సాక్షి, ఢిల్లీ: రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారమని చెప్పుకొచ్చారు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇదే సమయంలో తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు అని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వజ్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఢిల్లీలో కాంగ్రెస్ సంవిదాన్ రక్షక్ అభియాన్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ..‘రాజ్యాంగం అనేది కేవలం ఒక పుస్తకం కాదు. అది వేల సంవత్సరాల భారతదేశ ఆలోచనల సమాహారం. సత్యం, అహింసలతో ముడిపడి ఉంది. రాజ్యాంగంలో సావర్కర్ జీ స్వరం ఉందా? అని ప్రశ్నించారు. హింసకు గురిచేయాలి, మనుషులను చంపాలి, అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడపాలి అని ఎక్కడైనా రాసిందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Delhi: At the Constitution Day program at Talkatora Stadium, Lok Sabha LoP & Congress MP Rahul Gandhi says, "Does it (Constitution) have Savarkar ji's voice? Is it written somewhere in it that violence should be used, people should be killed or that the govt should be… https://t.co/tYELczHI6E pic.twitter.com/vIaY4TRBXY
— ANI (@ANI) November 26, 2024
ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ మాట్లాడుతూ..‘తెలంగాణలో కులగణన చరిత్రాత్మక అడుగు. అక్కడ కుల గణన మొదలు పెట్టాం. కుల గణనలో అడిగే ప్రశ్నలు ఒక గదిలో కూర్చొని 15 మంది రూపొందించలేదు. కులగణనలో అడిగే ప్రశ్నలు తెలంగాణ ప్రజలే డిజైన్ చేశారు. ఇది ప్రజా ప్రక్రియ. భవిష్యత్‌లో కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కుల గణన చేస్తాం.
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఏం చేసినా సరే కుల గణన ద్వారా రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితి ఎత్తివేస్తాం. కుల గణన అనేది నేను పార్లమెంట్‌లో రాజ్యాంగంపై చేసిన హామీ. కుల గణనను పాస్ చేసి చూపిస్తా. అందరికీ సమాన హక్కు కోసం పోరాడుతున్నాం. కుల గణన ద్వారా ప్రజా సమాచారం తెలుస్తుంది. దీని ద్వారా పాలసీలు నిర్ణయించబడతాయి. ఐదు ఆరు శాతం ఉన్న వారు దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కులగణన జరుగుతోంది. అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కాంగ్రెస్‌తోనే సాధ్యం. అందుకే కులగణన సర్వే చేపట్టాం. దేశవ్యాప్తంగా కుల గణన అనేది కాంగ్రెస్ ఆధ్వర్యంలో సాధించే సామాజిక న్యాయం. ఇది మూడో ఉద్యమం. దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ నెహ్రూ నుంచి ఇందిరా గాంధీ వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయం వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం మొదటి దశ సాధిస్తే... రాజీవ్ గాంధీ హయాంలో 18 ఏళ్లకే ఓటు హక్కు.. మండల్ కమిషన్ నివేదిక వంటి కార్యక్రమాలతో సామాజిక న్యాయం 2.0 పూర్తయింది. ఇప్పుడు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో కుల గణనకు సామాజిక న్యాయం 3.0 ప్రారంభమైంది. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ మహా యుద్ధం ప్రకటించారు. ఆయన బాటలో నడుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సామాజిక, ఆర్థిక, కుల సర్వే మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో సర్వే 92 శాతం పూర్తయింది.
పదేళ్లుగా దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, రాజ్యాంగ రక్షణకు రాహుల్ గాంధీ దేశ వ్యాప్త ఉద్యమం చేపట్టారు. రాహుల్ చేపపట్టిన ఉద్యమంలో ప్రజలు భాగస్వాములైనందునే మోదీ 400 వందల సీట్లు అడిగితే ప్రజలు కేవలం 240 సీట్లకు పరిమితం చేశారు. దేశవ్యాప్తంగా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ప్రజలు ఓడిస్తున్నారు.. ఇందుకు వయనాడ్, నాందేడ్ లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం. మహారాష్ట్రలో బీజేపీ కూటమి గెలిస్తే, జార్ఖండ్‌లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. రాజ్యాంగ రక్షణ ఉద్యమం కేవలం రాహుల్ గాంధీకి పరిమితమైన అంశంగా అనుకోవద్దు. మనమంతా అందులో భాగస్వాములు కావాలి. ప్రస్తుత పోరాటం రాజ్యాంగ రక్షకులు.. రాజ్యాంగ శత్రువుల మధ్యనే ఉందని గుర్తుంచుకోవాలి. మహాత్మా గాంధీ పరివార్ రాజ్యంగ రక్షణకు పూనుకుంటే.. మోదీజీ పరివార్ అంటే సంఘ్ పరివార్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని విమర్శించారు.
ఇక, అంతకుముందు వయనాడ్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీని కలిసి సీఎం రేవంత్, భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment