నెల్లూరు(పొగతోట): పేదలకు పట్టెడన్నం పెట్టేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపంపిణీ పథకం అస్తవ్యస్తంగా మారిం ది. అధికారులు మామూళ్లకు కక్కుర్తి పడుతుండటంతో పేదల బియ్యం హద్దులు దాటుతున్నాయి. ప్రజాపంపిణీ వ్యవస్థలో కమీషన్ల కహానీ పర్వం నడుస్తోంది. నెలనెలా లక్షల రూపాయలు లంచాల రూపంలో అధికారుల జేబుల్లోకి చేరుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో 8,55,271 రేషన్ కార్డులున్నాయి. తెలుపు కార్డులు 7,13,241, ఏఏపీ 1052, వైఏపీ 65,953, ర్యాప్‌టాప్ కూపన్లు 75,025 ఉన్నాయి. 3,773 రేషన్ షాపులు ఉన్నాయి. 12,101.249 మెట్రిక్ టన్నుల బియ్యం, 8,55,271 ప్యాకెట్ల పామాయిల్, చక్కెర, కంది పప్పు సర ఫరా చేస్తున్నారు. రెండు నెలల నుంచి పామాయిల్ పంపిణీ చేయడం లేదు. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ షాపులకు బియ్యం, కందిపప్పు సరఫరా చేస్తారు. సరఫరా చేసిన బియ్యం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను తహశీల్దారు, డీటీ, సీఎస్‌డీటీలు పర్యవేక్షించాల్సి ఉంది. సీఎస్‌డీటీలు మాత్ర మే షాపులను పరిశీలిస్తున్నారు.
సీఎస్‌డీటీలు రేషన్ షాపుల వద్దకు వెళ్లి పరిశీలించి ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగు పరచాలి. అవకతవకలు కప్పిపుచ్చి రికార్డులు సక్రమంగా ఉన్నాయని నమోదు చేసినందుకు రేషన్ షాపు డీలర్లు సీఎస్‌డీటీలకు ప్రతి నెలా మామూళ్లు సమర్పించుకుంటున్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించేవారు సైతం వారికి మామూళ్లు సమర్పించాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో డీలర్ నుంచి కార్డులను బట్టి రూ.500 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా సుమారు రూ.20 లక్షలకు పైగా చేతులు మారుతున్నట్టు విమర్శలు ఉన్నాయి.
మామూళ్ల వ్యవస్థ చాపకింద నీరులా సాగుతోంది. అధికారులు శ్రీరంగనీతులు బాగా చెబుతారని, చివరికి తమ మందలేదని అందినకాడికి దండుకుంటున్నారని డీలర్లు వాపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు పరిశీలనకు వచ్చిన సమయంలో వారికి డీలర్లు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు.అధికారులకు లంచాలు ఇవ్వడానికి డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. బియ్యాన్ని దొడ్డి దారిన హద్దులు దాటిస్తున్నారు. రేషన్ బియ్యం దొంగచాటుగా రైస్ మిల్లర్లకు విక్రయిస్తున్నారు. మిల్లర్లు డీలర్ల వద్ద కొనుగోలు చేసిన బియ్యాన్ని రిసైకిలింగ్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగు పరచాల్సి ఉంది.
మామూళ్లు వసూలు చేసే
వారిపై కఠిన చర్యలు :
ప్రజాపంపిణీ వ్యవస్థను మెరుగు పరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. మామూళ్లు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. క్రమం తప్పకుండా రేషన్ షాపుల తనిణీలు నిర్వహించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలను నివారించేందుకు కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. రేషన్ షాపుల్లో అక్రమాలు జరిగితే ఫిర్యాదు చేయవచ్చు. దానిపై విచారణ జరింపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
- శాంతకుమారి, డీఎస్‌ఓ
షరా మామూళ్లే..
Published Wed, Jun 25 2014 2:38 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement