జడ్పీ చైర్‌పై సస్పెన్స్
సాక్షి, గుంటూరు : జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికపై టీడీపీ మళ్ళీ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించిన టీడీపీ సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ముస్లింలకు సీటు కేటాయించలేకపోయామని, జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ముస్లింలకు కేటాయించి ఆ అపప్రధ పోగొట్టుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దీంతో ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను మండల జెడ్పీటీసీ షేక్ జానీమూన్ పేరును జిల్లాపార్టీ సమావేశంలో ప్రకటించారు కూడా.
ఇదే విషయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు పలువురు నేతలు అప్పట్లో అధినేత చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్ళగా ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. అంతేకాకుండా తాడికొండ జెడ్పీటీసీ వడ్లమూడి పూర్ణచంద్రరావును జెడ్పీ వైస్ చైర్మన్‌గా అదే సమయంలో ప్రకటించారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడి టీడీపీ అధికారంలోకి రావడంతో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలపై అనేక మంది కన్ను పడింది. దీనికితోడు సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీ తరఫున విజయం సాధించడంతో ఎవరికి వారే వారివారి వర్గాలకు చెందిన జెడ్పీటీసీలకు ప్రాధాన్యం కల్పించే పనిలో పడ్డారు. మరోవైపు ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు గుంటూరులో ప్రమాణస్వీకారం చేసిన రోజే జిల్లాకు చెందిన ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబులు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి.
మంత్రి వర్గంలో స్థానం దక్కించుకోలేని సీనియర్లు అలకబూనిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులైనా తాము చెప్పిన వారికి కేటాయించాలని వారు పట్టుపడుతుండగా, మరోవైపు మంత్రి పదవులు దక్కించుకున్న ఇరువురు కూడా తమ మాట నెగ్గించుకునేందుకు పైరవీలు సాగిస్తుండటంతో ఎంపిక గందరగోళంగా మారింది.
ముస్లింలకు
మరోసారి మొండి చెయ్యి...?
జిల్లాలో టీ డీపీ నాయకులు ముస్లింలకు మరోసారి మొండిచెయ్యి చూపనున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లలో ఒక్కటి కూడా ముస్లింలకు కేటాయించని టీడీపీ జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఆ వర్గానికి చెందిన షేక్ జానీమూన్‌కు ఇస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ స్థానాన్ని బీసీ వర్గానికి చెందిన అమృతలూరు జెడ్పీటీసీ డాక్టర్ పృధ్వీలతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు వైస్ చైర్మన్ స్థానాన్ని తమ సామాజిక వర్గానికి చెందిన వారికే కేటాయించాలని కాపునాడు నాయకులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గతంలో ప్రకటించిన తాడికొండ జెడ్పీటీసీ వడ్లమూడి పూర్ణచంద్రరావుకు కూడా వైస్ ఛైర్మన్ పదవి దక్కే అవకాశాలు లేవని చెబుతున్నారు. దీనికితోడు ఈయన అభ్యర్థిత్వాన్ని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు వ్యతిరేకిస్తున్నారనే వాదనలూ ఉన్నాయి. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికలో ఎవరిమాట నెగ్గుతుందో... ఎవరిని ఈ పదవులు వరిస్తాయోనని టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.