పడకేసిన పాలన
సాక్షి, నెల్లూరు: ఎన్నికల కోడ్ ముగిసి నెల కావస్తోంది. ప్రభుత్వం ఏర్పడి వారం దాటింది. అయినా ప్రభుత్వ కార్యాలయాల్లో పనితీరు మాత్రం గాడిలో పడలేదు. అధికారులు పూర్తిస్థాయిలో పనిలో దిగలేదు. కొందరు తాము పని చేస్తున్న కార్యాలయాలకు కూడా వెళ్లని పరిస్థితి. మరోవైపు కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు పలురకాల సర్టిఫికెట్లు అవసరం. మీసేవల పనితీరు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయినా సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో అటు ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోనూ పరిపాలన స్తంభించింది. అదే సమయంలో రాష్ట్రపతి పాలన, ఆ తర్వాత వరుస ఎన్నికల నేపథ్యంలో అధికారులు ఎన్నికల నిర్వహణ పనులకే పరిమితం అయ్యారు. కోడ్ నేపథ్యంలో మండల పరిషత్, రెవెన్యూకు సంబంధించి దాదాపు అధికారులందరూ ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. కొత్త అధికారులు వచ్చినా కేవలం ఎన్నికల పనులు మినహా మిగిలిన ప్రజాసమస్యల పరిష్కారం జోలికి వెళ్లలేదు. దీంతో నాలుగు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనులుకాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మండల పరిషత్, రెవెన్యూ, విద్య తదితర శాఖల్లో పనులు జరగక పోవడంతో ప్రజలు ముఖ్యంగా విద్యార్థుల బాధలు వర్ణణాతీతం. జిల్లా వ్యాప్తంగా 36 మంది ఎంపీడీఓలు బదిలీపై వెళ్లి బుధవారం రాత్రి తిరిగి తమ స్వస్థానాలకు చేరారు. గురువారం నాటికి కూడా వారు పూర్థి స్థాయిలో విధుల్లో చేరలేదు. వేసవి నేపథ్యంలో గత రెండునెలలుగా జిల్లా వ్యాప్తంగా పలు పట్టణాలు, వందలాది గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది.
పంచాయతీల్లో నీటిసమస్యతో పాటు మిగిలిన సమస్యలను పరిష్కరించాల్సిన మండల పరిషత్ అధికారులు లేకపోవడంతో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉండిపోయాయి. ఇక ఉపాధిహామీ పనుల పర్యవే క్షణ బాధ్యతలు సైతం ఎంపీడీఓల పైనే ఉన్నప్పటికీ అవి కూడా సక్రమంగా సాగే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు పాఠశాలలు ప్రారంభమయ్యా యి. జిల్లా వ్యాప్తంగా పలుపాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. ప్రాథమిక పాఠశాలల పర్యవేక్షణ బాధ్యత ఎంపీడీఓలకూ ఉంది. పాఠశాలల ప్రారంభ సమయానికి పై సమస్యలు పరిష్కరించాల్సి ఉంది.
కానీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇక రెవెన్యూలోనూ అదే పరిస్థితి. జిల్లాలో ఒకరిద్దరు తప్ప తహశీల్దార్లందరూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇతరప్రాంతాలకు బదిలీపై వెళ్లారు. వారు కూడా ఇటీవలే తిరిగి వచ్చినా పూర్తిస్థాయిలో పనిలో పడలేదు. దీంతో ప్రజలతో పాటు విద్యార్థులకు తిప్పలు తప్పడంలేదు. ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్‌తో పాటు కుల ధ్రువీకరణ, ఆదాయం, నివాస ధ్రువీకరణ తదితర సర్టిఫికెట్లు విద్యార్థులకు అవసరం. మీసేవలో దరఖాస్తు చేసుకొన్నా ధ్రువీకరించాల్సింది రెవెన్యూ అధికారులే కావడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు అందలేదు. ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశ గడువు ముగిసింది. రెవెన్యూ అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారాలకొద్దీ పడిగాపులు కాసినా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందలేదు.
ఇక జిల్లాలో గత రెండునెలలుగా వివిధ రకాల పెన్షన్లు అందక వృద్ధులు, వికలాంగులు తదితరులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు కార్పొరేషన్ పాటు మున్సిపాలిటీలలోనూ పాలన స్తంభించిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. మున్సిల్ అధికారులు, సిబ్బంది సైతం ఇంకా మత్తువదలి పూర్తిస్థాయిలో కార్యాలయాలకు వచ్చి పనులు చేస్తున్న దాఖలాలు లేవు. దీంతో ఇక్కడి ప్రజలు వివిధ రకాల సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన అధికారుల సంగతి పక్కన పెడితే జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు సైతం అదే మాదిరిగా ఉంది. అందరూ ఎన్నికల కోడ్ మూడ్ నుంచి బయటపడలేదు. అంతా స్తబ్ధత నెలకొంది. చాలా మంది అధికారులు కార్యాలయాలకు సక్రమంగా రాకపోవడంతో పనులు జరగక ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. మరోవైపు ఈ నెల 8న చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరింది.
తానుగొప్ప పరిపాలన దక్షుడినని గొప్పలు పోయే బాబు పాలనలోనూ ప్రభుత్వ పాలన కొనసాగక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేం పాలన అంటూ ఇటు అధికారులపైనా, చంద్రబాబు పాలనపైనా జనం మండిపడుతున్నారు.