రాసుకున్నోళ్లకు రాసుకున్నంత
- ఐటీఐ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్
- హాల్‌టిక్కెట్లు లేకుండానే పరీక్ష రాస్తున్న విద్యార్థులు
హిందూపురం అర్బన్ : ఐటీఐ మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్ జోరుగా జరుగుతోంది. ఎస్వీ, ఏంజెల్ ఐటీఐ కళాశాలల్లో చదువుతున్న సుమారు 150 మంది విద్యార్థులకు 2 నుంచి 16వ తేదీ వరకు మొదటి సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. కిరికెర వద్ద ఉన్న ఎంజెల్ ఐటీఐ కేంద్రంలో నిర్వహిస్తున్న పరీక్షల్లో నిర్వాహకులు, ఇన్విజిలేటర్లు అంతా కుమ్మక్కై చూచిరాతలు రాయిస్తున్నట్లు కనిపిస్తోంది.
బయటి వ్యక్తులు వచ్చి పరీక్ష హాలులో కూర్చుంటున్నారు. అలాగే కొందరు విద్యార్థులకు హాల్ టిక్కెట్లు కూడా లేవు. విద్యార్థులు గుంపుగా కూర్చుని పుస్తకాలు పెట్టుకుని పరీక్షలు రాస్తున్నారు. కాగా పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ఇన్విజిలేటర్లు, పర్యవేక్షకుల వద్ద ఐడీ కార్డులు కూడా లేకపోవడం గమనార్హం.