వాకాడు ఐటీ ఐపై ఏసీబీ పంజా | home turned against the government's anti-corruption | Sakshi
Sakshi News home page

వాకాడు ఐటీ ఐపై ఏసీబీ పంజా

Published Wed, Oct 30 2013 3:37 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

home turned against the government's anti-corruption

వాకాడు, న్యూస్‌లైన్: అక్రమాలకు నిలయంగా మారిన వాకాడులోని ప్రభుత్వ ఐటీఐపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు పంజా విసిరారు. ఈ ఐటీఐలో కొందరు అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతూ పేద విద్యార్థుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమాచారం అందుకున్న అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం మెరుపుదాడి చేశారు. ఐటీఐలో అక్రమంగా ఉన్న 2 లక్షల 13 వేల 700 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ప్రిన్సిపల్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఏసీబీ అధికారుల కథనం మేరకు..
 
 వాకాడులోని ప్రభుత్వ ఐటీఐలో మోటార్ మెకానిక్, ఇన్‌స్ట్‌మ్రెంట్ మెకానిక్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సీఓఈ) ట్రేడ్‌లు నిర్వహిస్తున్నారు. వీటిలో 120 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. వీరికి వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాల్సిన అధికారులు రకరకాల సాకులతో డబ్బులు గుంజడం ప్రారంభించారు. థియరీ, ప్రాక్టికల్ పరీక్షల్లో పాస్ చే యిస్తామంటూ రూ.2 వేలు, రికార్డులు, యూనిఫాం కోసమంటూ రూ.2 వేలు వసూలు చేస్తున్నట్లు ఏసీబీకి సమాచారం అందింది. హాజరు తక్కువైనా నెలకు వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది.
 
 దీంతో స్పందించిన ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు తన బృందంతో మంగళవారం పకడ్బందీ ప్రణాళికతో ఐటీఐపై మెరుపుదాడి చేశారు. కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ శైలజ నుంచి లక్షా 13 వేల రూపాయలు, డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ రవి నుంచి రూ.12,400, సెలవులో ఉన్న ట్రైనింగ్ ఆఫీసర్ మస్తాన్ (ఆయన కింద పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగి కిరణ్ అక్కడే ఉన్నారు) బీరువాలోని రూ.83,700ను స్వాధీనం చేసుకున్నారు. ఓ టేబుల్ డెస్క్‌లో 4,600 లభించాయి. ఈ అక్రమ వసూళ్లకు సూత్రధారులుగా అనుమానిస్తూ ప్రిన్సిపల్ కరిముల్లాతో పాటు శైలజ, రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
 విద్యార్థుల నుంచి కూడా కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది. రాత్రి 7 గం టల వరకు అధికారులు ఐటీఐలోనే తనిఖీలు చేశారు. ఈ వ్యవహారంపై  ప్రభుత్వానికి నివేదిస్తామని, అక్కడ నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రావు చెప్పారు. ఆయన వెంట సీఐలు చంద్రమౌళి, కె.వెంకటేశ్వర్లు, ఎం.కృపానందం, సిబ్బంది షఫీ, కుద్దూస్, సుధాకర్ తదితరులు ఉన్నారు.
 
 భారీగా గుంజారు
 పేదలమైన తమ నుంచి ఐటీఐ సిబ్బంది భారీగా గుంజారని విద్యార్థులు ఆరోపించారు. వివిధ రకాల సాకులు చెబుతూ నగదు వసూలు చేసేవారని చెప్పారు. హాజరు తక్కువైతే నెలకు వెయ్యి రూపాయలు చెల్లిస్తే కానీ కళాశాలకు రానిచ్చేవారు కాదని తెలిపారు. ఈ అక్రమ నగదు, వసూళ్లు వ్యవహారంతో తనకేం సంబంధం లేదని ప్రిన్సిపల్ కరిముల్లా అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement