పీఠం కోసం పాకులాట | Court of public opinion, we have failed. | Sakshi
Sakshi News home page

పీఠం కోసం పాకులాట

Published Wed, Jun 4 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM

Court of public opinion, we have failed.

సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాకోర్టులో విఫలమయ్యాం. అధినేత మెప్పుపొందాలంటే జిల్లా పరిషత్ పాలకమండల్ని కైవసం చేసుకుందాం. పక్కా వ్యూహం అమలు చేయండి. అధికారపార్టీ హోదా, అవసరమైతే డబ్బు దేనికైనా వెనుకాడవద్దు. తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి జెడ్పీ చేరేందుకు విశ్వప్రయత్నం చేయండి. జిల్లా పది నియోజకవర్గాలకు చెందిన టీడీపీ సమావేశంలో చేసుకున్న తీర్మాణమిది’. మరో పదహారు మంది జెడ్పీటీసీల మద్దతు కోసం తెలుగుదేశం పార్టీ నేతలు విస్తృతంగా శ్రమిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సభ్యుల్లో సహకారం అందించే వారెవరైనా ఉన్నారా? అని గోతికాడ నక్కలా పడిగాపులు గాస్తున్నారు.
 
 జిల్లాలో 39 జెడ్పీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. 11స్థానాలను మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. 50 జెడ్పీటీసీలున్నా 26స్థానాలు దక్కించుకున్నవారికి పాలకమండలి సొంతం కానుంది. ప్రజావిశ్వాసంతో నెగ్గలేకపోయిన తెలుగుదేశం పార్టీనేతలు ఎంతటి అనైతిక చర్యకైనా పాల్పడి జిల్లా పరిషత్‌కు కైవసం చేసుకోవాలనే తపనలో ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకోసం కోట్లు ఖర్చు చేసేందుకు సైతం వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఇరువురు నాయకులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. నేరుగా కాకుండా జెడ్పీటీసీల బంధువుల ద్వారా పురమాయిస్తున్నట్లు సమాచారం.
 
 ఎస్సీ సభ్యుడు లేకపోయినా..
 జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎస్సీ జనరల్‌కు రిజర్వుడు అయింది. అయితే తెలుగుదేశం పార్టీ గెలుపొందిన 11మందిలో ఎస్సీ సభ్యుడు లేరు. ఎస్సీ సభ్యుడు లేకపోయినా పాలకమండలి కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అత్యాశ పడుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, ఆర్. శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో ఈ తతంగం నడుస్తున్నట్లు సమాచారం. గత ఐదు రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నా వైఎస్సార్‌సీపీ సభ్యులు ఇసుమంత కూడా చలించనట్లు సమాచారం.
 
 టీడీపీ ఎత్తుగడలను ఎక్కడికక్కడ తిరస్కరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సభ్యత్వంపై గెలుపొందిన తాము మండల పరిధిలోనే ఉన్నామని, మీలాగా నీతి తక్కువ పనులు చేయలేమని ఓ ఎమ్మెల్సీతో వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ ఒకరు బహిరంగంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం. అధికారంలో ఉండగా ప్రజావిశ్వాసం పెంపొందించుకోవడం వైపు దృష్టి సారించకుండా అనైతికత వైపు అడుగులేస్తుండటాన్ని పలువురు పార్టీ సీనియర్ నేతలే తప్పుబడుతున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement