ఆ పరీక్ష రాసిన అందరూ ఫెయిల్!
అజ్మీర్: రాజస్థాన్ లోని ఓ ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్(ఐటీఐ) మొదటి సంవత్సరం తొలి సెమిస్టర్ రాసిన విద్యార్ధులందరూ అన్ని సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. అంతకంటే ఆశ్చర్యకరమైన మరో విషయం ఈ పరీక్షల్లో యాభై శాతం ప్రశ్నలు అబ్జక్టివ్ టైప్ కావడం. శనివారం ఫలితాలను చూసుకున్న విద్యార్థులు షాక్ కు గురయ్యారు. అందరికీ ప్రాక్టికల్, థియరిటికల్ పరీక్షల్లో సున్నా మార్కులు రావడంతో జోథ్ పూర్ లో నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్(ఎన్సీవీటీ)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విద్యార్థులందరికీ సున్నా మార్కులు రావడాన్ని తాము నమ్మడం లేదని టీచర్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టరుకు విద్యార్థులు వినతి పత్రాన్ని అందజేశారు. విద్యార్థులందరికీ సున్నా మార్కులు రావడంపై షాక్ కు గురయ్యామని కళాశాల ప్రిన్సిపల్ తెలిపారు. పరీక్షా ఫలితాలపై యూనివర్సిటీకు లేఖ రాసినట్లు వివరించారు. కాగా, ఈ నెల 27తో తదుపరి సెమిస్టర్ ఫీజు చెల్లింపు తేది ముగుస్తుంది. ఒకవేళ విద్యార్థులు తదుపరి సెమిస్టర్ ఫీజును చెల్లిస్తే, ప్రస్తుత ఫలితాలను అంగీకరించి సప్లిమెంటరీలో వాటిని క్లియర్ చేయాల్సివుంటుంది. ఇప్పటిలానే పోరాటం కొనసాగిస్తే ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపధ్యంలో యూనివర్సిటీ త్వరగా సమాధానం ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు.