ఎర్రగుంట్ల: ‘జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చి దిద్దుతా. రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలబెడతా. నాకు లభించిన పదవిని ప్రజాసేవకే అంకితం చేస్తా. ప్రతి పల్లె ప్రగతి పథంలో పయనించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా’ అని జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికైన గూడూరు రవి పేర్కొన్నారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ వివరాలివి.
ప్రశ్న: జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నిక కావడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
జవాబు: జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నికవుతానని నేను కలలో కూడా ఊహించలేదు. నేను సామాన్య కుటుంబంలో జన్మించాను. మాది ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామం. వ్యవసాయ కూలీగా, డ్రైవర్‌గా పనిచేసుకుంటూ ఉండేవాడిని. మా గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు అంబటి కృష్ణారెడ్డి ఆశీస్సులతో జెడ్పీటీసీగా విజయం సాధించాను.
ఆ తర్వాత మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీటీసీల సహకారంతో నన్ను జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఓ సామాన్య వ్యక్తిగా ఉన్న నాకు జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. ఈ పదవికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా. మొత్తానికి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నిక కావడం నాకెంతో ఆనందంగా ఉంది. నాకు లభించిన ఈ పదవిని ప్రజా సేవకే అంకితం చేస్తా.
ప్రశ్న: జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. వాటి పరిష్కారానికి ఏం చేస్తారు?
జవాబు: అవును జిల్లాలో అనేక సమస్యలున్నాయి. వాటి పరిష్కారానికి అనుభవజ్ఞులైన మా పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటాను. ఈ సమస్యలను పరిష్కరించాలంటే నిధులు కావాలి. ప్రస్తుతం మాది ప్రతిపక్ష పార్టీ. మా పార్టీ నేతల సహకారంతో ప్రభుత్వంతో పోరాడి తగినన్ని నిధులు విడుదల చేయించి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చి దిద్దుతా.
ప్రశ్న: ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు?
జవాబు: మహానేత వైఎస్ హయాంలో జిల్లాలో అన్ని విధాలా అభివృద్ధి జరిగింది. ఆయన మరణం తర్వాత అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుతం జిల్లాలో చాలా గ్రామాల్లో రోడ్లు లేవు. తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య పరిస్థితి అధ్వాన ంగా ఉంది. ఈ అంశాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను. అలాగే గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తాను.
ప్రశ్న: జిల్లా అభివృద్ధి కోసం ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు?
జవాబు: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తా. ప్రతి పథకాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రచారం కల్పిస్తా. గ్రామాల్లో వివిధ చేతి వృత్తులపై ఆధారపడి బతికేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారంద రూ ఆర్థికంగా పురోగతి సాధించేందుకు ఇలాంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే అన్ని మండలాలకు జెడ్పీ నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడతా.
ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతా
Published Mon, Jul 7 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 AM
Advertisement
Advertisement