ఉట్నూర్ రూరల్ : గిరిజన ప్రాంత విద్యార్థులకు పారిశ్రామి క రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీడీఏ సహాకారంతో 1984లో ఉట్నూర్‌లోని కేబీ ప్రాంగణంలో ఐటీఐని (ప్రభుత్వం గిరిజన పారిశ్రామిక శిక్షణ సంస్థ) నెలకొల్పారు. పదో తరగతి తర్వాత ఉపాధి పొందాలనుకునే విద్యార్థులు ఈ కళాశాలలో ప్రవేశాలు పొందుతారు.
ఇందులో వంద సీట్లు ఉండగా, 90 శాతం సీట్లు గిరిజనులకు.. మిగిలిన 10 శాతం ఇతరులకు కేటాయించారు. కొన్నేళ్ల వరకు పూర్తి స్థాయిలో అధ్యాపకులు ఉన్నారు. ఇటీవల వీరి కొరత విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. కళాశాలలో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్‌మన్, సివిల్, వెల్డర్, స్టెనోగ్రఫీ, కోప తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకుగాను 177 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు.
కళాశాలలో ఏడుగురు సీనియర్, ఏడుగురు జూనియర్ అధ్యాపకులు ఉండాలి. కాని ఇద్దరు మాత్రమే సీనియర్ అధ్యాపకులు ఉండగా, మిగతా పోస్టులు ఖాళీగా ఉండడంతో విద్యార్థుల చదువులు అటకెక్కుతున్నాయి. కాంట్రాక్ట్ ప్రతిపాదికనైనా అధ్యాపకులను నియమించేందుకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. ఆగస్టు 1వ తేదీ నుంచి నూతన బ్యాచ్ ప్రారంభం కానుండడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.
హాస్టల్ వసతి లేక ఇబ్బందులు
ఐటీఐలో హాస్టల్ వసతి లేక దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది మధ్యలోనే చదువు మానేస్తున్నారు. గతేడాది క్రితం అప్పటి ఐటీడీఏ పీవో రేవు ముత్యాల రాజు కళాశాల పక్కన ఉన్న ఎకరం భూమిని హాస్టల్ వసతి నిర్మాణం కోసం కేటాయించారు. కాని నిర్మాణానికి ఇంకా నిధులు మంజూరు కాలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లోనైనా నిధులు విడుదల చేసి విద్యార్థులకు వసతిగృహం నిర్మించాలని, అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఐటీఐలో అధ్యాపకుల కొరత
Published Fri, Jul 4 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 9:46 AM
Advertisement
Advertisement