* అందుబాటులోకి మరో 2,400 సీట్లు
* రూ. 37.74 కోట్లు కేటాయించిన కార్మిక శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కార్మికశాఖ పచ్చజెం డా ఊపింది. వాటిని త్వరతగతిన ఏర్పాటు చేయాలని నిర్ణయించి స్థలాలు అందుబాటులో ఉన్న తొ మ్మిది ప్రాంతాల్లో ఐటీఐల నిర్మాణానికి రూ. 37.74 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిగిలి న రెండు ఐటీఐల నిర్మాణానికి స్థలాలను త్వరతగతిన ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది.
రాష్ట్రంలో ప్రస్తుతం 62 ప్రభుత్వ, 250 ప్రైవేటు ఐటీఐలలో 39,029 సీట్లు ఉండగా కొత్త ఐటీఐల రాకతో మరో 2,400 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఐటీఐలను ఎక్కువగా పారిశ్రామికవాడలకు దగ్గరగా ఉన్న చోటనే ఎంపిక చేశారు.
ఐటీఐల్లోకి విద్యార్థుల క్యూ: ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులకు దీటుగా ఐటీఐలలో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. 62 ప్రభుత్వ ఐటీఐలలో 9 వేల సీట్లు, 250 ప్రైవేటు ఐటీఐలలో 28 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉండగా వొకేషనల్ ట్రైనింగ్‌లో 1,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మొదటి కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటివరకు ప్రభుత్వ ఐటీఐలలో 6,500 సీట్లు, ప్రైవేటు ఐటీఐలలో 10 వేల సీట్లు భర్తీకాగా వొకేషనల్ సర్టిఫికెట్ కోర్సు (ఎస్‌సీవీటీ)లో 750 సీట్లు భర్తీ అయ్యాయి.
భరోసా కల్పిస్తున్న కార్మికశాఖ: ఐటీఐ పూర్తి చేస్తే కచ్చితమైన ఉపాధి కలిగేలా కార్మికశాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. ప్రతి ఐటీఐకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఎంసీ)ను ఏర్పాటు చేసి ఒక్కో పరిశ్రమతో అనుసంధానించింది. తద్వారా ప్రతి విద్యార్థికీ అప్రెంటిషిప్ వచ్చేలా చూడటంతోపాటు విద్యార్థులకు నైపుణ్యశిక్షణ ఇప్పిస్తోంది. అలాగే క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశం లభించేలా కృషి చేస్తోంది. ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారికి దాదాపు నిరుద్యోగ సమస్య ఉండదనే భరోసాను అధికారులు కల్పిస్తుండటంతో డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెషినిస్ట్, టర్నర్, వెల్డర్ వంటి కోర్సులకు ఆదరణ పెరిగినట్లు అధికారులు తెలిపారు.
కొత్తగా రానున్న ఐటీఐలు
జహీరాబాద్ (మెదక్), కుల్చారం (మెదక్), మర్పల్లి (రంగారెడ్డి), తాండూరు (రంగారెడ్డి), చర్లపల్లి (రంగారెడ్డి), బిచ్‌కుంద (నిజామాబాద్), ఆసిఫాబాద్ (ఆదిలాబాద్), తాడ్వాయి (వరంగల్), కమలాపూర్ (కరీంనగర్), సిరిసిల్ల (కరీంనగర్), హుజూర్‌నగర్ (నల్లగొండ)
కొత్తగా11 ప్రభుత్వ ఐటీఐలు
Published Fri, Jul 22 2016 3:20 AM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
Advertisement
Advertisement