రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం
వాటిలో మంజూరైన పోస్టులు 2,033... ఖాళీలు 740కి పైమాటే
సరికొత్త ట్రేడ్‌లకు అనుగుణంగా అర్హతగల ఫ్యాకల్టీ నియామకానికి ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లుగా అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో వాటిలో ఉద్యోగ ఖాళీల భర్తీపై కార్మిక ఉపాధి కల్పన విభాగం దృష్టి సారించింది. దాదాపు పదేళ్లుగా ఐటీఐల్లో ఉద్యోగ నియామకాలు జరగకపోవడంతో దాదాపు 40 శాతం కొలువులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి గతవారం కార్మిక, ఉపాధి కల్పన శాఖపై సమీక్షలో ఆదేశించారు. దీంతో ఏటీసీలవారీగా ఖాళీలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వచ్చే నెల రెండో వారంలోగా కార్మి క శాఖకు నివేదికలు సమరి్పంచనున్నారు.
ప్రతి ఏటీసీకి పూర్తిస్థాయి ప్రిన్సిపాల్...
రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఏటీసీల్లో వివిధ కేటగిరీల్లో 2,033 ఉద్యోగాలు మంజూరయ్యాయి. అందులో మూడింట రెండో వంతు శిక్షణ ఇచ్చే శిక్షకుల పోస్టులు ఉన్నాయి. దాదాపు 1,500 శిక్షకుల పోస్టుల్లో 740 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఏటీసీలవారీగా ఏయే కేటగిరీలో ఎన్ని ఖాళీలున్నాయనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏటీసీలలో కొత్త ట్రేడ్‌లను పరిచయం చేయనుంది.
పాత ట్రేడ్‌లు రద్దు చేస్తూనే వాటి స్థానంలో కొత్త ట్రేడ్‌లను ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో కొత్త ట్రేడ్‌లపై శిక్షణ ఇచ్చే శిక్షకులకు అర్హతలను ఖరారు చేస్తూ ఖాళీల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. సగానికిపైగా ఏటీసీల్లో పూర్తిస్థాయి ప్రిన్సిపాల్ లేకపోవడంతో ఇన్‌చార్జీలతోనే నెట్టుకొస్తున్నారు.
ప్రతి ఏటీసీకి తప్పకుండా ప్రిన్సిపాల్ ఉండాలని సీఎం స్పష్టం చేయడంతో ప్రిన్సిపాల్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలా లేక నూతన నియామకాల్లో భాగంగా చేపట్టాలా అనే అంశంపై కార్మిక శాఖ కసరత్తు చేస్తోంది. మరోవైపు నూతన ఏటీసీల ఏర్పాటుపైనా అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment