
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 4జీ విస్తరణ ప్రణాళికలకు ఊతమిచ్చేందుకు రూ.6,000 కోట్ల అదనపు నిధుల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రణాళికాబద్ధమైన మూలధన వ్యయంలో లోటును పరిష్కరించడం, దేశవ్యాప్తంగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలను పెంచేందుకు ఈ నిధులు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది.
దిల్లీ, ముంబయిల్లో మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) కార్యకలాపాలను సైతం నిర్వహిస్తున్న బీఎస్ఎన్ఎల్‌కు దేశవ్యాప్తంగా 4జీ సేవలు లేకపోవడం, అందుకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కొరవడడంతో సవాళ్లు ఎదుర్కొంటోంది. దానివల్ల బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లు 4జీ కవరేజీని అందించే ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు మారుతున్నారు. ప్రైవేట్ కంపెనీల నుంచి ఎదురయ్యే పోటీని ఎదుర్కోవడానికి సంస్థ 2023లో 1,00,000 4జీ సైట్ల కోసం రూ.19,000 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ప్రభుత్వ రంగ టెలికాం పరికరాల తయారీ సంస్థ ఐటీఐ(ITI)కి సుమారు రూ.13,000 కోట్ల అడ్వాన్స్ పర్ఛేజ్ ఆర్డర్‌ను అప్పగించింది. ఈ సంస్థలు కంపెనీకి కావాల్సిన 4జీ మౌలిక సదుపాయాలను సిద్ధం చేసి అందించాల్సి ఉంటుంది. తాజాగా మరో రూ.6,000 కోట్లు అందించేందుకు కేబినెట్ ఆమోదించింది.
ఇదీ చదవండి: రేట్ల కోతతో తక్షణ, దీర్ఘకాలిక ప్రభావాలు
2019 నుంచి ప్రభుత్వం మూడు వేర్వేరు పునరుద్ధరణ ప్యాకేజీల ద్వారా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లో సుమారు రూ.3.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఉద్యోగుల వ్యయాలను తగ్గించడం, 4జీ స్పెక్ట్రమ్ కేటాయింపు, రుణ పునర్వ్యవస్థీకరణ, ఆస్తులను మానిటైజ్ చేయడం వంటి చర్యలు ఈ ప్యాకేజీల్లో ఉన్నాయి. ఫలితంగా 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లాభాలను ఆర్జించడం ప్రారంభించాయి.
భవిష్యత్తు ప్రణాళికలు..
తాజాగా ఆమోదం పొందిన నిధులతో దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తేవాలని, కస్టమర్ల అట్రిషన్(ఇతర టెలికాం కంపెనీలకు మారడం)ను తగ్గించాలని బీఎస్‌ఎన్‌ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. త్వరలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో 5జీ సేవలను ప్రారంభించాలని కూడా కంపెనీ యోచిస్తోంది. ఈ ప్రణాళికలు టెలికాం రంగంలో బీఎస్ఎన్ఎల్ స్థానాన్ని బలోపేతం చేస్తుందని, ప్రైవేట్ సంస్థలతో మరింత సమర్థవంతంగా పోటీ పడటానికి వీలు కల్పిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.