district parishyat
-
అధికార దాసోహం
సాక్షి, నెల్లూరు: జిల్లాలో కొంత మంది అధికారులు అధికాహారానికి దాసోహమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా పరిషత్ వేదికగా చైర్మన్ ఎన్నిక సందర్భంగా అధికారులు వ్యవహరించిన తీరుపై జనం మండిపడుతున్నారు. సాక్షాత్తు కొందరు అధికారులే తమ సహచరుల వ్యవహారశైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేవలం అధికార పార్టీని గెలిపించడం కోసం అధికారులు వేస్తున్న సర్కస్ ఫీట్లను చేసి జిల్లా ప్రజానీకం అసహ్యించుకునే పరిస్థితి నెలకొంది. జిల్లా పరిషత్ ఎన్నికలలో మొత్తం 46 స్థానాలకు గాను 31 స్థానాల్లో వైఎస్సార్సీపీ సభ్యులు విజయం సాధించి తిరుగులేని మెజార్టీ సొంతం చేసుకోగా టీడీపీ కేవలం 15 స్థానాలతో సరిపెట్టుకొంది. అయినా కేవలం అధికార బలంతో జెడ్పీ చైర్మన్ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో టీడీపీ నాయకులు అధికారులను అడ్డుపెట్టి గేమ్‌కు తెరలేపారు. ైవె ఎస్సార్సీపీ సభ్యులను ప్రలోభపెట్టడంతో పాటు భయపెట్టడం వరకూ జిల్లా పోలీసు యంత్రాంగం కీలక పాత్ర పోషించిన విషయం అందరికీ తెలిసిందే. కావలి రూరల్ జెడ్పీటీసీ పెంచలమ్మ తన ప్రాణం పోయినా గెలిపించిన పార్టీని వదలి వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. అయితే స్థానిక పోలీసు అధికారి పట్టుబట్టి పెంచలమ్మ కుటుంబ సభ్యులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 13 న సాక్షాత్తు జిల్లా పోలీసు బాసు నేతృత్వంలోనే ఇక్కడి పోలీసులు పెంచలమ్మను తీవ్రస్థాయిలో బెదిరించి అధికార పార్టీకి అప్పగించేంత వరకూ నిద్రపోలేదు. అంతటితో వదలకుండా తాజాగా నెల్లూరుకు చెందిన ప్రముఖన్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డిని హైదరాబాద్‌లో కిడ్నాప్ చేసేందుకు మంగళవారం విఫలప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. నెల్లూరు పోలీసులే ఈ పనికి దిగారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్సీపీ తరపున జెడ్పీ ఎన్నిక అక్రమాలను కోర్టు దృష్టికి తెచ్చేందుకు న్యాయవాది ప్రయత్నించగా పోలీసులే అడ్డకునే ప్రయత్నానికి దిగడంపై ప్రజాస్వామికవాదులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. అధికారులు పచ్చ చొక్కాలు తొడుక్కొని మరీ దిగజారి పని చేయడం దారుణమని అన్ని వర్గాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఇక రెవెన్యూ వర్గాలైతే మరీ బరితెగించి పని చేస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. తాజాగా మరికొందరు జెడ్పీటీసీలు అధికార పార్టీకి మద్దతు పలికేలా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా బాలాయపల్లి జెడ్పీటీసీ సభ్యురాలిని అధికార పార్టీకి మద్దతు తెలిపేలా చేసేందుకు ఇద్దరు రెవెన్యూ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సభ్యురాలి సోదరుడిపై రెవెన్యూ అధికారులు గత వారం రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. సోదరి అయిన జెడ్పీటీసీ సభ్యురాలు అధికార పార్టీకి మద్దతు తెలిపేలా చేయక పోతే ‘నీ ఉద్యోగం ఊడుతుంది’ అనే స్థాయిలో అధికారులు బెదిరిస్తున్నట్లు సమాచారం. జెడ్పీ ఎన్నిక తిరిగి 20న నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ విజయానికి అధికారులు పనిచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
స్వతంత్రంగా, నిర్భయంగా ఎన్నిక నిర్వహించండి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికను స్వంతంత్రంగా, నిర్భయంగా నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని గురువారం హైకోర్టు ఆదేశించింది. ఇది టీడీపీ నాయకులకు మింగుడు పడటం లేదు. నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు ప్రత్యేక దృష్టి సారించింది. వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ ఎన్నికల సమయంలో వీరంగం చేయడాన్ని వీడియో చూసి తెలుసుకున్న కోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికకు ప్రత్యేక పరిశీలకుడిని నియమించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఎన్నికల ప్రాంగణం వద్ద బ్యారికేడ్లు నిర్మించాలని, సీటింగ్ ఏర్పాట్లు చేపట్టాలని, సభ్యులు తమ స్థానం నుంచి లేవకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఎన్నిక ప్రక్రియలో ఎటువంటి అడ్డంకులు లేకుండా చేపట్టాలని సూచించింది. ఈ ప్రక్రియను వీడియోలో చిత్రీకరిచి కోర్టుకు అందజేయాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు భుజాలు తడుమకుంటున్నారు. జెడ్పీ ఎన్నికల సమయంలో తాము ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడలేదని అంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యే రామకృష్ణ కలెక్టర్ వద్దకు వెళ్లి శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలని మాత్రమే కోరారని, ఆ సమయంలో ఆయన చేయి తగిలి, మైకు కింద పడిపోయిందని, తప్పంతా వైఎస్సార్‌సీపీదేనని చెప్పుకొస్తున్నారు. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత నెల్లూరులో ఆ పార్టీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో తాము వైఎస్సార్సీపీ సభ్యులకు ఓటు వేసేందుకు స్వాతంత్య్రం ఇవ్వాలని మాత్రమే కోరామని అన్నారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యులు చేతులు నరికేస్తామని, తలలు తీస్తామని బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. అటువంటి వారిపై కేసులు పెట్టకుండా, తమ ఎమ్మెల్యే చేయి పొరపాటున తగిలిన కారణంగా మైకు పడిపోతే, దానికి నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఆవేశంతో ఊగి పోయారు. ఆయనపై ఉన్న నాన్‌బెయిలబుల్ కేసు ఉపసంహరించుకోవాలని సాక్షాత్తు కలెక్టర్‌నే సోమిరెడ్డి హెచ్చరించడం గమనార్హం. కురుగొండ్లపై కేసు తొలగించకపోతే, వైఎస్సార్సీపీ నేతల మీద కూడా కేసులు దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులను ఓటు వేయకుండా నిర్బంధించి, గోవాకు తీసుకెళ్లారన్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం నాయకులు వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు కనిపించడం లేదని వారి బంధువులతో కేసు పెట్టించడం గమనార్హం. ఇందకూరిపేట జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకటరమణయ్య సహ జెడ్పీటీసీలతో క్యాంపులో ఉన్నారు. అయితే ఆయన సోదరి ప్రభావతి బందెల వెంకటరమణయ్య కనిపించడం లేదని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ప్రభావతితో బలవంతంగా తెలుగుదేశం నేతలు కేసు పెట్టించినట్లు తెలిసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఒక మహిళా కార్పొరేటర్ కిడ్నాప్‌నకు గురైనట్లు కేసు పెట్టారు. అయితే ఆమె నేరుగా మేయర్ ఎన్నికల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. -
ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతా
ఎర్రగుంట్ల: ‘జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చి దిద్దుతా. రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలబెడతా. నాకు లభించిన పదవిని ప్రజాసేవకే అంకితం చేస్తా. ప్రతి పల్లె ప్రగతి పథంలో పయనించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా’ అని జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికైన గూడూరు రవి పేర్కొన్నారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ వివరాలివి. ప్రశ్న: జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నిక కావడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జవాబు: జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికవుతానని నేను కలలో కూడా ఊహించలేదు. నేను సామాన్య కుటుంబంలో జన్మించాను. మాది ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామం. వ్యవసాయ కూలీగా, డ్రైవర్‌గా పనిచేసుకుంటూ ఉండేవాడిని. మా గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి కృష్ణారెడ్డి ఆశీస్సులతో జెడ్పీటీసీగా విజయం సాధించాను. ఆ తర్వాత మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీటీసీల సహకారంతో నన్ను జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఓ సామాన్య వ్యక్తిగా ఉన్న నాకు జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. ఈ పదవికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా. మొత్తానికి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం నాకెంతో ఆనందంగా ఉంది. నాకు లభించిన ఈ పదవిని ప్రజా సేవకే అంకితం చేస్తా. ప్రశ్న: జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. వాటి పరిష్కారానికి ఏం చేస్తారు? జవాబు: అవును జిల్లాలో అనేక సమస్యలున్నాయి. వాటి పరిష్కారానికి అనుభవజ్ఞులైన మా పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటాను. ఈ సమస్యలను పరిష్కరించాలంటే నిధులు కావాలి. ప్రస్తుతం మాది ప్రతిపక్ష పార్టీ. మా పార్టీ నేతల సహకారంతో ప్రభుత్వంతో పోరాడి తగినన్ని నిధులు విడుదల చేయించి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చి దిద్దుతా. ప్రశ్న: ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు? జవాబు: మహానేత వైఎస్ హయాంలో జిల్లాలో అన్ని విధాలా అభివృద్ధి జరిగింది. ఆయన మరణం తర్వాత అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుతం జిల్లాలో చాలా గ్రామాల్లో రోడ్లు లేవు. తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య పరిస్థితి అధ్వాన ంగా ఉంది. ఈ అంశాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను. అలాగే గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తాను. ప్రశ్న: జిల్లా అభివృద్ధి కోసం ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? జవాబు: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తా. ప్రతి పథకాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రచారం కల్పిస్తా. గ్రామాల్లో వివిధ చేతి వృత్తులపై ఆధారపడి బతికేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారంద రూ ఆర్థికంగా పురోగతి సాధించేందుకు ఇలాంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే అన్ని మండలాలకు జెడ్పీ నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడతా. -
గులాబీ పవర్..
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక జిల్లాలో కొత్త రాజకీయాలకు తెరలేపింది. టీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహంతో కాంగ్రెస్, టీడీపీని దెబ్బకొట్టింది. ఈ రెండు పార్టీల్లోని జెడ్పీటీసీ సభ్యులను తమవైపునకు తిప్పుకుని జెడ్పీ పీఠం కైవసం చేసుకుంది. ఈ ప్రక్రియలో జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు కుదేల య్యాయి. 24 జెడ్పీటీసీ సభ్యులతోపాటు పార్టీ టికెట్ దక్కకపోవడంతో రెబెల్‌గా పోటీ చేసి గెలిచిన తాడ్వాయి సభ్యురాలితో కలిపి కాంగ్రెస్‌కు 25 మంది బలం ఉంది. మొత్తం జెడ్పీటీసీ సభ్యుల్లో సగం ఉన్నా.. జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలో దారుణంగా దెబ్బతినడంతో కాంగ్రెస్‌లో నైరాశ్యం నెలకొంది. సాధారణ ఎన్నికల ఫలితాలతో సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు జెడ్పీ ఎన్నిక మరింత ఇబ్బందికరంగా మారింది. జెడ్పీ చైర్పర్సన్ పదవి పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గానికే దక్క డం ఇప్పుడు కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారిం ది. గత ఎన్నికల సమయంలో తన పలుకుబడితో సొంత నియోజకవర్గానికి జెడ్పీ చైర్పర్సన్ పదవి వచ్చేలా చేసుకున్న పొన్నాలకు... ఇప్పుడు ప్రత్యర్థి పార్టీలో అలాగే జరగడం ఇబ్బందికరంగా మారింది. మెజారిటీ జెడ్పీటీసీ సభ్యులు ఉన్నా... జెడ్పీ పీఠాన్ని చేజార్చుకోవడంతో పొన్నాలపై సొంత పార్టీ నేతల విమర్శలు ఇంకా పెరిగే పరిస్థితి కనిపిస్తోంది. విభేదాలతోనే... జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాల్లో కాంగ్రెస్ 24, టీఆర్ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. తాడ్వాయి జెడ్పీటీసీ సభ్యురాలు సైతం కాంగ్రెస్ రెబల్‌గా పోటీ చేసినవారే. ఇలా 25 మంది సభ్యులు ఉండడంతో కాంగ్రెస్‌కే జెడ్పీ పీఠం దక్కుతుందని అంతా భావించారు. సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో మొదలైన విభేదాలు ఇప్పుడు జెడ్పీ పీఠం చేజారడానికి కారణమయ్యాయి. కాంగ్రెస్ టిక్కెట్ దక్కపపోవడంతో రెబల్ అభ్యర్థిగా నర్సంపేటలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్ క్యాంపు నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని నెక్కొండ జెడ్పీటీసీ సభ్యురాలు బక్కి కవితకు చైర్పర్సన్ పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు. పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దుగ్యాల శ్రీనివాసరావు... తన నియోజకవర్గ పరిధిలోని జెడ్పీటీసీ సభ్యురాలికి చైర్పర్సన్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇక్కడే విభేదాలు మొదలయ్యాయి. సొంత జిల్లా కావడంతో పీసీసీ చీఫ్ పొన్నాల జోక్యం చేసుకోకపోవడంతో విభేదాలు తారాస్థారుుకి చేరుకున్నారుు. చివరకు దుగ్యాల శ్రీనివాసరావు తన నియోజకవర్గ పరిధిలోని ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులను కాంగ్రెస్ క్యాంపులో చేరకుండా చేశారు. ఇది టీఆర్ఎస్కు అనుకూలంగా మారింది. మద్దతు కోసం దుగ్యాల శ్రీనివాసరావుతో వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి చర్చలు జరిపారు. దుగ్యాల అంగీకారం తెలపడంతో... టీఆర్ఎస్ జెడ్పీ పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నించింది. కాంగ్రెస్ క్యాంపులో వైస్ చైర్పర్సన్ పదవి విషయంలో వచ్చిన విభేదాలను టీఆర్ఎస్ అనుకూలంగా మార్చుకుంది. నెల్లికుదురు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాంభరత్ కాంగ్రెస్ నుంచి జెడ్పీ వైస్ చైర్పర్సన్ పదవి ఆశించారు. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో ఈ పదవి బీజేపీ జెడ్పీటీసీ సభ్యుడికి ఇవ్వాలని నిర్ణయించిందన్న సమాచారంతో శ్రీరాంభరత్ క్యాంప్‌ను వీడారు. ఈయనను టీఆర్ఎస్ దగ్గరికి తీసుకుంది. సాధారణ ఎన్నికల్లో ఓటమితో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి స్తబ్దుగా ఉండిపోయారు. కాంగ్రెస్ క్యాంపు విషయం లో ఈయన అంటిముట్టనట్లుగానే ఉన్నారు. భూపాలపల్లి సెగ్మెంట్‌తో సంబంధాలు ఉన్న టీఆర్ఎస్ నేత కొండా మురళీధర్‌రావు చిట్యాల, శాయంపేట జెడ్పీటీసీ సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చేలా చేశారు. టీడీపీకి చెం దిన ఆరుగురు సభ్యుల మద్దతు తీసుకునే విషయంలోనూ కాంగ్రెస్ నేతల విభేదాలే ఆ పార్టీకి ప్రతికూలంగా మారాయి. ఫలితంగా కాంగ్రెస్‌కు జెడ్పీ పద వి దక్కకపోవడంతోపాటు సొంత పార్టీకి చెందిన నల్ల అండాలు (దేవరుప్పుల), బన్నెపాక గణేష్ (పాలకుర్తి), శ్రీరాంభరత్(నెల్లికుదురు), వంగాల రమాదేవి (శాయంపేట), బాకి లలిత(కొడకండ్ల), కాట్రేవులు సాయిలు (చిట్యాల) టీఆర్ఎస్కు మద్ద తు ఇచ్చారు. టీడీపీ ఖాళీ... జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఆరు స్థానాలు దక్కించుకుంది. సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజునే టీడీపీ సభ్యుల సంఖ్య రెండుకు పడిపోయింది. చైర్పర్సన్ ఎన్నికలో టీడీపీకి చెందిన అంగోతు కవిత(గీసుగొండ), చెట్టుపల్లి మురళీధర్(నల్లబెల్లి), సుకినె రజిత(దుగ్గొండి), మోటపోతుల శివశంకర్(ఘణపురం)లు జెడ్పీచైర్‌పర్సన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థికి మద్దతు తెలిపారు. టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ వైస్ చైర్పర్సన్ అయినప్పటికీ... ఈయన ఈ ఎన్నికకు స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఈ నలుగురు సభ్యులు టీడీపీకి స్వస్తి పలికినట్లేనని తెలుస్తోంది. టీడీపీకి చెందిన కొత్తగూడ జెడ్పీటీసీ సభ్యురాలు దేశిడి అరుణమ్మ ఎన్నిక కార్యక్రమంలోనే ఉన్నా... ఎవరికీ మద్దతు తెలపలేదు. టీడీపీకి చెందిన రాయపర్తి జెడ్పీటీసీ సభ్యురాలు వంగాల యాకమ్మ ఎన్నికలో పాల్గొనలేదు. -
మైండ్‌గేమ్‌కు చెక్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జెడ్పీ చైర్మన్ ఎన్నికకు ఒక రోజు ముందు నుంచి టీడీపీ నాయకులు మైండ్‌గేమ్ రాజకీయానికి తెరదీశారు. కుట్రలు, కుతంత్రాలు, మాయమాటలతో జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఎత్తులు వేస్తున్నారు. అయితే వీరి ప్రయత్నాలను వైఎస్సార్సీపీ నేతలు తిప్పికొడుతున్నారు. జిల్లాలోని 46 జెడ్పీటీసీలకు గాను ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 31, టీడీపీ 15 దక్కించుకున్నాయి. ఎవరు జెడ్పీ చైర్మన్ కావాలోనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, టీడీపీ నాయకులు మాత్రం నీచరాజకీయాలకు పాల్పడుతున్నా రు. వైఎస్సార్సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రలోభాల కు పాల్పడుతూ వృథా ప్రయాసపడుతున్నా రు. వారి వద్దకు స్వయంగా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వెళ్లి నయానో..భయానో ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎనిమిది మంది సభ్యులు తమ వైపే ఉన్నారని, మీరొక్కరు వస్తే చాలు టీడీపీ గెలుస్తుందని చెబుతూ, అందరినీ బతిమాలుకుంటున్నట్లు తెలిసింది. ఇదే మాట అందరికీ చెబుతున్నారని సమాచారం. మీరొక్కరొస్తే చాలు అంటూ అందరిని కోరుతూ, వారిని ప్రలోభాలకు గురి చేస్తున్నారని సమాచారం. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని అధిక శాతం ఎంపీపీలు వైఎస్సార్సీపీ దక్కించుకోవడంతో పట్టుకోల్పోతున్నామని భయపడుతున్న టీడీపీ నేతలు జెడ్పీ చైర్మన్ పీఠంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మే యర్ పదవిని పోగొట్టుకోవడంపై సీఎం చంద్రబాబు జిల్లా నాయకుల మీద అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో చంద్రబాబును శాంతపరి చేందుకు జిల్లా నాయకులు జెడ్పీ పీఠంపై దృష్టి పెట్టారని, భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదని తెలిసింది. ఓ వైపు ప్ర లోభాలకు గురిచేస్తూనే మరోవైపు అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. కార్పొరేషన్ ఎన్నికల తరహాలో వైసీపీ నాయకులను రెచ్చగొట్టే ప్ర యత్నం చేస్తున్నట్లు సమాచారం. వైసీపీ నాయకులను రెచ్చిపోతే, ఏర్పడే గందరగోళ పరిస్థితిని ఆసరాగా తీసుకుని, ఎన్నికను వాయిదా వేయించుకునేలా కుట్ర ప న్నుతున్నారని వైసీపీ నాయకులు ఆరోపిం చారు. కార్పొరేషన్ మేయరు ఎన్నికల్లో ర హస్య బ్యాలెట్ పెట్టాలని, తమ ప్రాణాల కు రక్షణ కల్పించాలని డిమాండు చేస్తూ, ఎన్నికలు వాయిదా వేయాలని కోరారని చెప్పారు. అదే తరహాలో ఈ ఎన్నికను కూ డా తప్పుదారి పట్టించే యత్నం చేస్తున్నార ని తెలిపారు. 31 మంది జెడ్పీటీసీ సభ్యు లు తమ వద్దే ఉండగా, వారి కుటుంబ స భ్యుల ద్వారా బేరాలు మాట్లాడుతున్నార ని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. మీరొస్తే చాలు గెలిచి పోతామని అందరి వద్ద చెప్పుకుని, ఒకొక్కరని తమ వైపుకు తిప్పుకోవాలనే ప్రయత్నాలకు తమ జెడ్పీటీసీ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో లొంగరని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. జెడ్పీ పీఠం వైఎస్సార్సీపీదే : ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి టీడీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా, 31 మంది జెడ్పీటీసీ సభ్యులు మా వెంటే ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్ తరహాలో జెడ్పీ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంటాం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ కుట్రలు పన్నుతోంది. ఆ పార్టీ నేతల మైండ్ గేమ్‌ను వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ సభ్యులు పట్టించుకోరు. అడ్డదారుల్లో జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడడం మంచి పద్ధతి కాదు. -
జడ్పీ చైర్‌పై సస్పెన్స్
సాక్షి, గుంటూరు : జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికపై టీడీపీ మళ్ళీ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన టీడీపీ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ముస్లింలకు సీటు కేటాయించలేకపోయామని, జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ముస్లింలకు కేటాయించి ఆ అపప్రధ పోగొట్టుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండల జెడ్పీటీసీ షేక్ జానీమూన్ పేరును జిల్లాపార్టీ సమావేశంలో ప్రకటించారు కూడా. ఇదే విషయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు పలువురు నేతలు అప్పట్లో అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళగా ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అంతేకాకుండా తాడికొండ జెడ్పీటీసీ వడ్లమూడి పూర్ణచంద్రరావును జెడ్పీ వైస్ చైర్మన్‌గా అదే సమయంలో ప్రకటించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి టీడీపీ అధికారంలోకి రావడంతో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలపై అనేక మంది కన్ను పడింది. దీనికితోడు సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీ తరఫున విజయం సాధించడంతో ఎవరికి వారే వారివారి వర్గాలకు చెందిన జెడ్పీటీసీలకు ప్రాధాన్యం కల్పించే పనిలో పడ్డారు. మరోవైపు ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు గుంటూరులో ప్రమాణస్వీకారం చేసిన రోజే జిల్లాకు చెందిన ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. మంత్రి వర్గంలో స్థానం దక్కించుకోలేని సీనియర్లు అలకబూనిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులైనా తాము చెప్పిన వారికి కేటాయించాలని వారు పట్టుపడుతుండగా, మరోవైపు మంత్రి పదవులు దక్కించుకున్న ఇరువురు కూడా తమ మాట నెగ్గించుకునేందుకు పైరవీలు సాగిస్తుండటంతో ఎంపిక గందరగోళంగా మారింది. ముస్లింలకు మరోసారి మొండి చెయ్యి...? జిల్లాలో టీ డీపీ నాయకులు ముస్లింలకు మరోసారి మొండిచెయ్యి చూపనున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లలో ఒక్కటి కూడా ముస్లింలకు కేటాయించని టీడీపీ జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఆ వర్గానికి చెందిన షేక్ జానీమూన్‌కు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్థానాన్ని బీసీ వర్గానికి చెందిన అమృతలూరు జెడ్పీటీసీ డాక్టర్ పృధ్వీలతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు వైస్ చైర్మన్ స్థానాన్ని తమ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించాలని కాపునాడు నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గతంలో ప్రకటించిన తాడికొండ జెడ్పీటీసీ వడ్లమూడి పూర్ణచంద్రరావుకు కూడా వైస్ ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలు లేవని చెబుతున్నారు. దీనికితోడు ఈయన అభ్యర్థిత్వాన్ని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యతిరేకిస్తున్నారనే వాదనలూ ఉన్నాయి. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో ఎవరిమాట నెగ్గుతుందో... ఎవరిని ఈ పదవులు వరిస్తాయోనని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
పీఠం కోసం పాకులాట
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాకోర్టులో విఫలమయ్యాం. అధినేత మెప్పుపొందాలంటే జిల్లా పరిషత్ పాలకమండల్ని కైవసం చేసుకుందాం. పక్కా వ్యూహం అమలు చేయండి. అధికారపార్టీ హోదా, అవసరమైతే డబ్బు దేనికైనా వెనుకాడవద్దు. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి జెడ్పీ చేరేందుకు విశ్వప్రయత్నం చేయండి. జిల్లా పది నియోజకవర్గాలకు చెందిన టీడీపీ సమావేశంలో చేసుకున్న తీర్మాణమిది’. మరో పదహారు మంది జెడ్పీటీసీల మద్దతు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు విస్తృతంగా శ్రమిస్తున్నారు. వైఎస్సార్సీపీ సభ్యుల్లో సహకారం అందించే వారెవరైనా ఉన్నారా? అని గోతికాడ నక్కలా పడిగాపులు గాస్తున్నారు. జిల్లాలో 39 జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 11స్థానాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 50 జెడ్పీటీసీలున్నా 26స్థానాలు దక్కించుకున్నవారికి పాలకమండలి సొంతం కానుంది. ప్రజావిశ్వాసంతో నెగ్గలేకపోయిన తెలుగుదేశం పార్టీనేతలు ఎంతటి అనైతిక చర్యకైనా పాల్పడి జిల్లా పరిషత్‌కు కైవసం చేసుకోవాలనే తపనలో ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకోసం కోట్లు ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఇరువురు నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా కాకుండా జెడ్పీటీసీల బంధువుల ద్వారా పురమాయిస్తున్నట్లు సమాచారం. ఎస్సీ సభ్యుడు లేకపోయినా.. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎస్సీ జనరల్‌కు రిజర్వుడు అయింది. అయితే తెలుగుదేశం పార్టీ గెలుపొందిన 11మందిలో ఎస్సీ సభ్యుడు లేరు. ఎస్సీ సభ్యుడు లేకపోయినా పాలకమండలి కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అత్యాశ పడుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఆర్. శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో ఈ తతంగం నడుస్తున్నట్లు సమాచారం. గత ఐదు రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నా వైఎస్సార్సీపీ సభ్యులు ఇసుమంత కూడా చలించనట్లు సమాచారం. టీడీపీ ఎత్తుగడలను ఎక్కడికక్కడ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వంపై గెలుపొందిన తాము మండల పరిధిలోనే ఉన్నామని, మీలాగా నీతి తక్కువ పనులు చేయలేమని ఓ ఎమ్మెల్సీతో వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ ఒకరు బహిరంగంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. అధికారంలో ఉండగా ప్రజావిశ్వాసం పెంపొందించుకోవడం వైపు దృష్టి సారించకుండా అనైతికత వైపు అడుగులేస్తుండటాన్ని పలువురు పార్టీ సీనియర్ నేతలే తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది. -
22న జెడ్పీలో సమీక్ష సమావేశం
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 22వ తేదీన ఈఓఆర్డీ, ఎంపీడీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లాపరిషత్ సీఈఓ సూర్యప్రకాష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ భవనంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ఉంటుందన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణ, గుర్తించిన జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో బాలికలకు విశ్రాంతి గదులు, ప్రహరీల నిర్మాణం, ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహణ, తాగునీటి సమస్యల పరిష్కారం, బోర్ల నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, 2014-15 మండల పరిషత్ బడ్జెట్ రూపకల్పన తదితర అంశాలపై చర్చ ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ, డీఈఈ, ఏఈ, ఏఈఈలంతా హాజరు కావాలని సూర్యప్రకాష్ కోరారు.