ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా? | Fact Check On Maharashtra Congress Candidate Get Zero Votes Viral Video | Sakshi
Sakshi News home page

ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?

Published Tue, Nov 26 2024 7:32 PM | Last Updated on Tue, Nov 26 2024 7:52 PM

Fact Check On Maharashtra Congress Candidate Get Zero Votes Viral Video

ఎన్నికల్లో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌(EVM)ల పనితీరుపై రాజకీయ వర్గాల్లోనే కాదు.. జనాల్లోనూ చాలా అనుమానాలే ఉన్నాయి. ఊహించని రీతిలో వెలువడే ఫలితాలే.. ఆ అనుమానాల్ని బలపరుస్తుంటాయి. అలాంటప్పుడే గో బ్యాక్‌ టూ బ్యాలెట్‌ పేపర్‌ అనే వాయిస్‌ వినిపిస్తుంటుంది. అయితే లోపాల సంగతిని పక్కనపెట్టి.. అవకతవకలకు ఆస్కారం లేదంటూ ఎన్నిక సంఘం, కేంద్రం వాటి వినియోగాన్ని సమర్థిస్తుంటాయి. తాజాగా.. ఇవాళ సుప్రీం కోర్టు సైతం బ్యాలెట్‌ పేపర్లను వెనక్కి తేలేమంటూ తేల్చి చెప్పింది. ఇదిలా ఉంటే..

మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలపై ప్రజాగ్రహం వెల్లువెత్తిందంటూ ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాఢి ఘోర పరాభవం చవిచూసింది. కాంగ్రెస్‌ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసి.. కేవలం 16 స్థానాల్లో గెలిచింది. ఓడినవాళ్లలో.. దూలే రూరల్‌ నుంచి పోటీ చేసిన కునాల్‌ పాటిల్‌ కూడా ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి రాఘవేంద్ర పాటిల్‌ చేతిలో ఓటమి చెందారు. అయితే..

కాంగ్రెస్‌ మద్దతుదారులు సోషల్‌ మీడియాలో ఓ వీడియోను వైరల్‌ చేస్తున్నారు. నియోజకవర్గంలోని అవధాన్‌ గ్రామంలో జనం ఈవీఎంలకు వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌కు పట్టు ఉన్న ఈ గ్రామంలో.. కునాల్‌కు జీరో ఓట్లు వచ్చాయని, అందుకే ఈవీఎంలకు వ్యతిరేకంగా వాళ్లు నిరసన తెలుపుతున్నారనేది ఆ వీడియో సారాంశం. అయితే..

ఈ వీడియో ఆధారంగా కాంగ్రెస్‌ నేతలంతా ఎన్నికల సంఘాన్ని ట్యాగ్‌ చేస్తూ.. ఈవీఎంల పని తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వీళ్లలో యూపీ కాంగ్రెస్‌ కమిటీ సోషల్‌ మీడియా ప్రెసిడెంట్‌ పాన్ఖురి పాథక్‌ కూడా ఉన్నారు. గ్రామంలోని 70 శాతం జనాభా కునాల్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈవీఎంలను బీజేపీ తప్పుడుగా ఉపయోగించుకుంటోందని పేర్కొన్నారు. కానీ..

ఎన్నికల సంఘం ఆ ఆరోపణలన్నింటిని తోసిపుచ్చింది. అవధాన్‌లో కునాల్‌ పాటిల్‌కు 1,057 ఓట్లు పోలయ్యాయని ధూలే జిల్లా ఎన్నికల కార్యాలయం ప్రకటించింది. అలాగే.. రాఘవేంద్ర పాటిల్‌కు ఇక్కడ 1,741 ఓట్లు వచ్చాయని పేర్కొంది. దీంతో.. ఆ వీడియో ఫేక్‌ అనేది స్పష్టమైంది.

నవంబర్‌ 20వ తేదీన మహారాష్ట్రలోని 288 నియోజకవర్గాలకు పోలింగ్‌ జరగ్గా.. నవంబర్‌ 23వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ధూలే రూరల్‌ నియోజకవర్గంలో రాఘవేంద్ర పాటిల్‌కు 1,70,398 ఓట్లు, కునాల్‌ పాటిల్‌కు 1,04,078 ఓట్లు పడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement