
ఐటీఐలలో ఆకలి ‘కేక’లు
♦ ఇచ్చేది అంతంత మాత్రం...
♦ అందులోనూ నెలల తరబడి ఎదురుచూపులు
♦ కాంట్రాక్టు సిబ్బందికి అందని వేతనాలు
♦ సుమారు 12 నెలలుగా అందక అవస్థలు
♦ మూడు నెలలకు ఒకసారి కేటాయించే బడ్జెట్‌లో అరకొర నిధులు
సాక్షి, కడప : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకమునుపు ఒకమాట...వచ్చిన తర్వాత మరో మాట చెబుతూ నిరుద్యోగులతో చెలగాటమాడింది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చిన టీడీపీ సర్కార్ ఆ దిశగా చర్యలు లేకపోగా....చివరకు వారికి ఇచ్చే వేతనాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం...యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కాంట్రాక్టు సిబ్బంది అవస్థలు అన్నీ ఇన్నీ కావు. నెలకాదు..రెండు నెలలు కాదు...సుమారు పది నుంచి పన్నెండు నెలలుగా సక్రమంగా వేతనాలు రాకపోవడంతో ఐటీఐ సిబ్బంది పడుతున్న వేదన వర్ణణాతీతం.
మూడు నెలలకు ఒకసారి బడ్జెట్
సంవత్సరంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఐటీఐల్లో బడ్జెట్ రూపొందించి పంపించడం ఆనవాయితీ. అయితే భారీగా నిధులు అవసరమని బడ్జెట్‌లో ప్రతిపాదనలు పంపుతున్నా అంతంత మాత్రంగానే కేటాయిస్తున్నారు. దీంతో కాంట్రాక్టు సిబ్బంది జీతాలకు సమస్య ఏర్పడుతోంది. ఒకవేళ గట్టిగా వెళ్లి అడుగుదామంటే తాము చేసేది కాంట్రాక్టు పద్దతిపైన కాబట్టి ఉంచుతారో, తీసేస్తారోనన్న భయం వెంటాడుతోంది. మరోపక్క స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో పిల్లల ఫీజులతోపాటు తిండి అవసరాలు, ఇతర ఖర్చులు భారీగా ఉంటాయి. కనీసం ఇలాంటి పరిస్థితిలోనైనా ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టు సిబ్బందికి నిధులు విడుదల చేయాలని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఐటీఐల్లో పనిచేస్తున్న తమ ఇబ్బందులను గుర్తించి సత్వరమే నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని జిల్లాలోని ఐటీఐల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది వేడుకుంటున్నారు.
పెరిగిన ధరలతో సతమతం
జిల్లాలోని చాలా ఐటీఐలలో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందికి నెలల తరబడి వేతనాలు రావడం లేదు. జిల్లాలోని ఐటీఐల్లో ఇన్‌స్ట్రక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అటెండర్లు, వాచ్‌మెన్లు ఇలా రకరకాల సిబ్బంది పనిచేస్తున్నారు. 120 నుంచి 150 మంది వరకు జిల్లాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు 10 నుంచి 12 నెలలుగా వారికి ఇచ్చే వేతనాలు సక్రమంగా అందడం లేదు. ఇదేమని అడిగే అధికారులు లేకపోగా...చివరకు ఎలా బతుకుతున్నారని ప్రభుత్వం కూడా స్పందించిన పాపాన పోలేదని వారు వాపోతున్నారు. కాంట్రాక్టు కింద పనిచేస్తున్న సిబ్బంది వేతనాలు కూడా పెద్ద స్థాయిలో ఉండవు. అమరావతికి వచ్చే ఉద్యోగులకు మాత్రం 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని...ఇక్కడ జీతాలు రాక తిండికి అవస్థలు పడుతుంటే పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు.