సమైక్యాంధ్ర బంద్ సక్సెస్
Published Wed, Sep 25 2013 3:41 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM
ఏలూరు, న్యూస్‌లైన్:జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం నిత్యనూతనమై విరాజిల్లుతోంది. ఎన్జీవోల పిలుపుమేరకు మంగళవారం జిల్లావ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. దుకాణాలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంక్‌లు, చివరకు పాన్‌షాపులు, టీ బడ్డీలు సైతం మూతపడ్డాయి. సమైక్యవాదులు, ఉద్యోగులు ఎక్కడికక్కడ జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించారు. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, తణుకు, జంగారెడ్డిగూడెం తదితర పట్టణాలతోపాటు, గ్రామగ్రామాన బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. సమైక్యవాదులు నినాదాలు చేసుకుంటూ ఉదయం నుంచీ దుకాణాలను, కార్యాలయూలను మూయించివేశారు. వారికి మద్దతుగా వైఎస్సార్ సీపీ శ్రేణులు ముందుకు కదిలి బంద్ విజయవంతానికి సహకరించాయి. ఇదిలావుండగా, 56వ రోజు కూడా జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది,
ప్రభుత్వ ఐటీఐ, వృత్తి విద్యాశాఖ అధ్యాపకులు దీక్ష చేపట్టారు. పాలకొల్లు గాంధీబొమ్మల సెంటర్‌లో వైద్యులు దీక్షలో పాల్గొన్నారు. పోడూరు మండ లం గుమ్మలూరులో నాయూ బ్రాహ్మణులు ర్యాలీ నిర్వహించారు. చించినాడలో ఎన్జీవోలు దీక్ష చేశారు. చించినాడ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేసి రహదారి దిగ్బంధనం చేశారు. తాళ్లపూడిలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిలే దీక్షలు చేపట్టారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు రోడ్డుపైనే కబడ్డీ, షటిల్ ఆడి నిరసన తెలిపారు. చాగల్లు షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిలరీ యూనిట్ కార్మికులు, వ్యాపారులు నిరసన వ్యక్తం చేశారు. చాగల్లులో వేద పండితులు రోడ్డుపై హోమం నిర్వహించారు. కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో రహదారిని దిగ్బంధించారు. కాపవరంలో పవన్ కల్యాణ్ యూత్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కొవ్వూరు టాక్సీ స్టాండులో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో జైనులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో మద్దూరు,
కొవ్వూరు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు కూర్చున్నారు. జంగారెడ్డిగూడెంలో రాష్ట్ర ప్రధాన రహదారిని జేఏసీ నాయకులు దిగ్బంధించారు. వేలాది వాహనాలు నిలిచిపోయాయి. బోసుబొమ్మ సెంటర్‌లో జాతీయ క్రీడాకారులు రోప్ స్కిప్పింగ్ విన్యాసాలు ప్రదర్శించి నిరసన తెలిపారు. చింతలపూడిలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు రాస్తారోకో చేశారు. కామవరపుకోటలో జేఏసీ సభ్యులు జలదీక్ష చేశారు. టి.నరసాపురం మండలంలో ఆర్యవైశ్యులు భారీ ర్యాలీ నిర్వహించారు. తణుకులోను, తాడేపల్లిగూడెం సమీపంలోని జాతీయ రహదారిని ఎన్జీవోలు దిగ్బంధించారు. దువ్వలో రైతు జేఏసీ ఆధ్యర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. తాడేపల్లిగూడెం పోలీస్ ఐలండ్ సెంటర్‌లో గోనె సంచుల వ్యాపారులు మెడకు ఉరితాళ్లు ధరించి నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. మహిళా ఉద్యోగుల ప్రత్తిపాడు సెంటర్‌లో రోడ్డుపై క్రికెట్ ఆడి నిరసన తెలిపారు. నరసాపురంలో మహిళా టీ చర్లు గాలిపటాలు ఎగురవేసి నిరసన తెలిపారు.
Advertisement
Advertisement