Government ITI
-
అస్పైర్.. ఆవిష్కరణలకు ఇన్స్పైర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన అస్పైర్(ఏ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్, రూరల్ ఇండస్ట్రీస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) ప్రభుత్వ పారిశ్రామికశిక్షణ సంస్థ(ఐటీఐ)లకు బాసటగా నిలవనుంది. గ్రామీణ యువతను సరికొత్త ఆవిష్కరణల బాటపట్టించడమే ఈ పథకం ఉద్దేశం. దీని కింద ఎంపికైన ఐటీఐలను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్ది ఇక్కడ శిక్షణ పొందుతున్నవారికి సరికొత్త కార్యక్రమాలను పరిచయం చేయనుంది. అస్పై ర్ కింద సిరిసిల్ల, వనపర్తి, ఖమ్మం, నిజామాబాద్, మేడ్చల్, కరీంనగర్ ప్రభుత్వ ఐటీఐలు ఎంపికయ్యాయి. ఒక్కో ఐటీఐ ఖాతాలోకి రూ.50 లక్షల చొప్పున కేంద్రం జమ చేసింది. ఈ నిధులతో ఐటీఐల్లో లైవ్లీవుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్(ఎల్బీఐ)లను కార్మిక, ఉపాధి కల్పన శాఖ ఏర్పాటు చేయనుంది. ఈ ఐటీఐలు సమీపంలోని పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని స్థానిక నేపథ్యంతో కూడిన సరికొత్త ఆవిష్కరణలు చేయనున్నాయి. త్వరలో మరిన్ని ఐటీఐలు ఈ పథకం పరిధిలోకి వచ్చే అవకాశముంది. ►సిరిసిల్ల ఐటీఐ: ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఎల్బీఐ ప్రధానంగా చేనేత పరిశ్రమ ఆధారంగా పనిచేయనుంది. ఈ పరిశ్రమ ఉత్పత్తులు, మార్కెట్ సవాళ్లు, లక్ష్యాలు తదితర అంశాలను అధిగమించి ఆవిష్కరణలు చేసే అవకాశం ఉంది. ►వనపర్తి ఐటీఐ: స్థానిక రైతులకు సులభతర వ్యవసాయం, మార్కెటింగ్ అంశాలపై ఐటీఐ పనిచేయనుంది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ విత్తనోత్పత్తి, ఎరువులు, విత్తనాల తయారీపై దృష్టి పెట్టనుంది. ►ఖమ్మం ఐటీఐ: వెదురుకు ప్రసిద్ధమైన ఖమ్మం ప్రాంతంలో వెదురు దిగుబడుల ప్రాసెసింగ్‌తోపాటు వీటిపై ఆధారపడిన చేతివృత్తిదారులకు మెరుగైన వసతులు సమకూర్చేదిశగా ఈ ఐటీఐ పనిచేయనుంది. ►నిజామాబాద్ ఐటీఐ: వ్యవసాయ రంగానికి కేంద్రంగా ఉన్న నిజామాబాద్ ప్రాంత రైతాంగం కోసం శిక్షణ కార్యక్రమాలు ఇవ్వనుంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పుట్టగొడుగుల పెంపకం తదితర వాటిపై ఈ ఐటీఐలోని ఎల్బీఐ పనిచేయనుంది. ►మేడ్చల్ ఐటీఐ: నగరానికి చేరువలోని ఈ ప్రాంతంలో ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటిపై మరింత అవగాహన కలిగించడం, స్థానిక యువతకు ప్రాసెసింగ్ రంగంలో ఉపాధి అవకాశాలపై అవగాహన పెంచడం, వీటికి అనుబంధంగా శిక్షణ తరగతులు నిర్వహించడం వంటి వాటిని ఈ ఎల్బీఐ పర్యవేక్షిస్తుంది. ►కరీంనగర్ ఐటీఐ: ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నప్పటికీ, కుటీర పరిశ్రమల సంఖ్య కూడా గణనీయంగా ఉంది. వ్యవసాయ రంగంతో ముడిపడి ఉన్న కుటీర పరిశ్రమల ఏర్పాటుపై ఎల్బీఐ పనిచేస్తుంది. ఫుట్‌వేర్, ఆర్నమెంట్, అత్తరు పరిశ్రమలను ప్రోత్సహించే కార్యాచరణతో ముందుకు వెళ్లనుంది. పనితీరు పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు అస్పైర్ పథకం అమలుతోపాటు ఎల్బీఐల పనితీరును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర సలహాకమిటీ, పాలకమండలిని ఏర్పాటు చేసింది. రాష్ట్రస్థాయి సలహా కమిటీకి కార్మికమంత్రి చైర్మన్‌గా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యుడిగా, కమిషనర్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ మెంబర్ కన్వీనర్‌గా, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ జనరల్, ఉపాధి, శిక్షణ శాఖ జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా కొనసాగుతారు. పాలక మండలి(గవర్నింగ్ బాడీ) చైర్మన్‌గా ఉపాధి శిక్షణా విభాగం కమిషనర్, కొనసాగుతారు. ఈ శాఖ జాయింట్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా, ఎన్ఎస్ఐసీ చీఫ్ మేనేజర్, ఎంఎస్ఎంఈ ప్రతినిధి, ఉపాధి, శిక్షణ డిప్యూటీ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కమిటీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిణి ఉత్తర్వులు జారీ చేశారు. -
కొత్తగా11 ప్రభుత్వ ఐటీఐలు
* అందుబాటులోకి మరో 2,400 సీట్లు * రూ. 37.74 కోట్లు కేటాయించిన కార్మిక శాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 11 ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కార్మికశాఖ పచ్చజెం డా ఊపింది. వాటిని త్వరతగతిన ఏర్పాటు చేయాలని నిర్ణయించి స్థలాలు అందుబాటులో ఉన్న తొ మ్మిది ప్రాంతాల్లో ఐటీఐల నిర్మాణానికి రూ. 37.74 కోట్లు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మిగిలి న రెండు ఐటీఐల నిర్మాణానికి స్థలాలను త్వరతగతిన ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 62 ప్రభుత్వ, 250 ప్రైవేటు ఐటీఐలలో 39,029 సీట్లు ఉండగా కొత్త ఐటీఐల రాకతో మరో 2,400 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఐటీఐలను ఎక్కువగా పారిశ్రామికవాడలకు దగ్గరగా ఉన్న చోటనే ఎంపిక చేశారు. ఐటీఐల్లోకి విద్యార్థుల క్యూ: ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులకు దీటుగా ఐటీఐలలో చేరేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారు. 62 ప్రభుత్వ ఐటీఐలలో 9 వేల సీట్లు, 250 ప్రైవేటు ఐటీఐలలో 28 వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉండగా వొకేషనల్ ట్రైనింగ్‌లో 1,400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది మొదటి కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటివరకు ప్రభుత్వ ఐటీఐలలో 6,500 సీట్లు, ప్రైవేటు ఐటీఐలలో 10 వేల సీట్లు భర్తీకాగా వొకేషనల్ సర్టిఫికెట్ కోర్సు (ఎస్సీవీటీ)లో 750 సీట్లు భర్తీ అయ్యాయి. భరోసా కల్పిస్తున్న కార్మికశాఖ: ఐటీఐ పూర్తి చేస్తే కచ్చితమైన ఉపాధి కలిగేలా కార్మికశాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. ప్రతి ఐటీఐకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఎంసీ)ను ఏర్పాటు చేసి ఒక్కో పరిశ్రమతో అనుసంధానించింది. తద్వారా ప్రతి విద్యార్థికీ అప్రెంటిషిప్ వచ్చేలా చూడటంతోపాటు విద్యార్థులకు నైపుణ్యశిక్షణ ఇప్పిస్తోంది. అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరికీ ఉద్యోగ అవకాశం లభించేలా కృషి చేస్తోంది. ఐటీఐ కోర్సులు పూర్తి చేసిన వారికి దాదాపు నిరుద్యోగ సమస్య ఉండదనే భరోసాను అధికారులు కల్పిస్తుండటంతో డీజిల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మోటార్ మెషినిస్ట్, టర్నర్, వెల్డర్ వంటి కోర్సులకు ఆదరణ పెరిగినట్లు అధికారులు తెలిపారు. కొత్తగా రానున్న ఐటీఐలు జహీరాబాద్ (మెదక్), కుల్చారం (మెదక్), మర్పల్లి (రంగారెడ్డి), తాండూరు (రంగారెడ్డి), చర్లపల్లి (రంగారెడ్డి), బిచ్కుంద (నిజామాబాద్), ఆసిఫాబాద్ (ఆదిలాబాద్), తాడ్వాయి (వరంగల్), కమలాపూర్ (కరీంనగర్), సిరిసిల్ల (కరీంనగర్), హుజూర్నగర్ (నల్లగొండ) -
ఐటీఐలపై నీతి ఆయోగ్ అధ్యయనం
13న రాష్ట్రంలో పర్యటన సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఐటీఐల పనితీరును పరిశీలించేందుకు నీతి ఆయోగ్ బృందం ఈనెల 13న రాష్ట్రంలో పర్యటించనుంది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్, మల్లేపల్లి ఐటీఐలను పరిశీలించనుంది. ఐటీఐల నిర్వహణలో సమూలమైన మార్పులు తీసుకురావటంతో పాటు ప్రైవేట్ ఐటీఐల ఆగడాలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఈ అధ్యయనం చేస్తోంది. అలాగే వొకేషనల్ ట్రైనింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (వీటీఐపీ) పేరిట కేంద్ర ప్రభుత్వం ఐటీఐలకు మంజూరు చేసిన నిధుల వినియోగం, ప్రాజెక్టు ఫలితాలు, వైఫల్యాలను తెలుసుకోనుంది. రాష్ట్రంలోని 60 ప్రభుత్వ ఐటీఐల్లో 41 కేంద్రాలకు కేంద్రం వీటీఐపీలో భాగంగా రూ.3.50 కోట్లు కేటాయించింది. కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం ఇవ్వాల్సి ఉంది. గతేడాది 11 కాలేజీలకు కేంద్రం ఈ నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తమ వంతు వాటా విడుదల చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్టు అమల్లో ఉన్న ఐటీఐల్లోనూ నిరాశాజనకమైన శిక్షణ, నిర్వహణ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. మరోవైపు ప్రైవేటు ఐటీఐలు అడ్డగోలు ఫీజులు, సీట్ల అమ్మకంతో చెలరేగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేసేందుకు నీతి ఆయోగ్ బృందం క్షేత్ర స్థాయి అధ్యయనం చేస్తోందని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య తెలిపారు. -
పైసలివ్వకుంటే.. ఫెయిలే
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ప్రభుత్వ ఐటీఐలో పైసా ఖర్చు లేకుండా రెండేళ్లు కోర్సు పూర్తిచేస్తే ఉ ద్యోగం వస్తుందన్న ఆశపడే పేద విద్యార్థులను దురాశాపరులు సొమ్ముల కో సం పీడిస్తున్నారు. కాకినాడలోని ప్రభు త్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ)లో అక్రమ వసూళ్లు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఐటీఐలో రెగ్యులర్ ఇన్స్ట్రక్టర్లలో కొందరు చేస్తున్న దందాపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐటీఐ రెండో సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 15న థియరీ, ప్రాక్టికల్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. సుమా రు 238 మంది ఇన్‌స్ట్రమెంటల్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ వంటి పది ట్రేడుల్లో పరీక్షలు రాస్తున్నారు. ఏటా ఈ పరీక్షల సమయంలో కొందరు ఇన్స్ట్రక్టర్లు సొమ్ములు గుంజడం ఆనవాయితీగా మారిందని, ఈ ఏడాది కూడా ఒక్కో పేపర్‌కు రూ.2000 వంతున వసూలు చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలకు వారం ముందు నుంచే.. పరీక్షలు మొదలు కావడానికి వారం ముందుగానే కొందరు ఇన్స్ట్రక్టర్లు వసూళ్ల బాధ్యతను తమకు అనుకూలురైన కొందరు విద్యార్థులకు అప్పగిం చారు. అక్రమ వసూళ్ల లక్ష్యం రూ.20 లక్షల పైమాటే. రెండో సంవత్సరంలో ఒక్కో విద్యార్థీ రెండు థియరీ, రెండు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కావాలి. పేపర్‌కు రూ.2000 వంతున నాలుగింటికి రూ.8000 వసూలు చేశారని తల్లిదండ్రులు కన్నీరుపెట్టుకున్నారు. ఈ ఐటీఐలో చదువుతున్న వారంతా పేదకుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులే. 100 మార్కులున్న థియరీ పేపర్‌కు 40 పాస్ మార్కులు. మిగిలిన మూడు పేపర్లు ఒక్కొక్కటి 50 మార్కులకు నిర్వహిస్తున్నారు. వీటిలో ఒక్కో పేపర్‌కు 20 మార్కులు వస్తే ఉత్తీర్ణులైనట్టే. ఇవి కాక ప్రాక్టికల్స్‌లో 300 మార్కులకు 180 వస్తే ఉత్తీర్ణులైనట్టే. విద్యార్థులు అభ్యసించేది ఏ ట్రేడ్ అయినా ఉత్తీర్ణతా మార్కులు మాత్రం మారవు. ఇన్స్ట్రక్టర్లు ఎక్కడ ఉత్తీర్ణతకు అడ్డుపడతారోనని అప్పులు చేసి అడిగినంతా సమర్పించుకున్నామని పేర్లు చెప్పడానికి భయపడుతున్న కొందరు తల్లిదండ్రులు ‘సాక్షి’కి తెలిపా రు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే భవిష్యత్తులోనైనా ఈ అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట పడుతుందన్న ఆశతోనే ఈ విషయాన్ని బయటకు చెప్పాల్సి వచ్చిందన్నారు. వసూళ్లు వాస్తవమైతే చర్యలు : ప్రిన్సిపాల్ వసూళ్ల విషయమై ఐటీఐ ప్రిన్సిపాల్ డి.భూషణంను వివరణ కోరగా విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. బ లవంతపు వసూళ్లపై విద్యార్థులు ఫి ర్యాదు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిం చగా.. విచారించి వాస్తవమైతే చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. ఐటీఐ విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇన్‌స్ట్రక్టర్లపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నగర కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీ సుకోకుంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామన్నారు. -
వాకాడు ఐటీ ఐపై ఏసీబీ పంజా
వాకాడు, న్యూస్‌లైన్: అక్రమాలకు నిలయంగా మారిన వాకాడులోని ప్రభుత్వ ఐటీఐపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పంజా విసిరారు. ఈ ఐటీఐలో కొందరు అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతూ పేద విద్యార్థుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమాచారం అందుకున్న అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం మెరుపుదాడి చేశారు. ఐటీఐలో అక్రమంగా ఉన్న 2 లక్షల 13 వేల 700 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. వాకాడులోని ప్రభుత్వ ఐటీఐలో మోటార్ మెకానిక్, ఇన్‌స్ట్‌మ్రెంట్ మెకానిక్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సీఓఈ) ట్రేడ్లు నిర్వహిస్తున్నారు. వీటిలో 120 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. వీరికి వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాల్సిన అధికారులు రకరకాల సాకులతో డబ్బులు గుంజడం ప్రారంభించారు. థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ చే యిస్తామంటూ రూ.2 వేలు, రికార్డులు, యూనిఫాం కోసమంటూ రూ.2 వేలు వసూలు చేస్తున్నట్లు ఏసీబీకి సమాచారం అందింది. హాజరు తక్కువైనా నెలకు వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. దీంతో స్పందించిన ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు తన బృందంతో మంగళవారం పకడ్బందీ ప్రణాళికతో ఐటీఐపై మెరుపుదాడి చేశారు. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ శైలజ నుంచి లక్షా 13 వేల రూపాయలు, డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ రవి నుంచి రూ.12,400, సెలవులో ఉన్న ట్రైనింగ్ ఆఫీసర్ మస్తాన్ (ఆయన కింద పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగి కిరణ్ అక్కడే ఉన్నారు) బీరువాలోని రూ.83,700ను స్వాధీనం చేసుకున్నారు. ఓ టేబుల్ డెస్క్‌లో 4,600 లభించాయి. ఈ అక్రమ వసూళ్లకు సూత్రధారులుగా అనుమానిస్తూ ప్రిన్సిపల్ కరిముల్లాతో పాటు శైలజ, రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్థుల నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. రాత్రి 7 గం టల వరకు అధికారులు ఐటీఐలోనే తనిఖీలు చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిస్తామని, అక్కడ నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు చెప్పారు. ఆయన వెంట సీఐలు చంద్రమౌళి, కె.వెంకటేశ్వర్లు, ఎం.కృపానందం, సిబ్బంది షఫీ, కుద్దూస్, సుధాకర్ తదితరులు ఉన్నారు. భారీగా గుంజారు పేదలమైన తమ నుంచి ఐటీఐ సిబ్బంది భారీగా గుంజారని విద్యార్థులు ఆరోపించారు. వివిధ రకాల సాకులు చెబుతూ నగదు వసూలు చేసేవారని చెప్పారు. హాజరు తక్కువైతే నెలకు వెయ్యి రూపాయలు చెల్లిస్తే కానీ కళాశాలకు రానిచ్చేవారు కాదని తెలిపారు. ఈ అక్రమ నగదు, వసూళ్లు వ్యవహారంతో తనకేం సంబంధం లేదని ప్రిన్సిపల్ కరిముల్లా అన్నారు.