ఎస్పీ కార్యాలయ ఏర్పాటుకు ఐటీఐ భవనం పరిశీలన
మహబూబాబాద్ : తాత్కాలిక ఎస్పీ కార్యాలయ ఏర్పాటు కోసం పట్టణ శివారులోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ భవనాన్ని బుధవారం రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కార్యాలయ ఏర్పాటుకు భవనం అనుకూలంగానే ఉందన్నారు. ఎస్పీ కార్యాలయం, ఏఆర్ కాంప్లెక్స్ ఏర్పాటుకు ఆ భవనం చుట్టూ పరిసరాలను కూడా పరిశీలించామన్నారు. ఆ భవనం సమీపంలోనే సబ్‌జైల్ ఉండటం వల్ల భద్రత కూడా బాగానే ఉంటుందన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు. క్రైం టీమ్‌లను పెంచి చోరీలను అరికడతామన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని మూడు విభాగాలుగా చేస్తున్నామన్నారు. ఆయన వెంట డీఎస్పీ బి.రాజమహేంద్రనాయక్, సీఐలు నందిరామ్ నాయక్, ఎస్.కృష్ణారెడ్డి ఉన్నారు.