శ్రీసత్యసాయి జిల్లాలో రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్‌పై ఓ మంత్రి కన్ను
ఇచ్చేసి వెళ్లిపోవాలని యజమానికి హుకుం
కాదన్నందుకు వేధింపులు
ముడి సరుకు రాకుండా అడ్డుకున్న మంత్రి అనుచరులు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
మంత్రి ఒత్తిడి తట్టుకోలేకపోయిన యజమాని
తప్పనిసరై మరో టీడీపీ ప్రజాప్రతినిధికి 50 శాతం భాగస్వామ్యం ఇచ్చిన ప్లాంట్ ఓనర్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: నిన్నటికి నిన్న బూడిద కోసం కొట్టుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు కాంక్రీట్ పంచాయితీలోనూ ఇరుక్కున్నారు. ఆర్టీపీపీ నుంచి సిమెంటు ఫ్యాక్టరీలకు సరఫరా చేసే ఫ్‌లైయాష్ కోసం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నానా యాగీ చేసి చివరకు పార్టీ నుంచి ఎలాంటి సహకారమూ లేకపోవడంతో సర్దుకున్నారు. ఇప్పుడు శ్రీ సత్యసాయి జిల్లాలో ‘కాంక్రీట్’ కంపెనీని చేజిక్కించుకోవడానికి ఓ మంత్రి తీవ్రంగా ప్రయత్నిoచడం చర్చనీయాంశమైంది.
ప్లాంటు నాకు ఇచ్చేయాలి..
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం మక్కాజిపల్లి తండా వద్ద ఆర్‌ఎంసీ (రెడీమిక్స్ కాంక్రీట్) ప్లాంటు ఉంది. దీని నిర్వాహకులు కొన్నేళ్లుగా చిన్న చిన్న ఆర్డర్లు తెచ్చుకుని నడుపుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఓ మంత్రి కన్ను ఈ ప్లాంటుపై పడింది. ‘నీకు ఎంతో కొంత ఇస్తా.. ప్లాంటు ఇచ్చేసి వెళ్లిపో’ అంటూ ఓనర్‌ను మంత్రి బెదిరించడం మొదలుపెట్టారు. ప్లాంటు యజమాని ప్రాధేయపడినా మంత్రి కనికరించలేదు. ఇచ్చేసి వెళ్లిపోవాల్సిందేనని కరాఖండిగా చెప్పారు.
అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ప్లాంటుకు ముడిసరుకు సరఫరా చేసే కంపెనీలకు ఫోన్ చేసి.. సరుకు ఇవ్వొద్దని, లారీలు తిప్పొద్దని హుకుం జారీ చేశారు. ముడిసరుకుతో వస్తున్న లారీలను మంత్రి అనుచరులు నిలిపివేశారు. తమ ప్లాంటుకు వచ్చే లారీలను ఆపుతున్నారంటూ స్థానిక కియా పోలీస్ స్టేషన్‌లో యజమాని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
మంత్రి బెదిరింపులు పెరిగిపోవడంతో ఆ ప్లాంటు యజమాని విధిలేని పరిస్థితుల్లో మంత్రితో తీవ్ర రాజకీయ విభేదం ఉన్న అదే ప్రాంతానికి చెందిన మరో టీడీపీ ప్రజాప్రతినిధిని సంప్రదించారు. ఆ ప్రజాప్రతినిధికి ప్లాంటులో 50 శాతం భాగస్వామ్యం కల్పిస్తూ అగ్రిమెంటు చేసుకున్నారు. దీంతో మంత్రి వెనక్కి తగ్గినట్లు సమాచారం.
చిన్న పరిశ్రమలనూ వదలడం లేదు
శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అన్ని వ్యాపారాలు, మైన్లు, పరిశ్రమలను చేజిక్కించుకునేందుకు వాటి యజమానులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర పరిశ్రమలనూ వదలడం లేదు. గుడ్‌విల్, కమీషన్లు ఇవ్వాలని, లేదంటే వాటిని అప్పగించి వెళ్లిపోవాలంటూ వేధిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసినా, అపార్ట్‌మెంట్లకు పునాది వేసినా గద్దల్లా వాలిపోతున్నారు. మున్సిపాలిటీల పరిధిలో అనుమతులకూ స్థానిక ఎమ్మెల్యేకు ఎంతో కొంత ముట్టజెప్పాల్సిన పరిస్థితి. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆరు నెలలుగా ఒక్క పరిశ్రమ కూడా రాలేదంటే పరిస్థితి అంచనా వేయొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment