25 ఐటీఐల అప్‌గ్రేడేషన్‌కు ఎల్‌ఈటీ కార్యాచరణ
తొలివిడతలో ఎంపిక చేసిన వాటి ఆధునికీకరణ, వసతుల కల్పనకు ప్రాధాన్యం
అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే ఐదు ఐటీఐలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా, ఆ దిశగా రాష్ట్ర కార్మిక శిక్షణ, ఉపాధి కల్పన విభాగం కార్యాచరణ వేగవంతం చేసింది. గతవారం సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఏటీసీ ప్రాజెక్టు కార్యరూపం దాల్చగా, మాసబ్‌టాంక్‌లో నాలుగు ఏటీసీల భవన నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలు ఉన్నాయి. వీటన్నింటినీ ఏటీసీలుగా అప్‌గేడ్ర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా, తొలివిడతలో 25 ఐటీఐలను మాత్రమే అప్‌గ్రేడ్ చేస్తారు. ఇవన్నీ 2024–25 నుంచే సేవలు ప్రారంభిస్తాయి.
తొలివిడతలోకి వచ్చే ఐటీఐలతో కూడిన ప్రతిపాదిత జాబితా ను సిద్ధం చేసేందుకు శిక్షణ, ఉపాధికల్పన శాఖ కసరత్తు చేస్తోంది. తొలివిడత ప్రాజెక్టులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోనే ఐదు ఐటీఐలు ఏటీసీలుగా మారనున్నాయి. మిగతా వాటిని కూడా ఎంపిక చేసి జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి సమరి్పంచేందుకు ఆ శాఖ చర్యలు చేపట్టింది.
ఇండస్ట్రీస్ 4.0....
అప్‌గ్రేడ్ చేసే క్రమంలో ప్రస్తుతమున్న శిక్షణ కార్యక్రమాలు సైతం కొత్తరూపు సంతరించుకోనున్నాయి. రెండుమూడు దశాబ్దాల క్రితం ఉన్న శిక్షణ కార్యక్రమాలనే ఐటీఐల్లో కొనసాగిస్తున్నారు. ఇకపై ఏటీసీల్లో సరికొత్త కోర్సులు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కోర్సుల ఎంపికపైనా కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆరు రకాల ట్రేడ్‌లు ఎంపిక చేసి వాటిని ఈ ఏడాది నుంచే ప్రవేశపెట్టేలా చర్యలు వేగవంతం చేసింది.
ఇవన్నీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(ఎన్‌సీవీటీ) నిబంధనలకు అనుగుణంగా మార్పు చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్, ఐఓటీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, మోడ్రన్ ఆటోమేటివ్ మెయింటెనెన్స్, ఆర్ట్ వెల్డింగ్, ఆరి్టఫీíÙయల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వెల్డింగ్, పెయింటింగ్ తదితర కొత్త ట్రేడ్‌లు ఏటీసీల ద్వారా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.
కొత్తగా ఇండస్ట్రీస్ 4.0 పేరిట లాంగ్‌టర్మ్, షార్ట్ టర్మ్ కోర్సులను, పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైన ట్రేడ్‌లను ఏటీసీల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. చాలా ఐటీఐల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ సమస్య, స్థలాభావం కారణంగా భవనాల సమస్య ఉండడంతో యుద్ధప్రాతిపదికన ఏటీసీలుగా మార్పు చేయడం కత్తిమీద సాములా పరిణమించిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment