Ambati krishna reddy
-
డీఎల్.. వందల కోట్లు ఎలా సంపాదించావ్?
కడప కార్పొరేషన్: వందల కోట్ల విలువైన ఆస్తులను మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఏ విధంగా సంపాదించారో చెప్పాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు సుంకేసులలో చిన్న కొట్టం, రేకుల ఇల్లు ఉండేదని, ఇప్పుడు హైదరాబాద్లో రూ.200 కోట్ల విలువైన ఆస్పత్రి, రూ.20 కోట్ల విలువైన ఇల్లు, వందల ఎకరాల భూములు ఉన్నాయని చెప్పారు. ఈ ఆస్తులను ఆయన ఏ వ్యాపారం చేసి సంపాదించారో చెప్పాలని నిలదీశారు. శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జీవీ సత్రం వద్ద తల్లిదండ్రుల పేరుతో ఆస్పత్రి కడతానని ప్రభుత్వం నుంచి చౌక ధరకు భూమిని పొంది, తర్వాత దాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నాడని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వల్లే డీఎల్ రవీంద్రారెడ్డికి రాజకీయ భిక్ష లభించిందన్నారు. గతంలో మంత్రి పదవిలో ఉండి వైఎస్ జగన్కు పోటీగా ఎంపీగా నిలబడి, డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుగా ఓడిన చరిత్ర డీఎల్దే అన్నారు. వైఎస్ కుటుంబం దెబ్బ రుచి చూసినా ఆయనకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. 2014లో పుట్టా సుధాకర్ యాదవ్తో జతకట్టారని, 2019లో ఎవరూ పిలవకపోయినా వైఎస్సార్సీపీలో చేరినా, ఆయన ఏనాడు పార్టీ బలోపేతానికి గానీ, ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విజయానికి గానీ కృషి చేయలేదని తెలిపారు. వ్యవసాయ సలహాదారు పదవికి తాను తగనని డీఎల్ మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. తాను వ్యవసాయదారుల కుటుంబంలో పుట్టానని, 50 ఎకరాల పొలాన్ని ఇప్పటికీ సాగు చేస్తున్నానని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనను వ్యవసాయ సలహాదారుగా నియమించాక, 100 మండలాలు తిరిగి.. పల్లె నిద్ర చేసి, రైతుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నానని వివరించారు. ఈ పదవికి తాను అనర్హుడనని రైతులు చెబితే వెంటనే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. -
సీఎం జగన్కు ధన్యవాదాలు: అంబటి కృష్ణారెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో రైతన్నలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'నాపై నమ్మకముంచి ఇంతటి హోదా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు. ప్రతి రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తా. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి మేలు జరుగుతోంది. వైఎస్సార్ జలకళ పథకం చరిత్రాత్మకం. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్ వేసి ఇవ్వడం శుభపరిణామం. రైతులకు ఎరువులు, యూరియా సరసమైన ధరలకే అందేలా చర్యలు తీసుకుంటాం' అని అంబటి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. (మరో హామీకి శ్రీకారం చుట్టిన సీఎం జగన్) -
ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డిను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లపాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. కేబినెట్ ర్యాంక్ హోదాలో నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వ్యవసాయ సంబంధిత అంశాలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. -
ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దుతా
ఎర్రగుంట్ల: ‘జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చి దిద్దుతా. రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలబెడతా. నాకు లభించిన పదవిని ప్రజాసేవకే అంకితం చేస్తా. ప్రతి పల్లె ప్రగతి పథంలో పయనించేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా’ అని జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎన్నికైన గూడూరు రవి పేర్కొన్నారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ వివరాలివి. ప్రశ్న: జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎన్నిక కావడంపై మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జవాబు: జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎన్నికవుతానని నేను కలలో కూడా ఊహించలేదు. నేను సామాన్య కుటుంబంలో జన్మించాను. మాది ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామం. వ్యవసాయ కూలీగా, డ్రైవర్గా పనిచేసుకుంటూ ఉండేవాడిని. మా గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి కృష్ణారెడ్డి ఆశీస్సులతో జెడ్పీటీసీగా విజయం సాధించాను. ఆ తర్వాత మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జెడ్పీటీసీల సహకారంతో నన్ను జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎన్నుకున్నారు. ఓ సామాన్య వ్యక్తిగా ఉన్న నాకు జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం. ఈ పదవికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తా. మొత్తానికి జిల్లా పరిషత్ ఛైర్మన్గా ఎన్నిక కావడం నాకెంతో ఆనందంగా ఉంది. నాకు లభించిన ఈ పదవిని ప్రజా సేవకే అంకితం చేస్తా. ప్రశ్న: జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రజలు పలు సమస్యలతో సతమతమవుతున్నారు. వాటి పరిష్కారానికి ఏం చేస్తారు? జవాబు: అవును జిల్లాలో అనేక సమస్యలున్నాయి. వాటి పరిష్కారానికి అనుభవజ్ఞులైన మా పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ పెద్దలతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటాను. ఈ సమస్యలను పరిష్కరించాలంటే నిధులు కావాలి. ప్రస్తుతం మాది ప్రతిపక్ష పార్టీ. మా పార్టీ నేతల సహకారంతో ప్రభుత్వంతో పోరాడి తగినన్ని నిధులు విడుదల చేయించి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా. రాష్ట్రంలోనే వైఎస్సార్ జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చి దిద్దుతా. ప్రశ్న: ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇస్తారు? జవాబు: మహానేత వైఎస్ హయాంలో జిల్లాలో అన్ని విధాలా అభివృద్ధి జరిగింది. ఆయన మరణం తర్వాత అభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుతం జిల్లాలో చాలా గ్రామాల్లో రోడ్లు లేవు. తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ్య పరిస్థితి అధ్వాన ంగా ఉంది. ఈ అంశాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తాను. అలాగే గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తాను. ప్రశ్న: జిల్లా అభివృద్ధి కోసం ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? జవాబు: ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూస్తా. ప్రతి పథకాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకునేలా ప్రచారం కల్పిస్తా. గ్రామాల్లో వివిధ చేతి వృత్తులపై ఆధారపడి బతికేవారు ఎందరో ఉన్నారు. అలాంటి వారంద రూ ఆర్థికంగా పురోగతి సాధించేందుకు ఇలాంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే అన్ని మండలాలకు జెడ్పీ నిధులు మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి తోడ్పడతా.