సాక్షి, నెల్లూరు: అధికార పార్టీ నేతలు తానా అంటే అధికారులు తందానా అంటున్నారు. తెలుగు తమ్ముళ్లు స్థలాలు ఆక్రమించినా, అక్రమంగా భవనాలు నిర్మించినా వాటి జోలికెళ్లేందుకు జంకే అధికార గణం, ప్రత్యర్థి పార్టీల ఇళ్లను కూల్చమంటే ఆఘమేఘాల మీద పరుగులు తీస్తున్నారు. జిల్లాలో అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంకటాచలం మండలంలోని సర్వేపల్లిలో ఐదేళ్లుగా నిర్మిస్తున్న ఎస్‌ఆర్‌కే స్కూల్ భవనాలను అధికారులు గత శుక్రవారం ఉదయం కూల్చివేశారు. భవనాన్ని అక్రమంగా నిర్మిస్తున్నారంటూ సాకులు చూపారు.
అయితే దీనికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు అధికారులు కూడా పాఠశాల స్థలాన్ని పరిశీలించారు. వాస్తవాల పరిశీలనకు రెండు వారాల గడువు ఇచ్చారు. ఈ నెల 11న హైకోర్టులో వాయిదా ఉంది. అయినా అధికార పార్టీనేత ఒత్తిడితో స్థానిక అధికారులు పాఠశాల గదులను కూల్చారు. కనీసం విద్యాశాఖాధికారులకు కూడా సమాచారం లేదు. ఈ పాఠశాలలో 400 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్కూలు యాజమాన్యం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విజయం కోసం కృషి చేసేందనే అక్కసుతోనే ఈ చర్యలకు తెగబడ్డారు. అధికార పార్టీ నేత ఒత్తిడి మేరకు అధికారులు నిర్మాణాలను కూల్చేసినట్లు తెలిసింది.
పేరుకు మాత్రం ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలంటూ ముద్రవేశారు. ఐదేళ్లుగా నడుస్తున్న ఈ పాఠశాల జోలికి వెళ్లని అధికారులు, ఇప్పుడు హడావుడిగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లుగా వారికి ఆక్రమణలు ఎందుకు కనిపించలేదో వారికే తెలియాలి. కేవలం అధికారపార్టీ ఒత్తిళ్లతోనే స్కూల్ గదుల కూల్చివేత జరిగినట్లు స్పష్టమవుతోంది.అధికారాన్ని అడ్డుపెట్టి కక్షపూరిత చర్యలకు దిగుతున్నారనడానికి ఇది ఓ నిదర్శనం.
అధికార పార్టీ మద్దతుదారులైతే..
టీడీపీ మద్దతుదారులై భారీ స్థాయిలో ప్రభుత్వ భూములను ఆక్రమించి, అక్రమ కట్టడాలు చేపట్టినా అధికారులు వాటి జోలికెళ్లడం లేదు. వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీలోని బురాన్‌పూర్ వద్ద నిర్మించిన లక్ష్మీఫోర్డ్ కార్ల ఏజెన్సీ వారు సమీపంలోని గంగిరెడ్డి చెరువులో 68 సెంట్ల స్థలాన్ని ఆక్రమించి భవనాలను నిర్మించారు. ఈ ఆక్రమణలపై అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఏడాది క్రితం నామమాత్రంగా ఆక్రమణలను తొలగించి చేతులు దులుపుకున్నారు. ఆక్రమణలను, అక్రమ కట్టడాలను పూర్తిగా తొలగించిన పాపాన పోలేదు. కంపెనీకి చెందిన వారు ఇప్పటికీ ప్రభుత్వ స్థలాన్ని తమ స్వాధీనంలో ఉంచుకొని ఉపయోగించుకుంటున్నారు. అధికారులు మాత్రం వారి జోలికెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది.
నెల్లూరులోనూ ఆక్రమణల వెల్లువ
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నెల్లూరులో ఆనం సోదరుల హవా కొనసాగింది. కార్పొరేషన్‌ను తమ చేతల్లో పెట్టుకుని అధికారం చెలాయించిన నేతలు ఆక్రమణలు, అక్రమ కట్టడాలతో భారీగా ఆర్జించారు. అధికారిక లెక్కల ప్రకారమే నెల్లూరులో 5 వేలకు పైగా ఆక్రమణలు, అక్రమకట్టడాలు ఉన్నాయి. వాస్తవంగా అయితే వీటి సంఖ్య రెట్టింపుగా ఉంటుందని అంచనా. ఆక్రమించిన వేలాది ఎకరాల భూముల్లో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్లు కొల్లగడుతున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం. అదే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వారి స్థలాలు వివాదాల్లో చిక్కుకుంటే వెంటపడి వేధిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంత దారుణమా..!
Published Thu, Aug 7 2014 3:12 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement