fri, Jul 24 2015 12:50 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM

ఐటీఐలు కావు.. పిటీఐలు! - Sakshi

ఐటీఐలు కావు.. పిటీఐలు!

ఐటీఐలు విద్యార్థుల పాలిట పిటీగా మారాయి. పక్కా భవనాలు లేక.. వసతుల లేమి కారణంగా క్యూసీఐ గుర్తింపునకు నోచుకోని ఈ వృత్తి విద్యాసంస్థల్లో అడ్మిషన్లు జరగలేదు.
ఐటీఐల అడ్మిషన్లు రద్దు
- పక్కా భవనాలు, వసతులు లేమి కారణం..
- క్యూసీఐ గుర్తింపు లేక అవస్థలు,
- ఇదీ జిల్లాలోని ఐటీఐల దుస్థితి
నర్సాపూర్:
జిల్లాలోని పలు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ల్లో సరైన వసతులు లేక క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) గుర్తింపు లభించనందున అడ్మిషన్లు జరగలేదు. ఐటీఐల్లో అడ్మిషన్లు ఈనెల 21 వరకు జరిగాయి. ఐటీఐల్లో వసతులు లేకపోయినా ఇప్పటి వరకు నెట్టుకువచ్చినప్పటికీ ఈసారి క్యూసీఐ నుంచి గుర్తింపు లభించక పోవడంతో అడ్మిషన్లు చేపట్టకపోవడంతో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందాల్సిందే.  ఐటీఐల్లో వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించనందున అసౌకర్యలతో ఐటీఐలు కొట్టుమిట్టాడుతున్నాయి.

జిల్లాలో ఏడు ఐటీఐలు ఉండగా సంగారెడ్డి, పటాన్‌చెరు, హత్నూర ప్రభుత్వ ఐటీఐలకు క్యూసీఐ గుర్తింపు పూర్తి స్థాయిలో ఉండడంతో  ఈసారి మూడు ఐటీఐల్లో ఉన్న అన్ని ట్రేడ్లకు అడ్మిషన్లు జరిగాయి.  మెదక్, కుకునూర్‌పల్లి, సిద్దిపేట ప్రభుత్వ ఐటీఐల్లో ఐదు నుంచి ఎనిమిది ట్రేడ్లు ఉన్నప్పటికీ అన్ని ట్రేడ్లకు క్యూసీఐ గుర్తింపు లభించనందున నామమాత్రంగా ఒక్కో ట్రేడ్‌కు మాత్రమే అడ్మిషన్లు జరగగా దుబ్బాక ఐటీఐలో అడ్మిషన్లే జరుగలేదు.
 
సమస్యల్లో ప్రభుత్వ ఐటీఐలు
క్యూసీఐ నిబంధనల మేరకు ఐటీఐలకు శాశ్వత భవనం, ఖాళీ స్థలంతో పాటు కరెంటు సరఫరా, ట్రేడ్లను బట్టి శిక్షణకు అవసరమైన యంత్రాలు, ఇతర సామగ్రితో పాటు బోధించేందుకు తగిన సిబ్బంది ఉంటేనే క్యూసీఐ అధికారులు తనిఖీల  అనంతరం  ఐటీఐలకు గుర్తింపు ఇస్తారు. క్యూసీఐ అనుమతులు ఉంటేనే అడ్మిషన్లు చేపట్టాల్సి ఉంటుంది.  జిల్లాలోని పలు ఐటీఐలకు అనుమతులు లభించకపోవడంతో   ప్రస్తుత విద్యా సంవత్సారానికి  అడ్మిషన్లు చేపట్టలేదు.  కాగా మెదక్, సిద్దిపేట ఐటీఐలకు సొంత భవనాలు లేకపోవడంతో ఇతర విద్యా సంస్థలకు చెందిన భవనాల్లో ఐటీఐలను కొనసాగిస్తున్నందున క్యూసీఐ నుంచి అనుమతులు లభించకపోవడంతో అన్ని ట్రేడ్లకు అడ్మిషన్లు జరగలేదు.

ఉన్న వసతులతో నిర్వహించే అవకాశాలు ఉన్న రెండేసి ట్రేడ్లకు అడ్మిషన్లు చేపట్టారు. కాగా  కుకునూర్‌పల్లి ఐటీఐకి భవనం, సామగ్రి ఉన్నా  అవసరమైన రెగ్యులర్ బోధనకు సిబ్బంది సరిపడినంతగా లేనందున అనుమతులు లభించలేదని, ఒకే ట్రేడ్‌కు అనుమతి లభించడంతో ఒక్క ట్రేడ్‌లోనే విద్యార్థులను చేర్చుకున్నారు. కాగా దుబ్బాక ఐటీఐలో  శిక్షణకు అవసరమైన సామగ్రి లేనందున  అనుమతులు దొరకలేదు. గత ఏడాది చేర్చుకున్న విద్యార్థులకే  ఈసారి శిక్షణ ఇవ్వనున్నారు.
 
అంతటా ఒకే సిలబస్
ప్రభుత్వ ఐటీఐల్లో అన్నింటిలో ఒకే సిలబస్ విధానాన్ని అమలు చేయడంతో క్యూసీఐ గుర్తింపు ఈసారి తప్పనిసరిగి మారింది. గతంలో పలు ఐటీఐల్లో స్టేట్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్ సిలబస్ (ఎస్సీవీటీ) అమలులో ఉండగా మరి కొన్నింటిలో నేషనల్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్ సిలబస్ (ఎన్సీవీటీ) ఉండేది. క్యూసీఐ గుర్తింపు ఉన్న ఐటీఐల్లో నేషనల్ కౌన్సిల్ ఒకేషనల్ ట్రైనింగ్ విధానం అమలవుతుంది. కాగా ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి  అంతటా నేషనల్ కౌన్సిల్ ఒకేషనల్  ట్రైనింగ్ విధానం అమలు చేయాలని నిర్ణయించడంతో క్యూసీఐ గుర్తింపు లభించక అడ్మిషన్ల ప్రక్రియ నిలిచిపోయింది.
 
పేరుకే రెసిడెన్షియల్ ఐటీఐ
రాష్ట్రంలో  మెదక్ జిల్లా హత్నూర, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ ఐటీఐలు ఏన్నాయి. కాగా హత్నూరలోని  రెసిడెన్షినల్ ఐటీఐలో చేరే విద్యార్థులకు భోజన వసతితో హాస్టల్ వసతి లేదు.
 
గుర్తింపు ఉంటేనే అడ్మిషన్లు
జిల్లాలో క్యూసీఐ గుర్తింపు ఉన్న ఐటీఐల్లో మాత్రమే  అడ్మిషన్లు చేపట్టామని ఐటీఐల జిల్లా కన్వీనర్ గురుమూర్తి తెలిపారు. పలు ఐటీఐలకు కొన్ని ట్రేడ్లకు గుర్తింపు లభించగా ఆయా ట్రేడ్లకు విద్యార్థులను ఎంపిక చేశామన్నారు.
 
ఐటీఐలో ప్రవేశం కోసం 25 నుంచి కౌన్సెలింగ్
సంగారెడ్డి మున్సిపాలిటీ:
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో మిగిలిన అన్ని కేటగిరీల్లో ఉన్న సీట్లను భర్తి చేసేందుకు ఈ నెల 25 నుంచి 27 వరకు సంగారెడ్డిలోని ఐటీఐలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ గురుమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఫస్ట్‌ఫేజ్‌లో దరఖాస్తు చేసుకొని సీట్లు రాని విద్యార్థులు,  ఫోన్లకు మెసేజ్ వచ్చిన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో  కౌన్సెలింగ్‌కు హాజరు కావాలన్నారు. ప్రైవేట్ ఐటీఐల్లో చేరాలనుకున్నా వారు కౌన్సెలింగ్ రోజున సంవత్సరానికి రూ. 7,700 ఫీజు చెల్లించాలన్నారు. ఫస్ట్ ఫేజ్‌లో సీటు వచ్చిన వారికి కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వరని, ట్రేడ్ మార్పులు ఉండవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement