సాక్షి, హైదరాబాద్: నగరంలో జీహెచ్‌ఎంసీ మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. చికెన్, మటన్ షాపులు విషయంలో వీరిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ప్రస్తుతం మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్‌ఎంసీలో హాట్ టాఫిక్ అంశంగా మారింది.
వివరాల ప్రకారం..‘కలుషిత, అపరిశుభ్రమైన, నాణ్యత లేని నాన్‌వెజ్ విక్రయాలు జరుపుతూ చికెన్ మార్కెట్ నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. భరించలేని దుర్వాసన, ఎలుకల సంచారం.. తక్షణమే చికెన్ మార్కెట్‌ను సీజ్ చేయండి’.. ఈ నెల 22న కోఠిలోని మోతీ మార్కెట్‌లో ఆకస్మిక పర్యటన సందర్భంగా మేయర్ అధికారులకు చేసిన ఆదేశాలివి.. మేయర్ ఆదేశాల మేరకు చికెన్ సెంటర్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి సీజ్ చేసే ప్రయత్నం చేశారు.
మరోవైపు.. మేయర్ ఆదేశాలు ఇచ్చి 24 గంటలు గడవక ముందే ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మిర్జా రహమత్ బేగ్ సీజ్ చేసిన చికెన్, మటన్ షాపులు తెరవకపోతే ఉద్యోగాలు పోతాయంటూ ఫుడ్ సేఫ్టీ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోసారి తమ దుకాణాలపై దాడులు చేస్తే చర్యలు తప్పవంటూ మందలించారు. మేయర్ ఆదేశాలు డోంట్‌కేర్..ఇంట్లో ఎలుకలు ఉన్నాయని, ఇంటిని సీజ్ చేసుకుంటామా? అంటూ ఎమ్మెల్సీ బేగ్ మేయర్ తనిఖీల తీరును ఎండగట్టారు.
దీంతో, మేయర్ వర్సెస్ ఎంఐఎం ఎమ్మెల్సీ వ్యవహారం జీహెచ్‌ఎంసీలో హాట్ టాఫిక్ అంశంగా మారింది. మేయర్ తీరుపై ఎంఐఎం ప్రజాప్రతినిధులు గుర్రుగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడి క్యాంటీన్ విషయంలోనూ మేయర్ తరచూ జోక్యం చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతున్న క్రమంలో ఎమ్మెల్సీ బేగ్ మేయర్ ఆదేశాలకు ధీటుగా నిలబడి విమర్శలు గుప్పిస్తుండడంపై అటు అధికారుల్లో, ఇటు కార్పొరేటర్లలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది.
Comments
Please login to add a commentAdd a comment