అధికార దాసోహం
సాక్షి, నెల్లూరు: జిల్లాలో కొంత మంది అధికారులు అధికాహారానికి దాసోహమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ వేదికగా చైర్మన్ ఎన్నిక సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై జనం మండిపడుతున్నారు. సాక్షాత్తు కొందరు అధికారులే తమ సహచరుల వ్యవహారశైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
కేవలం అధికార పార్టీని గెలిపించడం కోసం అధికారులు వేస్తున్న సర్కస్ ఫీట్లను చేసి జిల్లా ప్రజానీకం అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది. జిల్లా పరిషత్ ఎన్నికలలో మొత్తం 46 స్థానాలకు గాను 31 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ సభ్యులు విజయం సాధించి తిరుగులేని మెజార్టీ సొంతం చేసుకోగా టీడీపీ కేవలం 15 స్థానాలతో సరిపెట్టుకొంది. అయినా కేవలం అధికార బలంతో జెడ్పీ చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో టీడీపీ నాయకులు అధికారులను అడ్డుపెట్టి గేమ్‌కు తెరలేపారు. ైవె ఎస్సార్‌సీపీ సభ్యులను ప్రలోభపెట్టడంతో పాటు భయపెట్టడం వరకూ జిల్లా పోలీసు యంత్రాంగం కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే.
కావలి రూరల్ జెడ్పీటీసీ పెంచలమ్మ తన ప్రాణం పోయినా గెలిపించిన పార్టీని వదలి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అయితే స్థానిక పోలీసు అధికారి పట్టుబట్టి పెంచలమ్మ కుటుంబ సభ్యులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 13 న సాక్షాత్తు జిల్లా పోలీసు బాసు నేతృత్వంలోనే ఇక్కడి పోలీసులు పెంచలమ్మను తీవ్రస్థాయిలో బెదిరించి అధికార పార్టీకి అప్పగించేంత వరకూ నిద్రపోలేదు. అంతటితో వదలకుండా తాజాగా నెల్లూరుకు చెందిన ప్రముఖన్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డిని హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసేందుకు మంగళవారం విఫలప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు పోలీసులే ఈ పనికి దిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ తరపున జెడ్పీ ఎన్నిక అక్రమాలను కోర్టు దృష్టికి తెచ్చేందుకు న్యాయవాది ప్రయత్నించగా పోలీసులే అడ్డకునే ప్రయత్నానికి దిగడంపై ప్రజాస్వామికవాదులు తీవ్రంగా తప్పుపడుతున్నారు.
అధికారులు పచ్చ చొక్కాలు తొడుక్కొని మరీ దిగజారి పని చేయడం దారుణమని అన్ని వర్గాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక రెవెన్యూ వర్గాలైతే మరీ బరితెగించి పని చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. తాజాగా మరికొందరు జెడ్పీటీసీలు అధికార పార్టీకి మద్దతు పలికేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా బాలాయపల్లి జెడ్పీటీసీ సభ్యురాలిని అధికార పార్టీకి మద్దతు తెలిపేలా చేసేందుకు ఇద్దరు రెవెన్యూ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సభ్యురాలి సోదరుడిపై రెవెన్యూ అధికారులు గత వారం రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. సోదరి అయిన జెడ్పీటీసీ సభ్యురాలు అధికార పార్టీకి మద్దతు తెలిపేలా చేయక పోతే ‘నీ ఉద్యోగం ఊడుతుంది’ అనే స్థాయిలో అధికారులు బెదిరిస్తున్నట్లు సమాచారం. జెడ్పీ ఎన్నిక తిరిగి 20న నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ విజయానికి అధికారులు పనిచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.